పంకజ్ కొత్త చరిత్ర
ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ సొంతం
మూడోసారి ‘గ్రాండ్ డబుల్’ సాధించిన తొలి ఆటగాడు
కెరీర్‌లో రికార్డు స్థాయిలో 12వ ప్రపంచ టైటిల్
లీడ్స్: భారత స్టార్ పంకజ్ అద్వానీ బిలియర్డ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఆటతీరుతో గత వారమే పాయింట్ల ఫార్మాట్‌లో విజేతగా నిలిచిన అతను టైమ్ ఫార్మాట్‌లో కూడా ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో పంకజ్ 1928-893తో ప్రపంచ మూడో ర్యాంకర్ రాబర్ట్ హాల్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. ఐదు గంటల పాటు జరిగిన ఫైనల్లో 29 ఏళ్ల పంకజ్ పూర్తి హవా కొనసాగించాడు. తొలి గంటలో 185 బ్రేక్ పాయింట్లు సాధించిన భారత స్టార్ ఆ తర్వాత కూడా చెలరేగిపోయాడు. 85, 92, 123 బ్రేక్ పాయింట్లతో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఆడుతున్న హాల్ మాత్రం 89, 64, 64 బ్రేక్ పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. ఓరాల్‌గా తొలి సెషన్ ముగిసేసరికి పంకజ్ 746-485 ఆధిక్యంలో నిలిచాడు. రెండో సెషన్‌లో కూడా పంకజ్ 94, 182, 289, 145 బ్రేక్ పాయింట్లతో దూసుకుపోయాడు. దీంతో ఇంకా గంట ఆట మిగిలి ఉండగానే దాదాపుగా టైటిల్‌కు చేరువగా వచ్చాడు. చివరి గంటలో కూడా పంకజ్ 94, 93, 59, 58, 62, 90 బ్రేక్ పాయింట్లను సాధించాడు. చివరకు వెయ్యికిపైగా పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
ఉమాదేవికి రజతం
మహిళల విభాగంలో రెవన్న ఉమాదేవి వరుసగా రెండోసారి రజతంతో సరిపెట్టుకుంది. లీడ్స్‌లోనే మంగళవారం జరిగిన ఫైనల్లో ఆమె 191-237 ఎమ్మా బోని (ఇంగ్లండ్) చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 90 నిమిషాల సెషన్‌లో బోని 44, 31 పాయింట్లతో రెండు బ్రేక్‌లు సాధించింది. ఓవరాల్‌గా కెరీర్‌లో బోనికి ఇది 9వ టైటిల్. ఏప్రిల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో కూడా ఉమాదేవి.. బోని చేతిలోనే ఓడటం గమనార్హం.
ఒకే ఏడాదిలో పాయింట్ల, టైమ్ ఫార్మాట్‌లో ప్రపంచ టైటిల్స్ (గ్రాండ్ డబుల్)ను మూడోసారి సాధించిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతంలో పంకజ్ 2005 (మాల్టా), 2008 (బెంగళూరు)లో గ్రాండ్ డబుల్‌ను సాధించాడు. ఇప్పుడు మూడోసారి గెలిచి మైక్ రస్సెల్ (2010, 2011లో గ్రాండ్ డబుల్)నూ అధిగమించాడు. కెరీర్‌లో 12 ప్రపంచ టైటిల్‌ను నెగ్గిన ఆటగాడిగా రికార్డులకెక్కిన ఈ బెంగళూరు ప్లేయర్‌కు... వ్యక్తిగత విభాగాల్లో ఇది 9వ టైటిల్. ఈ సందర్భంగా గీత్‌సేథీ (8 టైటిల్స్) రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
‘ఒకేసారి ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్నందుకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈ విజయాలు నా మాటలను కప్పేశాయి. ఇక్కడికి రావడానికి ముందు గేమ్, ఫిట్‌నెస్ కోసం చాలా కష్టపడ్డా. అది ఇప్పుడు ఫలితాన్నిచ్చింది. మా అమ్మ జన్మదినం రోజున 12వ టైటిల్ గెలవడం చాలా ప్రత్యేకమైందిగా భావిస్తున్నా’.
- పంకజ్