దేవుని నిస్వార్థ ప్రేమకు సంకేతం
సిలువ మరణం
మార్చి 25 గుడ్ ఫ్రైడే సందర్భంగా...
ప్రతి సంవత్సరం ప్రపంచ క్రైస్తవులందరు, క్రీస్తు సిలువలో తన ప్రాణమర్పించిన దినాన్ని ‘గుడ్‌ఫ్రైడే’ (శుభ శుక్రవారం)గా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఈ సదాచారం మానవాళి పాప శాప పరిహారం నిమిత్తం ఆ దైవం జరిగించిన సంపూర్ణ రక్షణ కార్యంగా పరిగణించడానికే. ఈ ప్రపంచ చరిత్రలో ఎందరో మహనీయులు ఎన్నో ఉత్తమ కారణాల నిమిత్తం తమ ప్రాణాలర్పిం చారు. వారు కొంత కాలానికి, ఒక ప్రాంతానికి, జాతికి, మతానికి మాత్రమే పరిమితమయ్యారు. క్రీస్తు సిలువ మరణం రెండువేల సంవత్సరాలకు పూర్వం జరిగినప్పటికీ నేటికీ విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని కలిగివుంది. చరిత్రలో ఒక వ్యక్తి మరణం ఈ ప్రపం చాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రభావవంతం చేయగలగటం అనేది క్రీస్తు విషయంలోనే జరిగిందేమో. సిలువ మరణం అత్యంత అవమానకరమైన క్రూరమైన అమానవీయ మైన, కఠినమైన హింసాయుత శిక్ష. అయితే పరిశుద్ధుడు, దైవసుతుడైన యేసుక్రీస్తు ఆనాడు ఇంత క్రూర శిక్షను ఎందుకు భరించాల్సి వచ్చింది? క్రీస్తు సిలువ మరణం మానవ సమాజానికి సాధించిన పరిహారం ప్రాయశ్చిత్తం ఎలాంటివి? క్రీస్తు సిలువ మరణం ఈ ప్రపంచానికి వెల్లడి చేసిన సందేశం ఏమిటి? మానవాళికి చూపిన మార్గం ఏమిటి? సిలువ దేనికి సంకేతంగా, స్ఫూర్తిగా నిలిచింది? అన్న విషయాలు మనం అవగతం చేసుకోవాలి. సిలువలో క్రీస్తు మరణం మనకు ప్రత్యక్షపరచే ఆధ్యాత్మిక, సాంఘిక సత్యాలు, అంశాలు ఏమిటి అని చూస్తే...
ప్రేమ, న్యాయం మూర్తీభవించిన ఘట్టం
మానవాళి పట్ల దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారు? దేవుడు తన న్యాయాన్ని ఎలా అమలుపరచారు? అనే విషయాలపై పౌలు అను భక్తుడు ఏం అన్నాడంటే... ‘‘మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపో యెను’’ (రోమా 5:8). ‘‘మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చి త్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ యున్నది’’ (1యోహా 4:10). క్రీస్తు సిలువ మరణం గొఱ్ఱెలవలె దారి తప్పిన మానవాళి యెడల దేవునికున్న ప్రేమ వెల్లడి చేస్తుంది. అదే సమయంలో సిలువ దైవ న్యాయమును సూచిస్తుంది. మరణ శాసన మెక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసినవాని మరణం అవశ్యం. ఆలాగే క్రీస్తు కూడా అనేకుల పాపాన్ని భరించడానికి తనను తాను అర్పించు కున్నాడు. మన పాపాలకు శిక్షగా మనకు బదులుగా ఆయన సిలువలో శిక్ష అనుభ వించాడు. క్రీస్తు సిలువ మరణం పాపం యొక్క భయంకరత్వాన్ని సూచిస్తుంది.
సిలువ అంటే శ్రమకు సూచన. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువు చెప్పారు. సద్భక్తితో బ్రతకనుద్దేశించే ప్రతి ఒక్కరూ శ్రమను ఎదుర్కొనక తప్పదు. క్రైస్తవ విశ్వాస దృక్పథంలో శ్రమ ఒక భవిష్య మహిమను కలిగినది. శ్రమలకు సహనం ఓ ఆయుధం. కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమ పడటమే మంచిది. క్రైస్తవ విశ్వాస సమాజం సిలువ శ్రమల్లో నుండి అంకురించింది. శ్రమల యందే క్రైస్తవ సంఘం వర్ధిల్లింది, విస్తరించింది. జీవితంలో సిలువను మోస్తే కిరీటం ధరిస్తాం. శ్రమలు మనల్ని అంతమొం దించటానికి కాదు. అవి నిత్య మహిమకు సోపానాలు. సిలువ మరణం క్రీస్తు అంతం కాదు. అక్కడనుండే ఆయన మహిమ ఈ లోకానికి ప్రత్యక్షమైనది. క్రీస్తు సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టూ ఈ లోకంలో ప్రతి పాపినీ కడిగి శుద్ధి చేసింది.
సిలువ మానవ సంబంధాల సంధి
పాపం మానవుణ్ని దేవునికి దూరం చేసింది. అలాగే తోటి మానవుల మధ్య సంబంధాల విఘాతాన్ని, అగాథాన్ని సృష్టించింది. అలా విచ్ఛిన్నమైన దైవ మానవ సంబంధాలు క్రీస్తు సిలువ మరణం ద్వారా బలపడ్డాయి. మనం దేవుణ్ని తండ్రి అని పిలువగలుగు తున్నాం. ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి చేరగలుగుతున్నాం. ఇక ఏ మధ్య వర్తిత్వం అవసరం లేదు. ఏ సిఫారసూ అక్కర్లేదు. సిలువ దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న పాపమనే శాపాన్ని తొలగించి, దేవునితో మానవునికి సత్సంబంధాన్ని ఏర్పరచింది. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. అంతరాలు లేని అసమానతలు లేని అస్పష్టత లేని సమాజం... క్రీస్తు సిలువ సమాజం.
నిస్వార్థ సేవకు స్ఫూర్తి
ప్రతి సేవ ప్రతిఫలాన్నీ పారితోషికాన్నీ అపేక్షించి చేసేదే. కాని క్రీస్తు తన జీవిత సూత్రాన్ని ఆరంభంలోనే స్పష్టపరిచారు. ‘‘మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెననెను’’ (మార్కు 10:45). సిలువ ఒక ఉగ్ర సమాజానికి స్ఫూర్తి కాదు. సిలువ ఎప్పటికీ ఓ నిస్వార్థ, ప్రేమపూరిత, కరుణాసహిత, త్యాగ పూరిత సేవకు బలమైన స్ఫూర్తిగా నిలిచింది. మదర్ థెరిస్సా వంటి సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలిచింది. స్వార్థం ద్వేషం దోపిడీ గల ప్రపంచంలో సిలువ మనిషికి శాంతిని కలిగించింది. అన్ని కాలాల్లోనూ మనుషులకు ఓ బాటను చూపించింది.
క్రీస్తు సిలువ భావం, ప్రభావం మన జీవిత ఆచరణలో భాగమై సాగాలి. ఆయన త్యాగంలో వివాదం లేదు. మానవాళి రక్షణయే ఆయన ధ్యేయం. ఎందరు నిందలు మోపినా, ఎన్ని అవమానాలు పెట్టినా, కొరడాలతో కొట్టినా, సిలువకు మేకులతో కొట్టి ఆయన దేహాన్ని వేలాడదీసి అతి కిరాతకంగా చంపినా ఆయన స్వరం ఒక్కటే. ‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము’’. అంటే ఆయన సందేశం ఒక్కటే... క్షమాపణ. ఇది ఎక్కడా కనిపించని వినిపించని దైవ త్యాగం, స్వరం, సందేశం. అందుకే సిలువ మరణం క్రీస్తు పరాజయం కాదు, మానవ పాప పరిహారార్థమై ప్రభువు సాధించిన ఘన విజయం.
మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి అందరినీ ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది.
- రెవ॥పెయ్యాల ఐజక్ వరప్రసాద్