Christ
-
హైదరాబాద్‌లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్‌ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్‌లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్‌వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది. ‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్‌లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11). యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది? వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం. మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు. అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21). ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి. మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16). దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్‌గారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది. పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్‌ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక. దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి. యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’ రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4). దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27). మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు. ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది. ‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12). ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా? ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు. వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది. నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి. అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది. సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’ ‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా.జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
ఆయన వారిని అమ్మా అని పిలిచాడు
క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేసింది స్త్రీలే. క్రీస్తు బోధలనీ, క్రీస్తు దైవత్వాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ స్త్రీలే. క్రైస్తవంలో స్త్రీలకు గుర్తించదగ్గ స్వేచ్చ ఉంది. కారణం క్రీస్తు బ్రతికున్న రోజుల్లో స్త్రీల మధ్యన ఎక్కువగా పరిచర్య చేయడం. పురుషాధిక్యత ఉన్న యూదా జాతిలో కన్యక అయిన మరియ అనే స్త్రీ, క్రీస్తును కనడానికి ముందుకొచ్చింది. క్రీస్తుకు తల్లిగా మారేందుకు తనని తాను తగ్గించుకుని గాబ్రియేల్ అనే దూత చెప్పినట్టు విన్నది. దేవునికి లోబడతానని తన విధేయతతో ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన స్త్రీగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. యోసేపుకు ప్రధానం చేయబడ్డ ఆమెను, ఒకానొక సమయంలో అవమాన భారం వల్ల యోసేపే వదిలేయాలనుకున్నాడు. అయినా లేఖనాలలో రాయబడ్డట్టు జరిగేందుకు తన సమ్మతిని తెలియజేయడమే కాదు ఆమె అన్ని పరిస్థితులలో దృఢనిశ్చయంతో ఉంది. పురుషాధిక్యత గల యూదా సమాజంలో పురుషులతో స్త్రీలు బహిరంగంగా మాట్లాడడం నిషేధం. క్రీస్తు మగ్ధలేన అనే ప్రాంతానికి చెందిన స్త్రీని దోపిడీగాళ్ల చేతులలో నుండి విడిపిస్తాడు. అప్పటినుంచి మగ్ధలేన మరియ క్రీస్తుతో పాటే ఉంది. క్రీస్తు పరిచర్యలో తనవంతు పాత్రను పోషించింది. క్రీస్తు పరిచర్య చేస్తూ వెళ్ళిన ప్రాంతాల్లో స్త్రీలను సమావేశపరుస్తూ, క్రీస్తును గురించి అనేకులకి చెబుతూ క్రీస్తు కోసం సాక్షిగా నిలబడింది. ఆమె క్రీస్తును ఎంతగా ఆరాధించిందంటే.. క్రీస్తు సిలువ వేయబడిన మూడోరోజున ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయడానికి తనతోపాటు మరికొందరు స్త్రీలను తీసుకుని పొద్దు పొడవకముందే సమాధి దగ్గరకు చేరుకుంది. సమాధిలో క్రీస్తు కనపడలేదని భయపడింది. దేవదూత ద్వారా ఆయన పునరుత్థానాన్ని గురించి తెలుసుకుని, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న వార్తా ఆమే మొదటగా చేరవేసింది. క్రీస్తును తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకుని, ఆయన బేతనీ అనే ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తమ గృహంలో ఆతిథ్యం ఇచ్చారు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. వాళ్లు మార్త, మరియలు. క్రీస్తు బేతనియకి వచ్చినప్పుడల్లా వాళ్ళింట్లో బస చేసే వాడు. వారి సహోదరుడు లాజరుతో క్రీస్తుకు మంచి స్నేహం. క్రీస్తు చెప్పే మాటలు వినడానికి వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవాళ్లు. ఒకానొక సమయంలో లాజరు అకారణంగా చనిపోయాడు. క్రీస్తు మూడు రోజులయ్యాక ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వారు ఆయనకీ విషయాన్ని తెలియజేస్తారు. లాజరును తిరిగి బతికిస్తాడు క్రీస్తు. ఇక అప్పటినుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్లు క్రీస్తును ఘనపరిచి ఆయన ప్రేమ తత్వాన్ని ప్రచారంచేసారు. సమరయులు యూదులకన్నా జాతి పరంగా చిన్న వాళ్లు. క్రీస్తు పరిచర్య చేస్తున్న రోజుల్లో సమరయ గ్రామాల వైపు వెళ్తూ వాళ్లకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందించేవాడు. ఒకానొక సమయంలో ఒక సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమయంలో క్రీస్తు అటుగా వెళ్లాడు. తాగడానికి నీళ్లిమ్మని అడిగాడు. ఆమె యూదుడైన క్రీస్తు తనని నీళ్లడగటం చూసి తన గతాన్ని చూసి క్రీస్తు తనని అసహ్యించుకుంటాడని భయపడింది. కాని క్రీస్తు ఆమెకి బుద్ధి వాక్యాన్ని బోధించాడు. తాను క్రీస్తు అనే విషయాన్ని ఆమెకి తెలిసేలా చేసాడు. ఆమె పరుగెత్తుకుంటూ ఊళ్లోకి వెళ్ళింది. క్రీస్తు గురించి ఊరంతా తెలిసేలా ఆయన కోసం గొప్ప సాక్షిగా మారింది. పన్నెండు ఏళ్ళుగా రక్తస్రావం ఆగక బాధపడుతున్న ఓ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. యేసు ప్రభువు తనకి స్వస్థతనివ్వాలంటే ఆయన ముందు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. కలవాలి. కాని అంతమంది జనంలో ఆమె ఆయన దగ్గర ఆయన దగ్గరగా వెళ్ళలేదు కాబట్టి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అని అనుకుంది. అలాగే చేసింది. వెంటనే రోగం బాగైంది. ఓ రోజు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని జనాలు రాళ్లు పట్టుకుని తరుముతూ వచ్చారు. ఆమె మీద రాళ్లు విసురుతున్నారు. ఇక ఆమెని చంపటమే తరువాయి. క్రీస్తు ఆమె దగ్గరకి వెళ్లి పడిపోయిన ఆమెని లేపాడు. రాళ్లు పట్టుకున్న వాళ్లను వారించాడు.పాపం చేయని వాడు ఆమె మీద మొదట రాయి వేయాలన్నాడు. అందరి పాపాలను నేల మీద రాయటం మొదలు పెట్టాడు. అంతే! అందరు ఎవరి పాపాలను వారు చూసుకుని భయపడి రాయి వదిలేసి పారిపోయారు. యేసు క్రీస్తు ఆ స్త్రీ దగ్గరకెళ్ళి ‘‘అమ్మా నీ మీద రాళ్ళేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు లేరు. ఇక వెళ్ళు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని ఆమెని విముక్తురాలిని చేసాడు. క్రీస్తు స్త్రీలందరినీ అమ్మా అనే పిలిచాడు. ఒకానొక సమయంలో మరియ అనే ఒక స్త్రీ, క్రీస్తు పరిసయ్యుల ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరు బుడ్డి తెచ్చి అతని తల మీద పోసింది. శేరున్నర అత్తరు ఆమె జీవిత కాలం సంపాదించిన డబ్బుతో కొనినదైయుంటుంది. ఆమె తన కన్నీటితో క్రీస్తు పాదాలను కడిగి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసింది. ఆమె చేసిన పని ఎంత గొప్పదో క్రీస్తు చెప్తూ ఆమె ప్రేమ ఎంత గొప్పదో అందుకే అంత గొప్పగా ఆయన్ని సన్మానించుకుందని చెప్తాడు. అది క్రీస్తు వల్ల తన జీవితంలో జరిగిన గొప్ప మేలు వల్ల కావచ్చు లేదా క్రీస్తు మీద తనకున్న వల్లమాలిన ప్రేమ కావచ్చు. యేసు క్రీస్తు పుట్టినప్పుడు అన్నా అనే ప్రవక్తి క్రీస్తును దేవాలయంలో చూసింది. ఆయన పుట్టుక గురించిన ప్రవచనం తనకి ముందే తెలుసునని, క్రీస్తుని చూడడానికే అంత ముదుసలిదైన తాను బతికే ఉందని చెప్తుంది. క్రీస్తును తన చేతుల్లోకి ఎత్తుకుని శుభవచనాలు పలుకుతూ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఎంతోమంది స్త్రీలకు క్రీస్తు చాలా ఆత్మీయుడిగా ఉన్నాడు. ఆయనకు స్త్రీ పురుష భేదం ఉన్నట్టు ఎక్కడా కనపడదు. ఆయన తనలోని మాతృత్వాన్ని ప్రేమగా చూపించడంవల్లే చాలామంది స్త్రీలు పరిచర్య చేయడానికి ఇష్టపడి ఉంటారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీలనైనా, ఎలాంటి స్త్రీలు తన దగ్గరకి వచ్చినా ఆయన వాళ్లని ‘అమ్మా’ అని సంబోధించేవాడు. క్రీస్తు తత్వమే ఆయనని చాలామంది ఆత్మీయుడిగా చేసింది. ఆ స్త్రీలందరూ ఆయనని ఘనపరిచి అనేకులకి ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన ప్రేమకి సాక్షులుగా నిలుచున్నారు. - మెర్సీ మార్గరెట్ -
క్రీస్తు జననం.. క్రైస్తవుల పర్వదినం
- జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు - చర్చిలకు విద్యుత్ కాంతుల శోభ కర్నూలు(టౌన్): క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని నిర్వహించుకునే క్రిస్మస్ సందడి మొదలైంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చర్చిలు విద్యుత్ దీప కాంతులతో శోభిల్లుతున్నాయి. వారం రోజులుగా ఆయా చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. చర్చిల్లో క్యాండిల్ లైటింగ్ సర్వీసు నిర్వహించారు. అసలు క్రిస్మస్ అంటే.... క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన రోజు. బైబిల్లోని లేఖనాల ప్రకారం ఏసుక్రీస్తు 2016 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్లు క్త్రెస్తవులు విశ్వాసం. అందుకే ఏటా డిసెంబర్ 25న క్రెస్తవులు పండుగగా చేసుకుంటారు. ఏసుక్రీస్తు పుట్టుకను జ్ఞానులు నడిపించిన నక్షత్రాన్ని సూచనగా క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఇంటిపై క్రీస్తు జననాన్ని తెలియజేస్తు నక్షత్రాలను ఏర్పాటు చేస్తారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు చర్చి, రాక్‌వుడ్ మెమోరియల్ చర్చి, స్టాంటన్ చర్చి, గిప్సన్ చర్చి, సీఎస్ఐ తదితర చర్చిలను అందంగా అలంకరించారు. క్రీస్తు పుట్టుకను తెలియజేస్తూ పశువుల పాకను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి నుంచి అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆర్ధరాత్రి 12 గంటల వరకు ప్రార్థనలు చేసి హ్యాపి క్రిస్మస్లోకి అడుగిడిన తరువాత శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రైస్తవ ప్రపంచానికి శుభోదయం: బిషప్ పూల ఆంథోని (సెయింట్ లూర్డ్సు క్యాథడ్రల్ చర్చి ) బాధాతప్త హృదయాలకు ఓదార్పునివ్వడానికి, చీకటి నిండిన బతుకులో వెలుగులు నింపడానికి రాజాధిరాజు దీనాతిధీనునిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు జననం, క్రీస్తును అరాధించడం అనే ఆర్థాలున్నా.. మూలార్థం మాత్రం మార్పు. అదే సమ సమాజ స్థాపన. ఆ మరియ సుతుడు అపరాజితుల పక్షాన నిలిచేందుకే ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా వ్యా«ధులు, బాధల్లో ఉన్న వారి పక్షాన నిలుద్దాం. నవ సమాజాన్ని నిర్మిద్దాం. ప్రేమ, కరుణే జీవిత సారాం«శం : డాక్టర్ రెవరెండ్ రత్నప్రభపాల్ క్రీస్తు పుట్టుక దేవుని ప్రత్యక్షతకు నిదర్శనం. పాపుల రక్షణ కోసం తన రక్తాన్ని చిందించాడు. ఆయన సూచించిన సత్యం, ధర్మం, శాంతి, దయా మార్గంలో మనందరం నడవాలి. సర్వమానవాళికి ఆయన కల్పించిన రక్షణ మనకు పాప, మరణ భయముల నుంచి విముక్తి కలిగింది. -
దేవుని నిస్వార్థ ప్రేమకు సంకేతం
సిలువ మరణం మార్చి 25 గుడ్ ఫ్రైడే సందర్భంగా... ప్రతి సంవత్సరం ప్రపంచ క్రైస్తవులందరు, క్రీస్తు సిలువలో తన ప్రాణమర్పించిన దినాన్ని ‘గుడ్‌ఫ్రైడే’ (శుభ శుక్రవారం)గా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఈ సదాచారం మానవాళి పాప శాప పరిహారం నిమిత్తం ఆ దైవం జరిగించిన సంపూర్ణ రక్షణ కార్యంగా పరిగణించడానికే. ఈ ప్రపంచ చరిత్రలో ఎందరో మహనీయులు ఎన్నో ఉత్తమ కారణాల నిమిత్తం తమ ప్రాణాలర్పిం చారు. వారు కొంత కాలానికి, ఒక ప్రాంతానికి, జాతికి, మతానికి మాత్రమే పరిమితమయ్యారు. క్రీస్తు సిలువ మరణం రెండువేల సంవత్సరాలకు పూర్వం జరిగినప్పటికీ నేటికీ విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని కలిగివుంది. చరిత్రలో ఒక వ్యక్తి మరణం ఈ ప్రపం చాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రభావవంతం చేయగలగటం అనేది క్రీస్తు విషయంలోనే జరిగిందేమో. సిలువ మరణం అత్యంత అవమానకరమైన క్రూరమైన అమానవీయ మైన, కఠినమైన హింసాయుత శిక్ష. అయితే పరిశుద్ధుడు, దైవసుతుడైన యేసుక్రీస్తు ఆనాడు ఇంత క్రూర శిక్షను ఎందుకు భరించాల్సి వచ్చింది? క్రీస్తు సిలువ మరణం మానవ సమాజానికి సాధించిన పరిహారం ప్రాయశ్చిత్తం ఎలాంటివి? క్రీస్తు సిలువ మరణం ఈ ప్రపంచానికి వెల్లడి చేసిన సందేశం ఏమిటి? మానవాళికి చూపిన మార్గం ఏమిటి? సిలువ దేనికి సంకేతంగా, స్ఫూర్తిగా నిలిచింది? అన్న విషయాలు మనం అవగతం చేసుకోవాలి. సిలువలో క్రీస్తు మరణం మనకు ప్రత్యక్షపరచే ఆధ్యాత్మిక, సాంఘిక సత్యాలు, అంశాలు ఏమిటి అని చూస్తే... ప్రేమ, న్యాయం మూర్తీభవించిన ఘట్టం మానవాళి పట్ల దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచారు? దేవుడు తన న్యాయాన్ని ఎలా అమలుపరచారు? అనే విషయాలపై పౌలు అను భక్తుడు ఏం అన్నాడంటే... ‘‘మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపో యెను’’ (రోమా 5:8). ‘‘మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చి త్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ యున్నది’’ (1యోహా 4:10). క్రీస్తు సిలువ మరణం గొఱ్ఱెలవలె దారి తప్పిన మానవాళి యెడల దేవునికున్న ప్రేమ వెల్లడి చేస్తుంది. అదే సమయంలో సిలువ దైవ న్యాయమును సూచిస్తుంది. మరణ శాసన మెక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసినవాని మరణం అవశ్యం. ఆలాగే క్రీస్తు కూడా అనేకుల పాపాన్ని భరించడానికి తనను తాను అర్పించు కున్నాడు. మన పాపాలకు శిక్షగా మనకు బదులుగా ఆయన సిలువలో శిక్ష అనుభ వించాడు. క్రీస్తు సిలువ మరణం పాపం యొక్క భయంకరత్వాన్ని సూచిస్తుంది. సిలువ అంటే శ్రమకు సూచన. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువు చెప్పారు. సద్భక్తితో బ్రతకనుద్దేశించే ప్రతి ఒక్కరూ శ్రమను ఎదుర్కొనక తప్పదు. క్రైస్తవ విశ్వాస దృక్పథంలో శ్రమ ఒక భవిష్య మహిమను కలిగినది. శ్రమలకు సహనం ఓ ఆయుధం. కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమ పడటమే మంచిది. క్రైస్తవ విశ్వాస సమాజం సిలువ శ్రమల్లో నుండి అంకురించింది. శ్రమల యందే క్రైస్తవ సంఘం వర్ధిల్లింది, విస్తరించింది. జీవితంలో సిలువను మోస్తే కిరీటం ధరిస్తాం. శ్రమలు మనల్ని అంతమొం దించటానికి కాదు. అవి నిత్య మహిమకు సోపానాలు. సిలువ మరణం క్రీస్తు అంతం కాదు. అక్కడనుండే ఆయన మహిమ ఈ లోకానికి ప్రత్యక్షమైనది. క్రీస్తు సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టూ ఈ లోకంలో ప్రతి పాపినీ కడిగి శుద్ధి చేసింది. సిలువ మానవ సంబంధాల సంధి పాపం మానవుణ్ని దేవునికి దూరం చేసింది. అలాగే తోటి మానవుల మధ్య సంబంధాల విఘాతాన్ని, అగాథాన్ని సృష్టించింది. అలా విచ్ఛిన్నమైన దైవ మానవ సంబంధాలు క్రీస్తు సిలువ మరణం ద్వారా బలపడ్డాయి. మనం దేవుణ్ని తండ్రి అని పిలువగలుగు తున్నాం. ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి చేరగలుగుతున్నాం. ఇక ఏ మధ్య వర్తిత్వం అవసరం లేదు. ఏ సిఫారసూ అక్కర్లేదు. సిలువ దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న పాపమనే శాపాన్ని తొలగించి, దేవునితో మానవునికి సత్సంబంధాన్ని ఏర్పరచింది. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. అంతరాలు లేని అసమానతలు లేని అస్పష్టత లేని సమాజం... క్రీస్తు సిలువ సమాజం. నిస్వార్థ సేవకు స్ఫూర్తి ప్రతి సేవ ప్రతిఫలాన్నీ పారితోషికాన్నీ అపేక్షించి చేసేదే. కాని క్రీస్తు తన జీవిత సూత్రాన్ని ఆరంభంలోనే స్పష్టపరిచారు. ‘‘మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెననెను’’ (మార్కు 10:45). సిలువ ఒక ఉగ్ర సమాజానికి స్ఫూర్తి కాదు. సిలువ ఎప్పటికీ ఓ నిస్వార్థ, ప్రేమపూరిత, కరుణాసహిత, త్యాగ పూరిత సేవకు బలమైన స్ఫూర్తిగా నిలిచింది. మదర్ థెరిస్సా వంటి సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలిచింది. స్వార్థం ద్వేషం దోపిడీ గల ప్రపంచంలో సిలువ మనిషికి శాంతిని కలిగించింది. అన్ని కాలాల్లోనూ మనుషులకు ఓ బాటను చూపించింది. క్రీస్తు సిలువ భావం, ప్రభావం మన జీవిత ఆచరణలో భాగమై సాగాలి. ఆయన త్యాగంలో వివాదం లేదు. మానవాళి రక్షణయే ఆయన ధ్యేయం. ఎందరు నిందలు మోపినా, ఎన్ని అవమానాలు పెట్టినా, కొరడాలతో కొట్టినా, సిలువకు మేకులతో కొట్టి ఆయన దేహాన్ని వేలాడదీసి అతి కిరాతకంగా చంపినా ఆయన స్వరం ఒక్కటే. ‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము’’. అంటే ఆయన సందేశం ఒక్కటే... క్షమాపణ. ఇది ఎక్కడా కనిపించని వినిపించని దైవ త్యాగం, స్వరం, సందేశం. అందుకే సిలువ మరణం క్రీస్తు పరాజయం కాదు, మానవ పాప పరిహారార్థమై ప్రభువు సాధించిన ఘన విజయం. మనుషుల్లో అనేక వ్యత్యాసాలు, అసమానతలు వివక్షతలు, అంతరాలు, అసూయ ద్వేషాలూ ఉన్నాయి. సిలువ మానవుల మధ్య ఉన్న అడ్డు గోడల్ని పడగొట్టి అందరినీ ఏకం చేసిన శక్తి. సిలువ సృష్టించిన సమాజమే సమ సమాజం. ప్రపంచ చరిత్రలో ఏ సంస్కరణలూ తేలేని సమాజాన్ని సిలువ తీసుకువచ్చింది. - రెవ॥పెయ్యాల ఐజక్ వరప్రసాద్ -
క్రీస్తు సందేశం
యేసు ప్రభువు మరణించిన తర్వాత మూడో రోజు సమాధి నుంచి తిరిగొచ్చి 40 రోజుల పాటు భూమ్మీద తిరిగారు. ఆ 40 రోజుల పాటు ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘తొలి కిరణం’. జాన్‌బాబు దర్శకత్వంలో పీడీ రాజు, అభినయ, బాలచందర్ ముఖ్యపాత్రల్లో సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మానవాళికి క్రీస్తు అందించిన సందేశాన్ని ఈ చిత్రంలో చూపించను న్నాం. త్వరలో పాటలను, మార్చి 25న గుడ్ ఫ్రైడేకి చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. నిర్మాత అందిస్తున్న సహకారం మరువలేనిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బి.ఎస్.రెడ్డి. -
క్రిస్మస్‌లోని క్రీస్తును మర్చిపోవద్దు!
భయంకరమైన ఎడారిలో ఎంతో ఆనందంగా, తృప్తిగా జీవించాడు ఈజిప్టు తత్వవేత్త ఐరేనియస్. ఒకసారాయన అలెగ్జాండ్రియా మహా నగరానికొచ్చాడు. అక్కడి హడావుడి, అంగళ్లు, సరుకులూ చూసి తెగ సంబరపడ్డాడు. ఈ ఆనందం ఎడారిలో నీకు కరువైందనే కదా దీనర్థం అని దెప్పి పొడిచారు గిట్టనివాళ్లు. ‘అదేం కాదు, నా ఆనందాన్ని, తృప్తిని అణుమాత్రం కూడా పెంచలేని అంశాలిన్ని ఉన్నాయని తెలిసి సంతోషిస్తున్నాను’ అన్నాడాయన. జనాభా లెక్కల్లో నమోదయ్యేందుకు నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చిన యోసేపు, మరియమ్మలకు అక్కడ నివాస స్థలం దొరకలేదు. దాంతో పశువుల పాకలో తల దాచుకున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు జననం అక్కడే జరిగింది. అక్కడ పశువుల తొట్టి, పొత్తి గుడ్డలే ఆయనకు పూలపాన్పు, పట్టు పరుపులయ్యాయి. అయితే దైవ కుమారుడైన కీ స్తుకు ఈ లోకపరంగా తాము తల్లిదండ్రులమయ్యామన్న దివ్య భావనతో వారిద్దరూ పులకరించిపోయారు. చుట్టూ ఉన్న చీకటి, ఆకలి, వణికించే చలి, దూర ప్రయాణ బడలిక, నిద్ర లేమి, ఒంటరితనం, అక్కడివారి నిరాదరణ... ఇవేవీ యోసేపు, మరియల ఆనందాన్ని అణుమాత్రం కూడా తగ్గించలేకపోయాయి (లూకా 2:8-14). సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే, అది చూసి చప్పట్లు కొట్టేవారు ఒక్కరూ లేకపోతే అతనికదెంత బాధాకరం! కాని మరియ, యోసేపుల ప్రయాస, ప్రత్యేకత తెలిసివారు, పూల దండ వేసి అభినందించేవారు అక్కడ ఒక్కరూ లేరు. అయినా కూడా అంతటి అనామక పరిస్థితుల్లో, కటిక పేదరికంలో కూడా వారు దేవునిలో ఆనందించారు. అంతటి భాగ్యాన్నిచ్చిన దేవుని స్తుతించారు. అదే నిజమైన ఆనందమంటే! బాహ్య పరిస్థితుల ప్రభావం దానిపై ఉండదు. అది విశ్వాసి హృదయపు లోతుల్లో నుండి పెల్లుబుకుతుంది. విశ్వాసంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దైవ సంకల్పాల్లో భాగమైనవారి ప్రత్యేకత ఇది. వారి ఆనందానికి అవధులుండవు. బాహ్య పరిస్థితుల ప్రభావం దానిపైన పడదు. డబ్బుతో పరుపు దొరుకుతుంది కాని నిద్ర దొరకదన్నది అందరికీ తెలిసిన నిజమే! అయినా పరుపుల అమ్మకాల జోరు తగ్గలేదు. నిజమైన నిద్రకు కారణమైన ‘శాంతి’ సాధనకు మానవ ప్రయత్నాలు ముమ్మరం కాలేదు సరికదా అత్యధునాతనమైన పరుపులు సొంతం చేసుకోడానికి జనం నిద్ర మాని మరీ పాకులాడటం రోజూ మనం చూస్తున్నాం. కోటి రూపాయలుంటే కొందరికానందం. కడుపు నింపే రెండు ముద్దల అన్నం దొరికితే మరికొందరికానందం. కాని త్రాసులో కడుపు నిండిన ఆనందమే ఎక్కువ తూగుతుంది. అయినా శాంతికోసం కాదు. శాంతితో సంబంధం లేని డబ్బు, అధికారం, అందం తదితరాల కోసమే లోకం వెంపర్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే యేసుక్రీస్తు ద్వారా పరిమళించిన శాంతి సందేశాన్ని గుర్తు చేస్తోంది. శాంతి దూత, దాతయైన యేసు జనన సందేశం పామరులు, నిరుపేదలైన గొర్రెల కాపరులకు అర్థమయ్యింది. కాని పాలకులైన హేరోదు రాజుకు, పిలాతుకు, నాటి ప్రముఖులైన యూదు పెద్దలకు, యాజకులకు అర్థం కాలేదు. ఆ ఆనందం లభ్యం కాలేదు. రెండు ముద్దల అన్నం తీర్చగల ఆకలి కోసం రెండొందల మాత్రలు మింగడం, ఆద మరచి నిద్రపోలేక మద్యాన్ని, మాదక ద్రవ్యాలను ఆశ్రయించడమే మానవాళి సాధించిన ప్రగతి అయితే... క్రిస్మస్ శాంతి సందేశం, ఆనందం ముమ్మాటికీ వారికే. అందువల్ల క్రిస్మస్ వేడుకల్లో పడి క్రీస్తును విస్మరిస్తే... విందు భోజనం వదిలేసి విస్తరాకు నమిలినట్టే!! - రెవ. టి.ఎ.ప్రభుకిరణ్ దుర్భర పరిస్థితుల్లో, కటిక పేదరికంలోనూ వారు దేవునిలో ఆనందించారు. అంతటి భాగ్యాన్నిచ్చిన దేవుని స్తుతించారు. అదే నిజమైన ఆనందమంటే! అది విశ్వాసి హృదయపు లోతుల్లో నుండి పెల్లుబుకుతుంది. -
విశ్వాసులకు మరణభయం లేదు
ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు అనుచరులు ఈస్టరు ఆదివారమున క్రీస్తు పునరుత్థానమును గుర్తు చేసుకుంటారు. ఇది కనీసం క్రీ.శ. 110లో టర్కీలోని అంతియోక్లో కూడ జరుపుకొన్నట్లు తెలియబడుతున్నది. ఇది సాధారణంగా యూదుల పస్కాపండుగ అయిన తరువాత మొదటి ఆదివారమున జరుపుకుంటారు. అసలు ఈస్టరు ఉత్తర యూరోప్‌లో వసంత రుతువుకు సంబంధించిన పండుగ. క్రీస్తు పునరుత్థానమును ఈస్టరుతో సమానంగా ఎంచుట సరియైనదా, కాదా అనేది వేరే విషయం. కానీ, క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైన విషయం ప్రాధాన్యం. ఆయన మృతులలో నుంచి తిరిగి లేచాడనునది చరిత్రలో ఎంతో విభ్రాంతి కలిగించు సంఘటన. క్రీస్తు పునరుత్థాన సత్యం క్రైస్తవ సంఘమునకు పునాదిగా ఉన్నది. క్రీస్తు పునరుత్థాన ప్రాముఖ్యత ఏమిటి? బైబిల్ ప్రకారం మొదటిగా, క్రీస్తు పునరుత్థానం ద్వారా ఆయన దేవుని కుమారుడుగా ప్రకటింపబడ్డాడు (రోమా 1:4). ఆయన పునరుత్థానం క్రీస్తు దైవత్వమును నిరూపించుతున్నది. రెండవదిగా, క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవనట్లైతే, ఆయన మరణించుట యందలి ఉద్దేశము విఫలమైనట్టు. ఆయన మానవులకు బదులుగా వారి పాప ప్రాయశ్చిత్తం చేయుటకు మరణించి తిరిగి లేవనట్లైతే, అందరిలాగే పాపిగా మరణించినట్లే. కానీ, క్రీస్తు తిరిగి లేచాడు. పాప ప్రాయశ్చిత్తం జరిగింది. పాపములకు క్షమాపణ కలదు. మూడవదిగా, మరణం జీవితానికి అంతం కాదని ఆయన పునరుత్థానం బోధిస్తోంది. క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా మానవుడు నిరంతరం జీవించగలడు. ఇది మానవులకు ఆయనిచ్చే నిరీక్షణ. ఆయన యందు విశ్వాసముంచిన వారికి మరణమంటే భయము లేదు. నాల్గవదిగా, దేవుడు మనతో ఎల్లప్పుడు ఉంటాడు అనే నిశ్చయత క్రీస్తు పునరుత్థానం ద్వారా కలుగుతుంది. అందుకే యేసు తన శిష్యులతో ‘‘ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను’’ అని వాగ్దానం చేశాడు (మత్తయి 28:20). చివరిగా, ఆయన పునరుత్థాన శక్తిచేత ఆయన జీవించినట్లు పవిత్రమైన, దీనమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తాడు. అందుకు ఆయన, ‘‘నేను జీవమిచ్చుటకును, మరియు సమృద్ధియైన జీవమిచ్చుటకును వచ్చియున్నాను’’ అని చెప్పాడు (యోహాను 10:10). మీ జీవితాలలో క్రీస్తు పునరుత్థానములోని ప్రాముఖ్యత కనుగొని, జీవించునట్లు దేవుడు మిమ్మునాశీర్వదించును గాక! - ఎర్రా -
ఆరాధనా స్థలాలుగా... మన కుటుంబాలు
విశ్వాసి వాక్యం అకుల అనే యూదు క్రైస్తవుడు అతని భార్యయైన ప్రిస్కిల్ల ఆదిమకాలపు ఆదర్శమయమైన విశ్వాసి జంట. అపొస్తలుడైన పౌలుకు పరిచర్యలో వారు సహాయకులు. ఎంతో ప్రతికూలత మధ్య పౌలు స్థాపించిన కొరింథీ, ఎఫెసీ చర్చిలు ఆ పట్టణాల్లో అకుల, ప్రిస్కిల్ల గృహాల్లోనే ఆరంభమయ్యాయి. పైగా అపొల్లో అనే మహావిద్వాంసుణ్ణి వారు ఎఫెసులో తమ ఇంటిలో చేర్చుకుని క్రీస్తు మార్గాన్ని విశదీకరించి తర్ఫీదునిస్తే ఆయన గొప్ప సువార్త ప్రబోధకుడయ్యాడు (అపొ.కా. 18) మా చర్చిలో మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం తెలుసా? అంటారు చాలామంది గొప్పగా. అకుల, ప్రిస్కిల్ల అనే ఈ దంపతులైతే తమ కుటుంబాన్నే చర్చిగా, బైబిలు కళాశాలగా మార్చుకున్నారు. పగ, వైషమ్యాలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజంలో దేవుని భయం, ప్రేమ పునాదిగా కలిగిన ఇలాంటి విశ్వాస కుటుంబాలు ఎడారిలో సెలయేళ్లవంటివే కదా! ఆత్మీయ పునాదులు, విలువల మీద కట్టబడిన కుటుంబాలతోనే పటిష్టమైన సమాజం నిర్మితమవుతుంది. పిల్లల పెంపకంలో అందుకే తల్లిదండ్రులది కీలకమైన పాత్ర. కరెన్సీ కట్టల్ని వేటాడే విద్యల్లో మన పిల్లలు ఆరితేరేందుకు ఆరాటపడుతున్నాం కాని అంతిమంగా ఆత్మీయత రూపంలో వారెలాంటి మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో ఆలోచించడం లేదు. ఆవిరి యంత్రాలతో ఆరంభమైన పారిశ్రామిక విప్లవం వేస్తున్న వెర్రితలల ఆధునిక యుగంలో మనుషులు కూడా మనసులేని యంత్రాలుగా మారి, ఒకనాటి శాంతి, ఆనందాలు ఆవిరైపోతుంటే నిస్సహాయంగా చూస్తున్నాం. అన్నీ చూస్తూ కూడా అలాంటి రాక్షస సమాజంలోనికే మన పిల్లల్ని నెడుతున్నాం. దేవుడు మాత్రమే ఇచ్చే శాంతిని, నిజమైన ఆనందాన్ని, లోకం ఇచ్చే విలాసాలు, వినోదాల్లో పొందే అవివేకానికి ‘ఆధునికత’ అనే పేరు పెట్టి మురిసిపోతున్నాం. మన కుటుంబాలు దేవునికి ఆరాధనా స్థలాలు, బైబిలు బోధనా కేంద్రాలుగా ఉంటే దేవునికి మహిమ, మనకు పరలోకానందం. దేవుడు, ఆయన విధివిధానాల మీద కట్టబడిన విశ్వాస కుటుంబాలు వినూత్న సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. దేవునికి దూరంగా బతకడమే ఆనందమనుకుంటే నీటికోసం ఎండమావుల్ని ఆశ్రయించడమే. మితిమీరిన వేగం, హింసాత్మకత నిండిన నేటి ‘ప్రగతిశీల సమాజం’లో జీవన సాఫల్యంతో హాయిగా కన్నుమూసే భాగ్యం కోల్పోయాం. బి.పి., షుగర్ వంటి జీవనశైలి రోగాలతో, బుల్లెట్ గాయాలతో కన్నుమూసే నిస్సారపు సమాజాన్ని నిర్మించుకున్నాం. ‘దేవుని సన్నిధి’ అనే అగ్ని మండే బలిపీఠాలుగా మన కుటుంబాలు, చర్చిలు ఉండాలి. అది సకల విధాలైన అపరిశుద్ధతనూ దహించి వేసి శాంతిని, ఆనందాన్ని మనలో నింపుతుంది. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
లోక రక్షకుడు!
క్రీస్తును లోక రక్షకునిగా, దేవునిగా అనేకమంది ఆరాధిస్తారు. నిజానికి క్రీస్తు నూటికి నూరుపాళ్లు మానవుడే! మానవుడైన క్రీస్తు దేవుడెలా అయ్యాడు అన్న దానికి సమాధానం దేవునికి, మానవునికి ఉన్న వ్యత్యాసాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే లభిస్తుంది. దేవుడు సృష్టికర్త అయితే మానవుడు సృష్టిలోని ఒక భాగం మాత్రమే. భూమిని, ఆకాశాన్ని, సర్వసృష్టిని దేవుడు తన నోటి మాటతో సృజించాడని బైబిలు గ్రంథం వివరిస్తోంది. మానవుడికి అంతటి శక్తి లేదు. దేవునికి మానవునికి మధ్యన ఉన్న మరొక ముఖ్యమైన వ్యత్యాసం- దేవునిలో పాపం మచ్చుకైనా లేదు. మానవునిలో పాపం జన్మతః కల్గింది. ఆ పాపాలను క్షమించగలవాడు దేవుడొక్కడే! ఎందుకంటే ఆయనలో పాపం లేదు గనుక. దేవునిలో ఉన్న ఈ లక్షణాలన్నీ మనం క్రీస్తు ప్రభువులో చూడగల్గుతున్నాం. ఆయన సత్యాన్ని బోధించాడు. నీతిని అనుసరించాడు. ఆయన నోటి మాటతో తుపానును గద్దించినప్పుడు అది వెంటనే నెమ్మదించింది. అంధుల కళ్లను తాకగా వారికి చూపు లభించింది. పక్షవాతంతో మంచం మీద పడి ఉన్న వానిని, ‘నీవు లేచి నిలచి, నీ పరుపునెత్తుకొని నడువుము’ అని చెప్పగానే అతను దిగ్గునలేచి తన పరుపునెత్తుకొని నడిచాడు. ఇవన్నీ క్రీస్తు చేసిన అద్భుతాలు. వాటికి చరిత్ర సాక్ష్యంగా నిలచింది. అందుకే క్రీస్తు లోకరక్షకుడయ్యాడు. ఆయన మానవాళికి ఇచ్చిన ఆజ్ఞ ఒక్కటే. ‘‘నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోను, పూర్ణశక్తితోను ఆరాధించు’’ అని. ఈ ఆజ్ఞను ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణా ఆచరించినప్పుడు అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, రక్షణను మనం పొందుతాం. - యస్. విజయభాస్కర్ -
నలుగురి గురించి..
క్రిస్మస్ లైట్స్ ‘నా గురించి కాదు.. మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి..’ ఇది క్రీస్తు వాణి. నగరంలో సందడి చేస్తున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సిటీజనులు. తమ సంతోషానికి సేవాభావాన్ని జోడిస్తూ.. పది మంది ఆనందాల మధ్య పండుగను జరుపుకుంటాం అంటున్నారు. మాదాపూర్ హైటెక్స్ నోవాటెల్ హోటల్లో వెదురు బొంగులతో క్రిస్మస్ ట్రీని తయారు చేశారు. దానికి పూర్తి స్థాయిలో అలంకరణ చేయలేదు. ట్రీని రెడీ చేసి డెకొరేట్ చేయకపోవడం ఏంటని అనుకుంటున్నారా..! ఈ అలంకరణ చేసే భాగ్యాన్ని సందర్శకులకే కల్పిస్తున్నారు. ఇందు కోసం వారు కూపన్ కొనుగోలు చేయాలి. ఆ తర్వాత అలంకరణ సామగ్రి ఐటమ్స్ బాల్స్, స్టార్స్, బెల్ట్.. ఇలా వివిధ వస్తువులతో ట్రీని అలంకరించాలి. ఇలా కూపన్ కొనుగోలు ద్వారా వచ్చిన నిధులను వృద్ధుల కోసం పనిచేస్తున్న నిరీక్షణ ఫౌండేషన్‌కు అందచేస్తామని రూమ్స్ డివిజన్ మేనేజర్ దినేశ్ రాయ్ చెప్పారు. నలుగురికీ చేయూతనిచ్చే ఈ థీమ్‌ను పదిమందీ మెచ్చి పండుగలో పాలుపంచుకుంటున్నారు. -
క్రీస్తు రూపురేఖలతో...తొలినాటి రేఖాచిత్రం!
ప్రత్యక్షం క్రీస్తుకు సంబంధించిన పవిత్ర ఆనవాళ్లు ఆయన నడయాడిన ప్రాంతాలలో, ఆయనను విశ్వసించిన వారు జీవించిన కాలపు ప్రాచీన ప్రదేశాలలో ఇప్పటికీ బయట పడుతూనే ఉన్నాయి! తాజాగా స్పెయిన్ పురావస్తు పరిశోధకులు కొందరు ఈజిప్టులోని డ్యూరా ప్రాంతంలో ఒక భూగర్భ సమాధి గోడలపై ఉన్న చిత్ర లేఖనాలలో యేసుక్రీస్తు రూపురేఖలతో ఉన్న స్పష్టమైన రేఖా చిత్రాన్ని కనుగొన్నారు. క్రీ.శ. 6-7 శతాబ్దాల మధ్య కాలం నాటి ఈజిప్టు పట్టణం ఆక్సిరింకస్లో బయల్పడిన ఈ చిత్రంలో యేసుక్రీస్తు యువకుడిలా ఉన్నారు. తలజుట్టు రింగులు తిరిగి ఉంది. పొడవాటి అంగీని ధరించి ఉన్నారు. ‘కాటలాన్ ఈజిప్టోలజీ సొసైటీ’కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త జోసెఫ్ పాడ్రో నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో ప్రాచీన క్రైస్తవ సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించిన భూగర్భ సమాధిపై అన్నీ ఆనాటి సంస్కృతులకు ప్రతీకలైన చిత్రాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యేసుక్రీస్తు చిత్రం. క్రీస్తుకు సంబంధించి బహుశా ఇదే తొలి చిత్రలేఖనం కావచ్చని వారు భావిస్తున్నారు. అయితే తమకున్న పరిమితులు, నిబంధనల మేరకు కట్టడాన్ని తప్ప, క్రీస్తు చిత్రాన్ని ప్రపంచం దృష్టికి తక్షణం తేలేకపోతున్నామని పరిశోధకుల బృందం ప్రకటించింది. -
క్రీస్తు ప్రేమకు పాత్రులమవుదాం...
క్రీస్తు మనందరికోసం పునరుత్థానం చెందాడు. ఆ పునరుత్థాన శక్తిని మనలో నింపుకుని జీవితంలోని అన్ని దశల అనుదిన జీవనంలో చెడు నుంచి మంచి వైపుకు మనం అడుగులు వేయాలి. రోమ్‌లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ప్రియ సోద ర సోదరీమణులందరికీ... హ్యాపీ ఈస్టర్. ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. నేను ప్రకటించబోయే వర్తమానం అటువంటిది. క్రీస్తు తిరిగి లేచాడు! క్రీస్తు పునరుత్థానం చెందాడు. ఈ సంగతిని ఇంటింటికీ వెళ్లి, ప్రతి కుటుంబం చెంతకూ వెళ్లి, ముఖ్యంగా పీడితులు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో... ఆసుపత్రులలో, కారాగారాలలో... అక్కడికి వెళ్లి చెప్పాలని ఉంది నాకు. క్రీస్తు సమాధి వద్దకు వెళ్లి, అది ఖాళీగా ఉండడం చూసి అబ్బుర పడిన ఆయన శిష్యురాళ్ల వలే మనకూ ఆశ్చర్యం కలగవచ్చు. ఏమిటి దీనికి అర్థం? క్రీస్తు తిరిగి లేచాడంటే ఏమిటి అంతరార్థం? ఏమిటంటే - మరణం కన్నా, పాపం కన్నా కూడా దేవుని ప్రేమ శక్తిమంతమైనదని! దేవుని ప్రేమ పూర్తిగా మన జీవితాలను మార్చివేసిందని! మన హృదయంలో ఎడారులై ఉన్న ప్రదేశాలను వికసింపజేసిందని! దేవుని ప్రేమ ఏదైనా చేయగలదు. ఈ ప్రేమ కోసమే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనిషిగా జన్మించాడు. నిరాడంబర మార్గాన్ని అనుసరించాడు. చిట్టచివరి వరకు తనను తను అర్పించుకుంటూ దేవుని నుంచి విడివడ్డాడు. ఇదే కారుణ్య ప్రేమ సమాధిలోని క్రీస్తు దేహంపై ఒక ఉద్ధృతిగా ప్రసరించి ఆ దేహాన్ని నిత్య జీవంతో నింపింది. కాబట్టి నేనిప్పుడు ఎవరితోనైతే మాట్లాడుతున్నానో వారందరికీ నాదొక ఆహ్వానం. క్రీస్తు పునరుత్థాన మహిమకు లోబడదాం. దేవుని కారుణ్యంతో మనల్ని మనం పునర్నవీకరించుకుందాం. క్రీస్తు ప్రేమకు పాత్రులమవుదాం. ఆయన ప్రేమతో మన జీవితాలను వెలిగించుకుందాం. ఈ భూమికి జలాన్ని, శాంతిని అందిస్తున్న ఆయన కారుణ్యానికి ప్రతినిధులమవుదాం. అదేవిధంగా, తిరిగి లేచిన క్రీస్తును మనం... మనలోని ద్వేషాన్ని ప్రేమగా, ప్రతీకార భావాన్ని క్షమాగుణంగా, యుద్ధాన్ని శాంతిగా మార్చమని అడుగుదాం. ప్రపంచాన్ని శాంతివనంగా మార్చమని ప్రార్థిద్దాం. ప్రియ సోదర సోదరీమణులారా... రోమ్ నుంచి నా మాటలను ఆలకిస్తున్న ప్రపంచ పౌరులందరికీ ‘సామెతలు’ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నిరంతరమైన ఆయన ప్రేమకు, కారుణ్యానికి వందనాలు సమర్పించండి. ఈ శాంతి సందేశాన్ని, సంతోష సందేశాన్ని, ఆకాంక్షల సందేశాన్ని మీ కుటుంబాలలో, మీ దేశాలలో ప్రతి సంవత్సరం ఈస్టర్ రోజున వినిపించండి. (వాటికన్ సిటీ నుంచి పోప్ ఫ్రాన్సిస్ గత ఏడాది ఇచ్చిన ఈస్టర్ శాంతి సందేశంలో కొంతభాగం)