క్రీస్తు రూపురేఖలతో...తొలినాటి రేఖాచిత్రం!
ప్రత్యక్షం
క్రీస్తుకు సంబంధించిన పవిత్ర ఆనవాళ్లు ఆయన నడయాడిన ప్రాంతాలలో, ఆయనను విశ్వసించిన వారు జీవించిన కాలపు ప్రాచీన ప్రదేశాలలో ఇప్పటికీ బయట పడుతూనే ఉన్నాయి! తాజాగా స్పెయిన్ పురావస్తు పరిశోధకులు కొందరు ఈజిప్టులోని డ్యూరా ప్రాంతంలో ఒక భూగర్భ సమాధి గోడలపై ఉన్న చిత్ర లేఖనాలలో యేసుక్రీస్తు రూపురేఖలతో ఉన్న స్పష్టమైన రేఖా చిత్రాన్ని కనుగొన్నారు. క్రీ.శ. 6-7 శతాబ్దాల మధ్య కాలం నాటి ఈజిప్టు పట్టణం ఆక్సిరింకస్‌లో బయల్పడిన ఈ చిత్రంలో యేసుక్రీస్తు యువకుడిలా ఉన్నారు.
తలజుట్టు రింగులు తిరిగి ఉంది. పొడవాటి అంగీని ధరించి ఉన్నారు. ‘కాటలాన్ ఈజిప్టోలజీ సొసైటీ’కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త జోసెఫ్ పాడ్రో నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో ప్రాచీన క్రైస్తవ సంప్రదాయాన్ని అనుసరించి నిర్మించిన భూగర్భ సమాధిపై అన్నీ ఆనాటి సంస్కృతులకు ప్రతీకలైన చిత్రాలే ఉన్నాయి.
వాటిలో ముఖ్యమైనది యేసుక్రీస్తు చిత్రం. క్రీస్తుకు సంబంధించి బహుశా ఇదే తొలి చిత్రలేఖనం కావచ్చని వారు భావిస్తున్నారు. అయితే తమకున్న పరిమితులు, నిబంధనల మేరకు కట్టడాన్ని తప్ప, క్రీస్తు చిత్రాన్ని ప్రపంచం దృష్టికి తక్షణం తేలేకపోతున్నామని పరిశోధకుల బృందం ప్రకటించింది.