నలుగురి గురించి..
క్రిస్మస్ లైట్స్
‘నా గురించి కాదు.. మీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి..’ ఇది క్రీస్తు వాణి. నగరంలో సందడి చేస్తున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సిటీజనులు. తమ సంతోషానికి సేవాభావాన్ని జోడిస్తూ.. పది మంది ఆనందాల మధ్య పండుగను జరుపుకుంటాం అంటున్నారు. మాదాపూర్ హైటెక్స్ నోవాటెల్ హోటల్‌లో వెదురు బొంగులతో క్రిస్మస్ ట్రీని తయారు చేశారు. దానికి పూర్తి స్థాయిలో అలంకరణ చేయలేదు. ట్రీని రెడీ చేసి డెకొరేట్ చేయకపోవడం ఏంటని అనుకుంటున్నారా..!
ఈ అలంకరణ చేసే భాగ్యాన్ని సందర్శకులకే కల్పిస్తున్నారు. ఇందు కోసం వారు కూపన్ కొనుగోలు చేయాలి. ఆ తర్వాత అలంకరణ సామగ్రి ఐటమ్స్ బాల్స్, స్టార్స్, బెల్ట్.. ఇలా వివిధ వస్తువులతో ట్రీని అలంకరించాలి. ఇలా కూపన్ కొనుగోలు ద్వారా వచ్చిన నిధులను వృద్ధుల కోసం పనిచేస్తున్న నిరీక్షణ ఫౌండేషన్‌కు అందచేస్తామని రూమ్స్ డివిజన్ మేనేజర్ దినేశ్ రాయ్ చెప్పారు. నలుగురికీ చేయూతనిచ్చే ఈ థీమ్‌ను పదిమందీ మెచ్చి పండుగలో పాలుపంచుకుంటున్నారు.