అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన వ్యోమగాములు
‘సెలవు కావాలి’. పండుగలు, పెళ్లిళ్లు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచదేశాలు అన్ని చోట్లా ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ తెగేసి చెప్పారు.
వీళ్ల సెలవు అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందోఏమో క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహారపదార్థాలు తినేందుకు నోరూరుతోందని అక్కడి భారతీయమూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి ఒకటిన తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కనబెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది.
తాజాగా ఐఎస్‌ఎస్‌కు వచి్చన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ 2,700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడి విడిగా వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియోకాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్‌ను తెస్తూ సునీత, డాన్ పెటిట్‌లు శాంటా టోపీలు ధరించిన ఫొటో ఒకటి తాజాగా షేర్‌చేశారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్‌ఎస్‌కు వచి్చన సునీతా విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment