లోక రక్షకుడు!
క్రీస్తును లోక రక్షకునిగా, దేవునిగా అనేకమంది ఆరాధిస్తారు. నిజానికి క్రీస్తు నూటికి నూరుపాళ్లు మానవుడే! మానవుడైన క్రీస్తు దేవుడెలా అయ్యాడు అన్న దానికి సమాధానం దేవునికి, మానవునికి ఉన్న వ్యత్యాసాలను తెలుసుకున్నప్పుడు మాత్రమే లభిస్తుంది.
దేవుడు సృష్టికర్త అయితే మానవుడు సృష్టిలోని ఒక భాగం మాత్రమే. భూమిని, ఆకాశాన్ని, సర్వసృష్టిని దేవుడు తన నోటి మాటతో సృజించాడని బైబిలు గ్రంథం వివరిస్తోంది. మానవుడికి అంతటి శక్తి లేదు. దేవునికి మానవునికి మధ్యన ఉన్న మరొక ముఖ్యమైన వ్యత్యాసం- దేవునిలో పాపం మచ్చుకైనా లేదు. మానవునిలో పాపం జన్మతః కల్గింది. ఆ పాపాలను క్షమించగలవాడు దేవుడొక్కడే! ఎందుకంటే ఆయనలో పాపం లేదు గనుక.
దేవునిలో ఉన్న ఈ లక్షణాలన్నీ మనం క్రీస్తు ప్రభువులో చూడగల్గుతున్నాం. ఆయన సత్యాన్ని బోధించాడు. నీతిని అనుసరించాడు. ఆయన నోటి మాటతో తుపానును గద్దించినప్పుడు అది వెంటనే నెమ్మదించింది. అంధుల కళ్లను తాకగా వారికి చూపు లభించింది. పక్షవాతంతో మంచం మీద పడి ఉన్న వానిని, ‘నీవు లేచి నిలచి, నీ పరుపునెత్తుకొని నడువుము’ అని చెప్పగానే అతను దిగ్గునలేచి తన పరుపునెత్తుకొని నడిచాడు. ఇవన్నీ క్రీస్తు చేసిన అద్భుతాలు. వాటికి చరిత్ర సాక్ష్యంగా నిలచింది. అందుకే క్రీస్తు లోకరక్షకుడయ్యాడు. ఆయన మానవాళికి ఇచ్చిన ఆజ్ఞ ఒక్కటే. ‘‘నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోను, పూర్ణశక్తితోను ఆరాధించు’’ అని. ఈ ఆజ్ఞను ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణా ఆచరించినప్పుడు అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని, రక్షణను మనం పొందుతాం.
- యస్. విజయభాస్కర్