
ఏడుగురు ప్రయాణికుల కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని ముష్కరులు ఏడుగురు ప్రయాణికులను పొట్టనపెట్టుకున్నారు. బస్సు నుంచి ఏడుగురు ప్రయాణికులను కిందికి దించి తుపాకులతో కాల్చిచంపారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నుంచి పంజాబ్ ప్రావిన్స్‌కు బస్సు వెళ్తుండగా బుధవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. బస్సు బుర్ఖాన్ ప్రాంతానికి రాగానే జాతీయ రహదారిపై సాయుధ ముష్కరులు బారీకేడ్లు అడ్డంగా పెట్టి నిలిపివేశారు. బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికుల గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు.
ఏడుగురిని బలవంతంగా కిందికి దించారు. సమీపంలోని పర్వతంపైకి తీసుకెళ్లి తుపాకులతో కాల్చారు. దాంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాలను రాక్నీ ఆసుపత్రికి తరలించారు. ముష్కరుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ అకృత్యానికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
దాదాపు 12 మంది సాయుధాలు బస్సులోకి వచ్చారని, వారివద్ద ఆధునిక ఆయుధాలున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్థానిక బలూచ్ ఉగ్రవాద గ్రూప్‌లు ఇటీవల ఒక్కసారిగా చురుగ్గా మారిపోయాయి. ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడి సైతం ఆయా గ్రూప్‌ల పనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమాయలకు బలి తీసుకున్న రాక్షసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తేల్చిచెప్పారు. బుర్ఖాన్‌లో జరిగిన హత్యాకాండను పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment