
మిమ్మల్ని ‘బుట్ట’లో వేసేస్తుంది!
ఈసారి మీరు షాప్‌కి వెళ్లినప్పుడు... ‘చెఫ్ బాస్కెట్’ ఇవ్వమని అడగండి. ఒక స్టీలు బుట్టను మీ చేతిలో పెడ తారు. చూడ్డానికి ఇది మామూలు బుట్టలానే అనిపిస్తుంది కానీ... దీని వల్ల ఉన్న ఉపయోగాలేమిటో తెలిస్తే మీరు బుట్టలో పడిపోతారు. దాన్ని వెంటనే కొనేస్తారు.
కజ్జికాయలు, గవ్వలు, చిప్స్, ఫింగర్ చిప్స్ లాంటి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా! వాటిని కడాయిలోంచి తీసేటప్పుడు బోలెడంత నూనె వచ్చేస్తూ ఉంటుంది. అవి తింటే మన గుండెకు మనమే స్పాట్ పెట్టుకున్నట్టు అవుతుంది. పైగా నూనె కూడా బాగా వృథా అయిపోతుంది. అందుకే ఈ చెఫ్ బాస్కెట్ ఇంట్లో ఉండి తీరాలి. వేయించాలనుకున్నవాటిని ఈ బుట్టలో వేసి, నూనె వేసిన కడాయిలో ఉంచాలి. వేగాక తీసేటప్పుడు పెద్దగా నూనె రాదు. బుట్టని కాసేపు ఏదైనా గిన్నె మీద పెడితే... అంటుకున్న కాస్తో కూస్తో నూనె కూడా కారిపోతుంది. పదార్థాలు పొడిగా ఉంటాయి. నూనె కూడా ఆదా!
ఈ చెఫ్ బాస్కెట్‌తో మరో రెండు ఉపయోగాలున్నాయి. స్టాండులా మార్చి పండ్లు, కూరగాయలు దాచుకోవచ్చు... ఆవిరి మీద కూరగాయలవీ ఉడికించుకోవచ్చు (ఫొటోలు 1,2). ఉపయోగించనప్పుడు శుభ్రంగా కడిగి, చక్కగా మడత పెట్టేసి దాచేసుకోవచ్చు (ఫొటో3). ఇన్ని ఉపయోగాలున్నాయి కదా అని ధర బోలెడంత ఉంటుందని భయపడక్కర్లేదు. కేవలం 150 రూపాయలకే వచ్చేస్తుంది. ఆన్‌లైన్లో అయితే రూ. 100 లోపే!