సంధ్య, రాజీవ్ ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్దరూ యాంబిషస్ ప్రొఫెషనల్స్. సంధ్య ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా, రాజీవ్ ప్రోడక్ట్ మేనేజర్‌గా ఒక అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ లైఫ్, ఇల్లు కట్టుకోవడం, వివిధ దేశాలకు టూర్ వెళ్లడం వంటి కలల గురించి తరచుగా మాట్లాడుకునేవారు. పరస్పర గౌరవం, ఎమోషనల్ ఇంటిమసీతో ఉండేవారు.
అయితే, పెళ్లికి ఆరునెలల ముందు పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. కొత్త ప్రాజెక్ట్ రావడంతో ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడం, డెడ్‌లైన్‌కు ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఒత్తిడి, పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనుల కారణంగా ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోయారు. ఎప్పుడైనా మాట్లాడుకున్నా, అతిథుల జాబితాలు, బడ్జెట్‌లు, లాజిస్టిక్స్ చుట్టూ తిరిగేవి. డేట్ నైట్స్, ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమసీలు తగ్గిపోయాయి.
సంధ్య మామూలుగానే రిజర్వ్‌డ్ వ్యక్తి. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు పనిలో మరింతగా మునిగిపోయింది. తన కెరీర్‌లో రాణించి, పెళ్లి సజావుగా జరిగితే మిగతావన్నీ సవ్యంగా సాగుతాయని భావించింది. కాని, రాజీవ్ మాత్రం ఎమోషనల్‌గా ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తరచుగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు. ‘పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగనివ్వు రాజీవ్. పెళ్లి తర్వాత అన్నీ సెట్ అవుతాయి. అప్పుడు టైమ్ అంతా మనదే కదా’ అంటూ అతని మాటలను తోసివేసేది సంధ్య.
ఆ సమయంలోనే రాజీవ్ టీమ్‌లోకి ప్రియ అనే కొత్తమ్మాయి చేరింది. చురుగ్గా, సరదాగా ఉండే వ్యక్తి. ప్రాజెక్ట్ టైమ్‌కి పూర్తిచేయాలని లేట్ అవర్స్‌లో కూడా పనిచేసేది. మొదట్లో రాజీవ్, ప్రియల సంభాషణలు ప్రొఫెషన్‌కు సంబంధించినవే ఉండేవి. క్రమేపీ అవి పర్సనల్ స్థాయికి చేరాయి.
రాజీవ్ ఆలోచనలను ప్రియ ప్రశంసించేది. అతని పని ఒత్తిడి పట్ల సహానుభూతి చూపించి, సంధ్య నుంచి అందని మద్దతును అతనికి అందించగలిగింది. ఫ్రెండ్లీ బాంటర్ త్వరగా ఫ్లర్ట్‌గా మారింది. తాను చేస్తున్నది తప్పని తెలిసినా, అదేమీ హానికరం కాదని, తన పెళ్లిపై ఎలాంటి ప్రభావం చూపించదని రాజీవ్ సమర్థించుకునేవాడు. వారాలు గడిచేకొద్దీ అతను తన ఫోన్‌ను సంధ్య నుంచి దాచడం ప్రారంభించాడు.
ఓ రోజు ఇద్దరూ కలిసి ఔటింగ్‌కు వెళ్లారు. డ్రింక్స్ తీసుకెళ్లడానికి రాజీవ్ పక్కకు వెళ్లిన సమయంలో వచ్చిన నోటిఫికేషన్ చూడటానికి సంధ్య అతని ఫోన్ ఓపెన్ చేసింది. ప్రియ, రాజీవ్‌ల మధ్య జరిగిన చాటింగ్ ఆమె కంటపడింది. అంతే, ఆమె మనసు ముక్కలైంది. రాజీవ్‌పై పెట్టుకున్న నమ్మకం ధ్వంసమైంది.
ఆ తర్వాత రాజీవ్‌తో సమయం గడపడం సంధ్య జీవితంలో అతి కష్టమైన పని అయింది. కోపం, బాధ, అవమాన భావాలతో సతమతమయ్యేది. ఇదంతా భరించలేక ఒకరోజు రాజీవ్‌ను అడిగేసింది. రాజీవ్ తన తప్పును ఒప్పుకున్నాడు. కానీ సంధ్య అతన్ని క్షమించలేకపోయింది. తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు.
అయినా రాజీవ్ పై మళ్లీ నమ్మకం ఉంచడం చాలా కష్టమనిపించింది. అతనికి మరో అవకాశం ఇవ్వాలా? లేక పెళ్లిని రద్దు చేసుకోవాలా? అనే సందేహంలో ఉంది సంధ్య. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌కి వెళ్లింది. ఇద్దరికీ మూడు నెలల కౌన్సెలింగ్ తర్వాత, ఒకరిపై ఒకరికి మళ్లీ పూర్తిగా నమ్మకం ఏర్పడ్డాక పెళ్లి చేసుకున్నారు.
నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడానికి పది సూత్రాలు..
» క్రమబద్ధమైన మంచి చర్యల ద్వారా నమ్మకం పెరుగుతుంది.
» మోసం చేసిన వ్యక్తి పూర్తి బాధ్యతను స్వీకరించాలి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి.
» తప్పు చేసినవారిని క్షమించడం మీ మానసిక శాంతి కోసమే, అది నిదానంగా జరుగుతుంది.
» ఎమోషనల్ ఓపెన్‌నెస్ బంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది.
» హద్దులను నిర్దేశించుకోవడం, గౌరవించడం ఆరోగ్యకరమైన బంధానికి కీలకం.
» నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేయాలి.
» భాగస్వాములిద్దరూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం వ్యక్తిగత వృద్ధికి, బంధం బలమవ్వడానికి దోహదం చేస్తుంది.
» బంధానికి విలువ ఉందా లేదా అన్నది ఆలోచించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
» బంధాన్ని బలంగా, మంచి పునాదితో తిరిగి నిర్మించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలచుకోవాలి.
» అవసరమైతే సైకాలజిస్ట్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment