
ఇండియాలో విడుదల చేయడంలేదన్న దర్శకురాలు సంధ్యా సూరి
యూకే తరఫున ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన ‘సంతోష్’ చిత్రం విడుదలకు భారత్‌లో బ్రేక్ పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సహానా గోస్వామి, సునీతా రాజ్వర్, సంజయ్ బిష్ణోయ్, కుశాల్ దూబే ప్రధానపాత్రల్లో భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ ΄పౌరురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంతోష్’. 2024లో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో యూకే తరఫున ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన ‘సంతోష్’ మూవీ డిసెంబర్‌లో షార్ట్ లిస్ట్ అయినప్పటికీ అవార్డు అందుకోలేకపోయింది.
ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ఇండియాలో విడుదల చేయాలనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ మూవీలో పలు సున్నితమైన అంశాలను చూపించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందని యూనిట్ తాజాగా వెల్లడించింది. అందుకే ఈ సినిమాని భారత్‌లో రిలీజ్ చేయడం లేదని పేర్కొంది. ఈ విషయం గురించి సంధ్యా సూరి మాట్లాడుతూ– ‘‘సంతోష్’ని భారత్‌లో విడుదల చేయాలని ప్రయత్నించాం. మా చిత్రంలో కొన్ని సున్నితమైన సన్నివేశాలను తొలగించమని సెన్సార్ బోర్డు పేర్కొంది. అలా చేస్తే మా కథలోని గాఢత పోతుంది.
స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు మా సినిమాని అందరూ అంగీకరించారు. కానీ, ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైగా మా సినిమాలో చూపించిన సన్నివేశాలను, సమస్యలను గతంలో ఎన్నో సినిమాల్లో ప్రస్తావించారు. బహుశా మా సినిమాలో హీరో లేకపోవడం వల్ల నచ్చలేదేమో? అందుకే మా సినిమాని ఇండియాలో థియేటర్స్‌లో రిలీజ్ చేయడం లేదు. ఇది మాకెంతో బాధగా ఉంది’’ అని తెలిపారు.