
శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు పేరుతో ఏర్పాటు
సీఎం చంద్రబాబు వెల్లడి
దీనిద్వారా వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి నిధుల సేకరణ
శ్రీవాణి ట్రస్టు కొనసాగుతుందని స్పష్టీకరణ
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరుతో ఇప్పటికే ఒక ట్రస్టు ఉన్నప్పటికీ శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్టు పేరుతో నూతన ట్రస్టును ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు కూడా కొనసాగుతుందన్నారు. తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజుకు సరిపడా రూ.44 లక్షల విరాళాన్ని టీటీడీకి అందించారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సీఎం భేటీ అయ్యారు.
ఆలయాల నిర్మాణాల కోసం నూతన ట్రస్టు..
అనంతరం.. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లేవు. అలాంటిచోట్ల ఈ ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు నూతన ట్రస్టు ఏర్పాటుచేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడో కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాన్ని తలపెడుతున్నాం. మాధవసేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటుచేస్తాం. స్వామివారి ఆస్తులు ఎవరు కబ్జాచేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం’.. అని అన్నారు.
టీటీడీలో హిందువులే పనిచేయాలి..
‘టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి. ఇతర ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. అలాగే, ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తాం’.. అని చంద్రబాబు చెప్పారు.
ఆ హోటళ్లకు భూకేటాయింపులు రద్దు..
తిరుమల కొండకు ఆనుకుని ముంతాజ్, ఎమర్, దేవలోక్ హోటళ్లకు అనుమతులిచ్చి 35.32 ఎకరాలు కేటాయించారు. ఆ భూముల కేటాయింపులను రద్దుచేస్తున్నామని చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడంగాని, అపవిత్రంగాని చేయకూడదన్నారు.
రాజకీయాల కోసమే శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు
గతంలో శ్రీవాణి ట్రస్టులో అనేక అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పెద్దఎత్తున విమర్శలు చేశారు. కానీ, నేడు శ్రీవాణి ట్రస్టు కొనసాగుతుందని చెబుతూ మరో కొత్త ట్రస్టు ఏర్పాటు అంటున్నారు. అంటే.. శ్రీవాణి ట్రస్టులో గతంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని సీఎం చెప్పకనే చెప్పేశారని.. అందుకే శ్రీవాణి ట్రçస్టు కొనసాగుతుందంటున్నారని భక్తులు చెబుతున్నారు. రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటారనేది చంద్రబాబు మరోసారి నిరూపించారని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment