
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో వెలువడిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ తీర్పు కూడా అంతే పంచలనంగా మారింది. సుదీర్ఘ వాదనల అనంతరం నేడు (మార్చి10) తుది తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దీనిపై ప్రజా సంఘాలు, నేతలు స్పందించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృతకు న్యాయం కావాలని పోరాటం చేసిన ప్రజా ఉద్యమకారులు ఈ తీర్పును ఆహ్వనించారు. ముఖ్యంగా ప్రగతిశీల మహిళాసంఘం జాతీయ కన్వీనర్ సంధ్య తాజా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పుపై వీ సంధ్య స్పందిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తె భర్తను కిరాయి హంతకులతో అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఇది అని గుర్తు చేశారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష సరైనదేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాఉద్యమాలు, ప్రజా పోరాటాల గెలుపు అని పేర్కొన్నారు. అలాగే అత్యంత క్రూరమైన హత్యలు, దౌర్జన్యాల పట్ల, పోలీసులు కోర్టులు స్పందించాల్సిన ఇలాంటి వైఖరి ఇదేనని ఆమె స్పష్టం చేశారు. పోలీసులు అధికారులు, న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిగా పనిచేస్తే వచ్చే ఫలితాలకు, తీర్పులకు ఈ తీర్పు ఒక నిదర్శనమన్నారు. ఈ కేసులో నిర్వహించినట్టుగానే అన్ని కేసుల్లోనూ పకడ్బందీ విచారణలు అవసర మన్నారు.
2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు.
అయితే ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు (అమృత తండ్రి) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే సుభాష్‌శర్మ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ప్రణయ్ హత్యనాటికి గర్భవతిగా ఉన్న అమృత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ప్రణయ్ తల్లితండ్రులే కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే తండ్రి మరణం తరువాత అమృత క్రమంగా తల్లికి దగ్గరైంది. అట అత్తమామలు, ఇటు తల్లితోనూ సన్నిహితంగా ఉంటోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌కు ప్రతిరూపమైన తన కొడుకును అంతే ప్రాణంగా పెంచుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment