వరగర్వంతో కయ్యానికి కాలుదువ్వి, కార్తవీర్యార్జునుడి చేతిలో ఓటమి పాలైనా, రావణుడికి బుద్ధి రాలేదు. పులస్త్యుడి వల్ల కార్తవీర్యార్జునుడి చేతి నుంచి బతికి బయటపడ్డాడు గాని, లేకుంటే అతడి చేతిలోనే అంతమైపోయేవాడు. కార్తవీర్యార్జునుడి చేతిలో జరిగిన పరాభవాన్ని రావణుడు త్వరలోనే మరచిపోయాడు. ముల్లోకాలలో బలవంతులుగా పేరుమోసిన వారందరినీ జయించాలన్న కండూతి అతడికింకా పోలేదు.
కిష్కింధ పాలకుడైన వాలి మహాబలవంతుడని రావణుడు తన మంత్రుల ద్వారా విన్నాడు. ఎలాగైనా, వాలితో యుద్ధం చేసి, అతణ్ణి గెలవడం ద్వారా లోకానికి తన బలం చాటాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పుష్పకాన్ని అధిరోహించి, కిష్కింధకు వెళ్లాడు.
రావణుడు కిష్కింధకు వెళ్లేసరికి వాలి నగరంలో లేడు. వాలి సభా మందిరంలో అతడి మంత్రి తారకుడు, మామ సుషేణుడు, యువరాజైన వాలి తమ్ముడు సుగ్రీవుడు, ఇతర వానర యోధులు ఉన్నారు. ‘నేను లంకాధిపతిని. నన్ను రావణుడంటారు. వాలి ఎక్కడ? నేను వాలితో యుద్ధం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘రావణా! మా రాజు వాలి ఇప్పుడు నగరంలో లేడు. అతడు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో నాలుగు సముద్రాలలో స్నానం చేసి, సంధ్యావందనం పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు.
నువ్వు అప్పటి వరకు వేచి ఉండవచ్చు. అయినా, వాలితో యుద్ధం నీకు క్షేమం కాదు. అదిగో ఆ అస్థిపంజరాల గుట్టలు చూడు. వాలితో యుద్ధానికి వచ్చి, అతడి చేతిలో హతమైపోయిన అభాగ్యులవే అవన్నీ. కాదూ కూడదూ ఇప్పటికిప్పుడే అతడి వద్దకు వెళ్లాలనుకుంటే, ఈ వేళకు అతడు దక్షిణ సముద్రంలో స్నానం చేస్తూ ఉంటాడు. నువ్వు నిరభ్యంతరంగా అక్కడకు వెళ్లవచ్చు’ అన్నాడు తారకుడు.
రావణుడు పుష్పకవిమానంలో దక్షిణ సముద్రానికి వెళ్లాడు. ఆ సమయానికి వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు.వాలిని వెనుక నుంచి ఒడిసి పట్టుకుందామనే ఉద్దేశంతో రావణుడు అతడి వైపు నడిచాడు. ఓరకంటితో వాలి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. రావణుడు దగ్గరకు రాగానే, హఠాత్తుగా అతడి మెడను చంకలో ఒడిసి పట్టుకుని, ఆకాశంలోకి పైకెగిరాడు. వాలి చర్యకు రావణుడు దిగ్భ్రాంతి చెందాడు. అతడి పట్టును విడిపించుకోవడానికి గోళ్లతో రక్కాడు. దంతాలతో కొరికాడు.
అయినా, వాలి లెక్క చేయకుండా ఎగురుతూ పోయి, తూర్పు సముద్రంలో మునిగి స్నానం చేశాడు. నిష్ఠగా సంధ్యావందనం చేశాడు. ఇన్ని చేస్తూనే రావణుడి మెడ మీద నుంచి తన పట్టును ఏమాత్రం సడలించలేదు. రావణుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. హాహాకారాలు చేశాడు.వాలి అతడి హాహాకారాలను ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడి నుంచి రావణుడిని పట్టుకుని ఆకాశమార్గంలో ఎగురుతూ ఉత్తర సముద్రం వద్దకు వెళ్లాడు. సముద్రంలో తనతో పాటు రావణుడిని కూడా ముంచుతూ తేల్చుతూ స్నానం చేశాడు. అక్కడ యథావిధిగా సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు. వాలి చేష్టలకు రావణుడికి శక్తులన్నీ ఉడిగిపోయి, భయం పట్టుకుంది.
వాలి అక్కడి నుంచి పైకెగిరి కిష్కింధ వైపు ప్రయాణం ప్రారంభించాడు. కిష్కింధ నగరం వెలుపల ఉపవనంలో రావణుడిని విసిరేశాడు. రావణుడు పొదల మధ్య పడ్డాడు. ఈ దెబ్బకు రావణుడికి కళ్లు బైర్లు కమ్మాయి.రావణుడిని చూసి, వాలి వినోదంగా నవ్వాడు.‘చూడటానికి మహారాజులా ఉన్నారు? ఇంతకీ తమరెవరు? ఎక్కడి నుంచి తమరి రాక? ఏ పని మీద వచ్చారు?’ అని వేళాకోళంగా ప్రశ్నించాడు.
కొద్ది క్షణాలకు రావణుడు తేరుకున్నాడు. నెమ్మదిగా గొంతు పెగల్చుకుని, ‘వానరేశ్వరా! నన్ను రావణుడంటారు. నేను లంకాధిపతిని. దేవతలను జయించినవాణ్ణి. అయితే, నీ శక్తి అమోఘం, అద్భుతం, అద్వితీయం. గమన వేగంలో నువ్వు గరుడుడిని, వాయువును మించిపోయావు. నన్ను ఏకంగా చంకలో ఇరికించుకుని, మూడు సముద్రాల్లో ముంచి తేల్చావు. బుద్ధి గడ్డితిని నీతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నీ శక్తిని చూశాక నేను నా ఆలోచనను విరమించుకుంటున్నాను. నీ అంతటి వీరుణ్ణి నేను ముల్లోకాలలో ఎక్కడా చూడలేదు. ఈ క్షణం నుంచి మనిద్దరం స్నేహితులుగా బతుకుదాం’ అన్నాడు.
రావణుడి కోరికను వాలి సమ్మతించాడు. అతడిని స్నేహితుడిగా అంగీకరించాడు. తనతో పాటు కిష్కింధ నగరానికి తీసుకుపోయి, ఘనంగా ఆతిథ్యం ఇచ్చాడు.వాలికి అతిథిగా రావణుడు కిష్కింధలో కొన్నాళ్లు గడిపి, వాలి వద్ద సెలవు తీసుకుని లంకకు తిరిగి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment