ఎవరెలా పోయినా...నా దారి రహదారి! | tikkana said one golden poem in mahabharatam | Sakshi
Sakshi News home page

ఎవరెలా పోయినా...నా దారి రహదారి!

Published Sat, Jul 26 2014 10:27 PM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

ఎవరెలా పోయినా...నా దారి రహదారి! - Sakshi

ఎవరెలా పోయినా...నా దారి రహదారి!

పద్యానవనం

తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్థ వ్యావృతుల్ మధ్యముల్,
దమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం
గము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమేయేరికిన్?

 
మేలు చేయకపోతే పోయావు కీడు మాత్రం చేయబోకుమంటారు. అంటే, కనీసం తటస్థంగా ఉండమని వేడుకోలన్నమాట! అలా ఉండగలమా? ఎందుకుండలేం, బేషుగ్గా ఉండగలం. ఎవరికీ, ఎప్పుడూ అసలేమీ చేయకుండా ఉంటాం కనుక మనకే ఇబ్బందీ ఉండదనుకుంటారు చాలా మంది. నిజమే! ఏమీ చేయనప్పుడు ఏముంటుంది, మంచి-చెడులు బేరీజు వేయడానికి? ఏదైనా పూని చేస్తే కదా, మంచయినా, చెడయినా! ఎవరికో ఏదో ఎప్పుడూ చేస్తూనే ఉండాలనే తలంపుతో ఉంటారు కొందరు. మంచిదే, చేసేది మంచిదైతే. ఇక చెడిపోయేదేముంది, చేసేది చెడు కానప్పుడు, అనేది మరో తలంపు. హనుమంతుడ్ని చేయబోతే కోతయిందన్న సామెత చందంగా, ఏదో కాస్త మంచి చేద్దామని వెళితే, అక్కడ మనజోక్యం వల్లో, మనతో నిమిత్తం లేకుండానో చెడు జరిగిందనుకో... ఏం చేస్తాం! మన చేతిలో లేకుండా ఏదేదో జరిగిపోతే మనం మాత్రం చేయగలిగేదేముంటుంది? కాకపోతే మన ఉద్దేశం చెడు కాకూడదంతే!
 
‘యద్భావం తద్భవతిః’. మన తలంపు మంచిదయితే మంచే జరుగుతుందని పెద్దల భావన/దీవెన. మంచి చేసిన వారికి మంచి చేయడం అంత గొప్పేం కాదంటాడు బద్దెనామాత్యుడు. ‘ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగన్ అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!’ అన్నాడందుకే. మనకు అపకారం చేసినవాడైనా, తప్పు పట్టకుండా ఉపకారం చేయడంలో ఉందట గొప్పదనం! అలా చేసిన వాడే నేర్పరి అంటాడు. మనకంత నేర్పుందా? నేర్పు, ఓర్పు, మార్పు, కూర్పు సంగతలా ఉంచితే, అసలు ముందు మనకో సంకల్పం ఉండాలి నిజంగా అలా చేయాలంటే! మనం యుగకర్తగా కీర్తించే గురజాడ అప్పారావు అందుకేనేమో! ‘....పూని ఏదైనను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయ్, సొంతలాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్!’ అన్నాడు.
 
ఏదైనా సత్సంకల్పం అనేది, వారి వారి తత్వాన్ని, ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుందేమో అనిపిస్తుంది. కొంతమంది పూని మంచి పనులు చేయడం వెనుక నిర్దిష్టమైన హేతువు కనబడుతుంది. ఆత్మతృప్తికో, కీర్తి కాంక్షతోనో, విశాల దృక్పథంతోనో, తమకూ మంచే జరగాలనో, వచ్చే జన్మలో సద్గతుల కోసమో... ఇలా రకరకాల కారణాలతో మంచి పనులు చేస్తుంటారు. తమ తమ స్థాయికి, తలంపునకు తగిన రీతిలో ఈ మంచిపనులకు పూనుకుంటారు. స్వార్థమో, అసూయో, ఈర్ష్యా-ద్వేషాలో... చెడు పనులు చేసేవారికీ కొన్ని కారణాలుంటాయి. కొందరి చేష్టల వెనుక ఏ లాజికూ ఉండదు. వారి గురించి భర్తృహరి అద్భుతంగా చెప్పారు తన సుభాషితాల్లో! దానికి, ఏనుగు లక్ష్మణకవి చేసిన అత్యద్భుతమైన తర్జుమాయే పై పద్యం.
 
తాము చేపట్టే పనుల విషయంలో నాలుగు రకాలుగా ఉండే జనం గురించి చెప్పాడిందులో! ఇతరుల ప్రయోజనాల్ని కోరుకునే క్రమంలో తమ పనుల్ని కూడా వదులుకునే వారు సజ్జనులు. తమ పని చేసుకుంటూ, పనిలో పనిగా ఇతరుల పనులూ చేసి పెట్టే వారు మధ్యములు. తమ పనులు చేసుకునేందుకు వీలుగా ఇతరుల పనులను చెడగొట్టేవారు నీచులు. ఇక, ఇంకో రకం వాళ్లున్నారు, అసలు వారినేమనాలో ఎవరికీ తెలియదంటాడు. వాళ్లెవరంటే, దానివల్ల తమకు ఏ ప్రయోజనం లేకపోయినా, ఇతరుల పనుల్ని పనిగట్టుకొని చెడగొట్టేవారట. తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి వారూ ఉంటారు.
 
మనం ఆ తెగలోకి రాకుండా జాగ్రత్త పడాలి సుమా! అందుకొక చక్కని మార్గముంది. ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మంగా మహాభారతంలో చెప్పినదాన్ని పాటిస్తే చాలు. అదేంటంటారా! తిక్కన ఓ చక్కని పద్యంలో చెప్పాడీ మాట. ‘‘ఒరులేయవి యొనరించిన, నరవర అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్’’. ఇతరులు మనకు ఏం చేయకూడదని కోరుకుంటామో, అవేవీ మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం. ‘‘ధర్మో రక్షతి రక్షితః’’. ఎవరెలా పోయినా మనం ధర్మబద్ధంగా ఉందాం, దట్సాల్!
 - దిలీప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement