ప్రకృతి ధర్మాన్ని గౌరవిద్దాం!
పద్యానవనం
గిలగిల మందువే యొరులు గిచ్చిన, కాలికి ముల్లు గ్రుచ్చినన్
విలవిల కొట్టుకుందువటె, నీవలె జీవులు కావె! హింసకున్
ఫలితము బాధయే గద! ప్రపంచములోని సమస్త జీవులం
దలరెడు ప్రాణమొక్కటె గదా! తగునయ్య వృథా వ్యధా క్రుథల్!
హంస పలు రకాలు. మనకు బాగా స్పష్టంగా తెలిసేది రెండు రకాలు. ఒకటి మానసికం, మరొకటి శారీరకం. ఈ రెంటిలో ఏదైనా హింస అంతిమంగా బాధను కలిగించేదే! నిర్హేతుకం, సహేతుకం అంటూ ఉండవు, హింస హింసే అంటారు మానవతావాదులు. హింసకు ప్రతిహింస తప్పు కాదనీ, వర్గ పోరాటంలో అనివార్యం, అంతర్భాగమనీ ప్రగతిశీల విప్లవవాదులంటారు.
ప్రకృతిలో ఒక జీవి మరో జీవిని చంపి తినడమూ హింసే కదా అన్న ప్రశ్నకు ‘అవును తప్పే’ అనే వాస్తవిక వాదులున్నట్టే, అది ప్రకృతి ధర్మం కనుక తప్పు కానే కాదనే వారూ ఉంటారు. సృష్టిలో అమలయ్యే ఆహార శృంకలం ప్రకారం చూసినా ఒక జీవి మరోజీవికి ఆహారమైనపుడు, అది సృష్టి అనుమతించే ప్రకృతి ధర్మమే అయినా హింస కచ్చితంగా ఒక ప్రాణిని బాధిస్తుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. గాయపరచినపుడు శరీరం బాధకు గురయినట్టే, పరుషమైన ఓ మాట కూడా మనసును గాయపరిచి వేదనను కలిగిస్తుంది. అదీ హింసే! ఉద్దేశపూర్వకంగా చేసినా, యాదృచ్ఛికంగా జరిగినా హింస పర్యవసానం బాధ, వేదన.
వీలయినంత వరకు హింసకు పాల్పడకుండా ఉండటం, పరిహరించడం ఉత్తమోత్తమమైన మానవ ధర్మం. అందుకే, జాతిపిత మహాత్ముడు సత్య పరిశోధనతోపాటు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. మానవేతిహాసంలో సత్యం-అహింసలను మహాత్మాగాంధీ అంత గొప్పగా నిష్ఠతో అనుసరించినవారు కానరారు. ఆయన నిబద్ధత అటువంటిది. అందుకేనేమో, అటువంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ నేలపై నడయాడారు అంటే భవిష్యత్తరాలు విస్మయం చెందవచ్చు అని, ప్రస్తుత సహస్రాబ్దిలోనే అత్యంత మేధావిగా ఆమోదం పొందిన ఐన్‌స్టీన్ అన్నారు. రెండూ, రెండు నిప్పు కణికల వంటి ధర్మాలని ఏక కాలంలో మనిషి ఆచరించడం అత్యంత క్లిష్టతరమైనదే అయినా గాంధీజీ ఆచరించి చూపారు. ఇదే సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకొని ఒక విదేశీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా గాంధీజీ సమాధానం ఇచ్చిన తీరే ఆయనలోని త్రికరణ శుద్ధిని వెల్లడిస్తుంది. సత్యం-అహింస రెండూ ఏకకాలంలో ఆచరించడం కష్టం కదా, నేనో సందర్భం చెబుతాను, అప్పుడు మీరెలా స్పందిస్తారో చెప్పండంటూ జర్నలిస్టు గాంధీజీని అడిగాడట. ‘‘మీరు ఓ దారంట నడిచి వెళుతున్నారు. ఓ జింక పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి మీ కళ్లముందే పక్కన ఓ పొదరింట్లో దాక్కుంది. కొద్ది సమయం తేడాతో దాని వెనుకే పరుగెత్తుకుంటూ వచ్చిన వేటగాడు మిమ్మల్ని అడుగుతాడు, ఇందాకొచ్చిన జింకపిల్ల ఎటువెళ్లింది? అని. సత్య రక్షణ కోసం మీరు అబద్ధం చెప్పలేరు, అలా నిజం చెప్పి హింసకు కారకులు కాలేరు. పరస్పర విరుద్ధ స్థితి. అప్పుడు మీరెలా స్పందిస్తారు?’’అని ప్రశ్నించి గాంధీజీ సమాధానం కోసం జర్నలిస్టు నిరీక్షిస్తున్నాడు. ‘‘ఏమీ చెప్పను. మౌనంగా ఉంటాను’’ అని ఇచ్చిన సమాధానంతో నివ్వెరపోవడం ఆ జర్నలిస్టు వంతయింది. సంక్లిష్టమనుకున్న ప్రశ్నకు కూడా గాంధీజీ అంత తేలిగ్గా, తడుముకోకుండా సమాధానం చెప్పగలిగాడూ అంటే, సత్యం, అహింసను ఎంతగా సమ్మిళితం చేశారో ఇట్టే స్పష్టమౌతుంది.
ఇక్కడ ఈ పద్యంలో, అప్పటికింకా గౌతమబుద్ధుడు కాని సిద్దార్థుడు తన సమీప బంధువు దేవదత్తుడ్ని ప్రశ్నిస్తున్నాడు. పనికి మాలిన పనులెందుకు చేస్తావ్? ఎవరైనా నిను గిచ్చితేనే అల్లాడిపోతావ్, కాలికి ముల్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడుతావు, గాయపరిస్తే ఇతర జీవులకు కూడా అలాగే బాధ కలుగుతుంది, హింస ఫలితం బాధే కదా! సమస్త జీవరాశిలోనూ ఉండే ప్రాణం ఒకటే కదా! అంటూ, హంసను బాణంతో గాయపరచిన దేవదత్తుడ్ని ప్రశ్నిస్తాడు. ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి అలతి అలతి పదాలతో మధురమైన పద్య రచన చేశారు. సత్యం-అహింసలను గాలికి వదిలి ఐహికమైన సౌఖ్యాలకోసం, భౌతికమైన సంపదల కోసం మనిషి ఎంతటి నైచ్యానికైనా దిగజారే సందర్భాల్ని చూసినపుడు గుండె తరుక్కుపోతుంది. తుచ్ఛమైన సంపద కోసం కన్న తండ్రినే గొంతుకోసిన ఓ కొడుకు గురించి విన్నపుడు... ఎక్కడికి జారిపోతున్నాం అనిపిస్తుంది. ఏమున్నా లేకున్నా, నాకూ నా జాతికి సదా సత్యం పాటించే, అహింసను ఆచరించే శక్తినివ్వు ఓ మహాత్మా! ఓ మహర్షీ!!
- దిలీప్‌రెడ్డి