మాటే మంత్రం
పద్యానవనం: అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని సామెత. మాట విషయంలో కొందరిది తెచ్చిపెట్టుకున్న సహనం, సౌమ్యత అయితే మరికొందరు సహజసిద్ధంగానే సౌమ్యులై ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు. అలా మాట్లాడటం వారి నైజం ఇంకొందరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. గంభీరంగా, ఆడంబరంగా ఉండాలనీ, మాట్లాడాలనీ చూస్తారు. ఇది అల్పుల లక్షణమంటాడు యోగివేమన. సజ్జనుడైన వాడు ఎప్పుడూ చల్లగా, సౌమ్యంగానే మాట్లాడతాడనేది ఆయన సూత్రీకరణ. అన్ని పద్యాల్లోలాగానే ఇందులోనూ ఒక ప్రాపంచిక విషయాన్ని సాపేక్షంగా చూపాడు. బంగారం అత్యంత విలువైన లోహమే అయినా కంచు మ్రోగినంత ఘనంగా అది మ్రోగదనేది జగమెరిగిన సత్యమే! అందుకేనేమో, ‘స్పీచ్ ఈజ్ సిల్వర్’ అన్న వారే ‘సెలైన్స్ ఈజ్ గోల్డ్’ అన్నారు. మనిషి బాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఎన్ని ఆభరణాలున్నా (లేకున్నా!) అంతస్సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే వాగ్భూషణం భూషణం అంటాడు భర్తృహరి.
మంచిగా మాట్లాడకపోయినా సరే, చెడు మాట్లాడకుంటే చాలనే వారూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనం మహా గొప్ప ‘కమ్యూనికేషన్’ అంటే ఆశ్చర్యం కలిగించినా అది నిజం. మౌనంలోని మహత్తు గురించి రమణ మహర్షే కాదు, మహాత్మాగాంధీ కూడా చెప్పేవారు. సహాయనిరాకరణ సందర్భంగా ఆయన పలుమార్లు మౌనదీక్షలు జరిపారు. విపాసన సాధకులు నిరూపిస్తారు మౌనంలో దాగి ఉన్న మార్మికత ఏంటో! మరీ మౌనం కాకపోయినా... మాట్లాడటం కూడా ఎదుటి వార్ని నొప్పించకుండా, సౌమ్యంగా, సామరస్య పూర్వకంగా ఉంటే తప్పేంటి? అనేది ప్రశ్న. ఏదో ఒక సందర్భానికి అని కాకుండా, అలా మాట్లాడటమే సదా లక్షణమైనా తప్పులేదు.
గత చరిత్రలో... మంచి మాటలతో పెద్ద పెద్ద కార్యాలు సాధించి, జఠిల సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించిన వారున్నారు. పెడసరం మాటలతో మంచి వాతావరణాన్నీ చెడగొట్టి సమస్యను పరష్కరించకపోగా మరింత జఠిలం చేసిన వారూ ఉన్నారు. సంభాషణ ఎలా ఉండాలి? దాని లక్షణం, స్వరూప స్వభావాల గురించి ఆదికవి వాల్మీకి అద్భుతంగా చెప్పాడు రామాయణంలో. ‘‘అవిస్తరం, అసందిగ్దం, అవిలంభితం, అవ్యధం. ఉరస్థ కంఠగం వాక్యం వర్ధతే మధ్యమస్వరం’’ అంటాడు. ఎదుటి వారితో సంభాషించేప్పుడు... విషయం సుదీర్ఘంగా ఉండొద్దట, అస్పష్టత లేకుండా సూటిగా ఉండాలట, సాగదీసినట్టుగా కాకుండా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విడమర్చినట్టుండాలట. ఎదుటి వారిని ఏ విధంగానూ నొప్పించని రీతిలో సంభాషణ సాగాలట. హృదయం నుంచి జనించిన మాటలు కంఠం ద్వారా వృద్ధి చెందుతూ, మంద్రంగా మొదలై ఓ మధ్య స్థాయి వరకే పెరగాలి తప్ప ఉచ్ఛ స్వరంలో ఉండకూడదట. ఇదీ సంభాషణ పద్ధతంటాడు.
రామాయణం మొత్తంలో హనుమంతుడ్ని ఓ గొప్ప సంభాషణా చాతుర్యం కలిగిన వాడిగా అభివర్ణిస్తాడు వాల్మీకి. సొంత సమస్యల్లో గొంతుదాకా కూరుకుపోయి ఉన్న శ్రీరామ, సుగ్రీవుల్ని కలిపి, పరస్పరం ఉపయోగపడేలా చేయడంలోనే ఆయన చాతుర్యం తెలిసిపోతుంది. జీవిత భాగస్వామికి దూరమై విలపిస్తున్న సీతా, శ్రీరాముల మధ్య సంధానకర్తగా వ్యవహరించడమైనా ఆయన మాటకారితనం, అంతకు మించి సంభాషణా చాతుర్యం వల్లే సాధ్యమైందనుకోవచ్చు. లంకలోని అశోక వృక్షం కింద కూర్చొని ఏ పరిణామాన్నయినా రాక్షస మాయ కావచ్చని సందేహిస్తున్న సీతకు తాను రామబంటునన్న విశ్వాసం కల్గించడానికి తానెంచుకున్న సంభాషణా క్రమం, వృద్ధి, ముగింపు... వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఈ గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. చైనా మహోపాధ్యాయుడు కన్ఫ్యూసియస్, గ్రీకు తాత్వికుడు సోక్రటిస్, భరతఖండ దయామయుడు గౌతమ బుద్ధుడు, కరుణామయుడైన ఏసుక్రీస్తు, మహ్మద్ ప్రవక్త, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా... ఇలా జాతిని ప్రభావితం చేసిన ఏ మహనీయుడ్ని తీసుకున్నా వారి నడతలో సౌశీల్యత, కార్యాచరణ నిబద్ధతతో పాటు వారి మాటల్లోని సౌమ్యత గురించి కూడా అంతే గొప్పగా చెబుతారు.
కటువుగా, పరుషంగా మాట్లాడే దుర్లక్షణం సామాన్యుల్లో ఉండటం పెద్ద ప్రమాద హేతువు కాకపోయినా, నిర్ణాయక స్థానాల్లో ఉన్న వారలా మాట్లాడటం కచ్చితంగా సమాజానికి నష్టం కలిగిస్తుంది. పాలకుల్లో ఇది సర్వదా అవాంఛనీయం. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకుల్లో కొందరు తమ పెడసరం మాటలతో వివిధ వర్గాల మధ వైషమ్యాలు పెంచి కక్షలు, కార్పణ్యాల్ని సృష్టిస్తున్నారు. మాటతీరు మార్చుకోండి మహానుభావులారా! అని వేడుకోవడం తప్ప మనమేం చేయగలం. మంచితనంతో ప్రపంచాన్ని వశీకరించుకోవడానికి మాటే మంత్రం. మనసుకది సంకేతం.
- దిలీప్‌రెడ్డి