
డాలస్, టెక్సాస్, అమెరికా: అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన వందలాదిమంది ప్రవాసభారతీయుల ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల హాజరైన వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి స్వాగతం పలికారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ “చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాస భారతీయలకు కృతజ్ఞతలు అన్నారు. అవతారిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, మొత్తం 251 పేజీలఉన్న రాజ్యాంగం భారతదేశ పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం అని దీనిలో ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వసంస్థల విధులు, పౌర హక్కులు వివరంగా పేర్కొనబడి ఉన్నాయన్నారు.
1950లో జనవరి 26న అమలులోకి వచ్చిన ఈ రాజ్యంగ రచన వెనుక రాజ్యాంగ ముసాయిదాను రూపొందించిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వెంట్‌గా పనిచేసిన సర్ బెనెగళ్ నర్సింగరావు (బి.ఎన్ రావు) కృషి, ముసాయిదా కమిటీకు చైర్మన్ గా విశేష సేవలందించిన బీ.ఆర్ అంబేడ్కర్ మరియు వారి కమిటీ సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, కే.ఎం మున్షి, మహ్మద్ సాదుల్లా, బీ.ఎల్ మిట్టర్, డీ.పీ ఖైతాన్ లు అభినందనీయులు అన్నారు.
ప్రధాని నెహ్రు అభ్యర్ధన మేరకు ప్రముఖ చేతివ్రాత నిపుణుడు ‘ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా’ తన సొంత దస్తూరితో ఆరునెలల పాటు శ్రమించి హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాసిన మన భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, దీని అసలు ప్రతిని ఇప్పటికీ పార్లమెంట్ గ్రంథాలయంలో అందరూ చూడవచ్చు అని అన్నారు.”ఎంతో కోలాహలంగా మాతృదేశభక్తి స్ఫూర్తి తో జరిగిన ఈ వేడుకలలో మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కో-ఛైర్మన్ తయాబ్ కుండావాలా, రాజీవ్ కామత్, కార్యదర్శి రావు కల్వాల, బోర్డ్ సభ్యులు బి.యెన్. రావు, మహేంద్ర రావు, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment