proverb
-
ఈ దారి... సోలార్ రహదారి!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. దక్షిణ కొరియాలోని ఈ ఫొటో చూస్తే ఈ సామెత నిజమేననిపించక మానదు. దాజియా- సెజాంగ్ పట్టణాలను కలిపే ఈ హైవే మధ్యలో సైకిళ్లు మాత్రమే వెళ్లేందుకు ఓ దారి ఏర్పాటు చేశారు. దాదాపు 32 కిలోమీటర్ల పొడవున్న ఈ దారికి అంత ప్రత్యేకత ఉండకపోవచ్చుగానీ... దానిపై కప్పు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతపొడవునా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారుమరి! సైకిళ్లలో ప్రయాణించేవారికి చల్లటి నీడనిస్తూ... విద్యుత్ కూడా ఉత్పత్తి చేసుకోగలగడం భలే ఆలోచన కదూ! -
ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు!
నివృత్తం: ఇది ఆధునిక న్యాయస్థానాలు వచ్చాక పుట్టుకు వచ్చిన సామెత. కోర్టు మెట్లు ఎక్కితే న్యాయాన్యాయల సంగతి పక్కనపెట్టి చూస్తే ఇరు వర్గాలకు కష్టాలు మొదలైనట్లే. ఎందుకంటే కోపతాపాల వల్లో, పెండింగ్ ఫైళ్ల వల్లో, ఇగోల వల్లో ఒక పట్టాన వాదనలు పూర్తి కావు. సాక్ష్యాలనీ, గైర్హాజరులనీ, రాజీలనీ ఇలా పుణ్యకాలం కాస్త కోర్టుకు తిరగడంలోనూ వాయిదాలకు హాజరు కావడంలోనూ గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో గెలిచినా, ఓడినా తుది తీర్పు వచ్చే సమయానికి చాలా కోల్పోయి ఉంటాం. పనులన్నీ మానుకుని కోర్టుకు తిరగడం వల్ల, దారి ఖర్చులు-లాయరు ఖర్చులు ఇలా రకరకాలుగా ఎంతో పోగొట్టుకుంటాం. కాబట్టి గెలిచినా ఓడినా అత్యధిక కేసుల్లో ఇరువర్గాలకీ ఎంతోకొంత నష్టం వాటిల్లక తప్పదన్న అంతరార్థంతో వాడుకలోకి వచ్చిన సామెత ఇది. నుదుటి మీద బొట్టు ఎందుకు పెడతారు? నుదుటి మీద బొట్టు పెట్టడం అనేది ఒక సనాతన భారతీయ సంప్రదాయం. ఇది హిందువుల సంప్రదాయమని ప్రచారమైంది కానీ ఇది మతానికి సంబంధించిన సంప్రదాయం కాదు. దేహానికి సంబంధించిన సంప్రదాయం. మనిషిలో అష్టచక్ర స్థానాలుంటాయి. వాటిలో ముఖ్యమైన ‘ఆజ్ఞచక్ర’ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. అక్కడ బొట్టు పెట్టడం ద్వారా ఆ చక్రం ఉత్తేజితమై మనిషిలో ఆందోళన తగ్గి ప్రశాంతత సిద్ధిస్తుంది. ఆక్యుపంక్చర్ విధానంలోని ఆక్యుప్రెజర్ సూత్రాల ప్రకారం నుదురు తలనొప్పి నివారణ కేంద్రం. బొట్టు పెట్టుకోవడం ద్వారా అక్కడ కొంత ఒత్తిడి పడుతుంది. అపుడు ఆ కేంద్రం ఉత్తిజేతిమై అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది అని చెబుతారు. -
మాటే మంత్రం
పద్యానవనం: అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినుర వేమ! నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని సామెత. మాట విషయంలో కొందరిది తెచ్చిపెట్టుకున్న సహనం, సౌమ్యత అయితే మరికొందరు సహజసిద్ధంగానే సౌమ్యులై ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు. అలా మాట్లాడటం వారి నైజం ఇంకొందరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. గంభీరంగా, ఆడంబరంగా ఉండాలనీ, మాట్లాడాలనీ చూస్తారు. ఇది అల్పుల లక్షణమంటాడు యోగివేమన. సజ్జనుడైన వాడు ఎప్పుడూ చల్లగా, సౌమ్యంగానే మాట్లాడతాడనేది ఆయన సూత్రీకరణ. అన్ని పద్యాల్లోలాగానే ఇందులోనూ ఒక ప్రాపంచిక విషయాన్ని సాపేక్షంగా చూపాడు. బంగారం అత్యంత విలువైన లోహమే అయినా కంచు మ్రోగినంత ఘనంగా అది మ్రోగదనేది జగమెరిగిన సత్యమే! అందుకేనేమో, ‘స్పీచ్ ఈజ్ సిల్వర్’ అన్న వారే ‘సెలైన్స్ ఈజ్ గోల్డ్’ అన్నారు. మనిషి బాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఎన్ని ఆభరణాలున్నా (లేకున్నా!) అంతస్సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే వాగ్భూషణం భూషణం అంటాడు భర్తృహరి. మంచిగా మాట్లాడకపోయినా సరే, చెడు మాట్లాడకుంటే చాలనే వారూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనం మహా గొప్ప ‘కమ్యూనికేషన్’ అంటే ఆశ్చర్యం కలిగించినా అది నిజం. మౌనంలోని మహత్తు గురించి రమణ మహర్షే కాదు, మహాత్మాగాంధీ కూడా చెప్పేవారు. సహాయనిరాకరణ సందర్భంగా ఆయన పలుమార్లు మౌనదీక్షలు జరిపారు. విపాసన సాధకులు నిరూపిస్తారు మౌనంలో దాగి ఉన్న మార్మికత ఏంటో! మరీ మౌనం కాకపోయినా... మాట్లాడటం కూడా ఎదుటి వార్ని నొప్పించకుండా, సౌమ్యంగా, సామరస్య పూర్వకంగా ఉంటే తప్పేంటి? అనేది ప్రశ్న. ఏదో ఒక సందర్భానికి అని కాకుండా, అలా మాట్లాడటమే సదా లక్షణమైనా తప్పులేదు. గత చరిత్రలో... మంచి మాటలతో పెద్ద పెద్ద కార్యాలు సాధించి, జఠిల సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించిన వారున్నారు. పెడసరం మాటలతో మంచి వాతావరణాన్నీ చెడగొట్టి సమస్యను పరష్కరించకపోగా మరింత జఠిలం చేసిన వారూ ఉన్నారు. సంభాషణ ఎలా ఉండాలి? దాని లక్షణం, స్వరూప స్వభావాల గురించి ఆదికవి వాల్మీకి అద్భుతంగా చెప్పాడు రామాయణంలో. ‘‘అవిస్తరం, అసందిగ్దం, అవిలంభితం, అవ్యధం. ఉరస్థ కంఠగం వాక్యం వర్ధతే మధ్యమస్వరం’’ అంటాడు. ఎదుటి వారితో సంభాషించేప్పుడు... విషయం సుదీర్ఘంగా ఉండొద్దట, అస్పష్టత లేకుండా సూటిగా ఉండాలట, సాగదీసినట్టుగా కాకుండా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విడమర్చినట్టుండాలట. ఎదుటి వారిని ఏ విధంగానూ నొప్పించని రీతిలో సంభాషణ సాగాలట. హృదయం నుంచి జనించిన మాటలు కంఠం ద్వారా వృద్ధి చెందుతూ, మంద్రంగా మొదలై ఓ మధ్య స్థాయి వరకే పెరగాలి తప్ప ఉచ్ఛ స్వరంలో ఉండకూడదట. ఇదీ సంభాషణ పద్ధతంటాడు. రామాయణం మొత్తంలో హనుమంతుడ్ని ఓ గొప్ప సంభాషణా చాతుర్యం కలిగిన వాడిగా అభివర్ణిస్తాడు వాల్మీకి. సొంత సమస్యల్లో గొంతుదాకా కూరుకుపోయి ఉన్న శ్రీరామ, సుగ్రీవుల్ని కలిపి, పరస్పరం ఉపయోగపడేలా చేయడంలోనే ఆయన చాతుర్యం తెలిసిపోతుంది. జీవిత భాగస్వామికి దూరమై విలపిస్తున్న సీతా, శ్రీరాముల మధ్య సంధానకర్తగా వ్యవహరించడమైనా ఆయన మాటకారితనం, అంతకు మించి సంభాషణా చాతుర్యం వల్లే సాధ్యమైందనుకోవచ్చు. లంకలోని అశోక వృక్షం కింద కూర్చొని ఏ పరిణామాన్నయినా రాక్షస మాయ కావచ్చని సందేహిస్తున్న సీతకు తాను రామబంటునన్న విశ్వాసం కల్గించడానికి తానెంచుకున్న సంభాషణా క్రమం, వృద్ధి, ముగింపు... వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఈ గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. చైనా మహోపాధ్యాయుడు కన్ఫ్యూసియస్, గ్రీకు తాత్వికుడు సోక్రటిస్, భరతఖండ దయామయుడు గౌతమ బుద్ధుడు, కరుణామయుడైన ఏసుక్రీస్తు, మహ్మద్ ప్రవక్త, మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా... ఇలా జాతిని ప్రభావితం చేసిన ఏ మహనీయుడ్ని తీసుకున్నా వారి నడతలో సౌశీల్యత, కార్యాచరణ నిబద్ధతతో పాటు వారి మాటల్లోని సౌమ్యత గురించి కూడా అంతే గొప్పగా చెబుతారు. కటువుగా, పరుషంగా మాట్లాడే దుర్లక్షణం సామాన్యుల్లో ఉండటం పెద్ద ప్రమాద హేతువు కాకపోయినా, నిర్ణాయక స్థానాల్లో ఉన్న వారలా మాట్లాడటం కచ్చితంగా సమాజానికి నష్టం కలిగిస్తుంది. పాలకుల్లో ఇది సర్వదా అవాంఛనీయం. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకుల్లో కొందరు తమ పెడసరం మాటలతో వివిధ వర్గాల మధ వైషమ్యాలు పెంచి కక్షలు, కార్పణ్యాల్ని సృష్టిస్తున్నారు. మాటతీరు మార్చుకోండి మహానుభావులారా! అని వేడుకోవడం తప్ప మనమేం చేయగలం. మంచితనంతో ప్రపంచాన్ని వశీకరించుకోవడానికి మాటే మంత్రం. మనసుకది సంకేతం. - దిలీప్‌రెడ్డి -
నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!!
ఈ రోజుల్లో తినడం అంటేనే అదేదో పాపంలా చూస్తున్నారు. తిండెక్కువైతే అన్నీ రోగాలే అంటూ శాపాలిచ్చేస్తున్నారు. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ ‘భాగ్య’నగరంలో ఇవ్వాళ్టికీ ఐదు రూపాయలకు ‘దాల్ రైస్’లూ, రెండు రూపాయలకే ప్లేటిడ్లీ పెట్టే సైకిల్ సెంటర్లు చాలా ఉన్నాయి. అందుకే ఇది భోజనప్రియుల సౌభాగ్యనగరం. ఇక్కడ ఒక్క ‘టై బిస్కెట్‌తో ఆకలికీ, డబ్బులేమికీ మధ్య జరిగే మ్యాచ్ ‘టై’గా ముగుస్తుంది. తిండి మాట రాగానే ప్రతివాడూ ‘బిర్యానీ’ని తలచుకునేవాడే. నిజమే.. మన్లాంటి తిండిపోతు మారాజులందరికీ ‘బిర్యానీ’ కిరీటం లాంటిదే! కానీ దాంతో పాటు దండకడియాలూ, మెడగొలుసులూ, కాళ్లపట్టీల లాంటి అచ్చమైన హైదరాబాదీ వంటకాలెన్నెన్నో ఉన్నాయి కదా. మొహమాటం లేకుండా మెహమాన్‌ను ఆదరించే ఈ నగరంలో ఓ సామెత ఉంది. అనుకోకుండా తిండి టైమ్‌కు మనం ఎవరింటికైనా వెళ్లామనుకోండి. అప్పుడు మనం ఇబ్బంది పడతామేమోనని హోస్టు భావన. అందుకే ఘోస్టుకైనా మర్యాద చేసేందుకు ఓ సామెత సృష్టించాడిక్కడి మోస్టు సంస్కార హోస్టు. అదే.. ‘ఖానేకే టైమ్ ఆనేవాలే దోస్త్ హోతే హై’ అని. అందుకే తినే టైమ్‌కు వచ్చిన ప్రతివాడూ స్నేహితుడే ఈ నగరంలో. ప్రాంతాలవారీ వంటకాలెన్నున్నా నగరానికే ప్రత్యేకమైనవి కొన్నున్నారుు. వాటితో నోటికి రుచి నింపడం, కడుపుకి తిండి నింపడం లాంటి ప్రయోజనాలే కాదు.. మరెన్నో సైడ్ బెనిఫిట్లు! ఉదాహరణకు మా ఛోటేమియాకు లెక్కలు రావడం లేదని ఓ రోజు ఇరానీ హోటల్‌కు తీసుకెళ్లి ఛోటా సమోసా చూపించి ‘ఇదేరా త్రిభుజం’ అన్నా. ఉస్మానియా బిస్కెట్ చూపించి ‘ఇదేరా వృత్తం’ అన్నా. లుఖ్మీని చూపించి ‘చతురస్రం ఇలాగే ఉంటుంది బేటా’ అని చెప్పా. స్టార్టర్ కాబట్టి లుఖ్మీతో మొదలుపెట్టి, ఛోటా సమోసా తిని, ఉస్మానియా బిస్కెట్‌ను ఇరానీ చాయ్‌లో ముంచినంత ఈజీరా లెక్కలంటే అన్నా. అంతే... జామెట్రీ అంటేనే జారుకునే వాడు కాస్తా... ఇప్పుడు ట్రిగనామెట్రీని టీ లా.. అర్థమెటిక్సూ, ఆల్జిబ్రాలనూ ఆరారా.. న్యూమరికల్స్‌ను నోరారా ఆస్వాదిస్తున్నాడు. ఇక లెక్కలు చాలు. సాయంత్రాల వేళల్లో పాయా షేర్వాతో షిర్మాల్ని చిన్నచిన్న ముక్కలు చేసి, ఆ షేర్వాతో కలిపేసి, అందులోనే నానేసి వేడివేడిగా ఉండగానే, ముక్కు నుంచి మసాలా ఘాటు వెలువడుతూ ఉండగా తినేవాడు మరింకెక్కడైనా ఉన్నాడా.. ఒక్క హైదరాబాద్‌లో తప్ప. ఇక బేకరీకి వెళ్తే ఆ పేర్లే వేరు. ‘దిల్ఖుష్’ తింటే నిజంగానే దిల్‌కు ఖుషీయే. ‘దిల్పసంద్’తో దిల్‌కు పసందే. ఐటమ్స్ పేర్లలో ఇంతలా భావుకత హైద్రాబాద్‌లో కాక మరెక్కడ?! ఒకడు రుమాలీ రోటీ తినేసి రుమాల్తో మూతి తుడుచుకుంటాడు. అది దక్కకపోతే ఇంకొకడు మూతి ముడుచుకుంటాడు. ఒకడికి తందూరీ యమా ప్యారీ. మరొకడికి ‘నహారీ’ అంటే షాయిరీ అంత ప్యారీ. ఇంకొకడికి ‘తలాహువా’ తింటే చాలు చెహరా ఖిలాహువా. అదే అల్లాహ్ కీ దువాహ్. హైదరాబాదీకి ఇవన్నీ ఇష్టమన్నమాటకు ‘ఖుదా యే గవాహ్’! మిఠాయిలు.. ఖుబానీ కీ మీఠా కోసం బతుకు ఖుర్బానీ అయిపోయినా పరవాలేదనుకునే వారెందరూ? డబుల్ కా మీఠాను ట్రబుల్ లేకుండా త్రిబుల్ టైమ్స్ తిననివారెందరు? తినే వారే అందరూ! హమారే షెహర్కే నవాబీ లోగోంకో... అంటే అసఫ్‌జాహీ నవాబులకూ మన హైదరాబాదీ రుచులు ఎంత ఇష్టం కాకపోతే.. సాక్షాత్తూ తమ అధికారిక జెండాలో ‘కుల్చా’ అనే రోటీని ముద్రించి దాన్నే ‘లోగో’గా వాడారు. వంటలకు పడగెత్తారు. రుచికి పట్టం కట్టారు. మనముండేది ఆ నవాబుల నగరంలోనే కదా.. అందుకే స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడల్లా బవర్చీలోనైనా, కేఫ్ బహార్లోనైనా, సర్వీలోనైనా, నయాగరాలోనైనా, ప్యారడైజ్, ఆస్టోరియాలలోనైనా తిండి కోసం క్యూలోనైనా నిలబడి నా వంతు కోసం వెయిట్ చేస్తా. అక్కడి వాళ్లు బయటకు తోసేస్తూ ఉన్నా ‘నేనూ ఉన్నా, లోపలికి పంపించమం’టూ ప్రాధేయపడుతూ వేచి చూస్తా. వెరసి... నేను హైదరాబాదీనీ... చలో తిందాం బిర్యానీ! -
బాసికం ఎందుకు కడతారు?
వివాహ ఘట్టంలో వధూవరుల అలంకరణలో బాసికం ఓ ప్రధాన భాగం. అయితే దీన్ని ఎందుకు కడతారు అన్నది చాలామందికి తెలియదు. ఈ ఆచారం వెనుక ముఖ్యమైన కారణం ఉంది. వివాహానికి అత్యంత అవసరమైనది సుముహూర్తం. సరిగ్గా ఈ సుముహూర్త సమయంలో వధువు కనుబొమల మధ్య స్థానాన్ని, అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అదే విధంగా వధువు కూడా వరుడి కనుబొమల మధ్య స్థానాన్ని చూడాలి. అయితే పెళ్లి సందట్లో కొన్నిసార్లు వారు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా జరగకుండా గుర్తు ఉండేందుకే ఇద్దరికీ బాసికాన్ని కడతారు. నుదిటి మీది బాసికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి కచ్చితంగా దానిమీదకి దృష్టి పోతుందన్నమాట! కుంచెడు గింజల కూలికి పోతే... తూమెడు గింజలు దూడ మేసినట్లు... అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్నప్పుడు ఈ సామెత వాడుతుంటారు! పూర్వం ఒక ఊరిలో ఓ ఆశబోతు ఉండేవాడు. అతడు ఓ ఆసామి దగ్గర కూలిపని చేసుకునేవాడు. అందుకు ప్రతిఫలంగా అతడికి ధాన్యం బాగానే ముట్టేది. ఓ యేడు పంటలు బాగా పండటంతో కూలీల అవసరం ఎక్కువైంది. దాంతో ఇతగాడికి ఆశ పుట్టింది. ఇంకాస్త ధాన్యం వస్తుంది కదా అని మరోచోట కూడా పనికి ఒప్పుకున్నాడు. తన యజమాని ఇచ్చిన ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకుని, వేరే పొలానికి పనికి పోయాడు. అక్కడ కుంచెడు వడ్లు లభించడంతో ఆనందంగా బయలుదేరాడు. తీరా ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఉండాల్సిన ధాన్యం లేదు. వెళ్లే హడావుడితో తలుపు వేయడం మర్చిపోవడంతో దూడ వచ్చి ఉన్నదంతా మేసేసింది. దాంతో ఘొల్లుమన్నాడా వ్యక్తి. నాటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది! -
నివృత్తం: విభూతి ఎందుకు రాసుకుంటారు?
నెయ్యి, పలు రకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు... అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలు, ఛాతి, ఇతరత్రా శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. కొందరు ఆస్తికులైతే శరీరమంతా రుద్దుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు. అందుకే అది అతి పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. మొండివాడు రాజుకన్నా బలవంతుడు... యాచకుల్లో ఒక రకమైన వారున్నారు. వీరు పసి బిడ్డల్ని చేతిలో పెట్టుకుని భిక్షాటనకు వస్తుంటారు. వీళ్లు భిక్ష మామూలుగా అడగరు. బిడ్డని ఇంటిముందు పెట్టి... అప్పుడు అడుగుతారు. ఇంటివాళ్లు వేస్తే సరే. లేదంటే కొరడాతో తమను తాము కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తారు. అతడలా చేసినంతసేపూ ఒక స్త్రీ వాయిద్యాన్ని ఢమఢమా మోగిస్తూనే ఉంటుంది. ఇంట్లోనివాళ్లు బయటికొచ్చి భిక్ష వేసేవరకూ కూడా అలా చేస్తూనే ఉంటారు. చివరికి ఆ గొడవ భరించలేక అందరూ బిచ్చమేస్తుంటారు. ఇది ఇప్పుడు బాగా తగ్గిపోయింది కానీ... ఒకప్పుడు ప్రతి ఊళ్లోనూ తరచూ కనిపిస్తుండేది. వీళ్లకు భయపడి... ‘రాజయినా చెబితే వింటాడు కానీ... ఈ మొండివాళ్లు మాత్రం వినరు’ అనేవారంతా. అలా పుట్టింది ఈ సామెత! -
అతడెవరు?
నిజాలు దేవుడికెరుక: కంటికి కనిపించేదంతా నిజం కాదు. కనిపించనిదంతా అబద్ధమూ కాదు. ఇది కొత్త మాటేమీ కాదు. అందరికీ తెలిసిన మాటే. కానీ స్విట్జర్లాండు వారు మాత్రం ఈ సామెత చెప్పుకుని ఊరుకోలేకపోయారు. ఎందుకంటే... వాళ్లకి కనిపించేదంతా నిజంలానే అనిపించింది. కనిపించనిదంతా అబద్ధంలా గోచరించింది. నిజమో కాదో తెలియని సందిగ్ధం... దశాబ్ద కాలం పాటు వారిని భయపెట్టింది. ఇంతకీ వాళ్లను అంతగా కంగారుపెట్టిన విషయం ఏమిటి? నవంబర్ 2003. స్విట్జర్లాండ్‌లోని మాలెస్ ప్రాంతం... సమయం రాత్రి ఎనిమిది కావస్తోంది. చలికాలం కావడంతో మంచు మెల్లగా పరుచుకుంటోంది. చలిగాలులు నరాలను వణికించడం మొదలు పెట్టాయి. పోలీసులు సైతం మత్తుగా, బద్దకంగా ఉన్నారు. చలికి ముసుగుతన్ని పడుకోవాలని ఉన్నా... విధిలేక విధులు నిర్వరిస్తున్నట్టుగా ఉన్నారు. అంతలో పరుగు పరుగున వచ్చాడు అలెక్స్. అతడు వచ్చిన వేగం కలిగించిన ఆయాసంతో రొప్పుతున్నాడు. అంత చలిలోనూ ముఖమంతా చెమట... కళ్లనిండా భయం. అతణ్ని చూస్తూనే ఏదో ఘోరం చూసొచ్చాడని అర్థమైపోయింది ఇన్స్పెక్టర్కి. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు అతృతగా. ‘‘అదీ... మరీ... అక్కడ..’’... భయంతో అతడి మాటలు తడబడుతున్నాయి.‘‘ఎక్కడ... ఏంటి... ఏం జరిగింది?’’ అనుమతి కూడా అడక్కుండానే ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉన్న గ్లాసు తీసుకుని, గటగటా నీళ్లు తాగేశాడు అలెక్స్. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని కుర్చీలో కూలబడ్డాడు. అతడు కాస్త కుదుటపడే వరకూ ఎదురుచూశాడు ఇన్స్పెక్టర్. తర్వాత అన్నాడు... ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పండి’’ అన్నాడు అనునయంగా. ‘‘నేను... నేను... పని మీద పక్క ఊరికెళ్లాను సర్. చీకటి పడిపోయింది కదా, త్వరగా తిరిగి వచ్చేద్దామని అడవి దారిలో బయలుదేరాను. కొంచెం దూరం వచ్చాక ఒకచోట... ఉన్నట్టుండి ఓ వ్యక్తి అడ్డొచ్చాడు.’’ ‘‘కొంపదీసి యాక్సిడెంట్ చేశావా?’’ లేదన్నట్టు తలూపాడు అలెక్స్. ‘‘అతడు సడెన్‌గా నా కారుకి అడ్డొచ్చాడు. పొడవుగా ఉన్నాడు. కోటు వేసుకున్నాడు. క్యాప్ కూడా పెట్టుకున్నాడు. కాస్త ఉంటే నా కారు గుద్దేసేదే. సడెన్ బ్రేకు వేయబట్టి తృటిలో తప్పింది.’’ ‘‘మరి ఇంకేంటయ్యా నీ బాధ?’’... కాస్త విసుగ్గా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘వాడు చాలా భయంకరంగా ఉన్నాడు సర్. ముఖానికి ఏదో మాస్క్ వేసుకున్నాడు. నేను కారు బ్రేక్ వేశానా.. కనీసం నా వైపు తలతిప్పి చూడలేదు. ఒక్కక్ష ణం ఆగనైనా ఆగలేదు. తన మానాన తను వెళ్లిపోయాడు. చూస్తుంటే... ఏదో నేరం చేయడానికి వెళ్తున్నవాడిలా అనిపించాడు. ఎందుకైనా మంచిదని మీకు చెబుదామని వచ్చాను.’’ ‘‘అవునా... చేతిలో ఏదైనా ఆయుధంగానీ ఉందా?’’ ‘‘లేదు సర్. బొకే ఉంది.’’ ‘‘ఏంటీ?’’ ‘‘అవును సర్. బొకే ఉంది.’’ చిర్రెత్తుకొచ్చింది ఇన్స్పెక్టర్కి. ‘‘మర్డర్ చేసేవాడు చేతిలో బొకే పట్టుకుని ఎందుకెళ్తాడయ్యా... చంపేశాక అంజలి ఘటించడానికా? ఈ టైములో నేనే దొరికానా నీకు?’’ ఇన్స్పెక్టర్ విసుగు చూసి భయమేసింది అలెక్స్‌కి. ‘‘సరే సర్... వస్తాను’’ అనేసి మెల్లగా జారుకున్నాడు. ఎవడో తింగరోడిలా ఉన్నాడు అనుకుంటూ ఆవులించాడు ఇన్స్పెక్టర్. డిసెంబర్ 25. క్రిస్మస్ సంబరాలతో స్విట్జర్లాండుకే కొత్త కళ వచ్చింది. దీపకాంతులతో మాలెస్ వెలిగిపోతోంది. ‘‘ఏదేమైనా... క్రిస్మస్ టైములో మాత్రం ఇక్కడ భలే హుషారుగా ఉంటుంది కదూ ఆంటోనీ’’ అన్నాడు ఇన్స్పెక్టర్ చుట్టూ చూస్తూ. జీపు డ్రైవ్ చేస్తోన్న ఆంటోనీ అవునన్నట్టు తలూపాడు. ‘‘కానీ పండుగలూ పబ్బాలూ మనకేమీ ఉండవు కదా సర్. ఎప్పుడూ డ్యూటీ యే డ్యూటీ’’ అన్నాడు కాస్త నిరాశగా. ‘‘ఒక్కసారి యూనిఫామ్ తొడిగాక ఇక అవన్నీ మర్చిపోవాల్సిందే బాబూ’’ అంటూ పకపకా నవ్వుతోన్న ఇన్స్పెక్టర్... డ్రైవర్ వేసిన సడెన్ బ్రేకుకి తుళ్లిపడ్డాడు. ‘‘ఓయ్... పండుగ చేసుకోవడం లేదన్న బాధలో జీపు నడపడం మర్చిపోయావా ఏంటి?’’ అన్నాడు ఆంటోనీ వైపు చూసి. అతడు మాత్రం ఇన్స్పెక్టర్ని చూడటం లేదు. ఎటో చూస్తున్నాడు. అతడి కళ్లు భయంతో వెడల్పయ్యాయి. దాంతో అతడు చూస్తున్నవైపే దృష్టి సారించాడు. ఓ వ్యక్తి నడచుకుంటూ పోతున్నాడు. నల్లని పొడవాటి కోటు, తలమీద టోపీ, ముఖానికి మాస్క్, చేతిలో బొకే... ఠక్కున అలెక్స్ గుర్తొచ్చాడు ఇన్స్పెక్టర్కి. ‘‘ఆ రోజు ఆ అబ్బాయి చెప్పింది ఇతని గురించే అనుకుంటా సర్’’ అవునన్నట్టు తలూపాడు. చకచకా జీపు దిగాడు. వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ వ్యక్తిని చేరుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి చీకట్లో కలిసిపోయాడు. కాసేపు అటూ ఇటూ తిరిగాడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని. కానీ ఎక్కడా కనిపించలేదు. కన్నుమూసి తెరిచేలోగా ఎలా మాయమైపోయాడో అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక వచ్చి జీపెక్కాడు. జీపు పోతూ ఉంది. ఇన్స్పెక్టర్ ఆలోచనలు అంతకంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఎవరా వ్యక్తి? అంత చీకటిలో అడవిలో ఏం చేస్తున్నాడు? ఆహార్యం విచిత్రంగా ఉంది. పైగా చేతిలో బొకే. ఎవరికివ్వడానికి వెళ్తున్నాడు? అంత వేగంగా ఎలా మాయమయ్యాడు? ఎలాగైనా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడికి తెలియదు... అవి ఎప్పటికీ తెలియవని. తెలుసుకోవడం సాధ్యం కాదని! స్విట్జర్లాండ్ వెళ్లి ‘లే లయోన్ (మిస్టీరియస్ మ్యాన్)’ గురించి మీకు తెలుసా అని ఎవరిని అడిగినా వాళ్ల ముఖాల్లో రంగులు మారతాయి. భయంతో కళ్లు రెప్ప వేయడం మర్చిపోతాయి. ఏం చెప్పాలో తెలియక మాటలు తడబడతాయి. అంతగా వారిని భయపెట్టే ఆ లే లయోన్ ఎవరు? అతడెవరో ఎవరికీ తెలియదు. కానీ అతడి గురించిన భయం మాత్రం వారిని దాదాపు పదేళ్లపాటు వెంటాడింది. 2003లో ఓ రోజు అనుకోకుండా అడవిలో ఓ వ్యక్తికి తారసపడ్డాడతను. విచిత్రమైన వస్త్రధారణ, అంతకంటే విచిత్రమైన ప్రవర్తనతో అందరినీ కంగారు పెట్టాడు. నల్లని లాంగ్ కోట్ వేసుకున్న ఓ వ్యక్తి చేతిలో బొకేతో అడవిలో తారసపడ్డాడని చాలామంది పోలీసులకు చెప్పారు. అతడిని చూస్తే భయం వేస్తోందని, ప్రమాదకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మొదట ఎవరో అయివుంటారని తీసి పారేసినా, ఆ తరువాత అతడిని చూసినవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆ మిస్టీరియస్ మ్యాన్ గురించి అన్వేషణ మొదలైంది. కానీ అడవంతా వెతికినా... అతడి జాడ కరువైంది! అతడు ఎవరికో ఎప్పుడో కనిపించేవాడు. ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉండేవాడు. ఆ దట్టమైన అడవిలో అతడు ఏం పారేసుకున్నాడో, ఎందుకలా వెతుకుతున్నాడో తెలిసేది కాదు. అడుగుదామంటే వీలుపడేదీ కాదు. కనిపించినట్టే కనిపించి మాయమయ్యేవాడు. చిక్కినట్టే చిక్కి జారిపోయేవాడు. కళ్లెదురుగానే ఉన్నట్టు అనిపించేవాడు. క్షణాల్లో చీకట్లో కలిసిపోయేవాడు. అతడెవరో, అతడి వెనుక ఉన్న మర్మమేమిటో తెలియక అందరూ జడిసిపోయేవారు. అడవిలోకి వెళ్లాలంటేనే వణికిపోయేవారు. అలా ఒకటీ రెండూ కాదు... దాదాపు పదేళ్లపాటు అందరినీ హడలెత్తించాడు లే లయోన్. అయితే ఎప్పుడూ ఎవరికీ చెడు చేయలేదు. ఎవరినీ కొట్టినట్టు, దోచుకున్నట్టు, చంపినట్టు ఆధారాలు లేవు. దాన్నిబట్టి అతడు మంచివాడేనని అర్థమైంది. కానీ పాదరసంలా జారిపోయే శక్తి ఓ మనిషికి ఎక్కడికి నుంచి వచ్చిందన్నదే అర్థం కాలేదు. అందుకే కొందరు అసలతడు మనిషేనా దెయ్యమా అన్న సందేహాన్ని కూడా లేవనెత్తారు. 2013లో ఓ వ్యక్తి దూరం నుంచి తీసిన మిస్టీరియస్ మ్యాన్ ఫొటో ఇది. స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రముఖ దినపత్రిక దీన్ని ప్రచురించింది. అప్పుడు రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. అన్నాళ్లూ అందరూ అతడి గురించి చాలానే విన్నారు కానీ... అతడిని కొందరే చూశారు. కొందరే నమ్మారు కూడా. ఈ ఫొటోని ప్రచురించాక మిస్టీరియస్ మ్యాన్ నిజంగానే ఉన్నాడనే నమ్మకం అందరికీ కలిగింది. అయితే ఇప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం ఒకటుంది. అన్నేళ్లు అతగాడు అలా తిరుగుతూ ఉంటే, పోలీసులు ఆ మాత్రం పట్టుకోలేకపోయారా అని. ఎంత అతడు దొరక్కుండా తప్పించుకు తిరిగినా... పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా దొరకలేదంటే అది పోలీసుల అసమర్థతే కారణం అన్న వారూ లేక పోలేదు. అదే విధంగా అతడి ఆత్మహత్య గురించి కూడా పలు అనుమానాలు తలెత్తాయి. ఆ ఉత్తరం అతడే రాశాడని గ్యారంటీ ఏంటి, ఎవరైనా కావాలని రాసిపెట్టి ఉండొచ్చు కదా, అతడే రాసివుంటే తన వివరాలు చెప్పేవాడు కదా, చెప్పడం ఇష్టం లేకపోతే ఉత్తరం రాసేవాడు కాదు కదా... ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. కానీ సమాధానాలే లేవు! ఆ సందేహం అందరినీ ఇంకా ఎక్కువ భయపెట్టింది. అయితే అతడు మనిషేనని, దెయ్యం కాదని తెలిపే సంఘటన ఒకటి 2013లో జరిగింది. అడవిలోని ఓ చెట్టు దగ్గర... మిస్టీరియస్ మ్యాన్ రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అయితే అది చదివిన తరువాత సందేహాలు నివృత్తి కాలేదు. మరింత పెరిగాయి. ‘‘వయసుడిగిపోతోంది. ఒంట్లోని శక్తి ఆవిరైపోతోంది. నాలో అభద్రతాభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక వెతకలేను. ఈ వెతుకులాట సాగించలేను. నేను కోరుకున్నదాన్ని పొందలేను. ఈ నిరాశలో జీవించలేను’’ అంటూ అతడు రాసిన లేఖ అందరినీ విస్మయపరిచింది. ఇన్నేళ్లుగా అతడు మనల్ని ఏమైనా చేస్తాడేమోనని భయపడ్డాం, కానీ అతడేదో బాధలో ఉన్నాడు పాపం అంటూ పెదవి విరిచారంతా. కానీ ఆ బాధ దేనికోసం? యేళ్లపాటు సాగించిన అన్వేషణ ఎవరి కోసం? కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో అతడు దేనికోసం వెతికాడు? ప్రపంచమంతా తన కోసం వెతుకుతుంటే అతడు ప్రపంచాన్ని మర్చిపోయి మరీ ఎవరి కోసం అన్వేషించాడు? ఏమో... నిజాలు దేవుడికెరుక!! - సమీర నేలపూడి -
నివృత్తం: అక్షింతలు ఎందుకు చల్లుతారు?
అక్షతలు అన్నమాట నుంచి అక్షింతలు వచ్చింది. అక్షతలు అంటే... రోకటిపోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికీ ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి దానవస్తువు బియ్యం. మనిషి మనసుపై చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనసుపై ప్రభావం చూపుతుందట. చల్లేవారి శరీరంలోని విద్యుత్‌ను, ఆశీస్సులు పుచ్చుకునేవారి శరీరంలోకి సరఫరా చేస్తాయి అక్షతలు. తద్వారా తమో, రజో, సాత్వికాలనే త్రిగుణాలకు కారకాలు అవుతాయి. కాబట్టి పెద్దల్లో ఉండే సాత్విక గుణం అక్షింతల ద్వారా పిల్లలకు చేరుతుందనే ఉద్దేశంతోనే శుభకార్యాల్లో వాటిని చల్లే సంప్రదాయం పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి. కుప్ప తగులబెట్టి పేలాలు ఏరుకు తిన్నట్టు... ఒక ఊళ్లో ఒక పిల్లాడు ఉండేవాడు. ఓ రోజు వాళ్లమ్మ దగ్గరకు వెళ్లి పేలాలు తినాలని ఉందన్నాడు. పనిలో ఉన్న తల్లి... తర్వాత చేసి పెడతానులే అంది. తనకు ఇప్పుడే కావాలని మారాం మొదలుపెట్టడంతో వీపు మీద ఒక్కటిచ్చింది. దాంతో పౌరుషం వచ్చేసింది పిల్లగాడికి. ఎలాగైనా పేలాలు తిని తీరాలనుకున్నాడు. పేలాలను ఒడ్ల నుంచి చేస్తారని తెలుసు కాబట్టి వెళ్లి వరికుప్పకు నిప్పెట్టాడు. ఏడాదికి సరిపడా ధాన్యం తగులబడిపోతున్నా పట్టించుకోకుండా, టపటపా పేలుతున్న పేలాలను ఏరుకుని తింటూ కూచున్న అతణ్ని చూసి తల్లి నెత్తీ నోరూ బాదుకుందట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోనికి వచ్చింది. చిన్న ప్రయోజనం కోసం పెద్ద నష్టం చేసినవారి విషయంలో దీన్ని వాడతారు! -
నివృత్తం: మొండిచేతి వాడికి నువ్వులు తినడం నేర్పినట్టు...
ఒక ఆసామి నువ్వుల్ని పండించాడు. మామూలు వాళ్లయితే నువ్వులు తినేస్తారేమోనని భయమేసి, వెతికి వెతికి ఓ మొండి చేతుల వాడిని తీసుకొచ్చి పొలంలో పనికి పెట్టుకున్నాడు. అయినా కూడా వాడి మీద అనుమానంగానే ఉండేది. ఎప్పటికప్పుడు వాడిని పరిశీలిస్తూ ఉండేవాడు. అంతలో పనిమీద పక్కూరికి వెళ్లిన ఆసామి, రెండు రోజుల వరకూ రాలేకపోయాడు. తాను లేనప్పుడు పనివాడు నువ్వులు తినేశాడేమోనన్న అనుమానంతో, వచ్చీ రాగానే ‘ఏరా... నువ్వులు తిన్నావా’ అని అడిగాడు. ‘చేతుల్లేనివాడిని, నేనెలా తినగలను సామీ’ అన్నాడు వాడు. వెంటనే ఇతగాడు... ‘ఏముంది, మొండి చేతులకు నూనె రాసుకుని, వాటికి నువ్వుల్ని అద్దుకుని తినొచ్చు కదా’ అన్నాడు. ఇదేదో బాగుందే అనుకున్న పనివాడు అప్పట్నుంచీ నిజంగానే నువ్వులు తినడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. మంచివాడికి లేనిపోని ఆలోచనలు కల్పించి, తప్పుదారి పట్టించినప్పుడు ఈ సామెత వాడతారు. అవసాన దశలో తులసి తీర్థం ఎందుకు పోస్తారు? తులసి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తులసిని ఎంతో పవిత్రంగా చూస్తారు. చావు బతుకుల్లో ఉన్న మనిషికి నోటిలో తులసి తీర్థం పోస్తారు. మరణానికి చేరువైన మనిషికి తులసి తీర్థాన్ని తాగిస్తే... అది శరీరాన్ని చల్లబర్చి వేడిని రగిలిస్తుందని, రుగ్మతలను తగ్గిస్తుందని, తద్వారా ఆ మనిషి మరికొంత కాలం బతుకుతాడేమోనన్న ఉద్దేశంతోనే అలా చేస్తారు. -
నివృత్తం: శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదా?
దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... శివుడు దేవదేవుడు. అంటే... దేవుళ్లకే దేవుడు. కాబట్టి... ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా... పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ... గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు... పూర్వకాలంలో సన్యాసులు ఒంటికి బూడిద రాసుకునేవారు. ఓసారి ఓ సన్యాసి మరో సన్యాసికి ఉపకారం చేశాడట. ఉపకారం పొందిన సన్యాసి... ‘అయ్యో, కృతజ్ఞతగా ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదే’ అంటూ ఆవేదన చెందాడట. దానికి రెండో సన్యాసి... ‘అన్నిటినీ వద్దనుకునే కదా సన్యాసులమయ్యాం, మన దగ్గర ఏముంటుంది... బూడిద తప్ప’ అంటూ నవ్వాడట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చిందని అంటారు. ఎందుకూ కొరగాని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా ఒకటే, కలిసివున్నా ఒకటే. వారి వల్ల వారికీ ఉపయోగం ఉండదు, ఇతరులకూ ఉపయోగం ఉండదు. అందుకే అలాంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఈ సామెత వాడతారు! -
దక్షిణం: కామన్‌సెన్స్‌కు మించిన సలహా లేదు!
ఆలస్యం అమృతం విషం - నిదానమే ప్రధానం... ఈ రెండు సామెతలు ఒకేసారి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఏదో ఒకటి తప్పనిపిస్తుంది. కానీ...రెండూ కరెక్టే. ముందు మనిషికి ఓ కామన్ సెన్స్ అంటూ ఉంటుంది కదా... దాన్ని వాడితే ఈ రెండు సామెతల్లో ఏది ఎపుడు కరెక్టో తెలుస్తుంది. స్త్రీ విషయంలో కూడా ఇంతకుమించి ఎన్నోరెట్లు కామన్సెన్స్ పనిచేయాలి. ప్రపంచంలో అబ్బాయిలు మహా అయితే పది పదిహేను రకాలు ఉంటారు. అమ్మాయిలు... ఎంత మంది ఉంటే అన్నిరకాలుగా ఆలోచిస్తారు. ఒకరి ఆలోచనా తీరు ఉన్నట్లు ఇంకొకరి ప్రవర్తన ఉండదు. అందుకే ఏ అమ్మాయి ప్రేమలో పడినా, ఏ అమ్మాయిని ప్రేమలో పడేయాలన్నా ఆ అమ్మాయి ఆలోచనా తీరుబట్టే ఉండాలి. అమ్మాయిలు అర్థం కారురా బాబూ... అనే బెంగ అక్కర్లేదు. వారు అర్థమవుతారు. కాకపోతే ఎవరికి వారు యునిక్ కాబట్టి మీక్కావల్సిన వారిని మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందరూ కొన్ని కామన్ టిప్స్ చెబుతుంటారు. అవి అన్నిసార్లూ చెల్లవు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్రేజీగా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు... ఇది అబ్బాయిలు నమ్మే ఒక కామన్ సూత్రం. ఇది కొంతవరకే నిజం! ఏ బొమ్మరిల్లు సినిమానో చూసి ప్రతి అమ్మాయి మిడ్నైట్ ఐస్‌క్రీం తినడం ఇష్టపడుతుందనుకుంటే పొరపాటు. అలానే మిగతా విషయాలూ. నిజాయితీగా ఉంటే ఇష్టం... ఎందులో నిజాయితీ అన్నది పెద్ద సమస్య. నిజాయితీగా పాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న చనువునంతా చెప్పేస్తే ఏ అమ్మాయి భరించగలదు? సెన్సాఫ్ హ్యూమర్ అమ్మాయిలకు ఇష్టం... అవును, కానీ అందరికీ సెటైర్లు అర్థం చేసుకునేటంత చిలిపి మనసు ఉండదు. అవి బూమ్రాంగ్లు అవ్వొచ్చు. మీ జోకులు సులువుగా క్యాచ్ చేసేటంత షార్ప్‌నెస్ ఉంటుందనే గ్యారంటీ ఏమిటి? అది కొందరమ్మాయిలకు కిక్ ఇస్తే, ఇంకొందరు దానివల్లే మనల్ని కిక్ చేయొచ్చు! ఆ వ్యక్తిని బట్టి మోతాదుండాలి. స్టేటస్‌కు పడిపోతారు... కాస్ట్లీ బైకు, కారు అందరు అమ్మాయిలను పడగొట్టలేవు. అదేనిజమైతే ఈ ప్రపంచం ఓ నెల కూడా నడవదు. కాలం మారినా... కాలం మారింది అమ్మాయిలు ఫాస్ట్ అయిపోయారు. రొమాంటిక్‌గా మాట్లాడాల్సిందే అనుకుంటున్నారా? సినిమాలు చూసి చెడిపోకండి. అందరూ అలా మారాలంటే కనీసం ఒక రెండు మూడు తరాలు మారాలి. ఇంకా మనం మొదటి తరంలోనే ఉన్నాం. కొసమెరుపు: ఇలాంటి సూత్రాలు చాలానే ఉన్నాయి. ఎన్నున్నా ఒకటి మాత్రం కామన్‌గా పనిచేస్తుంది. ఎంత శుభ్రంగా, క్రమశిక్షణగా డ్రెస్ చేస్తారు. శరీర సౌష్టవాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటారన్నది మాత్రం మగాడిలో ప్రతి అమ్మాయికీ కామన్‌గా నచ్చే అంశం. ‘ఆ ముద్దు’... చాలా పాతది ఇది 2013. కానీ... ఇప్పటికీ సినిమాలో లిప్‌కిస్ పెట్టడం ఒక వార్త. రొమాంటిజమ్లో అధిక మార్కులు కొట్టేసే ఈ చర్య పాశ్చాత్యులకే కాదు, భారతీయులకీ పాతదే అంటే నమ్ముతారా. ఎనైభె సంవత్సరాల క్రితమే ఇది భారతీయ సినిమాల్లో ఉంది. అంటే భారతీయ సినిమా పుట్టిన 20 ఏళ్లకే మన వాళ్లు లిప్‌కిస్ పరిచయం చేసేశారు. 1933లో తీసిన కర్మ సినిమాలో హిమాంశు రాయి, దేవికా రాణిల ఈ మద్య ఈ ముద్దు సీను నడిచింది. బాలీవుడ్లో ఇదే తొలి రొమాంటిక్ సీన్. సామాజిక స్వాతంత్య్రం కంటే ముందుగానే భారతీయులు రొమాంటిక్ స్వాతంత్య్రం సంపాదించేశారా? - ప్రకాష్ చిమ్మల