నివృత్తం: విభూతి ఎందుకు రాసుకుంటారు?
నెయ్యి, పలు రకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు... అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలు, ఛాతి, ఇతరత్రా శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. కొందరు ఆస్తికులైతే శరీరమంతా రుద్దుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు. అందుకే అది అతి పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
మొండివాడు రాజుకన్నా బలవంతుడు...
యాచకుల్లో ఒక రకమైన వారున్నారు. వీరు పసి బిడ్డల్ని చేతిలో పెట్టుకుని భిక్షాటనకు వస్తుంటారు. వీళ్లు భిక్ష మామూలుగా అడగరు. బిడ్డని ఇంటిముందు పెట్టి... అప్పుడు అడుగుతారు. ఇంటివాళ్లు వేస్తే సరే. లేదంటే కొరడాతో తమను తాము కొట్టుకుంటూ భయంకరంగా అరుస్తారు. అతడలా చేసినంతసేపూ ఒక స్త్రీ వాయిద్యాన్ని ఢమఢమా మోగిస్తూనే ఉంటుంది. ఇంట్లోనివాళ్లు బయటికొచ్చి భిక్ష వేసేవరకూ కూడా అలా చేస్తూనే ఉంటారు. చివరికి ఆ గొడవ భరించలేక అందరూ బిచ్చమేస్తుంటారు. ఇది ఇప్పుడు బాగా తగ్గిపోయింది కానీ... ఒకప్పుడు ప్రతి ఊళ్లోనూ తరచూ కనిపిస్తుండేది. వీళ్లకు భయపడి... ‘రాజయినా చెబితే వింటాడు కానీ... ఈ మొండివాళ్లు మాత్రం వినరు’ అనేవారంతా. అలా పుట్టింది ఈ సామెత!