గంగాధర్ ఆత్మహత్య విషయంలో ‘ఆమె’ పాత్రే కీలకం
త్రిబుల్ స్టార్ పోలీస్ అధికారితో సాన్నిహిత్యం
మహిళ ఒత్తిడితోనే గంగాధర్‌పై హత్యాయత్నం కేసు నమోదు
గతంలోనూ సదరు అధికారిపై లైంగిక ఆరోపణలు
సాక్షి, వైఎస్‌ఆర్ జిల్లా : ‘కంచె చేను మేసింద’న్న చందంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పులివెందుల సబ్ డివిజన్‌లో యథేచ్ఛగా ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చాలు ఎలాంటి అడ్డదారులు ఎంచుకున్నా పర్వాలేదన్న ధోరణి అధికంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలైన హత్యాయత్నం కేసులు నీరు గార్చడం, వాదులాటలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సర్వసాధారణమవుతోంది. అందులో భాగంగా మోట్నూతలపల్లెకు చెందిన గంగాధర్ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.
తెరవెనుక చక్రం తిప్పిన మహిళ..
పులివెందుల మండలం మోట్నూతలపల్లి గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే విస్తు పోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మృతి చెందిన గంగాధర్‌కు ఓ మహిళకు మధ్య విభేదాలున్నాయి. సదరు మహిళకు త్రిబుల్ స్టార్ అధికారితో కొద్దికాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఆమె విభేదాలతో నిమిత్తం లేకుండా మరో చిన్న కొట్లాటలో గంగాధర్ చిక్కుకున్నాడు. అంతే తెరవెనుక సదరు మహిళ చక్రం తిప్పింది. అంతే వేగంగా గంగాధర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అంతటితో పోలీసు అధికారుల చర్యలు ఆగిపోలేదు. త్రిబుల్ స్టార్ అధికారితో సాన్నిహిత్యం ఉన్న మహిళను సంతృప్తి పర్చేందుకు గంగాధర్‌కు పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. వెరసి పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి చనిపోవడం గమనార్హం.
గతంలోనూ లైంగిక ఆరోపణలు..
ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు త్రిబుల్ స్టార్ అధికారి గతంలో రాయచోటి ప్రాంతంలో పనిచేస్తుండగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన కింది స్థాయి సిబ్బంది కుటుంబ సభ్యురాలితో సాన్నిహిత్యం కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తర్వాత కాలంలో సైతం ఆమెతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ సంబంధబాంధవ్యాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సదరు మహిళకు రాయచోటిలో ఏకంగా ఇల్లు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఇంటి నిర్మాణానికి పులివెందుల టీడీపీ నాయకులు చేస్తున్న అనైతిక కార్యకలాపాల ద్వారా లభించే సొమ్ము వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.
గంగాధర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే దిశగా..
పులివెందులలో పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్న మోట్నూతలపల్లె గంగాధర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో త్రిబుల్ స్టార్ అధికారి నిమగ్నమైనట్లు సమాచారం. గంగాధర్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో బిత్తర పోయిన సదరు అధికారి మొత్తం వ్యవహారం బహిర్గతమవుతుందని నోట్ల కట్టలతో నోరు మూయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు, చట్టాన్ని అతిక్రమించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని నిత్యం ప్రకటిస్తుంటారు. అయితే పోలీసుశాఖకు ఎలాంటి మచ్చ తెచ్చినా టీడీపీ నేతల సిఫార్సులుంటే ఎలాంటి చర్యలు ఉండవని పులివెందుల సబ్ డివిజన్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి.
ఎస్పీ గాడిలో పెడతారా?!
జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ఖాకీ వనంలో కలుపు మొక్కలుగా తయారయ్యారు. చట్టాన్ని పరిరక్షించాల్సింది పోయి వారే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తూ, ఈజీ మనీ కోసం అడ్డదారులు ఎంచుకున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలు ఉద్యోగ నిర్వహణ ఎలా ఉన్నా ఇబ్బంది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్న కలుపు మొక్కలను.. కళంకితులను గాడిలో పెట్టా ల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మరి జిల్లా పోలీసు బాసు ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment