అతడెవరు? | who is he unknown person ? | Sakshi
Sakshi News home page

అతడెవరు?

Published Sun, Jul 6 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

అతడెవరు?

అతడెవరు?

నిజాలు దేవుడికెరుక: కంటికి కనిపించేదంతా నిజం కాదు. కనిపించనిదంతా అబద్ధమూ కాదు. ఇది కొత్త మాటేమీ కాదు. అందరికీ తెలిసిన మాటే. కానీ స్విట్జర్లాండు వారు మాత్రం ఈ సామెత చెప్పుకుని ఊరుకోలేకపోయారు. ఎందుకంటే... వాళ్లకి కనిపించేదంతా నిజంలానే అనిపించింది. కనిపించనిదంతా అబద్ధంలా గోచరించింది. నిజమో కాదో తెలియని సందిగ్ధం... దశాబ్ద కాలం పాటు వారిని భయపెట్టింది. ఇంతకీ వాళ్లను అంతగా కంగారుపెట్టిన విషయం ఏమిటి?
 
 నవంబర్ 2003. స్విట్జర్లాండ్‌లోని మాలెస్ ప్రాంతం... సమయం రాత్రి ఎనిమిది కావస్తోంది. చలికాలం కావడంతో మంచు మెల్లగా పరుచుకుంటోంది. చలిగాలులు నరాలను వణికించడం మొదలు పెట్టాయి. పోలీసులు సైతం మత్తుగా, బద్దకంగా ఉన్నారు. చలికి ముసుగుతన్ని పడుకోవాలని ఉన్నా... విధిలేక విధులు నిర్వరిస్తున్నట్టుగా ఉన్నారు. అంతలో పరుగు పరుగున వచ్చాడు అలెక్స్. అతడు వచ్చిన వేగం కలిగించిన ఆయాసంతో రొప్పుతున్నాడు. అంత చలిలోనూ ముఖమంతా చెమట... కళ్లనిండా భయం. అతణ్ని చూస్తూనే ఏదో ఘోరం చూసొచ్చాడని అర్థమైపోయింది ఇన్‌స్పెక్టర్‌కి. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు అతృతగా. ‘‘అదీ... మరీ... అక్కడ..’’... భయంతో అతడి మాటలు తడబడుతున్నాయి.‘‘ఎక్కడ... ఏంటి... ఏం జరిగింది?’’
 
 అనుమతి కూడా అడక్కుండానే ఇన్‌స్పెక్టర్ టేబుల్ మీద ఉన్న గ్లాసు తీసుకుని, గటగటా నీళ్లు తాగేశాడు అలెక్స్. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుని కుర్చీలో కూలబడ్డాడు. అతడు కాస్త కుదుటపడే వరకూ ఎదురుచూశాడు ఇన్‌స్పెక్టర్. తర్వాత అన్నాడు... ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పండి’’ అన్నాడు అనునయంగా. ‘‘నేను... నేను... పని మీద పక్క ఊరికెళ్లాను సర్. చీకటి పడిపోయింది కదా, త్వరగా తిరిగి వచ్చేద్దామని అడవి దారిలో బయలుదేరాను. కొంచెం దూరం వచ్చాక ఒకచోట... ఉన్నట్టుండి ఓ వ్యక్తి అడ్డొచ్చాడు.’’
 ‘‘కొంపదీసి యాక్సిడెంట్ చేశావా?’’
 లేదన్నట్టు తలూపాడు అలెక్స్. ‘‘అతడు సడెన్‌గా నా కారుకి అడ్డొచ్చాడు. పొడవుగా ఉన్నాడు. కోటు వేసుకున్నాడు. క్యాప్ కూడా పెట్టుకున్నాడు. కాస్త ఉంటే నా కారు గుద్దేసేదే. సడెన్ బ్రేకు వేయబట్టి తృటిలో తప్పింది.’’
 ‘‘మరి ఇంకేంటయ్యా నీ బాధ?’’... కాస్త విసుగ్గా అన్నాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘వాడు చాలా భయంకరంగా ఉన్నాడు సర్. ముఖానికి ఏదో మాస్క్ వేసుకున్నాడు. నేను కారు బ్రేక్ వేశానా.. కనీసం నా వైపు తలతిప్పి చూడలేదు. ఒక్కక్ష ణం ఆగనైనా ఆగలేదు. తన మానాన తను వెళ్లిపోయాడు. చూస్తుంటే... ఏదో నేరం చేయడానికి వెళ్తున్నవాడిలా అనిపించాడు. ఎందుకైనా మంచిదని మీకు చెబుదామని వచ్చాను.’’
 ‘‘అవునా... చేతిలో ఏదైనా ఆయుధంగానీ ఉందా?’’
 ‘‘లేదు సర్. బొకే ఉంది.’’
 ‘‘ఏంటీ?’’
 ‘‘అవును సర్. బొకే ఉంది.’’
 చిర్రెత్తుకొచ్చింది ఇన్‌స్పెక్టర్‌కి. ‘‘మర్డర్ చేసేవాడు చేతిలో బొకే పట్టుకుని ఎందుకెళ్తాడయ్యా... చంపేశాక అంజలి ఘటించడానికా? ఈ టైములో నేనే దొరికానా నీకు?’’
 ఇన్‌స్పెక్టర్ విసుగు చూసి భయమేసింది అలెక్స్‌కి. ‘‘సరే సర్... వస్తాను’’ అనేసి మెల్లగా జారుకున్నాడు. ఎవడో తింగరోడిలా ఉన్నాడు అనుకుంటూ ఆవులించాడు ఇన్‌స్పెక్టర్.
    
 డిసెంబర్ 25. క్రిస్మస్ సంబరాలతో స్విట్జర్లాండుకే కొత్త కళ వచ్చింది. దీపకాంతులతో మాలెస్ వెలిగిపోతోంది.
 ‘‘ఏదేమైనా... క్రిస్మస్ టైములో మాత్రం ఇక్కడ భలే హుషారుగా ఉంటుంది కదూ ఆంటోనీ’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ చుట్టూ చూస్తూ. జీపు డ్రైవ్ చేస్తోన్న ఆంటోనీ అవునన్నట్టు తలూపాడు. ‘‘కానీ పండుగలూ పబ్బాలూ మనకేమీ ఉండవు కదా సర్. ఎప్పుడూ డ్యూటీ యే డ్యూటీ’’ అన్నాడు కాస్త నిరాశగా.
 ‘‘ఒక్కసారి యూనిఫామ్ తొడిగాక ఇక అవన్నీ మర్చిపోవాల్సిందే బాబూ’’ అంటూ పకపకా నవ్వుతోన్న ఇన్‌స్పెక్టర్... డ్రైవర్ వేసిన సడెన్ బ్రేకుకి తుళ్లిపడ్డాడు.
 ‘‘ఓయ్... పండుగ చేసుకోవడం లేదన్న బాధలో జీపు నడపడం మర్చిపోయావా ఏంటి?’’ అన్నాడు ఆంటోనీ వైపు చూసి. అతడు మాత్రం ఇన్‌స్పెక్టర్‌ని చూడటం లేదు. ఎటో చూస్తున్నాడు. అతడి కళ్లు భయంతో వెడల్పయ్యాయి. దాంతో అతడు చూస్తున్నవైపే దృష్టి సారించాడు.
 ఓ వ్యక్తి నడచుకుంటూ పోతున్నాడు. నల్లని పొడవాటి కోటు, తలమీద టోపీ, ముఖానికి మాస్క్, చేతిలో బొకే... ఠక్కున అలెక్స్ గుర్తొచ్చాడు ఇన్‌స్పెక్టర్‌కి.
 ‘‘ఆ రోజు ఆ అబ్బాయి చెప్పింది ఇతని గురించే అనుకుంటా సర్’’
 అవునన్నట్టు తలూపాడు. చకచకా జీపు దిగాడు. వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ వ్యక్తిని చేరుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి చీకట్లో కలిసిపోయాడు. కాసేపు అటూ ఇటూ తిరిగాడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని. కానీ ఎక్కడా కనిపించలేదు. కన్నుమూసి తెరిచేలోగా ఎలా మాయమైపోయాడో అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక వచ్చి జీపెక్కాడు.
 జీపు పోతూ ఉంది. ఇన్‌స్పెక్టర్ ఆలోచనలు అంతకంటే వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఎవరా వ్యక్తి? అంత చీకటిలో అడవిలో ఏం చేస్తున్నాడు? ఆహార్యం విచిత్రంగా ఉంది. పైగా చేతిలో బొకే. ఎవరికివ్వడానికి వెళ్తున్నాడు? అంత వేగంగా ఎలా మాయమయ్యాడు?
 ఎలాగైనా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతడికి తెలియదు... అవి ఎప్పటికీ తెలియవని. తెలుసుకోవడం సాధ్యం కాదని!
    
 స్విట్జర్లాండ్ వెళ్లి ‘లే లయోన్ (మిస్టీరియస్ మ్యాన్)’ గురించి మీకు తెలుసా అని ఎవరిని అడిగినా వాళ్ల ముఖాల్లో రంగులు మారతాయి. భయంతో కళ్లు రెప్ప వేయడం మర్చిపోతాయి. ఏం చెప్పాలో తెలియక మాటలు తడబడతాయి. అంతగా వారిని భయపెట్టే ఆ లే లయోన్ ఎవరు?
 
 అతడెవరో ఎవరికీ తెలియదు. కానీ అతడి గురించిన భయం మాత్రం వారిని దాదాపు పదేళ్లపాటు వెంటాడింది. 2003లో ఓ రోజు అనుకోకుండా అడవిలో ఓ వ్యక్తికి తారసపడ్డాడతను. విచిత్రమైన వస్త్రధారణ, అంతకంటే విచిత్రమైన ప్రవర్తనతో అందరినీ కంగారు పెట్టాడు. నల్లని లాంగ్ కోట్ వేసుకున్న ఓ వ్యక్తి చేతిలో బొకేతో అడవిలో తారసపడ్డాడని చాలామంది పోలీసులకు చెప్పారు. అతడిని చూస్తే భయం వేస్తోందని, ప్రమాదకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. మొదట ఎవరో అయివుంటారని తీసి పారేసినా, ఆ తరువాత అతడిని చూసినవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆ మిస్టీరియస్ మ్యాన్ గురించి అన్వేషణ మొదలైంది. కానీ అడవంతా వెతికినా... అతడి జాడ కరువైంది!
 
 అతడు ఎవరికో ఎప్పుడో కనిపించేవాడు. ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉండేవాడు. ఆ దట్టమైన అడవిలో అతడు ఏం పారేసుకున్నాడో, ఎందుకలా వెతుకుతున్నాడో తెలిసేది కాదు. అడుగుదామంటే వీలుపడేదీ కాదు. కనిపించినట్టే కనిపించి మాయమయ్యేవాడు. చిక్కినట్టే చిక్కి జారిపోయేవాడు. కళ్లెదురుగానే ఉన్నట్టు అనిపించేవాడు. క్షణాల్లో చీకట్లో కలిసిపోయేవాడు. అతడెవరో, అతడి వెనుక ఉన్న మర్మమేమిటో తెలియక అందరూ జడిసిపోయేవారు. అడవిలోకి వెళ్లాలంటేనే వణికిపోయేవారు. అలా ఒకటీ రెండూ కాదు... దాదాపు పదేళ్లపాటు అందరినీ హడలెత్తించాడు లే లయోన్.
 అయితే ఎప్పుడూ ఎవరికీ చెడు చేయలేదు. ఎవరినీ కొట్టినట్టు, దోచుకున్నట్టు, చంపినట్టు ఆధారాలు లేవు. దాన్నిబట్టి అతడు మంచివాడేనని అర్థమైంది. కానీ పాదరసంలా జారిపోయే శక్తి ఓ మనిషికి ఎక్కడికి నుంచి వచ్చిందన్నదే అర్థం కాలేదు. అందుకే కొందరు అసలతడు మనిషేనా దెయ్యమా అన్న సందేహాన్ని కూడా లేవనెత్తారు.
 
 2013లో ఓ వ్యక్తి దూరం నుంచి తీసిన మిస్టీరియస్ మ్యాన్ ఫొటో ఇది. స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రముఖ దినపత్రిక దీన్ని ప్రచురించింది. అప్పుడు రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. అన్నాళ్లూ అందరూ అతడి గురించి చాలానే విన్నారు కానీ... అతడిని కొందరే చూశారు. కొందరే నమ్మారు కూడా. ఈ ఫొటోని ప్రచురించాక మిస్టీరియస్ మ్యాన్ నిజంగానే ఉన్నాడనే నమ్మకం అందరికీ కలిగింది. అయితే ఇప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం ఒకటుంది. అన్నేళ్లు అతగాడు అలా తిరుగుతూ ఉంటే, పోలీసులు ఆ మాత్రం పట్టుకోలేకపోయారా అని. ఎంత అతడు దొరక్కుండా తప్పించుకు తిరిగినా... పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా దొరకలేదంటే అది పోలీసుల అసమర్థతే కారణం అన్న వారూ లేక పోలేదు. అదే విధంగా అతడి ఆత్మహత్య గురించి కూడా పలు అనుమానాలు తలెత్తాయి. ఆ ఉత్తరం అతడే రాశాడని గ్యారంటీ ఏంటి, ఎవరైనా కావాలని రాసిపెట్టి ఉండొచ్చు కదా, అతడే రాసివుంటే తన వివరాలు చెప్పేవాడు కదా, చెప్పడం ఇష్టం లేకపోతే ఉత్తరం రాసేవాడు కాదు కదా... ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. కానీ సమాధానాలే లేవు!
 
 ఆ సందేహం అందరినీ ఇంకా ఎక్కువ భయపెట్టింది. అయితే అతడు మనిషేనని, దెయ్యం కాదని తెలిపే సంఘటన ఒకటి 2013లో జరిగింది. అడవిలోని ఓ చెట్టు దగ్గర... మిస్టీరియస్ మ్యాన్ రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అయితే అది చదివిన తరువాత సందేహాలు నివృత్తి కాలేదు. మరింత పెరిగాయి. ‘‘వయసుడిగిపోతోంది. ఒంట్లోని శక్తి ఆవిరైపోతోంది. నాలో అభద్రతాభావం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక వెతకలేను. ఈ వెతుకులాట సాగించలేను. నేను కోరుకున్నదాన్ని పొందలేను. ఈ నిరాశలో జీవించలేను’’ అంటూ అతడు రాసిన లేఖ అందరినీ విస్మయపరిచింది. ఇన్నేళ్లుగా అతడు మనల్ని ఏమైనా చేస్తాడేమోనని భయపడ్డాం, కానీ అతడేదో బాధలో ఉన్నాడు పాపం అంటూ పెదవి విరిచారంతా.
 
 కానీ ఆ బాధ దేనికోసం? యేళ్లపాటు సాగించిన అన్వేషణ ఎవరి కోసం? కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో అతడు దేనికోసం వెతికాడు? ప్రపంచమంతా తన కోసం వెతుకుతుంటే అతడు ప్రపంచాన్ని మర్చిపోయి మరీ ఎవరి కోసం అన్వేషించాడు? ఏమో... నిజాలు దేవుడికెరుక!!
  - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement