2014–19 మధ్య నాలుగుసార్లు చంద్రబాబు, ఒకసారి లోకేశ్ దావోస్ పర్యటన
భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా కథనాలు
2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం
విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటూ ప్రకటన
2016లో మియర్ బర్గర్, ఫిస్లోం సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తున్నాయని డప్పు
రూ.2,000 కోట్లతో ఘెర్జి టెక్స్‌టైల్స్ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటంటూ ప్రచారం
2017లో జనరల్ అట్లాంటిక్ రూ.43,000 కోట్ల పెట్టుబడులని.. విశాఖలో యూకేకు చెందిన
ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల ఆస్పత్రి అని కథనం
విశాఖలో నోవార్టీస్ ఆర్ అండ్ డీ కేంద్రం
2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారం
గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు.. హిటాచీ పెట్టుబడులంటూ ప్రచారం
2019లో జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం
డెలాయిట్, పెగాసిస్టమ్స్‌లో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి అంటూ ప్రకటనలు
కానీ.. ఒక్క పెట్టుబడీ సాధించలేకపోయిన బాబు సర్కార్
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్(Davos) పర్యటనకు వెళుతున్న చంద్రబాబు(Chandrababu) అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ, సీఎన్‌బీసీ టీవీ18, బిజినెస్ టుడే పత్రికలకు రూ.కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట అటుంచి.. 2014–19 మధ్య దావోస్(Davos) పర్యటనల్లో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాలు ఏమయ్యాయి.. ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా బాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచంలోని కుబేరులతో ఫొటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ.. దావోస్(Davos) పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు(Chandrababu) చెప్పగలరా... అని ప్రశ్చిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు చంద్రబాబు(Chandrababu) దావోస్(Davos) పర్యటనకు వెళితే... ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్(Davos) పర్యటనకు వెళ్లింది. మొత్తం దావోస్(Davos) పర్యటనకు రూ.55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా, రూ.ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్(Davos) పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్(Davos)కు వెళ్లిన అప్పటి సీఎం చంద్రబాబు(Chandrababu) పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడంతో పాటు సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా... తాజాగా సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారే కానీ.. మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగా సిస్టమ్స్... ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్టు ఊదరగొట్టారే కానీ... ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు(Chandrababu) హయాంలో తీసుకురాలేకపోయారు.
వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డుస్థాయి ఒప్పందాలు
కేవలం రూ.11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్(Davos) సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. రూ.200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు.
అలాగే రూ.60 వేల కోట్లతో అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్‌కో రూ.37 వేల కోట్లతో, అరబిందో రూ.28 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు దావోస్(Davos)లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే.. 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు, తెలుగు వంటలు గురించి చర్చించారని, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
2014–19 మధ్య దావోస్(Davos)లో చంద్రబాబు(Chandrababu) పర్యటించి ప్రకటించిన కొన్ని
ముఖ్యమైన పెట్టుబడులు ఇవీ... ఇందులో ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు
2015లో
⇒ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం
⇒ విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన
⇒ రాష్ట్రంలో భారీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం
2016లో
⇒ మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు
⇒ రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్‌టైల్స్ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు
⇒ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతోపాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి
2017లో
⇒ ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులు
⇒ విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు
⇒ విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు
2018లో
⇒ కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారం
⇒ గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు
⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హిటాచీ పెట్టుబడులు
2019లో
⇒ జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం
⇒డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి
Comments
Please login to add a commentAdd a comment