నివృత్తం: శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదా?
దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... శివుడు దేవదేవుడు. అంటే... దేవుళ్లకే దేవుడు. కాబట్టి... ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా... పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ... గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు...
పూర్వకాలంలో సన్యాసులు ఒంటికి బూడిద రాసుకునేవారు. ఓసారి ఓ సన్యాసి మరో సన్యాసికి ఉపకారం చేశాడట. ఉపకారం పొందిన సన్యాసి... ‘అయ్యో, కృతజ్ఞతగా ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదే’ అంటూ ఆవేదన చెందాడట. దానికి రెండో సన్యాసి... ‘అన్నిటినీ వద్దనుకునే కదా సన్యాసులమయ్యాం, మన దగ్గర ఏముంటుంది... బూడిద తప్ప’ అంటూ నవ్వాడట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చిందని అంటారు. ఎందుకూ కొరగాని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా ఒకటే, కలిసివున్నా ఒకటే. వారి వల్ల వారికీ ఉపయోగం ఉండదు, ఇతరులకూ ఉపయోగం ఉండదు. అందుకే అలాంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఈ సామెత వాడతారు!