Nivrutham
-
నివృత్తం: రొద్దానికి ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు...
ఒకప్పుడు పెనుగొండ ప్రాంతంలో బావులు చాలా లోతుగా ఉండేవట. అప్పట్లో బావులే నీటికి ప్రధాన ఆధారం కాబట్టి... ఇల్లాళ్లంతా బావుల నుంచే నీటిని తోడుకుని, ఇళ్లకు తీసుకెళ్లేవారు. అయితే మరీ లోతు ఎక్కువగా ఉండటం వల్ల, వాళ్లు తోడలేక అవస్థలు పడేవారట. అనారోగ్యం పాలయ్యేవారట. అందుకే ఆ ప్రాంతం వారికి పిల్లనివ్వాలంటే తల్లిదండ్రులు భయపడేవారట. పెనుగొండకు పిల్లనివ్వడం అంటే... మెరక సేద్యం చేయాల్సిన చోటికి ఎద్దుల్ని పంపడం లాంటిదేనన్న ఉద్దేశంతో ‘రొద్దానికి (ఇదీ ఒక ప్రాంతం) ఎద్దును, పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు’ అంటూ ఉండేవారు. అదే తర్వాత సామెతగా స్థిరపడిపోయింది. అరటిపండును పూర్ణఫలం అని ఎందుకంటారు? సృష్టిలోని ఫలాలు వేటినైనా తినేటప్పుడు వాటిలోని గింజలను నమిలి పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్లీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను ఇస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన వాటి ఫలాలనే మనం మళ్లీ ఆరగిస్తాం. దేవుడికి సమర్పిస్తాం. కానీ అరటిపండు మాత్రం అలా కాదు. దాన్ని మనం పూర్తిగా తినేస్తాం. గింజలు పారేయడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అరటిపండు అనేది ఎంగిలి విత్తనం ద్వారా మొలచిన మొక్క నుంచి వచ్చింది కాదు. అందుకే దాన్ని దేవునికి సమర్పించడం శ్రేష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి తోడు ఇవి అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. ఈ కారణాలన్నిటి చేతా అరటిపండును పూర్ణఫలం అంటారు. -
నివృత్తం: శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదా?
దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... శివుడు దేవదేవుడు. అంటే... దేవుళ్లకే దేవుడు. కాబట్టి... ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా... పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ... గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు... పూర్వకాలంలో సన్యాసులు ఒంటికి బూడిద రాసుకునేవారు. ఓసారి ఓ సన్యాసి మరో సన్యాసికి ఉపకారం చేశాడట. ఉపకారం పొందిన సన్యాసి... ‘అయ్యో, కృతజ్ఞతగా ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదే’ అంటూ ఆవేదన చెందాడట. దానికి రెండో సన్యాసి... ‘అన్నిటినీ వద్దనుకునే కదా సన్యాసులమయ్యాం, మన దగ్గర ఏముంటుంది... బూడిద తప్ప’ అంటూ నవ్వాడట. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చిందని అంటారు. ఎందుకూ కొరగాని ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా ఒకటే, కలిసివున్నా ఒకటే. వారి వల్ల వారికీ ఉపయోగం ఉండదు, ఇతరులకూ ఉపయోగం ఉండదు. అందుకే అలాంటి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఈ సామెత వాడతారు!