నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!! | Dhum Biryani a famous food of Hyderabad city | Sakshi
Sakshi News home page

నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!!

Published Sat, Sep 13 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!!

నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!!

ఈ రోజుల్లో తినడం అంటేనే అదేదో పాపంలా చూస్తున్నారు. తిండెక్కువైతే అన్నీ రోగాలే అంటూ శాపాలిచ్చేస్తున్నారు. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ ‘భాగ్య’నగరంలో ఇవ్వాళ్టికీ ఐదు రూపాయలకు ‘దాల్ రైస్’లూ, రెండు రూపాయలకే ప్లేటిడ్లీ పెట్టే సైకిల్ సెంటర్లు చాలా ఉన్నాయి. అందుకే ఇది భోజనప్రియుల సౌభాగ్యనగరం. ఇక్కడ ఒక్క ‘టై బిస్కెట్‌తో ఆకలికీ, డబ్బులేమికీ మధ్య జరిగే మ్యాచ్ ‘టై’గా ముగుస్తుంది. తిండి మాట రాగానే ప్రతివాడూ ‘బిర్యానీ’ని తలచుకునేవాడే. నిజమే.. మన్లాంటి తిండిపోతు మారాజులందరికీ ‘బిర్యానీ’ కిరీటం లాంటిదే! కానీ దాంతో పాటు దండకడియాలూ, మెడగొలుసులూ, కాళ్లపట్టీల లాంటి అచ్చమైన హైదరాబాదీ వంటకాలెన్నెన్నో ఉన్నాయి కదా.
 
 మొహమాటం లేకుండా మెహమాన్‌ను ఆదరించే ఈ నగరంలో ఓ సామెత ఉంది. అనుకోకుండా తిండి టైమ్‌కు మనం ఎవరింటికైనా వెళ్లామనుకోండి. అప్పుడు మనం ఇబ్బంది పడతామేమోనని హోస్టు భావన. అందుకే ఘోస్టుకైనా మర్యాద చేసేందుకు  ఓ సామెత సృష్టించాడిక్కడి మోస్టు సంస్కార హోస్టు. అదే.. ‘ఖానేకే టైమ్ ఆనేవాలే దోస్త్ హోతే హై’ అని. అందుకే తినే టైమ్‌కు వచ్చిన ప్రతివాడూ స్నేహితుడే ఈ నగరంలో. ప్రాంతాలవారీ వంటకాలెన్నున్నా నగరానికే ప్రత్యేకమైనవి కొన్నున్నారుు.
 
 వాటితో నోటికి రుచి నింపడం, కడుపుకి తిండి నింపడం లాంటి ప్రయోజనాలే కాదు.. మరెన్నో సైడ్ బెనిఫిట్లు! ఉదాహరణకు మా ఛోటేమియాకు లెక్కలు రావడం లేదని ఓ రోజు ఇరానీ హోటల్‌కు తీసుకెళ్లి ఛోటా సమోసా చూపించి ‘ఇదేరా త్రిభుజం’ అన్నా. ఉస్మానియా బిస్కెట్ చూపించి ‘ఇదేరా వృత్తం’ అన్నా. లుఖ్మీని చూపించి ‘చతురస్రం ఇలాగే ఉంటుంది బేటా’ అని చెప్పా. స్టార్టర్ కాబట్టి లుఖ్మీతో మొదలుపెట్టి, ఛోటా సమోసా తిని, ఉస్మానియా బిస్కెట్‌ను ఇరానీ చాయ్‌లో ముంచినంత ఈజీరా లెక్కలంటే అన్నా. అంతే... జామెట్రీ అంటేనే జారుకునే వాడు కాస్తా... ఇప్పుడు ట్రిగనామెట్రీని టీ లా.. అర్థమెటిక్సూ, ఆల్జిబ్రాలనూ ఆరారా.. న్యూమరికల్స్‌ను నోరారా ఆస్వాదిస్తున్నాడు.
 
 ఇక లెక్కలు చాలు. సాయంత్రాల వేళల్లో పాయా షేర్వాతో షిర్‌మాల్‌ని చిన్నచిన్న ముక్కలు చేసి, ఆ షేర్వాతో కలిపేసి, అందులోనే నానేసి వేడివేడిగా ఉండగానే, ముక్కు నుంచి మసాలా ఘాటు వెలువడుతూ ఉండగా తినేవాడు మరింకెక్కడైనా ఉన్నాడా.. ఒక్క హైదరాబాద్‌లో తప్ప. ఇక బేకరీకి వెళ్తే ఆ పేర్లే వేరు. ‘దిల్‌ఖుష్’ తింటే నిజంగానే దిల్‌కు ఖుషీయే. ‘దిల్‌పసంద్’తో దిల్‌కు పసందే. ఐటమ్స్ పేర్లలో ఇంతలా భావుకత హైద్రాబాద్‌లో కాక మరెక్కడ?!
 
 ఒకడు రుమాలీ రోటీ తినేసి రుమాల్‌తో మూతి తుడుచుకుంటాడు. అది దక్కకపోతే ఇంకొకడు మూతి ముడుచుకుంటాడు. ఒకడికి తందూరీ యమా ప్యారీ. మరొకడికి ‘నహారీ’ అంటే షాయిరీ అంత ప్యారీ. ఇంకొకడికి ‘తలాహువా’ తింటే చాలు చెహరా ఖిలాహువా. అదే అల్లాహ్ కీ దువాహ్. హైదరాబాదీకి ఇవన్నీ ఇష్టమన్నమాటకు ‘ఖుదా యే గవాహ్’!  
 
 మిఠాయిలు.. ఖుబానీ కీ మీఠా కోసం బతుకు ఖుర్బానీ అయిపోయినా పరవాలేదనుకునే వారెందరూ? డబుల్ కా మీఠాను ట్రబుల్ లేకుండా త్రిబుల్ టైమ్స్ తిననివారెందరు? తినే వారే అందరూ!  హమారే షెహర్‌కే నవాబీ లోగోంకో... అంటే అసఫ్‌జాహీ నవాబులకూ మన హైదరాబాదీ రుచులు ఎంత ఇష్టం కాకపోతే.. సాక్షాత్తూ తమ అధికారిక జెండాలో ‘కుల్చా’ అనే రోటీని ముద్రించి దాన్నే ‘లోగో’గా వాడారు. వంటలకు పడగెత్తారు. రుచికి పట్టం కట్టారు.
 
 మనముండేది ఆ నవాబుల నగరంలోనే కదా.. అందుకే స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడల్లా బవర్చీలోనైనా, కేఫ్ బహార్‌లోనైనా, సర్వీలోనైనా, నయాగరాలోనైనా, ప్యారడైజ్, ఆస్టోరియాలలోనైనా తిండి కోసం క్యూలోనైనా నిలబడి నా వంతు కోసం వెయిట్ చేస్తా. అక్కడి వాళ్లు బయటకు తోసేస్తూ ఉన్నా ‘నేనూ ఉన్నా, లోపలికి పంపించమం’టూ ప్రాధేయపడుతూ వేచి చూస్తా.  వెరసి... నేను హైదరాబాదీనీ... చలో తిందాం బిర్యానీ!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement