Paya Shorba
-
చికెన్ పాయా ఇవ్వనందుకే హతమార్చా
రాయదుర్గం: ‘చికెన్ పాయా (చారు), మద్యం కొనుగోలుకు డబ్బు అడిగా... ఇవ్వలేదు. దీంతో హత్య చేశాను’ అంటూ తాను చేసిన నేరాన్ని పోలీసుల సమక్షంలో నిందితుడు అంగీకరించాడు. రాయదుర్గం పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను రూరల్ సీఐ ప్రసాద్‌బాబు, డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాదరెడ్డితో కలసి డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం మురుడప్ప హత్యకు గురైన విషయం తెలిసిందే. హతుడి చిన్నమ్మ హరిజన పెన్నక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితుడిని గుర్తించి, సోమవారం సాయంత్రం 5 గంటలకు కల్యం బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో వాస్తవాలను నిందితుడు బహిర్గతం చేశాడు. అనాథగా ఉంటున్న మురడప్ప చుట్టుపక్కల ఇళ్లతో పాటు ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్‌గా పనిచేస్తుండేవాడు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణం నిర్వాహకుడి వద్ద కోడి కాళ్లను ఉచితంగా తీసుకున్నాడు.ఆలయానికి దూరంగా ఉండే వంకలో సొంతంగా చికెన్ రసం (పాయా) వండుకుని భోజనం చేస్తుండగా అక్కడికి యేసురాజు చేరుకున్నాడు. చికెన్ చారుతో పాటు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలని యేసురాజు అడగడంతో మురడప్ప నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆ సమయంలో చేతికి అందిన రాయి తీసుకుని మురడప్ప తలపై యేసురాజు మోది హతమార్చాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, హత్య కేసులో నిందితుడిని 24 గంటల్లోపు అరెస్ట్ చేసిన సిబ్బందిని ఎస్పీ గౌతమి శాలి ప్రత్యేకంగా అభినందించారు. -
ఒకప్పుడు ఇది పేదల వంటకం.. ప్రస్తుతం ఫేవరెట్ డిష్
ప్రపంచంలోనే విభిన్నవంటకాలకు హైదరాబాద్ నగరంప్రసిద్ధిగాంచింది. శతాబ్దాల ఘన చరిత ఇక్కడి రుచుల సొంతం. ఆహార ప్రియులకు ఇక్కడిహోటళ్లలో సీజన్‌కు అనుగుణంగా వంటలు లభిస్తాయి. వేసవిలో లస్సీ, ఫాలుదాతో పాటు పలు రకాల ఔషధాల జ్యూస్‌లు, వర్షాకాలంలో వేడి వేడి సమోసాలు, ఖజూర్లు, లుక్మి, పరాఠా, ఖీమాలు నోరూరిస్తుంటాయి. ఇక చలి కాలంలో శరీరానికి వేడినిచ్చే నహారీ, మరగ్, శేర్వాలుఅందుబాటులో ఉంటాయి. శీతాకాలంలోఇక్కడ లభించే నహారీ, మరగ్, శేర్వాలు, వాటి ప్రత్యేకతలపై కథనం. సాక్షి, సిటీబ్యూరో: చలికాలం వచ్చిందంటే చాలు పాత నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో పాయా, జబాన్, జబడా (తలకాయ కూర) తయారీ చేసే హోటళ్లు గుర్తుకొస్తాయి. చలికాలంలో నగర ప్రజలు ఉదయం సాయంత్రం పాయా శేర్వాతో పాటు మరగ్ కొనుగోలు చేసి తందూరీ, నహారీ కుల్చాతో ఆరగిస్తారు. పాయా శేర్వా, జబాన్, జబడా వంటకాలు శరీరానికి వేడినిస్తాయి. ప్రత్యేకంగా పాయా, మరగ్లో ఔషధ దినుసులు, మసాలాలతో తయారు చేస్తారు. దీంతో పాటు ప్రధానంగా మేక పొట్టేలు కాళ్లు, నాలుక, తలకాయ నహారీ, మరగ్ శేర్వాలో వినియోగిస్తారు. పేదవాళ్ల ప్రత్యేకం.. తొలి నాళ్లలో నహారీ శేర్వా ఎక్కువ శాతం పేదవాళ్లు తినేవారు. ఉదయం పూట శ్రామికులు, కింది స్థాయి ఉద్యోగులు ఆరగించేవారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో వంటలపై అనుభవం ఉన్న వ్యక్తులు ఉదయం, సాయంత్రం నహారీ శేర్వా తయారు చేసి విక్రయించేవారు. ప్రజలు పాత్రలు తీసుకొని వచ్చి నహారీ శేర్వా తీసుకెళ్లి ఇళ్లలో తినేవారు. నహారీ శేర్వా ఒక చోట, కుల్చా (నహారీతో తినేరొట్టె) మరోచోట లభించేది. ఉదయం పూట నహారీ శేర్వాతో పాటు కులచ్చారొట్టె తింటే సాయంకాలం దాకా ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకంటే దీనిలో పోషక గుణాలుఉండటమే కారణం. నహారీ శేర్వా తయారీ ఇలా.. మేక లేదా పొట్టెలు కాళ్లు, తలకాయ, నాలుకను కొన్ని నీళ్లలో నహారీ, మరగ్ మసాలా (పొటిలికా మసాలా, నహారీ మసాలా) వేడి చేసి ఉడకబెడతారు. అవి మెత్తగా అయ్యేదాకా ఉడికిస్తారు. మరో పక్కజైఫల్, జోత్రి, గరంమసాలతో పాటు పలు ఔషధ దినుసులు మసాలాలు వేసి పాయా, జబడా, జబాన్ శేర్వా (సూప్) తయారు చేస్తారు. దీనికి దాదాపు ఆరు గంటల సమయం పడుతుంది. నహారీ, మరగ్ తయారీలో లవంగాలు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, వేడినిచ్చే ఆకులతో పాటు పాలు, నెయ్యి ఉపయోగిస్తారు. వీటితో పాటు మరిన్ని ఔషధ దినుసులు కలిపి పాయా, మరగ్ శేర్వా తయారు చేస్తారు. నాటి నుంచి నేటి దాకా.. పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రదేశాల్లో చలికాలంలో నహారీ శేర్వా, మరగ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. శేర్వా, మరగ్ నగరం ఏర్పాటు నుంచి అందుబాటులో ఉంది. కుతుబ్ షాహీలు, ఆసీఫ్జాహీల పాలనా కాలంలో కూడా శుభకార్యాలు, ప్రభుత్వ వేడుకలు జరిగినప్పుడు శేర్వా, మరగ్‌లను తయారు చేసి వడ్డించేవారు. ఆరోజుల్లో వేడుకల్లో తయారు చేసే వంటకం నేడు నగరంలోని దాదాపు అన్ని ప్రధాన హోటళ్లో లభిస్తోంది. పలు హోటళ్లలో ఏడాది పాటు ఉదయం, సాయంత్రం నహారీ శేర్వా అందుబాటులో ఉంటుంది. కాగా.. కొన్ని హోటళ్లలో కేవలం చలికాలంలోనే శేర్వా తయారు చేస్తున్నారు. ఇప్పటికీ అదే పద్ధతిలో.. గతంలో నహారీ, పాయా మాత్రమే హోటళ్లలో తయారు చేసి విక్రయించేవారు. జబాన్, జబడా ఇళ్లలో తయారు చేసుకుని తినేవారు. మా నాన్న పాషా బాయి జబాన్, జబడాలు కూడా హోటళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. నేను గత ఐదేళ్ల నుంచి మరగ్‌ను తయారు చేసి ఆహార ప్రియులకు అందుబాటులో ఉంచుతున్నాను. నహారీ కొంచెం ఘాటుగా ఉంటుంది. నేటి తరానికి ఘాటు లేకుండా ఉండే విధంగా మరగ్‌ను మా హోటల్లోనే అందుబాటులో ఉంచాం. నిజాం కాలంలో తయారు చేసిన విధంగా మా హోటల్లో ఇప్పటికీ అదే పద్ధతిలో చేస్తున్నాం. – ఉమర్ ఆదిల్, షాదాబ్ హోటల్ యజమాని, మదీనా సర్కిల్ -
వహ్వా పాయా.. ఏమి రుచిరా !
సాక్షి, నిజామాబాద్ : చలి, వర్షా కాలాలు వచ్చాయంటే చాలు నోరూరించే వేడి వేడి పాయాను తినాల్సిందే అంటున్నారు నగర వాసులు. నగరంలో సుభాష్‌నగర్, నెహ్రూపార్క్, తిలక్‌గార్డెన్ లైన్, రైల్వే స్టేషన్ లాంటి నాలుగైదు ప్రాంతాల్లోనే లభించే ఈ నాన్‌వెజ్ వంటకం కోసం పోటీ పడుతున్నారు. దీంతో మధ్యాహ్నానికే హోటళ్లలో పాయా వంటకం ఖాళీ అవుతోంది. దీంతో ఎంత దొరికితే అంత ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు వెచ్చించడానికి పాయా ప్రియుడు వెనుకాడడం లేదు. అయితే ఇంత టేస్టీగా ఉండే పాయాను ఎందుకు ఇష్టపడి తింటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రమపడితేనే రుచి... పాయాను పొట్టేలు, మేక కాళ్లతో తయారు చేస్తారు. కాళ్లను కాల్చి గోధుమ పిండి సహాయంతో వాటి వెంట్రుకలను తొలగిస్తారు. తర్వాతా శుభ్రంగా కడుగుతారు. ఒక పాత్రలో కాళ్లను, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిర్యాలు, సొంటి, కొబ్బరి, ఇత ర మసాల దినులు వేసి నీళ్లు పోసి రెండు, మూడు గంట ల పాటు మరిగిస్తారు. అనంతరం కారంపొడి, ఉప్పు, కావాల్సిన పదార్థాలు వేస్తారు. అధికంగా సూప్ ఉంచి అన్ని కలిసేదాక మరిగిస్తారు. దీంతో ఘుమఘుమలాడే పాయా సిద్ధమవుతుంది. పాయా తయారీ శ్రమతో కూడుకున్న పనే అయినప్పటికీ, దానికున్న రుచి మరే నాన్‌వెజ్ వంటకానికి రాదని తయారీ దారులు చెప్తున్నారు. ఆయా హోటళ్లలో ఒక ప్లేట్ పాయా రూ.100 విక్రయిస్తున్నారు. రైస్‌తో కావాలంటే రూ.140 చెల్లించాలి. ఎముకలకు బలంగా.. పాయా వంటకం రుచికే కాకుండా ఆరోగ్యానికి మంచిదంటున్నారు.ఎముకలకు బలాన్ని ఇస్తుంది. నీళ్ల నొప్పులుంటే తప్పిపోతాయి. ఒంట్లో వేడి పుట్టించి జలుబు చేసిన వారికి సూప్ ఎంతగానో సహాయకారిగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు విరిగిన వారికి పొట్టేలు, మేక కాళ్లను ఉడికించిన సూప్‌ను ఎలాంటి మసాలాలు లేకుండా తాగితే త్వరగా అతుక్కుంటాయని చాలా మంది చెప్తుంటారు. ఇదొక ప్రత్యేకమైన వంట.. పాయా అనేది హోటళ్లలో చాల అరుదుగా లభిస్తుంది. దీనిని రుచిగా తయారు చేయాలంటే వంటకంలో అనుభవం ఉండాలి. అన్ని మసాలాలు కలిసి రుచిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాయా కోసం ఒక రోజు ముందుగానే చాల మంది ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తుంటారు. -
నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!!
ఈ రోజుల్లో తినడం అంటేనే అదేదో పాపంలా చూస్తున్నారు. తిండెక్కువైతే అన్నీ రోగాలే అంటూ శాపాలిచ్చేస్తున్నారు. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ ‘భాగ్య’నగరంలో ఇవ్వాళ్టికీ ఐదు రూపాయలకు ‘దాల్ రైస్’లూ, రెండు రూపాయలకే ప్లేటిడ్లీ పెట్టే సైకిల్ సెంటర్లు చాలా ఉన్నాయి. అందుకే ఇది భోజనప్రియుల సౌభాగ్యనగరం. ఇక్కడ ఒక్క ‘టై బిస్కెట్‌తో ఆకలికీ, డబ్బులేమికీ మధ్య జరిగే మ్యాచ్ ‘టై’గా ముగుస్తుంది. తిండి మాట రాగానే ప్రతివాడూ ‘బిర్యానీ’ని తలచుకునేవాడే. నిజమే.. మన్లాంటి తిండిపోతు మారాజులందరికీ ‘బిర్యానీ’ కిరీటం లాంటిదే! కానీ దాంతో పాటు దండకడియాలూ, మెడగొలుసులూ, కాళ్లపట్టీల లాంటి అచ్చమైన హైదరాబాదీ వంటకాలెన్నెన్నో ఉన్నాయి కదా. మొహమాటం లేకుండా మెహమాన్‌ను ఆదరించే ఈ నగరంలో ఓ సామెత ఉంది. అనుకోకుండా తిండి టైమ్‌కు మనం ఎవరింటికైనా వెళ్లామనుకోండి. అప్పుడు మనం ఇబ్బంది పడతామేమోనని హోస్టు భావన. అందుకే ఘోస్టుకైనా మర్యాద చేసేందుకు ఓ సామెత సృష్టించాడిక్కడి మోస్టు సంస్కార హోస్టు. అదే.. ‘ఖానేకే టైమ్ ఆనేవాలే దోస్త్ హోతే హై’ అని. అందుకే తినే టైమ్‌కు వచ్చిన ప్రతివాడూ స్నేహితుడే ఈ నగరంలో. ప్రాంతాలవారీ వంటకాలెన్నున్నా నగరానికే ప్రత్యేకమైనవి కొన్నున్నారుు. వాటితో నోటికి రుచి నింపడం, కడుపుకి తిండి నింపడం లాంటి ప్రయోజనాలే కాదు.. మరెన్నో సైడ్ బెనిఫిట్లు! ఉదాహరణకు మా ఛోటేమియాకు లెక్కలు రావడం లేదని ఓ రోజు ఇరానీ హోటల్‌కు తీసుకెళ్లి ఛోటా సమోసా చూపించి ‘ఇదేరా త్రిభుజం’ అన్నా. ఉస్మానియా బిస్కెట్ చూపించి ‘ఇదేరా వృత్తం’ అన్నా. లుఖ్మీని చూపించి ‘చతురస్రం ఇలాగే ఉంటుంది బేటా’ అని చెప్పా. స్టార్టర్ కాబట్టి లుఖ్మీతో మొదలుపెట్టి, ఛోటా సమోసా తిని, ఉస్మానియా బిస్కెట్‌ను ఇరానీ చాయ్‌లో ముంచినంత ఈజీరా లెక్కలంటే అన్నా. అంతే... జామెట్రీ అంటేనే జారుకునే వాడు కాస్తా... ఇప్పుడు ట్రిగనామెట్రీని టీ లా.. అర్థమెటిక్సూ, ఆల్జిబ్రాలనూ ఆరారా.. న్యూమరికల్స్‌ను నోరారా ఆస్వాదిస్తున్నాడు. ఇక లెక్కలు చాలు. సాయంత్రాల వేళల్లో పాయా షేర్వాతో షిర్మాల్ని చిన్నచిన్న ముక్కలు చేసి, ఆ షేర్వాతో కలిపేసి, అందులోనే నానేసి వేడివేడిగా ఉండగానే, ముక్కు నుంచి మసాలా ఘాటు వెలువడుతూ ఉండగా తినేవాడు మరింకెక్కడైనా ఉన్నాడా.. ఒక్క హైదరాబాద్‌లో తప్ప. ఇక బేకరీకి వెళ్తే ఆ పేర్లే వేరు. ‘దిల్ఖుష్’ తింటే నిజంగానే దిల్‌కు ఖుషీయే. ‘దిల్పసంద్’తో దిల్‌కు పసందే. ఐటమ్స్ పేర్లలో ఇంతలా భావుకత హైద్రాబాద్‌లో కాక మరెక్కడ?! ఒకడు రుమాలీ రోటీ తినేసి రుమాల్తో మూతి తుడుచుకుంటాడు. అది దక్కకపోతే ఇంకొకడు మూతి ముడుచుకుంటాడు. ఒకడికి తందూరీ యమా ప్యారీ. మరొకడికి ‘నహారీ’ అంటే షాయిరీ అంత ప్యారీ. ఇంకొకడికి ‘తలాహువా’ తింటే చాలు చెహరా ఖిలాహువా. అదే అల్లాహ్ కీ దువాహ్. హైదరాబాదీకి ఇవన్నీ ఇష్టమన్నమాటకు ‘ఖుదా యే గవాహ్’! మిఠాయిలు.. ఖుబానీ కీ మీఠా కోసం బతుకు ఖుర్బానీ అయిపోయినా పరవాలేదనుకునే వారెందరూ? డబుల్ కా మీఠాను ట్రబుల్ లేకుండా త్రిబుల్ టైమ్స్ తిననివారెందరు? తినే వారే అందరూ! హమారే షెహర్కే నవాబీ లోగోంకో... అంటే అసఫ్‌జాహీ నవాబులకూ మన హైదరాబాదీ రుచులు ఎంత ఇష్టం కాకపోతే.. సాక్షాత్తూ తమ అధికారిక జెండాలో ‘కుల్చా’ అనే రోటీని ముద్రించి దాన్నే ‘లోగో’గా వాడారు. వంటలకు పడగెత్తారు. రుచికి పట్టం కట్టారు. మనముండేది ఆ నవాబుల నగరంలోనే కదా.. అందుకే స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడల్లా బవర్చీలోనైనా, కేఫ్ బహార్లోనైనా, సర్వీలోనైనా, నయాగరాలోనైనా, ప్యారడైజ్, ఆస్టోరియాలలోనైనా తిండి కోసం క్యూలోనైనా నిలబడి నా వంతు కోసం వెయిట్ చేస్తా. అక్కడి వాళ్లు బయటకు తోసేస్తూ ఉన్నా ‘నేనూ ఉన్నా, లోపలికి పంపించమం’టూ ప్రాధేయపడుతూ వేచి చూస్తా. వెరసి... నేను హైదరాబాదీనీ... చలో తిందాం బిర్యానీ!