బిర్యానీ విత్ ఆవకాయ..ఉలవచారు
మరీ కారం కాకుండా.. మసాలా ఘాటు తగలకుండా స్పైసీ రుచితో వావ్ అనిపిస్తుంది.ఏ గెట్ టుగెదరయినా... ఫ్యామిలీ డిన్నరయినా బిర్యానీ ఉంటనే అది కంప్లీట్ అయినట్టు. మొఘలాయ్, కోల్‌కతా, దిండిగల్, బోంబో బిర్యానీ.. ఇలా ఏ ప్రాంతపు ఫ్లేవర్‌ను ఆ ప్రాంతంలో జతకడుతుండడంతో బిర్యానీ అందరికీ ఇష్టమైన ఫుడ్‌గా మారిపోయింది. నగరంలో దమ్ బిర్యానీ బాగా ఫేవరెట్. అలాగే నగరవాసులకు ఇటీవలే పరిచయమైన సరికొత్త వెరైటీలు ఆవకాయ, ఉలవచారు బిర్యానీలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆవకాయ పచ్చడిని గుర్తు తెచ్చుకుంటే... ‘ఊర’ని నోరుండదు. బిర్యానీని తలచుకుంటే చాపల్యం చెందని జిహ్వ ఉండదు.
అలాంటిది ఈ రెండింటి కాంబినేషన్ అంటే... భోజనప్రియులకు రుచుల పండుగే. ఆవకాయ పచ్చడిని బిర్యానీలో కలపడం కోసం మరికొంత ఫ్లేవర్‌ఫుల్‌గా తయారు చేస్తారు. బిర్యానీ పరిమళాలు దానికి తోడై అది మరింత వింతైన సువాసనలతో నాసికం నుంచి నాలుక దాకా స్పందనలు కలిగిస్తుంది. మొదట్లో ఇది చూడటానికి సాధారణ బిర్యానీలానే కనిపిస్తుంది. అయితే ఆవకాయ ఇంగ్రీడియంట్ అడుగున ఉంటుంది. మరీ కారం కాకుండా.. మసాలా ఘాటు తగలకుండా స్పైసీ రుచితో వావ్ అనిపిస్తుంది. ఇక ఉలవచారు బిర్యానీ కూడా దీనిలాగే మరో వెరైటీ. ఉలవలతో తయారయ్యే ఉలవచారును బిర్యానీలో కలపడం ద్వారా అతి శక్తిమంతమైన వంటకంగా మారుతుంది. దీని రుచి వినూత్నంగా, మళ్లీ మళ్లీ కావాలనిపించేలా ఉంటుంది. వెజిటబుల్, చికెన్, మటన్లతో కూడా వీటిని సర్వ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న స్పైసీ వెన్యూలో వీటిని టేస్ట్ చేయవచ్చు.
- విశాల్
ఫుడీస్ క్లబ్