నివృత్తం: మొండిచేతి వాడికి నువ్వులు తినడం నేర్పినట్టు...
ఒక ఆసామి నువ్వుల్ని పండించాడు. మామూలు వాళ్లయితే నువ్వులు తినేస్తారేమోనని భయమేసి, వెతికి వెతికి ఓ మొండి చేతుల వాడిని తీసుకొచ్చి పొలంలో పనికి పెట్టుకున్నాడు. అయినా కూడా వాడి మీద అనుమానంగానే ఉండేది. ఎప్పటికప్పుడు వాడిని పరిశీలిస్తూ ఉండేవాడు. అంతలో పనిమీద పక్కూరికి వెళ్లిన ఆసామి, రెండు రోజుల వరకూ రాలేకపోయాడు. తాను లేనప్పుడు పనివాడు నువ్వులు తినేశాడేమోనన్న అనుమానంతో, వచ్చీ రాగానే ‘ఏరా... నువ్వులు తిన్నావా’ అని అడిగాడు. ‘చేతుల్లేనివాడిని, నేనెలా తినగలను సామీ’ అన్నాడు వాడు. వెంటనే ఇతగాడు... ‘ఏముంది, మొండి చేతులకు నూనె రాసుకుని, వాటికి నువ్వుల్ని అద్దుకుని తినొచ్చు కదా’ అన్నాడు. ఇదేదో బాగుందే అనుకున్న పనివాడు అప్పట్నుంచీ నిజంగానే నువ్వులు తినడం మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. మంచివాడికి లేనిపోని ఆలోచనలు కల్పించి, తప్పుదారి పట్టించినప్పుడు ఈ సామెత వాడతారు.
అవసాన దశలో తులసి తీర్థం ఎందుకు పోస్తారు?
తులసి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే తులసిని ఎంతో పవిత్రంగా చూస్తారు. చావు బతుకుల్లో ఉన్న మనిషికి నోటిలో తులసి తీర్థం పోస్తారు. మరణానికి చేరువైన మనిషికి తులసి తీర్థాన్ని తాగిస్తే... అది శరీరాన్ని చల్లబర్చి వేడిని రగిలిస్తుందని, రుగ్మతలను తగ్గిస్తుందని, తద్వారా ఆ మనిషి మరికొంత కాలం బతుకుతాడేమోనన్న ఉద్దేశంతోనే అలా చేస్తారు.