
దార్శనికులు, తాత్త్వికులు, సంస్కృత, తమిళ, ప్రాకృత భాషలలో లెక్కకు మిక్కిలిగా వేదాంత గ్రంథాలను రచించిన ఉద్దండ పండితులు వేదాంతదేశికులు, శ్రీమద్రామానుజుల తరువాత విశిష్టాద్వైత ప్రవర్తకులలో అంతటివారుగా ప్రసిద్ధి పొందిన మహనీయులు దేశికులు. విష్ణుమూర్తి నందక ఖడ్గం ఏ విధంగా అయితే అన్నమయ్యగా అవతరించిందో, వేంకటేశ్వరస్వామివారి ఘంట వేంకట నాథులుగా ఉద్భవించినట్లు కథనాలున్నాయి.
శ్రీరంగం దేవాలయం విదేశీయుల దురాక్రమణకు గురై, అక్కడి ఉత్సవమూర్తి కొంతకాలం తిరుమలలో ప్రవాసం చేసిన విషయం తెలిసిందే. తరువాతి కాలంలో ఆ మూర్తిని శ్రీరంగంలో పునఃప్రతిష్ఠించడంలో దేశికులదే ప్రముఖపాత్ర. విద్యార్థి దశలోనే శ్రీ భాష్య ప్రసంగాలను ముప్పైమార్లు చేసిన ఘనత దేశికులది. వాల్మీకి కృత రామాయణంలోని హనుమ సందేÔè ం, కాళిదాసు‘మేఘసందేశం’ వంటి సందేశకావ్య పరంపరలో పరమోత్కృష్ట కావ్యం దేశికుల హంససందేశం. ఈ కావ్యం నుంచి ప్రేరణ పొందడం వల్లే తాను ఆయన జీవిత చరిత్రను రచించినట్లు చెప్పారు.
ఇందులో దేశికుల జీవితంలోని ప్రధాన ఘట్టాలతోబాటు, ఆయన వ్యక్తిత్వం, విశిష్టాద్వైతంలోనూ, శ్రీవైష్ణవమతంలోనూ దేశికులపాత్ర, ఆయన రచించిన వేదాంత గ్రంథాల వివరాలను చూడవచ్చు. దేశికులు కేవలం గ్రంథరచయిత కాదు. ఆయన చూపిన దివ్యశక్తులు ఎన్నో కథలుగాచెప్పుకొంటారు. అందమైన ముఖచిత్రం, ఆర్టుపేపరు మీద అంతకన్నా అందమైన వర్ణఛాయాచిత్రాలు అనేకం, చిత్రాలలో జీవితచరిత్ర అదనపు ఆకర్షణ.