బాసికం ఎందుకు కడతారు?
వివాహ ఘట్టంలో వధూవరుల అలంకరణలో బాసికం ఓ ప్రధాన భాగం. అయితే దీన్ని ఎందుకు కడతారు అన్నది చాలామందికి తెలియదు. ఈ ఆచారం వెనుక ముఖ్యమైన కారణం ఉంది. వివాహానికి అత్యంత అవసరమైనది సుముహూర్తం. సరిగ్గా ఈ సుముహూర్త సమయంలో వధువు కనుబొమల మధ్య స్థానాన్ని, అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అదే విధంగా వధువు కూడా వరుడి కనుబొమల మధ్య స్థానాన్ని చూడాలి. అయితే పెళ్లి సందట్లో కొన్నిసార్లు వారు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా జరగకుండా గుర్తు ఉండేందుకే ఇద్దరికీ బాసికాన్ని కడతారు. నుదిటి మీది బాసికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి కచ్చితంగా దానిమీదకి దృష్టి పోతుందన్నమాట!
కుంచెడు గింజల కూలికి పోతే... తూమెడు గింజలు దూడ మేసినట్లు...
అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్నప్పుడు ఈ సామెత వాడుతుంటారు!
పూర్వం ఒక ఊరిలో ఓ ఆశబోతు ఉండేవాడు. అతడు ఓ ఆసామి దగ్గర కూలిపని చేసుకునేవాడు. అందుకు ప్రతిఫలంగా అతడికి ధాన్యం బాగానే ముట్టేది. ఓ యేడు పంటలు బాగా పండటంతో కూలీల అవసరం ఎక్కువైంది. దాంతో ఇతగాడికి ఆశ పుట్టింది. ఇంకాస్త ధాన్యం వస్తుంది కదా అని మరోచోట కూడా పనికి ఒప్పుకున్నాడు. తన యజమాని ఇచ్చిన ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకుని, వేరే పొలానికి పనికి పోయాడు. అక్కడ కుంచెడు వడ్లు లభించడంతో ఆనందంగా బయలుదేరాడు. తీరా ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఉండాల్సిన ధాన్యం లేదు. వెళ్లే హడావుడితో తలుపు వేయడం మర్చిపోవడంతో దూడ వచ్చి ఉన్నదంతా మేసేసింది. దాంతో ఘొల్లుమన్నాడా వ్యక్తి. నాటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది!