వార్తా పత్రికల్లో వివాహాలకు సంబంధించిన ఆసక్తికర ప్రకటనలను చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రకటన గురించి గతంలో ఎప్పుడూ వినివుండం. ఒక జంట 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు వరుణ్ణి వెదుతున్నట్లు ఒక ప్రకటన ఇచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే దక్షిణ కన్నడ జిల్లాలో 30 ఏళ్ల క్రితం మృతిచెందిన ఓ పసికందు (ఇప్పుడు యువతి అయి ఉండేది) కోసం తగిన వరుడిని వెతుకుతున్నట్లు ఇటీవల ఒక వార్తాపత్రిలో ప్రకటన వెలువడింది. పుత్తూరుకు చెందిన ఒక కుటుంబం ఈ ప్రకటన ఇచ్చింది. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమార్తెకు ఎలాగైనా వివాహం చేయాలని ఆ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారు. తమ కుమార్తె అవివాహితగా మృతి చెందిన కారణంగా తమను దురదృష్టం వెంటాడుతున్నదని ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
30 ఏళ్ల క్రితం ఆ దంపతుల కుమార్తె పసికందుగా ఉన్నప్పుడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పటి నుండి వారికి కష్టాలు ఎదురవుతున్నాయట. తమ కుమార్తె వివాహం కాకుండా మృతి చెందడమే తమ కష్టాలకు కారణమని ఆ కుటుంబ నమ్ముతోంది. దీంతో తమ కుమార్తె ఆత్మకు శాంతి కలిగింపజేయాలనే భావనతో ఆ కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చారు.
‘30 ఏళ్ల క్రితం మరణించిన యువతికి.. 30 ఏళ్ల క్రితం మృతి చెందిన వరుడు కావలెను. దయచేసి ఇటువంటి వరుడు కలిగిన వారు ఇరు ఆత్మల వివాహానికి సహకరించండి. ఇందుకోసం ఫలానా నంబరుకు ఫోన్ చేయండి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఎంతగా ప్రయత్నించినా అటువంటి వరుడు దొరకడం లేదని, అందుకే ఈ ప్రకటన ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment