ఇంత వరకు రాజకీయనాయకులు పాదయాత్రలు చేపట్టడం చూశాం. అలాగే ఏదైన అన్యాయం జరిగితే నిరసన తెలిపేందుకు కూడా పాదయాత్రలు చేపడుతుంటారు. కానీ ఇక్కడ పెళ్లి కోసం పాదయాత్ర చేపట్టారు కొంతమంది యువకులు. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మాండ్యలో అబ్బాయిలు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా తమకు మంచి అమ్మాయి దొరకాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పెళ్లికాని బ్రహ్మచారులు. అందుకోసం సుమారు 200 మంది బ్రహ్మచారులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టానున్నారు. తమకు పెళ్లి చేసుకునేందుకు మంచి అమ్మాయి దొరికేలా ఆ దేవతా ఆశీర్వదం పొందడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని చెబుతున్నారు ఆ బ్యాచిలర్స్. ఐతే గతంలో ఈ జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని, దీనికి ఇప్పుడూ ఆ యువకులంతా తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని ఓ మహిళా రైతు నాయకురాలు చెబుతోంది.
మైసూరుకి 40 కి.మీ దూరంలో ఉన్న మాండ్య జిల్లాలో వధువుల కొరత బాగా ఎక్కువగా ఉందని, ప్రధానంగా వ్యవసాయ సంబంధిత పనులు చేసే యవతకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 23 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఈ పాదయాత్రో 30 ఏళ్లు పైబడిన 200 మంది యువకులంతా పాల్గొంటారు. అంతేగాదు ఈ పాదయాత్రకు బ్రహ్మచారుల పాదయాత్ర(బ్యాచిలర్ యాత్ర) అని కూడా పేరు పెట్టేశారు. ఈ యాత్రను ప్రకటించి పది రోజుల్లోనే సుమారు 100 మంది దాక పెళ్లికాని యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ యాత్ర ఫిబ్రవరి 23న మద్దూరు తాలూకాలోని కేఎం దొడ్డి గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల్లో పాదయాత్ర 105 కి.మీ మేర సాగి ఫిబ్రవరి 25న ఎం.ఎం.హిల్స్‌కు చేరుకుంటుందని, యాత్రికులకు భోజన వసతి కూడా కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లి కాని యువకులను ఈ సమస్య నుంచి బయటపడేలా చేయాలన్న ఉద్దేశంతోనే తమ వంతుగా ఇలా సాయం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
(చదవండి: ఎయిర్ ఏషియాకు డీజీసీఏ భారీ షాక్..ఏకంగా రూ. 20 లక్షల జరిమానా)
Comments
Please login to add a commentAdd a comment