Einstein
-
అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు
ఐన్ స్టీన్.. ఈ పేరు వినగానే చింపిరి జుత్తుతో కనిపించే ఓ పెద్దాయన గుర్తొస్తాడు కదా. కాస్తంత చదువుకొని ఉంటే శక్తి నిత్యత్వ సూత్రం E = mc² గుర్తొస్తుంది. ఇంకా.. సాధారణ సాపేక్షత సిద్ధాంతం గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఐన్ స్టీన్ కేవలం భౌతికశాస్త్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన శాంతికాముకుడు, రాజకీయ కార్యకర్త, చురుకైన జాత్యహంకార వ్యతిరేకి, నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన జీవితం నుంచి, మిత్రులకు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి ఆయన చెప్పిన జీవన సూత్రాలను ఈరోజు తెలుసుకుందాం. మీ సమయాన్ని, కృషిని ముఖ్యమైన విషయాలపై వెచ్చించండి మనం ఏదైనా పని చేయాలంటే శక్తిని వెచ్చించాలి. అలాగే రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి మానసిక శక్తిని వెచ్చించాలి. ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తినాలనే దాని దగ్గర్నుంచి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆఫీస్ కు ఎలా వెళ్లాలి లాంటి వాటికోసం మానసిక శక్తిని వెచ్చించడం వల్ల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. అందుకే చాలామంది టాప్ అచీవర్స్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాథాన్యం ఇవ్వరు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు మంగలి దగ్గరకు సమయం వృథా చేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే ఆ చింపిరి జుట్టు. ఇక ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎప్పడూ బ్లూ జీన్స్ మాత్రమే ధరిస్తాడు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ జుకర్ బర్గ్ కూడా అంతే. ఏ డ్రెస్ వేసుకోవాలనే నిర్ణయం కోసం తమ మానసిక శక్తిని వెచ్చించకుండా ముఖ్యమైన నిర్ణయాల కోసం ఆదా చేసుకుంటారు. ఎంత కష్టమైనప్పటికీ మీరు ఇష్టపడే పనులే చేయండి ఐన్ స్టీన్ అంటే కేవలం భౌతిక శాస్త్రం మాత్రమే కాదు. ఆయన వయోలిన్ వాయిస్తాడు. పడవ కూడా నడుపుతాడు. తనకు మనసు బాలేనప్పుడు, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆయనీ పనులు చేస్తాడు. అలాగని ఐన్ స్టీన్ గొప్ప సెయిలర్ కాదు. కనీసం ఈత కూడా రాదు. పడవ బోల్తాకొట్టి మునిగిపోతుంటే జాలర్లు కాపాడిన సందర్భాలున్నాయి. అయినా ఎందుకు సెయిలింగ్ చేస్తాడంటే... ‘‘సముద్రంలో విహారయాత్ర ప్రశాంతతనిస్తుంది. విభిన్న దృక్కోణాలనుండి ఆలోచించడానికి అద్భుత అవకాశాలు కల్పిస్తుంది’’ అని ఆయనే చెప్పాడు. అందుకే మీ సబ్జెక్ట్ తో పాటు మీరు ఆనందించే ఒక హాబీని అలవాటు చేసుకోండి. అందులో మీరేం నిష్ణాతులు కావాల్సిన అవసరంలేదు. అది మీకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఫలితంగా మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు. పజిల్ మైండ్‌సెట్‌ను కలిగి ఉండండి. జీవితంలో అనేకానేక సమస్యలు వస్తుంటాయి. వాటికి భయపడి పారిపోతే జీవితం దుర్భరంగా మారుతుంది. సమస్యలను పజిల్ లా చూసి పరిష్కరించుకునే మైండ్ సెట్ ఉంటే వాటిని పరిష్కరించడానికి మీరు కొత్త విధానం గురించి ఆలోచించవచ్చు. ఐన్‌స్టీన్ అలాగే చేసేవాడు. తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక పజిల్‌గా చూసి పరిష్కరించుకునేవాడు. ఉదాహరణకు ఐన్ స్టీన్ కు ముందు చాలామంది శాస్త్రవేత్తలు కాంతి వేగంతో కదిలే వస్తువులను చూశారు. కానీ ఐన్‌స్టీన్ మాత్రమే దాన్ని ఒక పజిల్ లా చూశాడు. సాపేక్ష సిద్ధాంతంతో పరిష్కరించాడు. అందుకే తప్పొప్పుల గురించి ఆలోచించకుండా పజిల్ పరిష్కారంపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని ఆకర్షించే విషయాల గురించి లోతుగా ఆలోచించండి ‘‘మీకు ఆసక్తిని కలిగించే ప్రశ్న ఎదురైతే సంవత్సరాల తరబడి దాన్నే పట్టుకుని ఉండండి. లోతుగా అన్వేషించండి. దానిపై పట్టు సాధించండి. అంతేతప్ప సులువుగా అందే విజయాలతో సంతృప్తి చెందకండి’’ అని ఐన్ స్టీన్ కూడా ఒక లేఖలో చెప్పారు. అంతేకాదు.. ‘‘సమస్య క్లిష్టతను చూసి కుంగిపోకూడదు. ప్రయత్నిస్తే దేన్నయినా అర్థం చేసుకోవడం కష్టమేం కాదు. కావాల్సిందల్లా పట్టువిడవని ప్రయత్నం మాత్రమే’’ అని తన స్నేహితుడు డేవిడ్ బోమ్ కు రాసిన ఉత్తరంలో చెప్పాడు. ఉదాహరణకు నేను ఎస్వీ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ప్రపంచంలో అత్యధిక డిగ్రీలున్న వ్యక్తి. కానీ ఏ ఒక్క సబ్జెక్ట్ లోనూ లోతైన అవగాహన లేదు. దీన్నే హారిజంటల్ లెర్నింగ్ అంటారు. అంటే.. అన్నీ పైపైన నేర్చుకోవడం. నేనేమో పాతికేళ్లుగా ‘జీనియస్’ అనే ఒకే పదాన్ని పట్టుకుని ఉన్నా. దాని పూర్వాపరాలు, లోతుపాతులు అర్థం చేసుకునేందుకు, పిల్లల్లోని జీనియస్ ను వెలికితీసే మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. దీన్నే వర్టికల్ లెర్నింగ్ అవసరం. ఏ రంగంలోనైనా పట్టు సాధించి, పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే ఈ వర్టికల్ లెర్నింగ్ అవసరం. రాజకీయాలు మిమ్మల్ని ఆవేశంతో లేదా నిరాశతో నింపనివ్వవద్దు. మనం రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలు మనల్ని నిత్యం అనేక విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాగని ఆ రాజకీయాల్లో మునిగి, మీ లక్ష్యాన్ని జారవిడుచుకోకండి. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఇజ్రాయిల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోమని ఐన్ స్టీన్ ను కోరారు. ‘‘రాజకీయాలు తాత్కాలికం. కానీ నా ఫార్ములాలు శాశ్వతం’’ అంటూ ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. జీవితం ప్రశాంతంగా సాగాలంటే ఈ సూత్రాన్ని పాటించాలి. సోషల్ మీడియా కాలంలో ఇది చాలా అవసరం. స్నేహితుడు, పరిచయస్తుడు లేదా పూర్తిగా అపరిచితుడు చేసిన పోస్ట్ వల్ల ఎలా కోపంతో ఊగిపోయామో లేదా గంటలు గంటలు వాదించామో ఒక్కసారి గుర్తుచేసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఎవరి అభిప్రాయమూ మారదని తెలిసినా అలా సమయం వృథా చేస్తూనే ఉంటాం. మీరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే అందులో సమయం వెచ్చించండి, లేదంటే దాని మానాన దాన్ని సాగనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. అధికారానికి గుడ్డి విధేయత సత్యానికి అతి పెద్ద శత్రువు నోబెల్ గ్రహీత జోహన్నెస్ స్టార్క్ వంటివారు కూడా ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని వ్యతిరేకించడంతోపాటు, దానికి వ్యతిరేకంగా ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి జాతీయవాదాన్ని చేర్చి ఐన్ స్టీన్ పై దాడి ప్రారంభించారు. ఈ కుతంత్రాలు హాస్యాస్పదమైనవి, హానిచేయనివిగా ఐన్ స్టీన్ మొదట భావించినప్పటికీ, వాటిని తట్టుకోలేక అమెరికా పారిపోవాల్సి వచ్చింది. అందుకే "అధికారానికి గుడ్డిగా విధేయత చూపడం సత్యానికి అతిపెద్ద శత్రువు" అని చెప్పాడు. సోషల్ మీడియా కాలంలో, ఫేక్ న్యూస్ యుగంలో ఇది మరింత ముఖ్యమైనది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు, అధికారంలో ఉన్నవారి చుట్టూ మేధావులు కూడా చేరి భజనలు చేయడం మీరు గమనించే ఉంటారు. అలా చేయడం ‘మంద మనస్తత్వం’, ‘సామూహిక పిచ్చితనం’ అంటాడు ఐన్ స్టీన్. అందుకే అధికారాన్ని గుడ్డిగా విధేయత చూపకండి. విమర్శనాత్మక దృష్టితో చూడండి. సైన్స్, సత్యం, విద్య అందరికీ... కొందరికి మాత్రమే కాదు 1930లలో వలస వెళ్లి 1940లో పౌరసత్వం పొందిన తర్వాత కూడా ఐన్‌స్టీన్ తరచుగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవాడు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గొంతు విప్పేవాడు. అందుకే FBI 1932లో ఐన్‌స్టీన్‌పై ఒక ఫైల్‌ను ప్రారంభించింది. అయినా ఆయన అదరలేదు, బెదరలేదు. అమెరికాలోని తొలి నల్లజాతి కళాశాల అయిన లింకన్ యూనివర్శిటీని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చాడు. "సత్యం కోసం శోధించే హక్కు, సత్యమని భావించే వాటిని ప్రచురించి, బోధించే హక్కు" ఉండాలని ఉద్యమించాడు. సైన్స్ ద్వారా వెలికితీసిన ఆవిష్కరణలు, ఫార్ములాలు ఏ జాతికి, దేశానికి లేదా వర్గానికి చెందినవి కావు, మానవాళి అందరికీ చెందినవని ఎలుగెత్తి చాటాడు. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్ గా మారుతున్న కాలంలో ఈ దృక్పథం మరింత అవసరం. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
గౌరవనీయులైన ఛాన్సలర్ శ్రీ గిరిధర్ మాలవ్య, వైస్– ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ జైన్ తదితరులకు నమ స్కారం. 103వ స్నాతకోత్స వానికి ముఖ్య అతిథిగా పాల్గొ నడం నాకు దక్కిన గౌరవం. ఈ రోజు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జ్ఞాపకాల పుస్త కంలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది. తరగతి గదులనూ, పరీక్షలనూ దాటుకొని వాస్తవ ప్రపంచంలోకి మీ ప్రయాణం ప్రారంభమయ్యే రోజు ఇది. ఈ తరుణంలో రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారతదేశం ఎదుర్కొనే సవాళ్లను, లభించే అవకాశాలను పరిశీలిద్దాం. విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి. గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్‌స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము. విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమ ర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి. క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్‌లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట! ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం. అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్‌పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే. భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక సలహా దారు ఆచార్య అజయ్ కుమార్ సూద్ ప్రసంగ సంక్షిప్త రూపం. అనువాదం: ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు) - ఆచార్య అజయ్ కుమార్ సూద్ -
అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం
సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఇప్పటికీ కాసింత సరదాగా ఉండేందుకు అర్హులమే అని నా అభిప్రాయం. నిస్సందేహంగా మిగిలిన 357 రోజుల్లో అంటే మున్ముందు జరిగే కార్యక్రమాలు మనల్ని ఉద్వేగంతో ముంచెత్తుతాయి. కానీ ఇప్పటికైతే మనం కాస్త తేలిగ్గానే ఉండగలం. కాబట్టి ఇంటర్నెట్ నుంచి నేను కూడబెట్టిన కొన్ని రత్నాలను మీతో పంచుకోనివ్వండి. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి అల్బర్ట్ ఐన్‌స్టీన్ పలుకులు. ‘ఈ=ఎంసీ స్క్వేర్’ అనే ఆయన సుప్రసిద్ధ సూత్రీకరణను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయాను. కానీ ఆయనకు సంబంధించిన ఇతర వివే కంతో నేను అనుసరించి సాగుతాను. ఆయనకు చెందిన ఈ కోణం మనకు పెద్దగా తెలియకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మనకు పెద్దగా తెలియని ఐన్‌స్టీన్ గురించి మీకు చెప్పనివ్వండి. ఐన్‌స్టీన్ చెప్పారంటూ కీర్తిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాల్లోని విశేషమైన ఉదాహరణలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఈ సమయంలో నా మనసును విశే షంగా ఆకర్షించిన ఉల్లేఖనలను నేను ఎంపిక చేసుకుంటాను. ‘అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అహంకారం’. ‘ఏ మతిహీనుడైనా తెలుసుకోవచ్చు, విషయమేమిటంటే దాన్ని అర్థం చేసు కోవాలి’. ‘బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివైనవారు పట్టించుకోకుండా ఉంటారు’. ‘నేను నేర్చుకునేదానికి అడ్డుతగిలే ఒకే ఒక విషయం ఏమిటంటే, అది నా చదువు మాత్రమే’. ‘మూర్ఖత్వానికీ, మేధాతనానికీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, మేధాతనానికి దానివైన హద్దులుంటాయి’. ‘విజ్ఞానానికి ఏకైక వనరు అనుభవమే’. నాకు బాగా ఇష్టమైనవాటిల్లో రెండు మరీ సార వంతంగా ఉండి, ముక్కుసూటిగా ఉంటాయి. మొదటిది ఇదీ: ‘మీరు దాన్ని సులభంగా వివరించలేనట్లయితే, దాన్ని మీరు తగినంత అర్థం చేసుకోలేరు’. రెండోది ఇదీ: ‘చిలిపితనం వర్ధిల్లాలి! ఈ ప్రపంచంలో ఇదే నన్ను సంరక్షించే దేవదూత’. ఇప్పుడు ఐన్‌స్టీన్ చెప్పినవాటిల్లో నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులకు వర్తించే అంశాలకు వస్తాను. ఉదాహరణకు, మన రాజకీయ నేతలు వాటిని ఉపయుక్తంగా వాడుకునే సలహాలు ఆయన ఇచ్చారు. ‘సమాధానాలు ఉన్న వ్యక్తులు చెప్పేది వినవద్దు, ప్రశ్నలు ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రమే వినాలి’ అని ఆయన అన్నారు. ‘ఆలోచన లేకుండా అధికారాన్ని గౌర వించడం అనేది సత్యానికి మహా శత్రువు’ అని ఐన్‌స్టీన్ చెప్పింది మరింత ప్రాసంగికమైనది. ఐన్‌స్టీన్ వివేకంలో ఎక్కువ భాగం మన లాంటి సామాన్యులను లక్ష్యంగా చేసుకున్నది. ‘మీ జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఏదీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి ఏమిటంటే ప్రతిదీ అద్భుతమే అన్నట్టుగా.’ సులభంగా అలిసిపోయే వారికీ, లేదా ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో నిస్పృహ చెందేవారికీ కూడా ఒక హామీ ఉంటుంది. ‘మీరు నిజంగా ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టొద్దు. అన్ని వాస్తవాలు చేతిలో ఉన్న వ్యక్తులకంటే పెద్ద స్వప్నాలు కనే వ్యక్తి చాలా శక్తి మంతుడు.’ బహుశా, తడబడటాన్నీ, పడిపోవడాన్నీ అధిగమించాలంటే ఇదే మార్గం. ‘జీవితం అనేది సైకిల్ స్వారీ లాంటిది. మీ సమతౌల్యాన్ని సాధించాలంటే, మీరు ముందుకు కదులుతూనే ఉండాలి.’ ఐన్‌స్టీన్ చెప్పిన కొన్ని విషయాలను తీసుకుంటే, ఆయన 2023 నాటి భారతదేశాన్ని మనసులో ఉంచుకుని చెప్పారా అని మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. దీన్ని గురించి ఆలోచించండి: ‘హాని తలపెట్టేవారి వల్ల ప్రపంచం ప్రమాదకరంగా లేదు, దానికేసి చూస్తూ కూడా ఏమీ చేయకుండా ఉండటం వల్ల ప్రమాదం ఉంటోంది’. ఇది కూడా చూడండి: ‘నిత్యం విశ్రాంతి లేనితనంతో వచ్చే విజయం కంటే కూడా ప్రశాంతమైన, నిరాడంబర జీవితం మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది’. బహుశా, ఐన్‌స్టీన్‌ని ప్రపంచం కనీవినీ ఎరుగనంత గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తున్నారు. అయినా సరే, భౌతిక శాస్త్రం మీద ఉన్నంత గ్రహణ శక్తి ఆయనకు దేవుడి మీదా ఉంది. ‘యాదృచ్ఛికత అనేది దేవుడు అజ్ఞాతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం’. అలాగే చిన్న పిల్లల గురించీ, వారికి ఏది ప్రేరణ కలిగిస్తుందో ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ‘మీరు మీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, జానపద సాహస గాథలు చదివి వినిపించండి. మీరు వారిని మరింత తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటు న్నట్లయితే, వారికి మరింత ఎక్కువ అద్భుత గాథలను చదివి వినిపించండి’. మానవుల గురించిన ఐన్‌స్టీన్ గ్రహణశక్తి ఎంత లోతైనదో, ఎంత పదునైనదోనని నాకులాగే మీక్కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించినట్లయితే– ఆయనకు తనపట్ల తనకు ఉన్న అవగాహన కూడా అంతే సరిసమానంగా పదునుగా ఉంటుందని నేను చెబుతాను. ‘ఒక గొప్ప శాస్త్రవేత్తను రూపొందించేది మేధస్సేనని చాలామంది జనం చెబుతుంటారు. వారి అభిప్రాయం తప్పు. నడవడికే దానికి కారణం’. దీన్నే ఐన్‌స్టీన్ మరింత స్పష్టంగా చెబుతారు: ‘సహజాతా లనూ, ప్రేరణనూ నేను విశ్వసిస్తాను. ఒక్కోసారి, నాకు కారణం తెలియకుండానే నేను చెప్పినది సరైనది అని భావిస్తుంటాను’. పైగా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవ డానికి ఆయన ఊహాశక్తే ఆయనకు అంతర్ దృష్టిని ఇచ్చి ఉంటుందనిపిస్తుంది. ‘నా ఊహాశక్తి ఆధారంగా స్వేచ్ఛగా చిత్రించే కళాకారుడిగా నేను ఉంటాను. జ్ఞానం కంటే ఊహ ముఖ్యమైనది. జ్ఞానం పరిమితి కలది, ఊహాశక్తి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది’. చివరగా, మహాత్మాగాంధీ గురించి ఐన్‌స్టీన్ ఇలా చెప్పారు: ‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి ఒకరు భూమ్మీద నడియాడి ఉంటారనే విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేవు’. గాంధీని ఇప్పటికే మర్చిపోతున్న తరుణంలో, అలా మర్చిపోతున్న తరాల్లో మనమే మొదటివాళ్లుగా ఉంటున్నామా? (క్లిక్ చేయండి: బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి) - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
11 ఏళ్లకే ప్రపంచ మేధావులనే మించిపోయిన బుడతడు
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బుడతడి వయసు పట్టుమని పదకొండేళ్లు. బ్రిటన్‌కు చెందిన ఈ బాలుడి పేరు కెవిన్ స్వీనే. ఇతడి వయసు కొంచెమే గాని, తెలివితేటలు చాలా ఘనం. ఐక్యూలో ఏకంగా ఐన్‌స్టీన్‌ను, స్టీఫెన్ హాకింగ్‌ను సైతం అధిగమించి, అంతర్జాతీయ మేధావులంతా అవాక్కయ్యేలా చేసిన ఘనత ఇతడిది. ఐక్యూ పరీక్షల్లో 162 స్కోర్ సాధించి, ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను తలదన్నడంతో కెవిన్‌కు అంతర్జాతీయ మేధావుల సంస్థ ‘మెన్సా ఇంటర్నేషనల్’ నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ‘మెన్సా ఇంటర్నేషనల్’లో సభ్యత్వం దక్కాలంటే, ఐక్యూ కనీసం 98 లేదా అంతకు మించి ఉండాలి. ఎడిన్‌బరోలో గత జూలై 16న జరిగిన ఐక్యూ పరీక్షకు హాజరైన కెవిన్, ఇందులో 162 స్కోర్ సాధించాడు. ఇదివరకు ఈ పరీక్షలో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ 160 స్కోర్ సాధించగా, ఐన్‌స్టీన్ ఎప్పుడూ ఈ పరీక్షకు హాజరవలేదు. అయితే, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఐన్‌స్టీన్ ఐక్యూ కూడా 160 ఉండేది. చదవండి: ఎక్కువసేపు కూర్చునే ఉంటారా? ఈ సమస్యలు తెలిస్తే.. స్థిమితంగా కూర్చోలేరేమో! -
ప్రాణాలు తీసిందీ అతనే తిండి పెడుతున్నదీ అతనే
ఆయన ఓ సైంటిస్ట్.. ఐన్‌స్టీన్‌కు స్నేహితుడు.. యుద్ధమంటే ప్రేమ.. చావు అంటే సరదా.. ఓవైపు విష వాయువులతో మారణాయుధాలను సృష్టించి.. వేలు, లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మరోవైపు ఎరువులను రూపొందించి.. మానవాళి తిండి గోస తీర్చేందుకు సాయపడ్డాడు. నోబెల్ బహుమతిని కూడా పొందాడు. ఆ సైంటిస్ట్ ఎవరో.. ఏం చేశాడో.. తెలుసుకుందామా... – సాక్షి సెంట్రల్ డెస్క్ ఐన్‌స్టీన్‌కు స్నేహితుడు అయినా.. ఆయన పేరు ఫ్రిట్జ్ హేబర్.. 1868 డిసెంబర్లో జర్మనీలోని బ్రెస్లోలో పుట్టాడు. రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. కొంతకాలం తన తండ్రికి చెందిన రసాయనాల వ్యాపారంలో పనిచేశాడు. తర్వాత పరిశోధనలపై దృష్టిపెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు ఫ్రిట్జ్ హేబర్ స్నేహితుడు కూడా. అయినా ఆయనకు భిన్న మార్గంలో నడిచాడు. హేబర్కు జాతీయవాద ఆలోచనలు ఎక్కువ, యుద్ధాలంటే మక్కువ. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ప్రభుత్వ ‘వార్ ఆఫీస్’కు కన్సల్టెంట్‌గా చేరాడు. విష వాయువులపై ప్రయోగాలతో.. జర్మనీ శత్రుదేశాలపై విజయం సాధించాలన్న లక్ష్యంతో రసాయన ఆయుధాలపై పరిశోధనలు చేసిన ఫ్రిట్జ్ హేబర్.. క్లోరిన్ గ్యాస్‌ను తయారు చేశాడు. మొదట ఆయన ఆలోచనను కొట్టిపారేసిన జర్మనీ ప్రభుత్వం.. మొదటి ప్రపంచ యుద్ధం రావడంతో ఓకే చెప్పింది. 1915లో బెల్జియంలోని వైప్రస్ నగరంలో మిత్రరాజ్యాల సైన్యాలకు, జర్మనీ దళాలకు భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో ఫ్రిడ్జ్ హేబర్ రూపొందించిన క్లోరిన్ గ్యాస్‌ను మిత్రరాజ్యాల సైన్యాలపై ప్రయోగించారు. దీంతో ఊపిరాడక గిలగిలాకొట్టుకుంటూ వేల మంది అక్కడిక్కడే చనిపోయారని అంచనా. దీంతో అక్కడ జర్మనీ దళాలు పైచేయి సాధించాయి. ►వైప్రస్ క్లోరిన్ దాడి నుంచి బతికి బయటపడిన ఓ సైనికుడు ‘అది చావుల్లోనే అత్యంత ఘోరమైన దారుణమైన చావు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. దారుణాన్ని చూడలేక భార్య ఆత్మహత్య రసాయన ఆయుధాల తయారీని హేబర్ భార్య తప్పుపడుతూ ఉండేది. అది మానుకోవాలని చాలా సార్లు ఒత్తిడి చేసింది. హేబర్ సాయంతో వైప్రస్లో విజయం సాధించడంతో జర్మనీ సైనికాధికారులు పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జరుగుతున్న చోటికి వచ్చిన హేబర్ భార్య.. అందరి ముందు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయింది. మానవాళికి చేసిన మంచి ఏమిటి? 18వ శతాబ్దం నుంచి జనాభా పెరిగిపోవడంతో ఆహార ఉత్పత్తులకు కొరత మొదలైంది. అప్పట్లో పంటల దిగుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీనిపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు నైట్రోజన్ (నత్రజని) తగిన మోతాదులో అందిస్తే.. దిగుబడులు భారీగా పెరుగుతాయని గుర్తించారు. కానీ నైట్రోజన్ ఉత్పత్తి ఎలాగనేది తెలియదు. దీనిపైనా ఫ్రిట్జ్ హేబర్ పరిశోధనలు చేశాడు. ►1909లో గాలిలోంచి నైట్రోజన్‌ను సంగ్రహించగల విధానాన్ని ఆవిష్కరించాడు. నైట్రోజన్‌ను వివిధ రసాయన పద్ధతుల్లో అవసరమైన ఎరువులుగా మార్చే ప్రక్రియలనూ అభివృద్ధి చేశాడు. దీనితో ఎరువుల ఉత్పత్తి మొదలై ఆహార పంటల దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ►ఈ–పరిశోధనలకుగాను ఫ్రిట్జ్ హేబర్ 1918లో నోబెల్ బహుమతి అందుకున్నారు. రసాయన ఆయుధాలతో మారణ హోమాన్ని సృష్టించిన మూడేళ్లకే ఇది జరగడం గమనార్హం. ఆ ఆయుధానికే తన కుటుంబం బలి ఫ్రిట్జ్ హేబర్ 1934లో చనిపోయాడు. అయితే ఆయన మొదలుపెట్టిన రసాయన ఆయుధాల ప్రయోగాలు.. హిట్లర్ తెరపైకి వచ్చాక మరింత ముందుకు వెళ్లాయి. హిట్లర్ 1940 తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో వేలాది మందిని విష వాయువులతో చంపించాడు. ఇందుకోసం ‘జైక్లోన్ బి’ అనే విషపూరితమైన వాయువును వాడారు. ►ఇలా చనిపోయినవారిలో శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉండటం.. అసలు ఆ ‘జైక్లోన్ బి’ పాయిజన్ గ్యాస్‌ను 1920లో ఫ్రిట్జ్ హేబరే తయారు చేసి ఉండటం.. విధి విచిత్రం. -
కాలంలో ప్రయాణం సాధ్యమేనా?
టైమ్ ట్రావెల్ అసాధ్యమేమీ కాదు. అదో ఇంజనీరింగ్ సమస్య. అంతే! – ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మైకియో కాకు చేజారితే మళ్లీ దొరకనిది కాలమని అందరికీ తెలుసు. కానీ టైమ్ ట్రావెలే గనక నిజంగా సాధ్యమైతే? చేజారిన క్షణాలను మళ్లీ చవిచూడవచ్చు. సైన్స్ ఫిక్షన్‌గా, కవుల కల్పనగా భాసించిన కాల ప్రయాణం సాధ్యమేనంటున్నారు సైంటిస్టులు! గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తే బాగుండని అనుకోని వాళ్లుండరు. కానీ నిజజీవితంలో అది సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. అయితే ఇంతవరకు మనిషి కల్పనలో భాగమైన టైమ్ మిషన్ ఇక ఎంతమాత్రం కల్పన కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపై ఎవరైనా కాలంలో వెనక్కు పయనించవచ్చంటున్నారు. ‘ఆహా! ఎంత శుభవార్త’అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. కాలంలో వెనక్కు పయనించడం సాధ్యమే కానీ అది ఏ టైమ్‌లైన్‌లోకి అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరని వివరిస్తున్నారు. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా! ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఐన్‌స్టీన్ స్పేస్ అండ్ టైమ్ సూత్రం నుంచి కొత్త సిద్ధాంతం వరకు గుర్తు చేసుకోవాలి. రెండు సమస్యలు ఐన్‌స్టీన్ ప్రకారం స్థలకాలాదులు వాస్తవాలు కావు. అవి సాపేక్షాలు. అసలు ఆ రెండూ కలిసి స్పేస్టైమ్గా కూడా ఉంటాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా పలువురు సైంటిస్టులు కాల ప్రయాణానికి సంబంధించిన సూత్రాలు రూపొందించారు. కానీ ఆచరణలో ఇవన్నీ విఫలమయ్యాయి. సూత్రాల వైఫల్యానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. టైమ్ మిషన్ నిర్మించడానికి నెగిటివ్ ఎనర్జీ (డార్క్ మ్యాటర్) కావాలి. కానీ మన చుట్టూ ఉన్న ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీతో తయారైనదే. అలాంటప్పుడు టైమ్ మిషన్ కోసం నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకురావాలన్నది మొదటి ప్రశ్న. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం నెగిటివ్ మ్యాటర్‌ను స్వల్పకాలం పాటు స్వల్ప పరిమాణంలో సృష్టించవచ్చు. కాలంలో ప్రయాణానికి అసలు సమస్య టైమ్ కన్సిస్టెన్సీ పారడాక్స్ (కాల స్థిరత్వ విరోధాభాసం). అంటే భూతకాలంలో ఒక సంఘటనలో మార్పు వస్తే దాని ప్రభావం వర్తమానంపై కూడా పడుతుంది. అదే సమయంలో వర్తమానంలో అప్పటికే వచ్చిన మార్పు భూతకాలం తాలూకు సదరు మార్పును జరగనీయకుండా ఆపుతుంది. మరింత సరళంగా చెప్పాలంటే మీరు టైమ్ మిషన్‌లో ఐదు నిమిషాలు వెనక్కువెళ్లి అక్కడ అదే టైమ్ మిషన్‌ను ధ్వంసం చేశారనుకోండి, అలాంటప్పుడు మీకు ఐదు నిమిషాల తర్వాత టైమ్ మిషన్ వాడే అవకాశమే ఉండదు. అలా టైమ్ మిషన్ వాడే అవకాశమే లేనప్పుడు మీరు ఐదు నిమిషాల గతంలోకే వెళ్లలేరు. దాన్ని ధ్వంసం చేయనూ లేరు. అంటే ఏకకాలంలో టైమ్ మిషన్ ఉంటుంది, ఉండదు కూడా. ఇదే కాల ప్రయాణంలో ఎదురయ్యే రెండో పరస్పర విరుద్ధ వాస్తవాల సమస్య. – నేషనల్ డెస్క్, సాక్షి పరిష్కారాలున్నాయి రకరకాల పారడాక్స్ల దృష్ట్యా కాల ప్రయాణం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు ప్రముఖ సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్. టైమ్ ట్రావెల్ నిజమైతే ఈపాటికి భవిష్యత్ మానవులు మన దగ్గరికి వచ్చేవారన్నది ఆయన అభిప్రాయం. కానీ వీటన్నింటికీ సరికొత్త సమాధానం ఉందంటున్నారు ప్రస్తుత పరిశోధకులు. ఐగార్ డిమిట్రివిక్ నొవికో అనే సైంటిస్టు ప్రకారం మనం భూతకాలంలోకి వెళ్లవచ్చు, కానీ అక్కడ ఎలాంటి మార్పులూ చేయలేం! అంటే భూతకాలంలో ప్రేక్షకులుగా మాత్రమే ఉండగలుగుతాం. అలాంటప్పుడు పారడాక్స్ల సమస్యే రాదు. అయితే పారడాక్స్ సమస్యకు అతి ముఖ్య పరిష్కారం మల్టిపుల్ హిస్టరీలు లేదా మల్టిపుల్ టైమ్‌లైన్స్ అంటారు నవీన శాస్త్రవేత్తలు. దీని ప్రకారం భూతకాలంలోకి వెళ్లవచ్చు. మార్పులూ చేయవచ్చు. కానీ ఆ మార్పులు ప్రస్తుత టైమ్‌లైన్‌లో ప్రతిబింబించవు. మీరు చేసిన మార్పులతో కొత్త టైమ్‌లైన్ స్టార్టవుతుంది. అంటే ఒక ఘటనకు అనేక చరిత్రలుంటాయి. ఈ సిద్ధాంతాన్ని పై ఉదాహరణకు అన్వయిస్తే మీరు ఐదునిమిషాల గతంలోకి వెళ్లేది మీ ప్రస్తుత టైమ్‌లైన్‌లోకి కాదు. అది మరో కొత్త టైమ్‌లైన్. అక్కడ మీరు టైమ్ మిషన్ ధ్వంసం చేసిన తర్వాతి పరిణామాలతో టైమ్‌లైన్ కొనసాగుతుంది. అంటే మీ ఐదు నిమిషాల భూతకాల ప్రయాణం తర్వాత మీకు రెండు చరిత్రలుంటాయి. ఒకటి ప్రస్తుతమున్నది, మరోటి మీరు సృష్టించినది. అయితే మన విశ్వంలో ఇలా అనేక టైమ్‌లైన్స్ ఉండటం సాధ్యమేనా? అంటే క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ఫైనల్‌గా... ‘టైమ్ ట్రావెల్ సాధ్యమే. కానీ దీనివల్ల టైమ్‌లైన్స్ మారతాయి’అన్నది ప్రస్తుత సైంటిస్టుల సిద్ధాంతం. ఇది ప్రాక్టికల్‌గా నిరూపితమవ్వాలంటే ఒక రియల్ టైమ్ మిషన్ నిర్మాణం జరగాలి. అంతవరకు ఈ సిద్ధాంత రాద్ధాంతాలు నడుస్తూనే ఉంటాయి. -
ఆ ఉత్తరంలో ఐన్‌స్టీన్ భార్య ఏం రాసిందంటే..
ఐన్‌స్టీన్ భౌతిక శాస్త్రవేత్త. భౌతిక శాస్త్రవేత్తతో పాటు ఆయనలో ఒక ప్రవక్తను, ఒక కాలజ్ఞుడిని చూసిన ఒకే ఒక వ్యక్తి ఆయన భార్య ఎల్సా! ఆమె తన అసహోదరుడు (కజిన్) ఎరిక్‌కి 1934 లో రాసిన ఒక ఉత్తరంలో ఐన్‌స్టీన్‌లోని భవిష్యదృష్టి గురించి ప్రస్తావించారు. ‘జైలు నుంచి విడుదల అయిన అడాల్ఫ్ హిట్లర్ అనే ఆ వ్యక్తి మారణహోమం సృష్టించి జర్మనీలోని యూదులందరినీ లక్షలాదిగా హతమార్చే అవకాశం ఉంది’ అని ఐన్‌స్టీన్ నాతో అన్నారు. ఆయన ఏదైనా సరిగ్గా ఊహించగలరు’ అంటూ రాసిన ఆ ఉత్తరం ఇప్పుడు యు.ఎస్.లో వేలానికి రావడంతో ఐన్‌స్టీన్‌తో ఎల్సాకు ఉన్న ‘అన్య విషయాల అన్యోన్యత’ ఆసక్తిని కలిగించే విశేషం అయింది. ఐన్‌స్టీన్‌కు ఎల్సా రెండో భార్య. ఆమె పూర్తిపేరు ఎల్సా లోవెంథాల్. మొదటి భార్య మిలేవా 1919లో చనిపోవడంతో పెద్దవాళ్లు ఎల్సాను ఐన్‌స్టీన్‌కు ఇచ్చి చేశారు. అప్పటికి ఐన్‌స్టీన్ వయసు 40 ఏళ్లు. ఎల్సా వయసు 43 ఏళ్లు. భర్త కన్నా భార్య మూడేళ్లు పెద్ద. ఒక అంగరక్షకురాలిగా మాత్రమే ఆమె తన భార్య పాత్రను పోషించారు. ఐన్‌స్టీన్ అప్పటికే శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడు. నిరంతరం దీర్ఘాలోచనలో ఉండేవారు. ఆయన్ని కలిసేందుకు కుప్పలు తెప్పలుగా కుహనా మేధావులు, ఆహ్వానం లేనివారి వస్తుండేవారు. వారి నుంచి ఐన్‌స్టీన్‌కు ఏకాంతం కల్పించడం కోసం ఎల్సా గేటు దగ్గరే కాపలా ఉండేవారు. ఐన్‌స్టీన్ లేరని చెప్పి పంపించేవారు. కొన్నిసార్లు ఎల్సా ఆయనకు ఆంతరంగిక సలహాదారుగా మారేవారు. మాతృభూమిలో సొంత ఇల్లు లేకుంటే ఎలా అని ఆ మరో జగత్ మేధావి చేత జర్మనీలో 1929లో ఒక ఇల్లు కట్టించిన ఘనత ఆమెదే అయినా జర్మనీలో ఉండేందుకు ఆయన విముఖంగా ఉండేవారు. అందుకు హిట్లర్ ఒక కారణం. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించిన మొదటి ప్రపంచ యుద్ధ సైనికుడిగా అరెస్ట్ అయి, జైల్లో శిక్షను అనుభవించి 1924లో హిట్లర్ విడుదలయీ రాగానే ఐన్‌స్టీన్ ఎల్సాతో అన్నమాట.. ‘ఇక కష్టమే’ అని. ఆ తర్వాతి మాట ‘యూదుల్ని బతకనివ్వడు’ అని. 1925లో హిట్లర్ ‘నాజీ’ పార్టీ పెట్టాడు. 1933లో జర్మనీకి అధినేత అయ్యాడు. ఆ యేడాదే ఐన్‌స్టీన్, ఎల్సా అమెరికా వెళ్లిపోయారు. ఆ సమయంలోనే.. జర్మనీలో యూదులపై హిట్లర్ పాల్పడబోయే దారుణాల గురించి భార్య దగ్గర మాట్లాడేవారు ఐన్‌స్టీన్. అందుకు కారణాలు విశ్లేషించేవారు. భర్తలో ఆమె ఒక కాలజ్ఞాని కనిపించింది అప్పుడే. ఆ సంగతినే తన కజిన్‌కి ఉత్తరంలో రాశారు. ‘యూదులపై జరగబోయే హింసాత్మక అకృత్యాల గురించి పదేళ్ల క్రితమే (1924) ఐన్‌స్టీన్ ఊహించారు’ అని 1934లో ఆమె రాసిన ఆ ఉత్తరంలో ఉంది! ఐన్‌స్టీన్ తన భార్యతో అన్నట్లే జరిగింది. 1939–45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మొత్తం కోటీ 20 లక్షల మందిని ఊచకోత కోయించగా వారిలో 60 లక్షల మంది యూదులే! అదృష్టమో, దురదృష్టమో ఆ ఘోరకలికి మూడేళ్ల ముందే 1936లో తన అరవయ్యవ యేట ఎల్సా చనిపోయారు. యుద్ధం ముగిసిన పదేళ్లకు 1955లో ఐన్‌స్టీన్ తన డెబ్బయ్ ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఎల్సా ప్రిన్స్టన్ (న్యూజెర్సీ) నుంచి జర్మనీలో ఉన్న తన కజిన్‌కి రాసిన ఆ ఉత్తరం యూ.ఎస్.లోని ప్రముఖ సంస్థ నేట్ డి శాండర్స్‌లో ప్రస్తుతం వేలానికి ఉంది. ఒక అజ్ఞాత వ్యక్తి ఆ ఉత్తరాన్ని వేలానికి ఉంచారు. -
బోస్-ఐన్స్టీన్లు ఊహించినట్టుగానే అంతరిక్షంలో..
పారిస్ : శతాబ్ధం కిందట భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్, జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్లు ఊహించిందే నిజమైంది. సాధారణంగా అణువులు సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా స్థితుల్లో ఉంటాయి. అయితే వీటితోపాటూ ఐదో స్థితి కూడా ఉంటుందని బోస్-ఐన్స్టీన్లు ముందుగానే ఊహించారు. ఈ స్థితినే బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్గా పిలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంతరిక్షంలో నాసా శాస్త్రవేత్తలు తొలిసారిగా ఐదవ స్థితి(బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్)ని గమనించారు. దీంతో విశ్వానికి సంబంధించి అనేక చిక్కుముడులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఒక నిర్దిష్ట మూలకం అణువులను సంపూర్ణ సున్నా ఉష్ణోగ్రతకు(0 కెల్విన్, -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్లు) చల్లార్చినప్పుడు ఒక పదార్ధం బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ల స్థితికి చేరుకుంటుందని వీరు అంచనా వేశారు. అటువంటి స్థితిలో, ఒక మూలకంలోని అణువులు క్వాంటం లక్షణాలను కలిగి ఉన్న ఒకే స్థితిలోకి మారుతాయి. ఈ సమయంలో అణువులు క్వాంటం లక్షణాలతో, ఒకే తరందైర్ఘ్యంతో ఒకే ఎన్టిటీగా మారిపోతాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా శాస్త్రవేత్తలు బీఈసీలపై జరుగుతున్న పరీక్షల ఫలితాలను గురువారం వెల్లడించారు. కాగా, క్వాంటం సిద్దాతంత పరిణామ క్రమంలో ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఐన్‌స్టీన్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక సత్యేంద్రనాథ్ బోస్ 1920 లో క్వాంటం మెకానిక్స్‌లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్ సిద్ధాంతానికి ఎనలేని కృషి చేశారు. ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ను 1954లో ప్రదానం చేసింది. -
వర్సిటీల్లో స్వేచ్ఛ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్ చాలెంజ్ విసరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ నిలయాలుగా ఎప్పుడు మారుతాయని ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం కోరిక మేరకు కుటుంబసభ్యులు ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్ చాలెంజ్ విసిరినందుకు సంతోషం. ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా.. బోధన, రచన, పత్రిక రంగాల్లో స్వేచ్ఛ ప్రజల సహజ, ఉన్నత వికాసానికి పునాది వంటివి’. అయితే, మన వర్సిటీలు అటువంటి వాస్తవమైన స్వేచ్ఛా నిలయాలుగా ఎప్పుడు మారతాయి?’అని పేర్కొన్నారు. -
గురుత్వాకర్షణ శక్తి ఐన్‌స్టీన్ కనుగొంటే.. మరి న్యూటన్
-
అయ్యో.. ఇన్ని రోజులు న్యూటన్ అనుకున్నానే?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి గల కారణాలపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో రంగం కుదేలవడానికి గల కారణాలు చెప్పి అబాసు పాలవగా.. తాజాగా మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తన వ్యాఖ్యలతో నవ్వుల పాలయ్యారు. గురువారం ఓ సమావేశానికి హాజరైన గోయల్.. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశంగా అడుగులు వేస్తోందని, దానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత జీడీపీ ఎలా ఉన్నా తమ లక్ష్యానికి ఏ మాత్రం అడ్డుకాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ‘ఇంట్లో కూర్చొని టీవీల్లో చూస్తూ లెక్కలు వేయకండి. అసలు గణితాన్ని మర్చిపోండి. ఐన్‌స్టీన్ గురత్వాకర్షణ శక్తిని గణితాన్ని ఉపయోగించి కనుక్కొలేదు. ఒక వేళ గణితం ద్వారానే వెళ్లినట్లయితే ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగేది కాదని నా అభిప్రాయం’ అంటూ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే గోయల్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు మండిపడుతుండగా మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్ అని ఐన్‌స్టీన్ కాదనే విషయాన్ని కేంద్ర మంత్రి తెలుసుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. కాంప్లెక్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లేనిదే సైన్స్ లేదనే విషయాన్ని గోయల్ గుర్తుంచుకోవాలని మరికొందరు సూచించారు. జీడీపీతో సంబంధం లేకుండా బలమైన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ‘ఇలాంటి మేధావుల చేతిలో భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ల డాలర్లేంటి పది ట్రిలియన్లకు వెళుతుంది’ , ‘అయ్యో ఇన్ని రోజులు గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నది న్యూటన్ అనుకున్నా.. కాదా?’అంటు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, దేశంలో మిలీనియల్స్ (2000 సంవత్సరం, ఆ తర్వాత పుట్టిన వారు) ఎక్కువగా ఓలా, ఉబర్ వంటి వాటిని వినియోగిస్తున్నారని, అందుకే కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌తో సహా నెటిజన్లు మండిపడిన విషయం తెలిసిందే. -
భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్
చికాగో: భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్) అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్ ప్రైజ్’కు ఈ ఏడాది భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్ ఎంపికయ్యారు. అక్టోబర్ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్‌స్టీన్ ప్రైజ్–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అభయ్ ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అభయ్ మాట్లాడుతూ... ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏపీఎస్ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్‌లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేర్చుకున్న భౌతికశాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడింద’న్నారు. 1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన అభయ్... లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. -
ఎం.ఎన్. రాయ్‌కి ఐన్‌స్టీన్ మద్దతు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత, సాపేక్షతా సిద్ధాంత కర్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ (1879–1955)కు భారతీయ ప్రముఖుల్లో రవీం ద్రనాథ ఠాగోర్ బాగా తెలుసు. ఆ తరువాత మహాత్మాగాంధీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరి పారు. మరో ఇద్దరు ముగ్గురు సైంటిస్టులతో పరిచయం వున్నది. అయితే సైంటిస్టు కాని మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్ (1887–1954)తో పరిచయం వుండటం ఆశ్చర్యకరమైన విషయం. 1930లో ఎమ్.ఎన్. రాయ్ 17 సంవత్సరాల తర్వాత బొంబాయిలో మహమ్మూద్ అనే మారుపేరుతో అడుగు పెట్టాడు. ఆయన 1920 నుంచి 1930 వరకు ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, రష్యాలలో ఉన్నాడు. అప్పట్లో భారత స్వాతంత్య్ర పోరాటాన్ని విదేశాల నుండే వివిధ రీతులలో జరిపించారు. కానీ, 1931 జూలై 31న బొంబాయిలో బ్రిటిష్ పోలీసులు ఎమ్.ఎన్.రాయ్‌ను అరెస్టు చేశారు. ఆ వార్త తెలిసి ఐన్‌స్టీన్ వెంటనే భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి పూర్వక లేఖ రాశారు. అది జర్మన్ భాషలో ఉన్నది. జెరూసలేంలోని ఐన్‌స్టీన్ పురావస్తు పుస్తక పరిశోధనాలయంలో ఉంది. ఎమ్.ఎన్.రాయ్‌ను హింసిం చకుండా మానవ దృక్పథంతో చూడాలని కోరారు. మేథావులపై క్రూరంగా పగతీర్చుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అప్పటికే ఐన్‌స్టీన్ జర్మనీలో హిట్లర్ భయానికి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎమ్.ఎన్.రాయ్‌తో పరి చయం అయిందో తెలియదు. కానీ ఒక అసాధారణ సైంటిస్టు అలా రాయటం ఆశ్చర్యకరమైన విషయం. సాధారణంగా ఐన్‌స్టీన్ ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోడు. దీనిని బట్టి వారిరువురికీ సన్నిహిత పరిచయం ఉండి ఉండాలి. ఎమ్.ఎన్.రాయ్ సైన్సు పట్ల తీవ్రస్థాయిలో ఆసక్తి కనబరిచినట్లు సైంటిస్టులతో పరిచయం ఉన్నట్లు జైలు నుంచి ఆయన రాసిన లేఖలను బట్టి తెలుస్తున్నది. జైలులో ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాత్విక ఫలితాలు అనే అంశాన్ని ఐదువేల పేజీలలో రాశారు. అందులో ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని చర్చించారు. తనకున్న సందేహాలను రాసి పారిస్‌లో ఉన్న ఎలెన్‌కు పంపి ఆయా సైంటిస్టులకు అందజేసి సమాధానాలు తెప్పించమన్నారు. దానినిబట్టి కూడా సైన్స్ లోతుపాతులు గ్రహించిన వ్యక్తిగా స్పష్టపడింది. కొందరు సైంటిస్టులు సమాధానాలిచ్చారు కూడా. జైలులో రాసిన రచనల సారాంశాన్ని ‘సైన్స్ అండ్ ఫిలాసఫీ’ పేరిట 1948లో చిన్న పుస్తకంగా వెలువరించారు. మిగిలిన రచన ఎడిట్ చేసి ప్రచురించవలసి ఉంటుందని ఆయన అనుచరుడు సైన్సు రచయిత అమృతలాల్ బిక్కుషా అభిప్రాయపడ్డారు. ఐన్‌స్టీన్‌తో ఎమ్.ఎన్.రాయ్ మొదటి భార్య ఎవిలిన్ (1892–1970)కు పరిచయం ఉంది. అణ్వాయుధ నిషేధ ఉద్యమం చేపట్టిన ఐన్‌స్టీన్ విరాళాల కోసం ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆమె కొంత వరకు సహాయపడింది. ఎమ్.ఎన్.రాయ్‌తోపాటు ఎవిలిన్ కూడా 1926 వరకు యూరోప్‌లో ఉంది. అప్పుడు ఐన్‌స్టీన్‌తో పరిచయం ఉండే అవకాశం ఉన్నది. ఆ పరిచయం వల్లనే 1950లో ఐన్‌స్టీన్ విరాళాలకై అమెరికాలో ఉంటున్న ఎవిలి న్కు విజ్ఞప్తి చేశాడు. వీటన్నిటి బట్టి చూస్తే ఎమ్.ఎన్.రాయ్ యూరోప్‌లో ఐన్‌స్టీన్‌ను కలిసి ఉండవచ్చునని భావిస్తున్నారు. రీజన్–రొమాంటిసిజమ్, రివల్యూషన్ అనే శీర్షికతో రెండు సంపుటాలు ఎమ్.ఎన్.రాయ్ ప్రచురించినప్పుడు సుప్రసిద్ధ సైకాలజిస్టు ఎరిక్ ఫ్రాం తన పుస్తకం సేన్ సొసైటీలో–ఎవరైనా యూరోప్ పునర్వికాసాన్ని గురించి అవగాహనకు రావాలి అంటే ఎమ్.ఎన్.రాయ్ గ్రంథం చదవమనటం పెద్ద విశేషం. ఈ విధంగా ఒక వైపున రాజకీయాలలో నిమగ్నుడై సతమతమైనా, మరొకవైపు సైన్సు పట్ల సైంటిస్టుల పట్ల ఆసక్తి చూపటమే కాక ప్రజోపయోగకరమైన రచనలు వెలువరించటం గమనార్హం. ఐన్‌స్టీన్ – రాయ్ పరిచయాలపై లోతైన పరిశీలన జరగవలసి ఉన్నది. (మానవవాద సిద్ధాంతకర్త ఎమ్.ఎన్.రాయ్‌ని 1931 జూలై 31న ముంబైలో అరెస్టు చేసిన ఘటనపై తక్షణ స్పందనగా భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వానికి సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్ లేఖ రాసిన సందర్భంగా) -నరిసెట్టి ఇన్నయ్య సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : innaiah@gmail.com -
వేదాలు గొప్పవని హాకింగే చెప్పారు
ఇంఫాల్: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం(ఉ=ఝఛి2) కంటే మెరుగైన సిద్ధాంతం వేదాల్లో ఉన్నట్లు కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కన్నుమూసిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ విషయాన్ని చెప్పారన్నారు. ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. ‘ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం కంటే మెరుగైన సిద్ధాంతం మన వేదాల్లో ఉండొచ్చని హాకింగ్ గతంలో పత్రికాముఖంగా తెలిపారు’ అని చెప్పారు. సమావేశం అనంతరం ఈ వాదనలకు ఆధారమేంటని విలేకరులు ప్రశ్నించగా.. వాటిని కనుక్కోవాల్సిన బాధ్యత మీదేనన్నారు. ‘హిందూ మతంలోని ఆచార, సంప్రదాయాల్లో సైన్స్ మెండుగా ఉంది. ఆధునిక భారత్‌లో ప్రతీ ఆవిష్కరణ మన పూర్వీకులు సాధించిన వాటికి కొనసాగింపే’ అని సమావేశం అనంతరం హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు 2015లో ముంబైలో జరిగిన 102వ సైన్స్ కాంగ్రెస్‌లోనూ భారత్‌లో 7,000 ఏళ్ల క్రితం విమానాలు ఉండేవనీ, వాటిద్వారా ప్రజలు వేర్వేరు దేశాలకు, గ్రహాలకు వెళ్లేవారని వేదాల్లో ఉన్నట్లు ఓ పత్రాన్ని దాఖలుచేయడం వివాదానికి దారితీసింది. -
ఈ బాలికకు ఐన్‌స్టీన్ మించిన ఐక్యూ
లండన్: భారత సంతతికి చెందిన బాలిక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఐక్యూ(మేథ) పరీక్షల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా 162 పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లు ప్రపంచ ప్రఖ్యాత మేథావులు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే కూడా రెండు పాయింట్లు ఎక్కువే కావటం గమనార్హం. లండన్‌లోని చెషైర్ కౌంటీలో నివసించే ప్రవాస భారతీయుడు డాక్టర్ సూరజ్ కుమార్ పవార్ కుమార్తె రాజ్‌గౌరి పవార్. 18 ఏళ్లలోపు వారికి నిర్వహించే ఐక్యూ పరీక్షలో రాజ్‌గౌరి పాల్గొని అత్యధికంగా 162 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో మెన్సా సంస్థ రాజ్గౌరిని తమ బ్రిటిష్ మెన్సా ఐక్యూ సొసైటీ సభ్యురాలిగా చేర్చుకుంది. స్కూల్లో టీచర్లు ఇస్తున్న ప్రోత్సాహంతోనే తమ కుమార్తె ఇంతటి ప్రతిభను చాటగలిగిందని బాలిక తండ్రి సూరజ్‌కుమార్ పవార్ తెలిపారు. సాధారణంగా 140 పాయింట్లు సాధించిన వారిని జీనియస్‌గా పరిగణిస్తామని మెన్సా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20వేల మంది మాత్రమే ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్నారని వివరించింది. -
అంతరిక్షంలో ఆలాపనలు
మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్‌స్టీన్‌ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్స్టీన్కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది. తెలుసుకోవాలనుకున్నప్పుడు విజ్ఞానశాస్త్రం నన్ను సదా గజిబిజి చేసిపోయేది. పాఠశాల స్థాయిలో మొదట్లో భౌతికశాస్త్ర పాఠాలు విన్నప్పుడు అంతా గందరగోళంగానే ఉండేది. రసాయనశాస్త్రం కాస్త అర్థమైనప్పుడు ఏదో కుట్ర పన్నుతున్నట్టు ఉండేది. తర్కంతో, అంచనాలతో సాగే గణితం మాత్రం బాగుండేది. కానీ లేని సున్నాతో ఏమైనా లెక్కకట్టాలని చూస్తే దానిని మాత్రం తత్వశాస్త్రంగా పరిగణించాలి. ఇకపోతే, ఒక హోటల్ గదిలో ఈ వారంలోనే ఒక వేకువ నిశ్శబ్ద వేళ అనుకోకుండా టీవీ పెట్టి, ఒక న్యూస్ చానల్ చూస్తున్నాను. హఠాత్తుగా నన్ను వివశత్వంలో ముంచెత్తుతూ భూతభవిష్యద్వర్తమానాలు, ఇంకా అనేక భవిష్యత్తు అంచనాలు కలగలసిన కలగూరగంప వంటి, ఇంకా అంతులేని కథనాలను జోడించుకుని ఓ సైన్స్ విషయం దర్శనమిచ్చింది. గూడు కట్టినట్టున్న ఆ నిశ్శబ్దంలోనే సాహిత్య గుబాళింపు ఉన్న ఒక వాక్యం వినిపించింది. విశ్వాసానికి అతీతమైనదానిని నిరాకరించమని హేతువు చెప్పినప్పుడు మనం దేని గురించి ఎదురు చూడవచ్చునో ఆ వాక్యం చెప్పి, మనోహరమైన వాస్తవం దగ్గరకి తీసుకుపోయింది. అదే- గోళాల సంగీతం. వందకోట్ల కాంతి సంవత్సరాల క్రితం గురుత్వాకర్షణ కారణంగా రెండు కృష్ణబిలాలు డీకొన్నప్పుడు జనించిన అంతరిక్ష సంబంధమైన, మరచిపోలేని శ్రావ్యమైన సంగీతం అందులో విన్నాను. మేధావుల స్థాయిలో చెప్పాలంటే పైథాగరస్ వచ్చి ఐన్‌స్టీన్‌ను కలుసుకున్నాడు. ఖగోళంలోని రాశులన్నీ లయాత్మకంగా కదులుతున్నాయని ఆ పురాతన గ్రీకు మార్మిక గణితశాస్త్రవేత్త ఏనాడో ప్రతిపాదించాడు. ఆ రాశులన్నీ కదిలిపోతూ మనిషి చెవులకు సోకని ఒక అనుపమానమైన ఆలాపన చేస్తున్నాయని కూడా చెప్పాడాయన. కవులని సూదంటురాయి వలే ఆకర్షించే ఆ అంశమే గోళాల స్వర సమ్మేళనం. కింది తరాలవారి అద్భుత మేధస్సునూ, ఈ తరం శాస్త్రవేత్తల సాహసోపేతమైన జ్ఞానదీప్తినీ ఒక ప్రేక్షకునిలా వీక్షించే నాలాంటి వ్యక్తి బుద్ధికి ఆ నాదం పదును పెడుతుంది. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. స్థలకాలాలు, ఉనికిల సారం గురించి వినూత్న విశ్లేషణలు ఇచ్చే ఒక ప్రపంచంతో మన బుద్ధిని అనుసంధానింపచేస్తుంది. జీవితం అంటే కాలం గడిచిపోవడమే. అది ఒక శూన్యంలో అర్థంతరంగా ఎక్కడో ముగిసిపోతుంది. ఆ తరువాత ఏమవుతుందన్నది అంతుచిక్కని అంశం. దీనికి సమాధానం కేవలం నిర్దిష్ట విశ్వాసం, సిద్ధాంతాల ద్వారా లభిస్తుంది తప్ప, మనిషి మేధస్సుతో చేసే అనిర్దిష్ట ప్రయత్నంతో కాదు. కానీ, విశ్వంలో గురుత్వాకర్షణతో పాటే, మనిషి చెవికి సోకని కొన్ని శబ్దాలు ఉన్నాయని మేధస్సుతో చే సిన ప్రయత్నంతోనే ఇప్పుడు రుజువైంది. ఇంకో మాటలో చెప్పాలంటే మానవాళి అనుభవాల మౌలిక ధర్మాలు ఎక్కడెక్కడో ఉన్న ఇతర ప్రపంచాలలో కూడా ఉనికిలో ఉన్నాయి. ఇకపై శబ్దం వినడం మనిషి ఇంద్రియాలు చేసే పనులలో ఒకటి మాత్రమే కాదు, ఈ శాశ్వత ఉనికిలో కూడా దాని జాడ ఉంది. ‘లిగో’ (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రేవిటేషనల్ - వేవ్ అబ్జర్వేటరీ)బృందంలో సభ్యుడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు సబోల్క్స్ మర్కా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెప్పిన మాటను ఇక్కడ ఉటంకిస్తాను. ‘‘ఈ ఆవిష్కరణ చాలా కాలం తరువాత భౌతికశాస్త్ర పరిశోధన లు సాధించిన అతి గొప్ప పురోగతిగా నేను భావిస్తున్నాను. ఖగోళశాస్త్రంలో వేరే అన్నీ అంశాలు చర్మచక్షువులకు కనిపించేవే. ఇప్పుడు ఈ శాస్త్రానికి వినికిడి శక్తి కూడా వచ్చింది. ఇంతకు ముందు ఇలాంటి శక్తి ఏనాడూ లేదు.’’ఎంతో వాగ్ధాటితో వివరించిన ఈ అంశంలోని లోతైన ఆ భేదం గురించి ఆలోచించండి. దృష్టి మానవుల చూపు ద్వారా ఆవిర్భవిస్తుంది. అది వారి సామర్థ్యం మేరకు ప్రయాణిస్తుంది. నాదం మరెక్కడి నుంచో ఉద్భవిస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన దానిని బట్టి వంద కోట్ల కాంతి సంవత్సరాల క్రితం ఆ నాదం వెలువడింది. కన్ను ఆత్మాశ్రయం లేదా వ్యక్తి అనుభవం. చెవి బాహ్యమైనది. మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే ఉత్ప్రేక్షల గురించి, అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. అయితే తెలియని కోణం వైపు మరో కొత్త అడుగు పడే వరకు ఈ వాస్తవాన్ని కూడా తాత్కాలికమైనదిగానే పరిగణిస్తారు. అలాగే ఒక ఆవిష్కరణని తక్కువ చేసి చూడడం కూడా చాలా సులభం. ఈ ఉద్వేగంలో నేను అతిగా స్పందిస్తూ ఉండాలి. కానీ నేను ఆశావాదంలోని దోషాన్ని చూడడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్‌స్టీన్‌ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్స్టీన్కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది. ఊహకు కూడా అందని ఈ విశాల విశ్వం నిరీశ్వరవాదుల రచనలు వాదించినట్టు కొన్ని యాదృచ్చిక పరిణామాల మాలిక అనుకోవాలా? అంతకు మించి నైపుణ్యంతో మలచిన ఆకృతి అనకోవాలా? లేకపోతే ఈ భూగోళానికి అందకుండా బయట కాలానుక్రమణికలు ఉన్నాయా? కాలాన్ని వెనక్కు జరపవచ్చన్న వాగ్దానం ద్వారా మన ఊహలు ఎల్లప్పుడూ ప్రభావితమవుతూ వచ్చాయి. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భావాలను రూపుదిద్దుతున్నప్పుడు, హెచ్.జి. వెల్స్ ‘ది టైమ్ మిషన్’ను రాస్తూ ఉండేవారు. భారతీయ తత్వశాస్త్రం అన్ని వేళలా కాలాన్ని పునర్జన్మలో విశ్వాసానికి తప్పనిసరి అవ సరంగా ఒక భ్రమగా కొట్టిపారేసింది. కాలంలోని వంపును, చపలతను లిగో శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. మన మనస్సు సూచించేదానికంటే ఎక్కువ పరిమాణాలను కాలం కలిగి ఉంది. తర్వాతేమిటి? తర్వాత ఎక్కడ? జ్యోతిషశాస్త్రాన్ని ప్రస్తావించడం అనేది ఉత్కృష్ట స్థితినుంచి పరిహాసాస్పద స్థాయికి దిగజారడమే అవుతుందా? జ్యోతిషశాస్త్రానికి సైన్స్ అంత పరిపక్వత, కచ్చితత్వం ఉండదు కానీ అది సామూహిక అభద్రత కంటే ఎక్కువగా స్పష్టమైన రుజువుగా మన విశ్వాసాల్లో బలంగా నిలిచిపోయింది. మీడియాలో కనిపించే రోజువారీ లేదా వారాంతపు జోస్యాలు, అంచనాలు విస్పష్టంగానే అర్ధరహితమైనవి కానీ అన్ని సంస్కృతులను ఆదేశిస్తున్న జాతకచక్రం పట్ల పూజ్య భావం అనేది విలువ కోల్పోయిన పురాగాధనే సూచిస్తోంది. నాకు సమాధానాలు తెలియవు. ప్రశ్నలు మాత్రమే తెలుసు. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు: బీజేపీ అధికార ప్రతినిధి - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు -
'తరంగాల'ను కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో 37 మంది మనోళ్లే!
విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లకు పైగా మిస్టరీగా ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను శాస్త్రవేత్తలు గురువారం కనుగొన్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో 37 మంది భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఉండడం గమనార్హం. సుమారు దశాబ్దం కిందటే పుణెలోని ఇంటర్ యూనివర్సీటీ ఫర్ ఆస్ట్రనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందిన సంజీవ్‌దురందర్, సత్యప్రకాశ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. ఈ ప్రయోగంలో పుణె,ముంబై,బెంగళూరుకి చెందిన సుమారు 30 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్లతో గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనల నిమిత్తం ‘లేజర్ ఇన్ఫర్మేషన్ గ్రావిటేష్నల్ వేవ్ అబ్సర్వేటరీ’ (లిగో)ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని భారత్, అమెరికా సమ్యుక్తంగా నిర్వహించనున్నారు. అమెరికా 140 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను సమకూర్చనుంది. ప్రయోగంలో భాగస్వామ్యులైనా భారత శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. -
ఐన్‌స్టీన్ ‘తరంగాలు’ దొరికాయి
గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన ‘లిగో’ శాస్త్రవేత్తలు * 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న కృష్ణబిలాల నుంచి వచ్చిన తరంగాలు వాషింగ్టన్: మానవ చరిత్రలో మరో అద్భుతమైన ఆవిష్కరణ చోటుచేసుకుంది. విశ్వం పుట్టుకనాటి రహస్యాలను తెలుసుకొనగలిగే పరిశోధనకు బీజం పడింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లుగా మిస్టరీగానే ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు గురువారం ప్రకటించారు. దాదాపు 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి జన్మించి.. అంతరిక్షంలోకి విస్తరిస్తున్న ఈ తరంగాల ఉనికిని నిర్ధారించుకున్నట్లు యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కార్డోవా వెల్లడించారు. ఇప్పటివరకూ గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని.. కానీ ఆధారపూర్వకంగా తొలిసారిగా గుర్తించామని తెలిపారు. దీనిద్వారా విశ్వానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలను తెలుసుకోవచ్చని చెప్పారు. 1916లో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా లెక్కించగలిగిన గురుత్వాకర్షణ తరంగాలు.. తాము గుర్తించిన తరంగాలు కచ్చితంగా సరిపోలాయని ‘లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’లో ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ షూమాకర్ చెప్పారు. బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టుక జరిగిన నాటి పరిస్థితులను.. కృష్ణబిలాలను దీని ద్వారా పరిశోధించవచ్చని తెలిపారు. కాగా ఈ పరిశోధనలో పాలుపంచుకున్న భారత శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ అభినందించారు. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం గొప్ప ముందడుగని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏమిటీ పరిశోధన..? నక్షత్రాలకు, కృష్ణ బిలాలకు గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నక్షత్రాలు, కృష్ణబిలాలు ఢీకొన్నప్పుడుగానీ, పేలినప్పుడుగానీ గురుత్వాకర్షణ తరంగాలు వెలువడతాయని అంచనా. అంతరిక్షంలో స్థల-కాలాలను ప్రభావితం చేసే అతి భారీ ద్రవ్యరాశుల గమనాన్ని వీటి ద్వారా నిర్ధారించవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలను ఏదీ అడ్డుకోలేదు. నీటిలో రాయి వేసినప్పుడు ఏర్పడే అలల్లా ఇవి విస్తరిస్తాయని అంచనా. ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో ‘లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’ పేరిట పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. గురుత్వాకర్షణ తరంగాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నా గుర్తించగలిగే అత్యాధునికమైన రెండు అతి భారీ డిటెక్టర్లను హాన్ఫోర్డ్, లివింగ్స్టన్ ప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించారు. వీటి సహాయంతో సుదూర అంతరిక్షంలో 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాలపై పరిశోధన చేశారు. ఈ కృష్ణబిలాలు ఒక్కోటి సూర్యుడికి దాదాపు 36 రెట్లు పెద్దవి. అవి ఢీకొన్నప్పుడు వెలువడి స్థల-కాలాల్లో అలల్లాగా విస్తరించిన గురుత్వాకర్షణ తరంగాలు గత ఏడాది సెప్టెంబర్ 14న భూమిని చేరాయి. ఆ రోజు సాయంత్రం 4.51 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.21 గంటలకు) ‘లిగో’లోని పరికరాలు గురుత్వాకర్షణ తరంగాలకు తొలి ఆధారాన్ని సంపాదించాయి. తొలుత లివింగ్‌స్టన్‌లో ఉన్న డిటెక్టర్ ఈ తరంగాలను గుర్తించింది. అక్కడికి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హాన్‌ఫోర్డ్‌లోని డిటెక్టర్ 7.1 మిల్లీ సెకన్ల తర్వాత గుర్తించింది. ఈ రెండు చోట్ల తరంగాల రీడింగ్ ఒకేస్థాయిలో నమోదైంది కూడా. అయితే ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించి, నిర్ధారించుకునేందుకు 5 నెలల సమయం పట్టింది. అయితే ఈ గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన పరోక్ష ఆధారాలను 1974లోనే ఓ న్యూట్రాన్ నక్షత్రంపై పరిశోధన చేసినప్పుడు గుర్తించారు. -
స్టాక్స్ వ్యూ
appకీకహానీ... వాల్నట్ బోయే తరాల్ని టెక్నాలజీ బద్దకస్తులుగా మారుస్తుందన్నాడు ఐన్‌స్టీన్. ఇప్పుడీ మొబైల్ యాప్స్ ఆయన మాటల్ని నిజం చేస్తున్నాయి. ఇదిగో... ఈ వాల్నట్ ఫైనాన్షియల్ యాప్ కూడా అలాంటిదే. ఇది మీ ఆదాయ, వ్యయాలను విశ్లేషించి ఆర్థిక లావాదేవీలను మరింత సులభంగా మార్చేస్తోంది మరి. ప్రత్యేకతలు మీ ఏటీఎం విత్‌డ్రాయల్స్ అన్నీ దీన్లో సేవ్ అయిపోతాయి. మీరు ఈ విత్‌డ్రాయల్స్‌ను ఎందుకు చేశారన్న దీన్లో మీరే జోడించుకోవచ్చు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎం ఉన్న ప్రదేశాన్ని, సమయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎలాంటి బ్యాంకు అకౌంట్లు, పాస్వర్డ్స్ అవసరం లేదు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్, క్రెడిట్, డె బిట్ కార్డుల వ్యయాలు, ఇతర ఖర్చులను ఆటోమెటిక్‌గా ట్రాక్ చేసి మీకు చూపిస్తుంది.మీ ఖర్చులను ఇన్ఫో గ్రాఫిక్స్‌లో చూపి స్తూ.. మీకు వాటిపై ఒక అవగాహన వచ్చేలా చేస్తుంది. ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నామనే అంశాన్ని గ్రాఫ్స్ రూపంలో మనకు తెలియజేస్తుంది.టికెట్స్, ఆదాయం, ఖర్చులు, బిజినెస్ వంటి అంశాలకు సంబంధించిన ఎస్ఎంఎస్లను మీ ఇన్‌బాక్స్ నుంచి సేకరించి విశ్లేషిస్తుంది.బిల్స్ చెల్లింపులు, వాయిదాలు వంటివి రిమైండర్లో పెట్టుకోవచ్చు. ఖర్చులకు ట్యాగ్లు, నోట్స్ రాసుకోవచ్చు. ఒకరోజులో ఎంత ఖర్చు చేశామనే అంశాన్ని అదేరోజు రాత్రి తెలియజేస్తుంది. ఈ మేరకు ఒక అలర్ట్ వస్తుంది. ఖర్చులకు సంబంధించి లిమిట్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటుంది. బాటా ఇండియా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.1,058 టార్గెట్ ధర: రూ.1,700 ఎందుకంటే: పాదరక్షల మార్కెట్లో పటిష్టమైన బ్రాండ్ ఫ్రాంఛైజీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాండెడ్ సెగ్మెంట్లో 20-25 శాతం వాటా ఈ కంపెనీదే. దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఏడాదికి వంద కొత్త స్టోర్స్ చొప్పున ఏర్పాటు చేస్తోంది. రానున్న 2-3 ఏళ్లలో టైర్ 2, టైర్-త్రీ నగరాలపై దృష్టిసారించనున్నది. లాభాలు రాని స్టోర్స్‌ను మూసేస్తోంది. లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ అమ్మకాలు అంచనాలను మించుతుండటంతో ఈ స్టోర్స్‌ను అధికంగా అందుబాటులోకి తేవడంపై దృష్టిసారిస్తోంది. డిమాండ్ పుంజుకుంటుండటంతో 2018 కల్లా అమ్మకాలు 17 శాతం మెరుగుపడతాయని, దీంతో కంపెనీ రాబడులు 21 శాతం పెరుగుతాయని అంచనా. మూడేళ్లలో కంపెనీ ఆదాయం 16 శాతం, ఇబిటా మార్జిన్లు 300 బేసిస్ పాయింట్ల చొప్పున పెరుగుతాయని భావిస్తున్నాం. 2015 మార్చి 31నాటికి రూ.53 కోట్లుగా ఉన్న ఫ్రీ క్యాష్ ఫ్లో(ఎఫ్‌సీఎఫ్) 2018 మార్చి నాటికి రూ.220 కోట్లకు పెరుగుతాయని అంచనా. పుష్కలంగా ఉన్న నిధులతో కొత్త స్టోర్లను సులభంగా ఏర్పాటు చేయగలమని కంపెనీ ధీమాగా ఉంది. కొత్త ఫ్రాంఛైజీ విధానం ద్వారా ఉద్యోగుల వ్యయాలు తగ్గించుకుంటోంది. ప్రణాళిక బధ్దమైన ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగ వ్యయాలపై నియంత్రణ, వినూత్న ఉత్పత్తుల కారణంగా మరో 2-3 ఏళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాం. ఈపీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.39గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.40కు చేరుతుందని భావిస్తున్నాం. లార్జ్-ఫార్మాట్ స్టోర్స్ లాభాలు అంతగా వచ్చే అవకాశాలు లేకపోవడం, ముడి పదార్ధాల ధరలు పెరగడం, పోటీ తీవ్రత పెరుగుతుంండడం.. ప్రతికూలాంశాలు. గ్రీవ్స్ కాటన్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.127 టార్గెట్ ధర: రూ.160 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు సాధారణంగా ఉన్నాయి. అయితే మార్కెట్ ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఈ షేర్ 12 శాతం దాకా తగ్గింది. స్టాక్ మార్కెట్ పతనానికి అనుగుణంగానే ఈ షేర్ పడిపోయింది. 12 శాతం పతనం తర్వాత ప్రస్తుతం ఈ షేర్ సమంజసమైన ధరలోనే లభిస్తోందని భావిస్తున్నాం. నష్టాలొచ్చే వెంచర్ల నుంచి నిష్ర్కమించాలని యాజమాన్యం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్ల నష్టాలొచ్చిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ విభాగం నుంచి వైదొలగనున్నది. వేల్యూ ఇంజినీరింగ్, వ్యయాల నియంత్రణ ఫలితంగా లాభదాయకత మెరుగుపడుతుందని భావిస్తున్నాం. వ్యయ నియంత్రణ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి అంచనాలను మించిన మార్జిన్ పనితీరు (16.4% వృద్ధి)ను కనబరిచింది. కొత్త వినియోగదారులు లభించడం, కొత్త ఉత్పత్తులనందించడం వంటి కారణాల వల్ల ఇంజిన్ డివిజన్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి పుంజుకోగలదని భావిస్తున్నాం. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.400 కోట్ల వరకూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో మూడు నుంచి ఐదేళ్లలో వాహన ఇంజిన్ వ్యాపారం 5 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇబిటా మార్జిన్లు రికవరీ కావడం, ఇంజిన్ల అమ్మకాలు మెల్లమెల్లగా పుంజుకోవడం, వంటి కారణాల వల్ల రెండేళ్లలో కంపెనీ ఆదాయం 18% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. -
రెక్కల పుస్తకం
అనగనగా ఓ రాజు. ఆ రాజ్యం అంతా కాగితంతోనే కట్టారు. రాజుగారి ప్యాలెస్ నుంచి వాచ్‌మెన్‌గారి ఇల్లు దాకా అంతా కాగితమే. సోఫాలు, కుర్చీలు, బల్లలు, ప్లేట్లు, కప్పులు, స్పూన్లు... ఎవ్రీథింగ్ ఈజ్ పేపర్. కార్లు, బస్‌లు, ట్రైన్లు... విమానాలు కూడా. అంతే కాదు ఆ రాజ్యంలో అందరి డ్రీమ్స్ కూడా కాగితపు కట్టడాలే. మమ్మీ డాడీ చాలా హ్యాపీ... ఎందుకంటే పిల్లలు టీవీలూ సెల్ఫోన్లూ కంప్యూటర్లతో కాకుండా ఎప్పుడూ కాగితాల్లో మునిగి క్రియేటివిటీలో తేలుతుంటారు. చూసింది చదవలేం కానీ... చదివింది చూడగలం... ఊహల్లో చూడగలం. పిల్లల ఊహాశక్తిని ఆవిష్కరించేవే ఈ కాగితపు రెక్కలు... మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మంచి పిల్లాడికి? ఒక పుస్తకం. చెడ్డ పిల్లాడికైనా ఒక పుస్తకమే. అవే వారిని దారిన పెడతాయి. దారి చూపిస్తాయి. పిల్లలను ఉన్నచోటే ఉంచుతూ కాల్పనిక, వాస్తవిక జగత్తులో ఏకకాలంలో విహరింపజేసే మహత్తు పుస్తకాలకే ఉంది. విజ్ఞానం కావాలంటే వాటినే ఆశ్రయించాలి. వినోదం కావాలంటే వాటి అట్ట తెరవాలి. ‘నా చదువుకు నా విద్య ఎప్పుడూ ఆటంకం కాకుండా జాగ్రత్త పడ్డాను’ అన్నాడు ఐన్‌స్టీన్. పాఠశాలలో చదివే పాఠ్యపుస్తకాల ద్వారా అందే విద్య ఎలాగూ అందుతుంది. కాని పిల్లలకు చదువు కావాలి. వారికి తెలివి, యుక్తి, ధైర్యం, పట్టుదల, రుజుమార్గం, సందర్భాలను ఎదుర్కొనే పరిణతి ఇవన్నీ సాహిత్యం నుంచే అబ్బుతాయి. శత్రువుకు భయపడి గుహలో దాక్కున్న తైమూర్ రాజు ఒక చీమ తన కంటే మూడింతలు బరువున్న ఆహారతుంటను అతికష్టం మీద మోసుకెళ్లడం చూసి స్ఫూర్తి పొంది, ఒక చీమ చేయగలిగిన పని ఒక మనిషిని చేయలేనా అని పట్టుదల తెచ్చుకుని, శత్రువును ఓడించి తన రాజ్యం తిరిగి దక్కించుకున్నాడు. ఇలాంటి కథలు పిల్లలకు అవసరం. భారతదేశం అదృష్టవశాత్తూ కథల భాండాగారం. కాని తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ భాండాగారాన్ని వారికి దూరం చేస్తోంది. పిజా, బర్గర్, సినిమా, వీడియోగేమ్స్... అడిగితే ఇవ్వొచ్చు. తప్పు లేదు. కాని తోడుగా పుస్తకం కూడా ఇవ్వాలి. అప్పుడే పిజ్జా, బర్గర్, వీడియోగేమ్స్ ఇవ్వలేని ఒక అంతఃజ్ఞానం దాని ద్వారా అందుతుంది. రేపో మాపో స్కూళ్లు తెరవబోతున్నారు. వారి కోసమని నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు కొనడమే ముఖ్యమనుకోవద్దు. ఈ పుస్తకాలు కొనడం, చదివించడం కూడా ముఖ్యమే. హార్లిక్స్, బూస్ట్, పిడియాషూర్‌లలాగే పుస్తకాలు కూడా బలవర్థకమైన ఆహారం. కాకుంటే మేధకు. బొమ్మల రామాయణం, భారతం పిల్లలకు ఇవి ఉగ్గుపాల వంటివి. కథ పట్ల తొలి కుతూహలం కలిగించే రామాయణ, భారతాలను పిల్లలు వాటి నాయకులైన రాముడు, కృష్ణుడు కోసమే కాకుండా ఆంజనేయుడు, కుంభకర్ణుడు, భీముడు, అర్జునుడు, బకాసురుడు, ఘటోత్కచుడు కోసం కూడా ఇష్టపడతారు. విలువలను నేర్పడంలో రామాయణం ముందుంటే విలువలను ఉల్లంఘిస్తే జరిగే పెను పరిణామాలను భారతం తెలియచేసి హెచ్చరిస్తుంది. అరేబియన్ నైట్స్ మొత్తంగా ఈ పేరుతో తెలుగులో పుస్తకాలు లేవు. కాని అరేబియన్ నైట్స్‌లో విస్తృతంగా ఖ్యాతి పొందిన సింద్బాద్, అల్లావుద్దీన్ అద్భుతదీపం, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ, ఎగిరే కంబళి వంటి కథలన్నీ పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. వీటి మూలం భారతదేశమే అని అంటారు. కాని అరేబియా ప్రాంతంలో బహుళ ప్రచారం పొంది తిరిగి భారతదేశం చేరాయి. పంచతంత్రం కథలతో కూడా పాఠాలు నేర్పించవచ్చు అని నిరూపించిన తొలి వరుస కథలివి. ప్రపంచానికి భారతదేశం అందించిన ఘనసంపద. ఈ సంగతి పిల్లలకు తెలియచేయాలి. వీటిని వారి చేత చదివించాలి. మిత్రలాభం, మిత్రభేదం ఈ రెంటి మర్మం తెలుసుకోకపోతే అడుగు ముందుకు పడేదెలా? మహా పండితుడు విష్ణుశర్మ అజ్ఞానులైన రాజకుమారులకు విజ్ఞానం నేర్పే క్రమంలో జంతువులను ప్రధాన పాత్రలుగా తీసుకుని వాటి ద్వారా సకల శాస్త్రాలు వివరించాడు. లోకం పన్నే ఎరలు తెలియాలంటే ఈ కథలు తప్పనిసరి కదా. వీటిని సంస్కృతం నుంచి తెలుగుకు తెచ్చిన చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం గురించి కూడా పిల్లలకు తెలపాలి. కాశీ మజిలీ కథలు ప్రయాణంలో కథకు మించిన కాలక్షేపం లేదు. ఆ విధంగా ఇవి తెలుగులో జర్నీ స్టోరీస్. మధిర సుబ్బన్న దీక్షితులు వీటి సృష్టికర్త. ఒక గురువు తన శిష్యులతో కాశీ ప్రయాణమై దారిలో ఆగిన ప్రతిచోట ఒక కథ చెప్పేవారుట. ఆ కథల ద్వారా విద్యార్థులకు జ్ఞానబోధ జరిగేది. ఈ కథల్లో హాస్యంతో పాటు చతురత, విజ్ఞత కూడా ఉంటాయి. ఈ కథల ఆధారంగా గులేబకావళికథ, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి, పాతాళభైరవి, నవ్వితే నవరత్నాలు... వంటి సినిమాలు రూపొందాయి. పెద్దబాలశిక్ష అసలేం చదవకపోయినా పెద్దబాల శిక్ష చదివినా చాలు అనంటారు పెద్దలు. తెలుగువారి సారస్వత సర్వసాన్ని రేఖామాత్రంగా ఒక్కచోటే చేర్చి తెలిపే విలువైన కూర్పు ఇది. తెలుగు భాషలోని అక్షరాల దగ్గర నుంచి చిన్న చిన్న పదాలు, నీతి వాక్యాలు, పది పంక్తులలో వచ్చే కథలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం... వంటి అన్ని విషయాలకూ నెలవైన ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ పుస్తకం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా కొత్త కొత్త అంశాలను సైతం ఇందులో చేరుస్తోంది. బుడ్డిగ సుబ్బరాయన్, గాజుల సత్యనారాయణ ఈ కూర్పుతో ప్రసిద్ధి చెందారు. నీతి శతకాలు ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు రాని బాలలు మన ఇంట్లో ఉన్నారంటే మనం తెలుగువారు కాదనే లెక్క. నీతి శతకాల నుంచి కనీసం ఇరవై ముప్పై పద్యాలు కంఠతా పట్టడం వల్ల నీతి, ధర్మం, మర్మం తెలియడమేగాక వాక్శుద్ధి కూడా కలుగుతుంది. సుమతీ, వేమన, భర్తృహరి ఈ శతకాలు తప్పనిసరిగా పిల్లల షెల్ఫుల్లో ఉండాలి. తళుకుబెళుకుల రాళ్లు తట్టడేల అన్నాడు వేమన. నీతి శతకాలు పిల్లలను నిక్కమైన నీలాల్లా మారుస్తాయి. నిండైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి. తెనాలి రామలింగడు, మర్యాద రామన్న కథలు, పరమానందయ్య కథలు ఈ కథలన్నీ యుక్తి కథలు. ఆపద కలిగినప్పుడు తెలివిగా తప్పించుకోవడానికి మార్గాలు చూపే కథలు. తెనాలి రామలింగడు తన తెలివితేటలు, చమత్కార ధోరణితో శ్రీకృష్ణదేవరాయలను ఎన్నోమార్లు రక్షించాడు. మర్యాద రామన్న కథలలో రామన్న చెప్పే తీర్పు వల్ల ప్రతిసారీ న్యాయం జరుగుతూ, చెడ్డవారికి శిక్షలు పడుతుంటాయి. పరమానందయ్య గారి శిష్యుల కథలో వారు తెలివితక్కువగా చేసే పనుల వల్ల గురువుగారికి ప్రతిసారి గండం తప్పుతూ ఉంటుంది. ఒక్కసారి అలవాటు చేస్తే పిల్లలు వీటిని వదలరు. అక్బర్- బీర్బల్ కథలు, ముల్లా నస్రుద్దీన్ కథలు ఉత్తరాది నుంచి దక్షణాదికి ఆ తర్వాత ప్రపంచమంతటికీ పరిచమైన ఉల్లాసకరమైన కథలు ఇవి. అక్బర్ ఒక పొడుపు కథ వేయడం, ఆయన స్నేహితుడు, మంత్రి అయిన బీర్బల్ ఆ పొడుగు కథను విప్పడం పిల్లలకు ‘పజిల్‌ను సాల్వ్’ చేసే తర్ఫీదును ఇస్తాయి. ఇక ముల్లా నస్రుద్దీన్‌కు మన తెనాలి రామలింగడుకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ తుంటరి పనులతో చెడును సంస్కరించడానికి ప్రయత్నించినవారే. ముల్లా గాడిద మీద వెనక్కు తిరిగి కూచుని ఊరూరా తిరుగుతూ చేసే చమత్కారాలు బాలలకు అత్యంత ఇష్టం. బుడుగు బాపు రమణలు తెలుగువారికి అందించిన అమూల్యమైన పాత్ర బుడుగు. అంతవరకూ ప్రతి ఇంట్లో అల్లరి పిల్లవాణ్ణి బాల కృష్ణుడితో పోల్చేవారు. ఈ పాత్ర వచ్చాక బుడుగుతో పోల్చడం మొదలెట్టారు. బాల్యంలో ఉండే అమాయకత్వం, ఆరిందాతనం, ముద్దుమాటలు అందరినీ అలరిస్తాయి. ఈ పుస్తకం చదివితే హాస్య స్ఫోరకమైన భాష అలవడుతుంది. టామ్సాయర్, హకల్‌బరీ ఫిన్ ఆంగ్లంలో మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్‌బరీ ఫిన్ కథలను ప్రముఖ సంపాదకులు నండూరి రామ మోహనరావుగారు తెలుగులో రచించారు. ఈ కథలు పిల్లలకు చాలా థ్రిల్ కలిగిస్తాయి. మనం కూడా సాహసం చేద్దాం అని చదవగానే పిల్లలకు అనిపిస్తుంది. - డా. వైజయంతి, సాక్షి, చెన్నై -
ప్రపంచంలో అతి పెద్ద హంతకుడు ఎవరు?
ప్రపంచంలో అతి పెద్ద హంతకుడు ఎవరు? అతడు ఎన్ని హత్యలు చేశాడు? మానవాళికి శాంతి, సహనాన్ని బోధించడంలో ఎవరు ముందున్నారు? తమ పరిశోధనలతో జీవన గమనాన్ని మార్చేసిన శాస్త్రవేత్తల్లో మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు?.. ఇలా తమదైన ప్రత్యేక ముద్రతో అటు హీరోలుగా, ఇటు విలన్లుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల గురించి ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన సమాధానాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్, అర్జెంటీనా, దక్షిణ కొరియా, ఇటలీ, అమెరికా దేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆయా వర్సిటీలకు చెందిన దాదాపు 7వేల మంది విద్యార్థినీ విద్యార్థులు తాము ఆరాధించేవారితోపాటు అసహ్యించుకునే చరిత్రాత్మక వ్యక్తులెవరో కుండబద్దలు కొట్టారు. దాని ప్రకారం ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. హిస్టరీ హీరోల్లో ప్రధమ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో జీసస్ క్రైస్ట్, మదర్ థెరిసా, మహాత్మాగాంధీల కన్నా ఐన్్స్టీనే విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. ఇక ప్రపంచ విలన్ల విషయంలో మరిన్ని ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫ్ఘానిస్థాన్, ఇరాక్ తో యుద్ధంచేసి లక్షల మంది అమాయకుల్ని హత్యచేశారని ఆరోపిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను విలన్ల జాబితాలో చేర్చారు అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు. సామ్యవాద స్థాపనలో తమకు అడ్డొచ్చినవాళ్లందరినీ హతమార్చిన కారణంగా రష్యా మాజీ పాలకులు స్టాలిన్, లెనిన్లు కూడా విలన్ల జాబితాలోనే చేరిపోయారు. ఇక జర్మనీ మాజీ నియంత అడాల్ఫ హిట్లర్ ప్రపంచ విలన్లలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అధ్యయనం వెల్లడించిన జాబితా ఇదే.. ప్రపంచ హీరోల జాబితా: 1 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, 2 మదర్ థెరిసా, 3 మహాత్మా గాంధీ, 4 మార్టిన్ లూథర్ కింగ్, 5 ఐజక్ న్యూటన్, 6 జీసస్ క్రైస్ట్, 7 నెల్సన్ మండేలా, 8 థామస్ ఎడిసన్, 9 అబ్రహాం లింకన్, 10 గౌతమ బుద్ధుడు ప్రపంచ విలన్ల జాబితా: 1 అడాల్ఫ్ హిట్లర్, 2 ఒసామా బిన్ లాడెన్, 3 సద్దాం హుస్సేన్, 4 జార్జి బుష్, 5 స్టాలిన్, 6 మావో, 7 లెనిన్, 8 ఛెంఘీజ్ ఖాన్, 9 సలాద్దీన్ (ఈజిప్ట్ తొలి సుల్తాన్), 10 కిన్ షి హువాంగ్ (ఉమ్మడి చైనా పాలకుడు) -
ఉంగళక్కు తెరియుమా?
(మీకు తెలుసా?) హాస్యమే ఆనందం రజనీ ‘గుడ్‌మార్నింగ్’ చెప్పేవరకు చెన్నైలోకి సూర్యుడు ప్రవేశించడు. రజనీకాంత్ మాత్రమే ‘మిస్డ్ కాల్’కు ఆన్సర్ ఇవ్వగలరు. తన ఫోన్‌తో తన నంబర్‌కే ‘మిస్డ్ కాల్’ ఇవ్వగల సమర్థుడు రజనీ. ఏదైనా అద్భుతాన్ని చూస్తే ‘ఓ మై గాడ్’ అంటాం. మరి గాడ్ ‘రోబో’ సినిమా చూస్తే? ‘ఓ మై రజనీకాంత్’ అంటాడట! ఐన్‌స్టీన్: ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ కరుణానిధి: రిలేటివ్ ఈజ్ ఎవ్రీథింగ్ (బంధుప్రీతి) రజనీకాంత్: ఐయామ్ ఎవ్రీథింగ్ {పభుత్వానికి రజనీకాంత్ ఎలాంటి ట్యాక్సూ కట్టరు. ఇక్కడ నివసిస్తున్నందుకు ప్రభుత్వమే అతడికి ట్యాక్స్ కడుతుంది. కుక్కతో కూడా రజనీ మ్యా...వ్ అనిపించగలరు {sెడ్మిల్ అలసిపోయే వరకు రజనీ పరుగెత్తుతూనే ఉంటారు. -
గర్వంగా చెబుతారు..!
పంచామృతం ‘నా శరీరంలో మరో జీవిని సమాధి చేయను...’ అని ప్రకటించుకొన్నారు ప్రఖ్యాత పెయింటర్ లియోనార్డో డావించి. ‘శాకాహారులు ఈ ప్రకృతికి ప్రియమైన వాళ్లు..’ అని చెప్పారు విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. శాకాహారుల్లో ఒక గర్వం ఉంటుంది. నవీన మానవుడి ఆహారపు గొలుసులో కూడా వీళ్లు ప్రత్యేకమైన వాళ్లు. ఇలాంటి వారిలో మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు శాకాహారులం అని గర్వంగా ప్రకటించుకున్నారు. వారిలో కొందరు... విద్యాబాలన్... తమిళ-బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన విద్య తన కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఆమె మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. తను సహజసిద్ధంగానే వెజిటేరియన్‌ని అనే విద్య ఈ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా కోరుకోవడం లేదు. అమితాబ్ బచ్చన్... ఆహారం మనిషి శక్తిస్థాయిని ప్రభావితం చేస్తుందని అనుకుంటే... అమితాబ్ శక్తి స్థాయి పూర్తిగా శాకాహారం వల్ల సమకూరినదే. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) తరపున వరసగా మూడుసార్లు ‘హాటెస్ట్ వెజిటేరియన్’గా పురస్కారాన్ని అందుకున్నారీయన. కేట్ విన్స్లెట్... ఈ టైటానిక్ సుందరి ‘పెటా’ మద్దతుదారు. మాంసం కోసం బాతులను కోయడాన్ని చూడటం కేట్‌ను శాకాహారిగా మారేలా చేసిందట. తనవంతుగా జీవహింసను తగ్గించడానికి మాంసాహారాన్ని వదిలేసి, పెటా తరపు ప్రచార కర్తగా మారారు. మల్లికా షెరావత్... సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించినా... మల్లిక స్వాభావికంగా జంతుహింసకు చాలా దూరమట. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా నాన్‌వెజ్‌ను ముట్టిందే లేదట. పెటావాళ్లు తనను ‘సెక్సియెస్ట్ వెజిటేరియన్’గా ఎంపిక చేయడం కూడా తనకు గర్వకారణమటున్నారు. కంగనా రనౌత్... హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్‌పుత్‌ల కుటుంబం నుంచి వచ్చిన కంగనా తన జీవనశైలిలో భాగంగా మాంసాహారాన్ని త్యజించారు. చాలా సంవత్సరాల నుంచి శాకాహారిగా ఉంటున్నాననీ, అప్పట్నుంచి గ్లామరస్‌గా తయారయ్యాయననీ కంగనా చెబుతున్నారు. అందంగా తయారవ్వాలనుకుంటున్న వాళ్లు తన దారికి వచ్చేయాలని కూడా కంగనా సలహా ఇస్తున్నారు! -
ప్రకృతి ధర్మాన్ని గౌరవిద్దాం!
పద్యానవనం గిలగిల మందువే యొరులు గిచ్చిన, కాలికి ముల్లు గ్రుచ్చినన్ విలవిల కొట్టుకుందువటె, నీవలె జీవులు కావె! హింసకున్ ఫలితము బాధయే గద! ప్రపంచములోని సమస్త జీవులం దలరెడు ప్రాణమొక్కటె గదా! తగునయ్య వృథా వ్యధా క్రుథల్! హంస పలు రకాలు. మనకు బాగా స్పష్టంగా తెలిసేది రెండు రకాలు. ఒకటి మానసికం, మరొకటి శారీరకం. ఈ రెంటిలో ఏదైనా హింస అంతిమంగా బాధను కలిగించేదే! నిర్హేతుకం, సహేతుకం అంటూ ఉండవు, హింస హింసే అంటారు మానవతావాదులు. హింసకు ప్రతిహింస తప్పు కాదనీ, వర్గ పోరాటంలో అనివార్యం, అంతర్భాగమనీ ప్రగతిశీల విప్లవవాదులంటారు. ప్రకృతిలో ఒక జీవి మరో జీవిని చంపి తినడమూ హింసే కదా అన్న ప్రశ్నకు ‘అవును తప్పే’ అనే వాస్తవిక వాదులున్నట్టే, అది ప్రకృతి ధర్మం కనుక తప్పు కానే కాదనే వారూ ఉంటారు. సృష్టిలో అమలయ్యే ఆహార శృంకలం ప్రకారం చూసినా ఒక జీవి మరోజీవికి ఆహారమైనపుడు, అది సృష్టి అనుమతించే ప్రకృతి ధర్మమే అయినా హింస కచ్చితంగా ఒక ప్రాణిని బాధిస్తుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. గాయపరచినపుడు శరీరం బాధకు గురయినట్టే, పరుషమైన ఓ మాట కూడా మనసును గాయపరిచి వేదనను కలిగిస్తుంది. అదీ హింసే! ఉద్దేశపూర్వకంగా చేసినా, యాదృచ్ఛికంగా జరిగినా హింస పర్యవసానం బాధ, వేదన. వీలయినంత వరకు హింసకు పాల్పడకుండా ఉండటం, పరిహరించడం ఉత్తమోత్తమమైన మానవ ధర్మం. అందుకే, జాతిపిత మహాత్ముడు సత్య పరిశోధనతోపాటు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. మానవేతిహాసంలో సత్యం-అహింసలను మహాత్మాగాంధీ అంత గొప్పగా నిష్ఠతో అనుసరించినవారు కానరారు. ఆయన నిబద్ధత అటువంటిది. అందుకేనేమో, అటువంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ నేలపై నడయాడారు అంటే భవిష్యత్తరాలు విస్మయం చెందవచ్చు అని, ప్రస్తుత సహస్రాబ్దిలోనే అత్యంత మేధావిగా ఆమోదం పొందిన ఐన్‌స్టీన్ అన్నారు. రెండూ, రెండు నిప్పు కణికల వంటి ధర్మాలని ఏక కాలంలో మనిషి ఆచరించడం అత్యంత క్లిష్టతరమైనదే అయినా గాంధీజీ ఆచరించి చూపారు. ఇదే సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకొని ఒక విదేశీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా గాంధీజీ సమాధానం ఇచ్చిన తీరే ఆయనలోని త్రికరణ శుద్ధిని వెల్లడిస్తుంది. సత్యం-అహింస రెండూ ఏకకాలంలో ఆచరించడం కష్టం కదా, నేనో సందర్భం చెబుతాను, అప్పుడు మీరెలా స్పందిస్తారో చెప్పండంటూ జర్నలిస్టు గాంధీజీని అడిగాడట. ‘‘మీరు ఓ దారంట నడిచి వెళుతున్నారు. ఓ జింక పిల్ల పరుగెత్తుకుంటూ వచ్చి మీ కళ్లముందే పక్కన ఓ పొదరింట్లో దాక్కుంది. కొద్ది సమయం తేడాతో దాని వెనుకే పరుగెత్తుకుంటూ వచ్చిన వేటగాడు మిమ్మల్ని అడుగుతాడు, ఇందాకొచ్చిన జింకపిల్ల ఎటువెళ్లింది? అని. సత్య రక్షణ కోసం మీరు అబద్ధం చెప్పలేరు, అలా నిజం చెప్పి హింసకు కారకులు కాలేరు. పరస్పర విరుద్ధ స్థితి. అప్పుడు మీరెలా స్పందిస్తారు?’’అని ప్రశ్నించి గాంధీజీ సమాధానం కోసం జర్నలిస్టు నిరీక్షిస్తున్నాడు. ‘‘ఏమీ చెప్పను. మౌనంగా ఉంటాను’’ అని ఇచ్చిన సమాధానంతో నివ్వెరపోవడం ఆ జర్నలిస్టు వంతయింది. సంక్లిష్టమనుకున్న ప్రశ్నకు కూడా గాంధీజీ అంత తేలిగ్గా, తడుముకోకుండా సమాధానం చెప్పగలిగాడూ అంటే, సత్యం, అహింసను ఎంతగా సమ్మిళితం చేశారో ఇట్టే స్పష్టమౌతుంది. ఇక్కడ ఈ పద్యంలో, అప్పటికింకా గౌతమబుద్ధుడు కాని సిద్దార్థుడు తన సమీప బంధువు దేవదత్తుడ్ని ప్రశ్నిస్తున్నాడు. పనికి మాలిన పనులెందుకు చేస్తావ్? ఎవరైనా నిను గిచ్చితేనే అల్లాడిపోతావ్, కాలికి ముల్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడుతావు, గాయపరిస్తే ఇతర జీవులకు కూడా అలాగే బాధ కలుగుతుంది, హింస ఫలితం బాధే కదా! సమస్త జీవరాశిలోనూ ఉండే ప్రాణం ఒకటే కదా! అంటూ, హంసను బాణంతో గాయపరచిన దేవదత్తుడ్ని ప్రశ్నిస్తాడు. ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి అలతి అలతి పదాలతో మధురమైన పద్య రచన చేశారు. సత్యం-అహింసలను గాలికి వదిలి ఐహికమైన సౌఖ్యాలకోసం, భౌతికమైన సంపదల కోసం మనిషి ఎంతటి నైచ్యానికైనా దిగజారే సందర్భాల్ని చూసినపుడు గుండె తరుక్కుపోతుంది. తుచ్ఛమైన సంపద కోసం కన్న తండ్రినే గొంతుకోసిన ఓ కొడుకు గురించి విన్నపుడు... ఎక్కడికి జారిపోతున్నాం అనిపిస్తుంది. ఏమున్నా లేకున్నా, నాకూ నా జాతికి సదా సత్యం పాటించే, అహింసను ఆచరించే శక్తినివ్వు ఓ మహాత్మా! ఓ మహర్షీ!! - దిలీప్‌రెడ్డి -
సత్యం: ఐన్‌స్టీన్ = మేధావి
ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా... చిన్నతనంలో ఐన్‌స్టీన్‌కు వాళ్ల నాన్న ఒక ప్యాకెట్ కంపాస్ ఇచ్చాడట. ఏమీలేకుండానే శూన్యంలో అటూయిటూ తిరుగుతున్న ఆ ముల్లును చూస్తూంటే, ఏమీలేనిదాన్లోనే ఏదోవుందన్న గ్రహింపు కలిగిందట! ఆ కుతూహలమే ఆ పిల్లాడిని ‘ఐన్‌స్టీన్’ను చేసింది. నిస్సందేహంగా ఇరవయ్యో శతాబ్దపు అత్యున్నత మేధావిగా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను శాస్త్ర ప్రపంచం కీర్తించింది. ప్రతిదాన్నీ ప్రశ్నించే స్వభావం ఆయనది. పాఠశాలల్లో అతి క్రమశిక్షణను సహించేవాడు కాదు. ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు ఆయనకు నచ్చేవాళ్లు కాదు. మనిషికి మెదడు ఉన్నదే ప్రశ్నించడానికనేవారు. ప్రశ్నిస్తూనే జ్ఞానాన్ని పొందాలిగానీ, గుడ్డిగా కాదనేవారు. విద్య అనేది విద్యార్థుల్ని ఆలోచించేలా చేయాలి, అంతకుముందు ఊహించడానికి కూడా సాధ్యంకాని ఊహల్ని సాధ్యం చేసేట్టుగా ఉండాలి. ఉత్తినే వాస్తవాలు తెలుసుకోవడంకన్నా, ఆలోచించేలా మెదడుకు తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచనలు ఆయనవి. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలస్తంభాల్లో ఒకటైన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ సుప్రసిద్ధ సూత్రం ‘ఈ=ఎం.సీస్క్వేర్’ కనుగొన్నారు. 1921లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అయితే, ఆయన కేవలం మేధావిగా, శాస్త్రవేత్తగా మాత్రమే ఉండిపోలేదు. అలా ఉండిపోకపోవడమే ఆయన్ని జనానికి కూడా చేరువ చేసింది. తాత్వికుడిగా, ఆధ్యాత్మిక అన్వేషకుడిగా, అహింస పట్ల ప్రేమ ఉన్నవాడిగా ఆయన ఎన్నో అంశాల్లో తన భావాలను పంచుకున్నారు. ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా, అన్నారు ఓ సందర్భంలో. ఆర్థిక విధానాల రీత్యా సామ్యవాదం వైపు మొగ్గినా, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ఉండే ప్రాధాన్యతను నొక్కిచెప్పేవారు. ఐన్‌స్టీన్ ఏ దేవుడినీ అంగీకరించలేదు. మానవ బలహీనతలోంచే దేవుడు జన్మించాడని వ్యాఖ్యానించారు. అయితే మతంగా మాత్రం బౌద్ధానికి పెద్దపీట వేశారు. ఏ మతమైనా ఆధునిక శాస్త్రీయావసరాలతో తూగగలిగినది ఉందంటే అది బౌద్ధమే అన్నారు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న ఐన్‌స్టీన్ తిరిగి తన మాతృదేశం వెళ్లలేదు. అమెరికాలోనే స్థిరపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రదేశాల మద్దతుదారుగా శత్రువును ఎదుర్కోవడానికి మరింత శక్తిమంతమైన బాంబుల తయారీ అవసరం గురించి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్కు లేఖ రాశారు. అయితే, 1955లో తన మరణానికి ముందుమాత్రం బ్రిటన్ రచయిత బెర్ట్రండ్ రసెల్‌తో కలిసి ‘ద రసెల్-ఐన్‌స్టైన్ మానిఫెస్టో’లో అణ్వాయుధాల ప్రమాదం గురించి హెచ్చరించారు. ‘అహింసతోనూ అనుకున్నది సాధించవచ్చని మీరు నిరూపించారు. మీ దారి ఆదర్శప్రాయమైనదీ, ప్రపంచ శాంతిని నెలకొల్పేదీనూ. మీరంటే నాకు ఆరాధన’ అని గాంధీజీకి లేఖ పంపారు ఐన్‌స్టీన్, కలయికను అభ్యర్థిస్తూ. అయితే ఇద్దరూ కలిసే సమయం వచ్చేలోపే మహాత్ముడు నేలకొరిగారు. మహాత్ముడి గురించిన ఐన్‌స్టీన్ వ్యాఖ్య ‘రక్తమాంసాలతో కూడిన ఇలాంటి మనిషి...’ ప్రసిద్ధమైంది. నేనెప్పుడూ ఒంటరి ప్రయాణికుడినే! నేను ఏనాడూ నా దేశానికి చెందలేదు, నా ఇంటికిగానీ, నా స్నేహితులకుగానీ నా నిండుగుండెతో చెందిలేను. అయినప్పటికీ నేను ఏనాడూ ఒంటరితనాన్నిగానీ, దేనికైనా దూరపుతనాన్నిగానీ అనుభవించలేదు, అన్నారు ఐన్‌స్టీన్. ఆయన మరణించి అర్ధశతాబ్దం దాటిపోయినా ఇప్పటికీ ఐన్స్టీన్నుంచి మనకు కూడా ఏ దూరపుతనమూ లేదు. 14 మార్చి ఐన్‌స్టీన్ జయంతి