స్టాక్స్ వ్యూ | Stocks Overview | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Oct 5 2015 1:13 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

స్టాక్స్ వ్యూ - Sakshi

స్టాక్స్ వ్యూ

appకీకహానీ...
 
 
వాల్‌నట్

బోయే తరాల్ని టెక్నాలజీ బద్దకస్తులుగా మారుస్తుందన్నాడు ఐన్‌స్టీన్. ఇప్పుడీ మొబైల్ యాప్స్ ఆయన మాటల్ని నిజం చేస్తున్నాయి. ఇదిగో... ఈ వాల్‌నట్ ఫైనాన్షియల్ యాప్ కూడా అలాంటిదే. ఇది మీ ఆదాయ, వ్యయాలను విశ్లేషించి ఆర్థిక లావాదేవీలను మరింత సులభంగా మార్చేస్తోంది మరి.
 
ప్రత్యేకతలు

మీ ఏటీఎం విత్‌డ్రాయల్స్ అన్నీ దీన్లో సేవ్ అయిపోతాయి. మీరు ఈ విత్‌డ్రాయల్స్‌ను ఎందుకు చేశారన్న దీన్లో మీరే జోడించుకోవచ్చు. డబ్బులు డ్రా చేసిన ఏటీఎం ఉన్న ప్రదేశాన్ని, సమయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎలాంటి బ్యాంకు అకౌంట్లు, పాస్‌వర్డ్స్ అవసరం లేదు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్, క్రెడిట్, డె బిట్ కార్డుల వ్యయాలు, ఇతర ఖర్చులను ఆటోమెటిక్‌గా ట్రాక్ చేసి మీకు చూపిస్తుంది.మీ ఖర్చులను ఇన్ఫో గ్రాఫిక్స్‌లో చూపి స్తూ.. మీకు వాటిపై ఒక అవగాహన వచ్చేలా చేస్తుంది. ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తున్నామనే అంశాన్ని గ్రాఫ్స్ రూపంలో మనకు తెలియజేస్తుంది.టికెట్స్, ఆదాయం, ఖర్చులు, బిజినెస్ వంటి అంశాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లను మీ ఇన్‌బాక్స్ నుంచి సేకరించి విశ్లేషిస్తుంది.బిల్స్ చెల్లింపులు, వాయిదాలు వంటివి రిమైండర్‌లో పెట్టుకోవచ్చు. ఖర్చులకు ట్యాగ్‌లు, నోట్స్ రాసుకోవచ్చు. ఒకరోజులో ఎంత ఖర్చు చేశామనే అంశాన్ని అదేరోజు రాత్రి తెలియజేస్తుంది. ఈ మేరకు ఒక అలర్ట్ వస్తుంది. ఖర్చులకు సంబంధించి లిమిట్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటుంది.
 
బాటా ఇండియా కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్
ప్రస్తుత ధర: రూ.1,058
టార్గెట్ ధర: రూ.1,700

 ఎందుకంటే: పాదరక్షల మార్కెట్లో పటిష్టమైన బ్రాండ్ ఫ్రాంఛైజీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాండెడ్ సెగ్మెంట్లో 20-25 శాతం వాటా ఈ కంపెనీదే. దేశవ్యాప్తంగా 1,400 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. ఏడాదికి వంద కొత్త స్టోర్స్ చొప్పున ఏర్పాటు చేస్తోంది. రానున్న 2-3 ఏళ్లలో టైర్ 2, టైర్-త్రీ నగరాలపై దృష్టిసారించనున్నది. లాభాలు రాని స్టోర్స్‌ను మూసేస్తోంది. లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ అమ్మకాలు అంచనాలను మించుతుండటంతో  ఈ స్టోర్స్‌ను అధికంగా అందుబాటులోకి తేవడంపై దృష్టిసారిస్తోంది. డిమాండ్ పుంజుకుంటుండటంతో 2018 కల్లా అమ్మకాలు 17 శాతం మెరుగుపడతాయని, దీంతో కంపెనీ రాబడులు 21 శాతం పెరుగుతాయని అంచనా.   మూడేళ్లలో కంపెనీ ఆదాయం 16 శాతం,  ఇబిటా మార్జిన్లు 300 బేసిస్ పాయింట్ల చొప్పున పెరుగుతాయని భావిస్తున్నాం.  2015 మార్చి 31నాటికి రూ.53  కోట్లుగా ఉన్న ఫ్రీ క్యాష్ ఫ్లో(ఎఫ్‌సీఎఫ్) 2018 మార్చి నాటికి రూ.220 కోట్లకు పెరుగుతాయని అంచనా.  పుష్కలంగా ఉన్న నిధులతో కొత్త స్టోర్లను సులభంగా ఏర్పాటు చేయగలమని కంపెనీ ధీమాగా ఉంది.   కొత్త ఫ్రాంఛైజీ విధానం ద్వారా ఉద్యోగుల వ్యయాలు తగ్గించుకుంటోంది. ప్రణాళిక బధ్దమైన ఇన్వెస్ట్‌మెంట్స్, ఉద్యోగ వ్యయాలపై నియంత్రణ, వినూత్న ఉత్పత్తుల కారణంగా మరో 2-3 ఏళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాం. ఈపీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.39గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.40కు చేరుతుందని భావిస్తున్నాం. లార్జ్-ఫార్మాట్ స్టోర్స్ లాభాలు అంతగా వచ్చే అవకాశాలు లేకపోవడం, ముడి పదార్ధాల ధరలు పెరగడం,  పోటీ తీవ్రత పెరుగుతుంండడం.. ప్రతికూలాంశాలు.
 
గ్రీవ్స్ కాటన్ కొనొచ్చు
 
బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్
ప్రస్తుత ధర: రూ.127
టార్గెట్ ధర: రూ.160

 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలం  ఆర్థిక ఫలితాలు సాధారణంగా ఉన్నాయి.  అయితే మార్కెట్ ప్రతికూలంగా ఉండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఈ షేర్ 12 శాతం దాకా తగ్గింది. స్టాక్ మార్కెట్ పతనానికి అనుగుణంగానే ఈ షేర్  పడిపోయింది. 12 శాతం పతనం తర్వాత ప్రస్తుతం ఈ షేర్ సమంజసమైన ధరలోనే లభిస్తోందని భావిస్తున్నాం. నష్టాలొచ్చే వెంచర్ల నుంచి నిష్ర్కమించాలని యాజమాన్యం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్ల నష్టాలొచ్చిన కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ విభాగం నుంచి వైదొలగనున్నది. వేల్యూ ఇంజినీరింగ్, వ్యయాల నియంత్రణ ఫలితంగా లాభదాయకత మెరుగుపడుతుందని భావిస్తున్నాం. వ్యయ నియంత్రణ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి అంచనాలను మించిన మార్జిన్ పనితీరు (16.4% వృద్ధి)ను కనబరిచింది.

కొత్త వినియోగదారులు లభించడం, కొత్త ఉత్పత్తులనందించడం వంటి కారణాల వల్ల ఇంజిన్ డివిజన్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి పుంజుకోగలదని భావిస్తున్నాం. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.400 కోట్ల వరకూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో మూడు నుంచి ఐదేళ్లలో వాహన ఇంజిన్ వ్యాపారం 5 శాతం చొప్పున వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇబిటా మార్జిన్లు రికవరీ కావడం, ఇంజిన్ల అమ్మకాలు మెల్లమెల్లగా పుంజుకోవడం, వంటి కారణాల వల్ల రెండేళ్లలో కంపెనీ ఆదాయం 18% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement