ఆయన ఓ సైంటిస్ట్.. ఐన్‌స్టీన్‌కు స్నేహితుడు.. యుద్ధమంటే ప్రేమ.. చావు అంటే సరదా.. ఓవైపు విష వాయువులతో మారణాయుధాలను సృష్టించి.. వేలు, లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మరోవైపు ఎరువులను రూపొందించి.. మానవాళి తిండి గోస తీర్చేందుకు సాయపడ్డాడు. నోబెల్ బహుమతిని కూడా పొందాడు. ఆ సైంటిస్ట్ ఎవరో.. ఏం చేశాడో.. తెలుసుకుందామా...
– సాక్షి సెంట్రల్ డెస్క్
ఐన్‌స్టీన్‌కు స్నేహితుడు అయినా..
ఆయన పేరు ఫ్రిట్జ్ హేబర్.. 1868 డిసెంబర్‌లో జర్మనీలోని బ్రెస్లోలో పుట్టాడు. రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. కొంతకాలం తన తండ్రికి చెందిన రసాయనాల వ్యాపారంలో పనిచేశాడు. తర్వాత పరిశోధనలపై దృష్టిపెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌కు ఫ్రిట్జ్ హేబర్ స్నేహితుడు కూడా. అయినా ఆయనకు భిన్న మార్గంలో నడిచాడు. హేబర్‌కు జాతీయవాద ఆలోచనలు ఎక్కువ, యుద్ధాలంటే మక్కువ. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ప్రభుత్వ ‘వార్ ఆఫీస్’కు కన్సల్టెంట్‌గా చేరాడు.
విష వాయువులపై ప్రయోగాలతో..
జర్మనీ శత్రుదేశాలపై విజయం సాధించాలన్న లక్ష్యంతో రసాయన ఆయుధాలపై పరిశోధనలు చేసిన ఫ్రిట్జ్ హేబర్.. క్లోరిన్ గ్యాస్‌ను తయారు చేశాడు. మొదట ఆయన ఆలోచనను కొట్టిపారేసిన జర్మనీ ప్రభుత్వం.. మొదటి ప్రపంచ యుద్ధం రావడంతో ఓకే చెప్పింది. 1915లో బెల్జియంలోని వైప్రస్ నగరంలో మిత్రరాజ్యాల సైన్యాలకు, జర్మనీ దళాలకు భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో ఫ్రిడ్జ్ హేబర్ రూపొందించిన క్లోరిన్ గ్యాస్‌ను మిత్రరాజ్యాల సైన్యాలపై ప్రయోగించారు. దీంతో ఊపిరాడక గిలగిలాకొట్టుకుంటూ వేల మంది అక్కడిక్కడే చనిపోయారని అంచనా. దీంతో అక్కడ జర్మనీ దళాలు పైచేయి సాధించాయి.
►వైప్రస్ క్లోరిన్ దాడి నుంచి బతికి బయటపడిన ఓ సైనికుడు ‘అది చావుల్లోనే అత్యంత ఘోరమైన దారుణమైన చావు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
దారుణాన్ని చూడలేక భార్య ఆత్మహత్య
రసాయన ఆయుధాల తయారీని హేబర్ భార్య తప్పుపడుతూ ఉండేది. అది మానుకోవాలని చాలా సార్లు ఒత్తిడి చేసింది. హేబర్ సాయంతో వైప్రస్‌లో విజయం సాధించడంతో జర్మనీ సైనికాధికారులు పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జరుగుతున్న చోటికి వచ్చిన హేబర్ భార్య.. అందరి ముందు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయింది.
మానవాళికి చేసిన మంచి ఏమిటి?
18వ శతాబ్దం నుంచి జనాభా పెరిగిపోవడంతో ఆహార ఉత్పత్తులకు కొరత మొదలైంది. అప్పట్లో పంటల దిగుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీనిపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు నైట్రోజన్ (నత్రజని) తగిన మోతాదులో అందిస్తే.. దిగుబడులు భారీగా పెరుగుతాయని గుర్తించారు. కానీ నైట్రోజన్ ఉత్పత్తి ఎలాగనేది తెలియదు. దీనిపైనా ఫ్రిట్జ్ హేబర్ పరిశోధనలు చేశాడు.
►1909లో గాలిలోంచి నైట్రోజన్‌ను సంగ్రహించగల విధానాన్ని ఆవిష్కరించాడు. నైట్రోజన్‌ను వివిధ రసాయన పద్ధతుల్లో అవసరమైన ఎరువులుగా మార్చే ప్రక్రియలనూ అభివృద్ధి చేశాడు. దీనితో ఎరువుల ఉత్పత్తి మొదలై ఆహార పంటల దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.
►ఈ–పరిశోధనలకుగాను ఫ్రిట్జ్ హేబర్ 1918లో నోబెల్ బహుమతి అందుకున్నారు. రసాయన ఆయుధాలతో మారణ హోమాన్ని సృష్టించిన మూడేళ్లకే ఇది జరగడం గమనార్హం.
ఆ ఆయుధానికే తన కుటుంబం బలి
ఫ్రిట్జ్ హేబర్ 1934లో చనిపోయాడు. అయితే ఆయన మొదలుపెట్టిన రసాయన ఆయుధాల ప్రయోగాలు.. హిట్లర్ తెరపైకి వచ్చాక మరింత ముందుకు వెళ్లాయి. హిట్లర్ 1940 తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, నాజీ కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లో వేలాది మందిని విష వాయువులతో చంపించాడు. ఇందుకోసం ‘జైక్లోన్ బి’ అనే విషపూరితమైన వాయువును వాడారు.
►ఇలా చనిపోయినవారిలో శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉండటం.. అసలు ఆ ‘జైక్లోన్ బి’ పాయిజన్ గ్యాస్‌ను 1920లో ఫ్రిట్జ్ హేబరే తయారు చేసి ఉండటం.. విధి విచిత్రం.
Comments
Please login to add a commentAdd a comment