రెక్కల పుస్తకం | Winged book | Sakshi
Sakshi News home page

రెక్కల పుస్తకం

Published Mon, Jun 1 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

రెక్కల పుస్తకం

రెక్కల పుస్తకం

అనగనగా ఓ రాజు.
ఆ రాజ్యం అంతా కాగితంతోనే కట్టారు.
రాజుగారి ప్యాలెస్ నుంచి వాచ్‌మెన్‌గారి
ఇల్లు దాకా అంతా కాగితమే.
సోఫాలు, కుర్చీలు, బల్లలు, ప్లేట్లు, కప్పులు, స్పూన్లు...
ఎవ్రీథింగ్ ఈజ్ పేపర్.
కార్లు, బస్‌లు, ట్రైన్‌లు... విమానాలు కూడా.
అంతే కాదు ఆ రాజ్యంలో
అందరి డ్రీమ్స్ కూడా కాగితపు కట్టడాలే.
మమ్మీ డాడీ చాలా హ్యాపీ... ఎందుకంటే పిల్లలు
టీవీలూ సెల్‌ఫోన్‌లూ కంప్యూటర్లతో కాకుండా ఎప్పుడూ
కాగితాల్లో మునిగి క్రియేటివిటీలో తేలుతుంటారు.
చూసింది చదవలేం కానీ... చదివింది చూడగలం...
ఊహల్లో చూడగలం. పిల్లల ఊహాశక్తిని ఆవిష్కరించేవే
ఈ కాగితపు రెక్కలు...
 
 మంచి మనిషికో మాట,
 మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు.
 మంచి పిల్లాడికి? ఒక పుస్తకం.
 చెడ్డ పిల్లాడికైనా ఒక పుస్తకమే.


అవే వారిని దారిన పెడతాయి. దారి చూపిస్తాయి. పిల్లలను ఉన్నచోటే ఉంచుతూ కాల్పనిక, వాస్తవిక జగత్తులో ఏకకాలంలో విహరింపజేసే మహత్తు పుస్తకాలకే ఉంది. విజ్ఞానం కావాలంటే వాటినే ఆశ్రయించాలి. వినోదం కావాలంటే వాటి అట్ట తెరవాలి. ‘నా చదువుకు నా విద్య ఎప్పుడూ ఆటంకం కాకుండా జాగ్రత్త పడ్డాను’ అన్నాడు ఐన్‌స్టీన్. పాఠశాలలో చదివే పాఠ్యపుస్తకాల ద్వారా అందే విద్య ఎలాగూ అందుతుంది. కాని పిల్లలకు చదువు కావాలి. వారికి తెలివి, యుక్తి, ధైర్యం, పట్టుదల, రుజుమార్గం, సందర్భాలను ఎదుర్కొనే పరిణతి ఇవన్నీ సాహిత్యం నుంచే అబ్బుతాయి. శత్రువుకు భయపడి గుహలో దాక్కున్న తైమూర్ రాజు ఒక చీమ తన కంటే మూడింతలు బరువున్న ఆహారతుంటను అతికష్టం మీద మోసుకెళ్లడం చూసి స్ఫూర్తి పొంది, ఒక చీమ చేయగలిగిన పని ఒక మనిషిని చేయలేనా అని పట్టుదల తెచ్చుకుని, శత్రువును ఓడించి తన రాజ్యం తిరిగి దక్కించుకున్నాడు.

ఇలాంటి కథలు పిల్లలకు అవసరం. భారతదేశం అదృష్టవశాత్తూ కథల భాండాగారం. కాని తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ భాండాగారాన్ని వారికి దూరం చేస్తోంది. పిజా, బర్గర్, సినిమా, వీడియోగేమ్స్... అడిగితే ఇవ్వొచ్చు. తప్పు లేదు. కాని తోడుగా పుస్తకం కూడా ఇవ్వాలి. అప్పుడే పిజ్జా, బర్గర్, వీడియోగేమ్స్ ఇవ్వలేని ఒక అంతఃజ్ఞానం దాని ద్వారా అందుతుంది. రేపో మాపో స్కూళ్లు తెరవబోతున్నారు. వారి కోసమని నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు కొనడమే ముఖ్యమనుకోవద్దు. ఈ పుస్తకాలు కొనడం, చదివించడం కూడా ముఖ్యమే. హార్లిక్స్, బూస్ట్, పిడియాషూర్‌లలాగే పుస్తకాలు కూడా బలవర్థకమైన ఆహారం. కాకుంటే మేధకు.
 
బొమ్మల రామాయణం, భారతం

పిల్లలకు ఇవి ఉగ్గుపాల వంటివి. కథ పట్ల తొలి కుతూహలం కలిగించే రామాయణ, భారతాలను పిల్లలు వాటి నాయకులైన రాముడు, కృష్ణుడు కోసమే కాకుండా ఆంజనేయుడు, కుంభకర్ణుడు, భీముడు, అర్జునుడు, బకాసురుడు, ఘటోత్కచుడు కోసం కూడా ఇష్టపడతారు. విలువలను నేర్పడంలో రామాయణం ముందుంటే విలువలను ఉల్లంఘిస్తే జరిగే పెను పరిణామాలను భారతం తెలియచేసి హెచ్చరిస్తుంది.
 
  అరేబియన్ నైట్స్
 మొత్తంగా ఈ పేరుతో తెలుగులో పుస్తకాలు లేవు. కాని అరేబియన్ నైట్స్‌లో విస్తృతంగా ఖ్యాతి పొందిన సింద్‌బాద్, అల్లావుద్దీన్ అద్భుతదీపం, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ, ఎగిరే కంబళి వంటి కథలన్నీ పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. వీటి మూలం భారతదేశమే అని అంటారు. కాని అరేబియా ప్రాంతంలో బహుళ ప్రచారం పొంది తిరిగి భారతదేశం చేరాయి.
 
  పంచతంత్రం

 కథలతో కూడా పాఠాలు నేర్పించవచ్చు అని నిరూపించిన తొలి వరుస కథలివి. ప్రపంచానికి భారతదేశం అందించిన ఘనసంపద. ఈ సంగతి పిల్లలకు తెలియచేయాలి. వీటిని వారి చేత చదివించాలి. మిత్రలాభం, మిత్రభేదం ఈ రెంటి మర్మం తెలుసుకోకపోతే అడుగు ముందుకు పడేదెలా? మహా పండితుడు  విష్ణుశర్మ  అజ్ఞానులైన రాజకుమారులకు విజ్ఞానం నేర్పే క్రమంలో జంతువులను ప్రధాన పాత్రలుగా తీసుకుని వాటి ద్వారా సకల శాస్త్రాలు వివరించాడు. లోకం పన్నే ఎరలు తెలియాలంటే ఈ కథలు తప్పనిసరి కదా. వీటిని సంస్కృతం నుంచి తెలుగుకు తెచ్చిన చిన్నయసూరి, కందుకూరి వీరేశలింగం గురించి కూడా పిల్లలకు తెలపాలి.
 
కాశీ మజిలీ కథలు
 ప్రయాణంలో కథకు మించిన కాలక్షేపం లేదు. ఆ విధంగా ఇవి తెలుగులో జర్నీ స్టోరీస్. మధిర సుబ్బన్న దీక్షితులు వీటి సృష్టికర్త. ఒక గురువు తన శిష్యులతో కాశీ ప్రయాణమై దారిలో ఆగిన ప్రతిచోట ఒక కథ చెప్పేవారుట. ఆ కథల ద్వారా విద్యార్థులకు జ్ఞానబోధ జరిగేది.  ఈ కథల్లో  హాస్యంతో పాటు చతురత, విజ్ఞత కూడా ఉంటాయి. ఈ కథల ఆధారంగా గులేబకావళికథ, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి, పాతాళభైరవి, నవ్వితే నవరత్నాలు... వంటి సినిమాలు రూపొందాయి.
 
  పెద్దబాలశిక్ష

 అసలేం చదవకపోయినా పెద్దబాల శిక్ష చదివినా చాలు అనంటారు పెద్దలు. తెలుగువారి సారస్వత సర్వసాన్ని రేఖామాత్రంగా ఒక్కచోటే చేర్చి తెలిపే విలువైన కూర్పు ఇది. తెలుగు భాషలోని అక్షరాల దగ్గర నుంచి చిన్న చిన్న పదాలు, నీతి వాక్యాలు, పది పంక్తులలో వచ్చే కథలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం... వంటి అన్ని విషయాలకూ నెలవైన ఒక విజ్ఞాన సర్వస్వం. ఈ పుస్తకం ఎప్పటికప్పుడు కాలానుగుణంగా కొత్త కొత్త అంశాలను సైతం ఇందులో చేరుస్తోంది. బుడ్డిగ సుబ్బరాయన్, గాజుల సత్యనారాయణ ఈ కూర్పుతో ప్రసిద్ధి చెందారు.
 
  నీతి శతకాలు

 ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు రాని బాలలు మన ఇంట్లో ఉన్నారంటే మనం తెలుగువారు కాదనే లెక్క. నీతి శతకాల నుంచి కనీసం ఇరవై ముప్పై పద్యాలు కంఠతా పట్టడం వల్ల నీతి, ధర్మం, మర్మం తెలియడమేగాక వాక్శుద్ధి కూడా కలుగుతుంది.  సుమతీ, వేమన, భర్తృహరి ఈ శతకాలు తప్పనిసరిగా పిల్లల షెల్ఫుల్లో ఉండాలి. తళుకుబెళుకుల రాళ్లు తట్టడేల అన్నాడు వేమన. నీతి శతకాలు పిల్లలను నిక్కమైన నీలాల్లా మారుస్తాయి. నిండైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి.
 
  తెనాలి రామలింగడు, మర్యాద రామన్న కథలు,
 పరమానందయ్య కథలు

 ఈ కథలన్నీ యుక్తి కథలు. ఆపద కలిగినప్పుడు తెలివిగా తప్పించుకోవడానికి  మార్గాలు చూపే  కథలు. తెనాలి రామలింగడు తన తెలివితేటలు, చమత్కార ధోరణితో శ్రీకృష్ణదేవరాయలను ఎన్నోమార్లు రక్షించాడు. మర్యాద రామన్న కథలలో రామన్న చెప్పే తీర్పు వల్ల ప్రతిసారీ న్యాయం జరుగుతూ, చెడ్డవారికి శిక్షలు పడుతుంటాయి. పరమానందయ్య గారి శిష్యుల కథలో వారు తెలివితక్కువగా చేసే పనుల వల్ల గురువుగారికి ప్రతిసారి గండం తప్పుతూ ఉంటుంది. ఒక్కసారి అలవాటు చేస్తే పిల్లలు వీటిని వదలరు.
 
అక్బర్- బీర్బల్ కథలు, ముల్లా నస్రుద్దీన్ కథలు
 ఉత్తరాది నుంచి దక్షణాదికి ఆ తర్వాత ప్రపంచమంతటికీ పరిచమైన ఉల్లాసకరమైన కథలు ఇవి. అక్బర్ ఒక పొడుపు కథ వేయడం, ఆయన స్నేహితుడు, మంత్రి అయిన బీర్బల్ ఆ పొడుగు కథను విప్పడం పిల్లలకు ‘పజిల్‌ను సాల్వ్’ చేసే తర్ఫీదును ఇస్తాయి. ఇక ముల్లా నస్రుద్దీన్‌కు మన తెనాలి రామలింగడుకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ తుంటరి పనులతో చెడును సంస్కరించడానికి ప్రయత్నించినవారే. ముల్లా గాడిద మీద వెనక్కు తిరిగి కూచుని ఊరూరా తిరుగుతూ చేసే చమత్కారాలు బాలలకు అత్యంత ఇష్టం.
 
 బుడుగు

బాపు రమణలు తెలుగువారికి అందించిన అమూల్యమైన పాత్ర బుడుగు. అంతవరకూ ప్రతి ఇంట్లో అల్లరి పిల్లవాణ్ణి బాల కృష్ణుడితో పోల్చేవారు. ఈ పాత్ర వచ్చాక బుడుగుతో పోల్చడం మొదలెట్టారు. బాల్యంలో ఉండే అమాయకత్వం, ఆరిందాతనం, ముద్దుమాటలు అందరినీ అలరిస్తాయి. ఈ పుస్తకం చదివితే హాస్య స్ఫోరకమైన భాష అలవడుతుంది.
 
 టామ్‌సాయర్, హకల్‌బరీ ఫిన్
ఆంగ్లంలో మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్‌బరీ ఫిన్ కథలను ప్రముఖ సంపాదకులు నండూరి రామ మోహనరావుగారు తెలుగులో రచించారు. ఈ కథలు పిల్లలకు చాలా థ్రిల్ కలిగిస్తాయి. మనం కూడా సాహసం చేద్దాం అని చదవగానే పిల్లలకు అనిపిస్తుంది.
 - డా. వైజయంతి, సాక్షి, చెన్నై
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement