ఇంకా అందని పుస్తకం.. మొదలవ్వని పాఠం | Lessons have not started in govt schools yet | Sakshi
Sakshi News home page

ఇంకా అందని పుస్తకం.. మొదలవ్వని పాఠం

Published Mon, Jul 3 2023 1:36 AM | Last Updated on Mon, Jul 3 2023 8:30 AM

Lessons have not started in govt schools yet - Sakshi

పాఠశాలలు ప్రారంభించి 15 రోజులవుతోంది. ప్రైవేటు స్కూళ్లలో ఇప్పటికే కొన్ని చాప్టర్లకుసంబంధించిన పాఠాలు పూర్తయ్యాయి. కానీ వేలాది ప్రభుత్వ పాఠశా­లల్లో మాత్రం ఇప్పటివరకు కనీసం ఒక్క పాఠం కూడా ఉపాధ్యాయులు బోధించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుంటే... ఇప్పటికీ 15 వేలకు పైగా స్కూళ్ళలో ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో జూలై నెల ప్రారంభమైనా ఇంకా పునఃశ్చరణకే పరిమితం అవ్వాల్సి వస్తోంది.  –సాక్షి, హైదరాబాద్‌


హెచ్‌ఎంలకు బిల్లులు ఇవ్వకపోవడంతో..
వాస్తవానికి స్కూళ్ళు తెరిచేలోగా పుస్తకాలు ఇస్తామ­ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే పుస్తకాల ముద్రణపైనా దృష్టి పెట్టారు. ముద్రణ పూర్తయిన పుస్తకాలను స్కూళ్ళు తెరిచేలోగానే జిల్లా కేంద్రాలకు పంపారు. కానీ వాటిని వేసవి సెలవులు ముగిసేలోగా స్కూళ్ళకు చేరవేయడంలో సర్కారు విఫలమయ్యింది. ప్రతి ఏటా స్కూళ్ల ప్రధానో­పాధ్యాయులు జిల్లా కేంద్రాల నుంచి స్కూళ్ళకు పుస్తకాలు చేరవేసే వాళ్ళు.

ఇందుకయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించేది. అయితే గత ఏడాదికి సంబంధించిన బిల్లులు ఏడాది గడిచినా ఇవ్వకపోవడంతో హెచ్‌ఎంలు ఈ ఏడాది మొండికేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం వరకు పుస్తకాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే ఉండిపో­యాయి. ఈ నేపథ్యంలో రవాణా కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని విద్యాశాఖ ఆదేశించినా, ఈ ప్రక్రియ కూడా చాలా ఆలస్యం అయ్యింది.

టెండర్ల ఖరారులో ఆలస్యం..
పుస్తకాలను స్కూళ్లకు రవాణా చేసేందుకు ప్రతి జిల్లా డీఈవో పరిధిలో టెండర్లు పిలిచారు. అయితే స్కూళ్ళు తెరిచిన తర్వాత టెండర్లు పిలవడంతో వాటిని ఖరారు చేసేవరకే జూన్‌ నెలాఖరు అయ్యింది. ఈ కారణంగానే రాష్ట్రంలోని సగానికిపైగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అందలేదు. పుస్తకాల రవాణా పూర్తి చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని టెండర్లు దక్కించుకున్న సంస్థలు చెబుతున్నాయి. 

పంపిణీ పూర్తయినా కొరతే..
రాష్ట్రవ్యాప్తంగా 28,77,675 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. వీరికి ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. సబ్జెక్టులు, లాంగ్వేజీలు కలిపి 1,63,78,607 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ముద్రించినవి పోను, 1,57,48,270 పుస్తకాలు అందించాల్సి ఉంది.

ఇప్పటివరకు 1,35,85,185 పుస్తకా­లు ముద్రించి, జిల్లా కేంద్రాలకు కూడా చేరవేశారు. ఇంకా 14 శాతం పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వాటి పంపిణీ పూర్తి చేసినా, కొన్ని స్కూళ్ళకు పుస్తకాల కొరత తప్పేట్టు లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశా­లలకు వచ్చే నెలాఖరు వరకూ కూడా పుస్తకాలు అందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. 

రెగ్యులర్‌ క్లాసులు మొదలు పెట్టాలి..
పుస్తకాల పంపిణీ ఆలస్యమై ఇప్పుడిప్పుడే పాఠశాలలకు చేరుతుండటంతో.. ప్రస్తుతం చాలావరకు ప్రాథమిక పాఠశాలల్లో గతేడాది మొదలు పెట్టిన తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రాథమి­కోన్నత పాఠశాలలు, హైస్కూల్స్‌లో పునఃశ్చరణ చేస్తున్నారు. కోవిడ్‌ కాలంలో జరిగిన అభ్యసన నష్టాన్ని పూడ్చడం కోసం ఈ ప్రక్రియ అనివా­ర్యమని విద్యాశాఖ భావించింది. అయితే దీన్ని అదనపు గంటల్లో చేపట్టి, రెగ్యులర్‌ క్లాసులు మొదలు పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement