సాక్షి, మంచిర్యాల : ఊహించినట్టే జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నా.. ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు ఇంకా చేరనే లేదు. చాలా చోట్ల.. కనీసం మండల వనరుల కేంద్రాలకూ చేరుకోలేదు. స్కూళ్లు తెరిచేలోగా.. పుస్తకాలు పాఠశాలలకు చేర్చి విద్యార్థులందరికీ అదే రోజు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. జిల్లాకు 17.40 లక్షల పుస్తకాలు అవసరముండగా.. ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోదాముకు 16 లక్షల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇటు.. జిల్లాకు వచ్చిన పుస్తకాలను మండలాలకు చేరవేయడంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటి వరకు కేవలం 10 లక్షల పుస్తకాలు మాత్రమే మండల వనరుల కేంద్రం (ఎమ్మార్సీ)లకు వెళ్లాయి. వాటిలో 4 లక్షలకు మించి పుస్తకాలు స్కూల్ పాయింట్లకు చేరలేదు. మరోపక్క.. జిల్లాలో 270 స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం అమలవుతున్నా.. అందులో చదువుతున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన లక్ష పాఠ్యపుస్తకాల్లో ఒక్కటీ జిల్లాకు రాలేదు. దీంతో విద్యార్థులు తొలి రోజు ఖాళీ చేతులతోనే ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. మరోపక్క.. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన పుస్తకాలన్నీ తెలుగు మాద్యమానికి సంబంధించినవే.
ఇంగ్లిష్.. హిందీ.. మరాఠీ.. ఉర్దూ మాద్యమాలకు సంబంధించిన పుస్తకాలు ఇంకా జిల్లాకే రాలేదు. అవి వచ్చి.. ఎమ్మార్సీలకు అక్కడి నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందో తమకే తెలియదని అధికారులే చెప్పడం గమనార్హం. ఈ విషయమై పాఠ్య పుస్తక గోదాము జిల్లా మేనేజర్ రమేశ్ వివరణ ఇస్తూ.. ‘తెలుగేతర పాఠ్య పుస్తకాలు ఇంకా జిల్లాకు రాలేదు. వచ్చిన వెంటనే స్కూళ్లకు పంపిస్తాం’ అని అన్నారు.
అరకొరగా పంపిణీ
జిల్లాలో అన్ని యాజమాన్యాల్లో కలుపుకుని 4,200 ప్రభుత్వ ప్రాథమిక, 750 ప్రాథమికోన్నత, 540 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఎయిడెడ్, కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తోంది. ఈ క్రమంలో గత విద్యా సంవత్సరం అక్టోబర్ నెలలోనే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వచ్చే సంవత్సరానికి అవసరమయ్యే పాఠ్య పుస్తకాలను సబ్జెక్టుల వారీగా జిల్లా విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. అవి డీఈవో ఆమోదముద్ర తర్వాత విద్యాశాఖ డెరైక్టర్‌కు వెళ్లాయి.
అప్పుడే పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రారంభం కావల్సి ఉండగా.. ఈసారి 6 నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రంలో తెలంగాణ చరిత్ర.. ఉద్యమకారుల జీవిత విశేషాలు, తెలుగు, హిందీ పాఠ్యాంశాల్లో తెలంగాణ సాహిత్యం-కవులు, కళాకారుల జీవిత విశేషాలు చేర్చడంతో కొంత ఆలస్యమైనట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ.. జిల్లాకు వచ్చిన పుస్తకాలు మండలాలకు పంపడంలో ఎందుకు జాప్యమవుతోందో చెప్పలేకపోతున్నారు.
పాఠ్యపుస్తకాల గోదాము ‘తూర్పు’ ప్రాంతంలోనే ఉన్నా.. ఈ ప్రాంత పరిధిలోని సమీప మండలాలకూ ఇంత వరకు పుస్తకాలు పూర్తి స్థాయిలో చేరలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాగజ్‌నగర్‌లో 54 వేల పుస్తకాలు అవసరముంటే.. కేవలం 24 వేలు మాత్రమే వచ్చాయి. చెన్నూరులో 32 వేలకు 27 వేలు, జైపూర్‌కు 31,300లకు 27,600, కాసిపేటలో 21 వేలకు 11,580, నెన్నెలలో 22 వేలకు 11 వేలు, కౌటాలలో 41 వేలకు 31 వేల పుస్తకాలు మాత్రమే వచ్చాయి.
ఆందోళనలో ‘ప్రైవేట్’ విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే.. ఈ సారి ప్రైవేట్ విద్యార్థులకూ పాఠ్య పుస్తకాల బెంగ పట్టుకుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే ప్రైవేట్ స్కూళ్లలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ.. ప్రైవేట్ విద్యా సంస్థలు దీనికి ఒప్పుకోలేదు. తాము తయారు చేసిన సిలబస్ అమలు చేస్తామనే మంకుపట్టుతో ఉన్నారు. మరోపక్క.. జిల్లాలోని పలు పట్టణాల్లోని దుకాణాల్లో ప్రభుత్వ పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఇంత వరకు చేరవేయకపోవడంతో ప్రైవేట్ విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఈ విద్యా సంవత్సరం తొలి నెల రోజుల వరకు విద్యార్థులకు చదువు కష్టాలు తప్పేలా లేవు.
పుస్తకాలేవీ...?
Published Thu, Jun 11 2015 5:32 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement