
సిక్కిం గరీబ్ ఆవాస్ పథకం కింద నిర్మించిన ఇంటి వద్ద తెలంగాణ గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్
చిన్న రాష్ట్రమైన సిక్కింలో పేదలకు ఖరీదైన పేదింటి పథకం
ఇంటితోపాటు సోఫా, టీవీ, రెండు బీరువాల బహుమతి
స్టడీ టూర్‌లో పరిశీలించిన తెలంగాణ అధికారులు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వంతోపాటు అనేక రాష్ట్రాలు నిరుపేదలకు ఉచితంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాయి. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోంది. అయితే, వీటి నిర్మాణ వ్యయం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలకు మించదు. కానీ, దేశంలోని అతిచిన్న రాష్ట్రాల్లో ఒకటైన సిక్కింలో పేదలకు ఏకంగా రూ.17.51 లక్షలతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇంటితోపాటు సోఫా, రెండు బీరువాలు, ఓ టీవీని కూడా ఉచితంగా ఇస్తోందట. తెలంగాణ గృహనిర్మాణ శాఖకు చెందిన ఎస్‌ఈ స్థాయి అధికారులు చైతన్య, ఈశ్వరయ్య కేంద్రప్రభుత్వ స్టడీ టూర్‌లో భాగంగా ఇటీవల సిక్కిం వెళ్లి, ఆ పేదల ఇళ్లను పరిశీలించారు.
సకల సదుపాయాలు
పేదలకు ఉచిత ఇళ్లు అంటే ప్రభుత్వాలు ఏదో కొంత మొత్తం ఇచ్చి మమ అనిపించటం చూస్తుంటాం. కానీ, సిక్కిం ప్రభుత్వం మాత్రం సకల సౌకర్యాలతో పేదలకు ఉచిత ఇళ్లు అందిస్తోంది. సిక్కిం గరీబ్ ఆవాస్ యోజన పథకంలో భాగంగా 678 చదరపు అడుగుల వైశాల్యంతో ఇల్లు నిర్మించి ఇస్తోంది. ఇందులో రెండు పడకగదులు, వంటశాల, లివింగ్ రూమ్, టాయిలెట్ ఉంటాయి. ఇదంతా మామూలే. కానీ, లబ్ధిదారుల కోసం ఒక సోఫా, రెండు స్టీల్ బీరువాలు, ఓ టీవీ సెట్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుండటం విశేషం. ఈ సకల సౌకర్యాల ఇంటికి అక్షరాలా రూ.17.51 లక్షలు ఖర్చవుతోందట. ఇలాంటివి పది వేల ఇళ్లు నిర్మించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అవాక్కైన అధికారులు
ఈ పథకం తీరు చూసి స్టడీ టూర్‌కు వెళ్లిన అధికారులు అవాక్కయ్యారు. ఒక చిన్న రాష్ట్రం ఇంత భారీ వ్యయంతో పథకాన్ని అమలు చేస్తున్న తీరును ఆసక్తితో పరిశీలించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మిజోరం, మహారాష్ట్ర, త్రిపుర, నాగాలాండ్, అస్సాం అధికారులతోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, హడ్కో ప్రతినిధులు కూడా ఈ టూర్ లో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక సాయంతోపాటు రాష్ట్రప్రభుత్వ సొంత నిధులతో ఈ పథకం అమలవుతోంది.
కొండ ప్రాంతం కావటంతో ఈ ఇళ్ల నిర్మాణంలో సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మిస్తున్నట్టు చైతన్య తెలిపారు. అక్కడ రూ.1.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మరో ఇళ్ల పథకం కూడా ఉందని చెప్పారు. పేదల్లో అతి పేదలు, వార్షిక ఆదాయం రూ.లక్ష మించని వారికి ఖరీదైన ఇళ్ల పథకాన్ని వర్తింపచేస్తున్నారని వెల్లడించారు.