అర్హులైన పేదలందరికీ ఇళ్లు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ ఓర్వలేకపోతోంది..
మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్‌ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్‌ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment