Indiramma Houses Scheme
-
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసన సభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. నాలుగు నెలల క్రితం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.వీటిల్లో ఇందిర మ్మ ఇళ్ల కోసం 80 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, వాటిల్లో ప్రాథమిక స్థాయిలో 16 లక్షల దర ఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 64 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. కానీ ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబితా రూపొందించనున్నందున, ఈ దరఖాస్తులతో పాటు కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలదే హవా..నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికీ ఏ పథకంలో కూడా ఇళ్లు అందని పేదలనే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల స్క్రూటినీ కీల కంగా మారనుంది. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల్లో చాలావరకు గతంలో ఇళ్లు పొందిన వారికి సంబంధించినవీ ఉన్నాయని సమాచారం. ఆధార్ నంబరు, ఇతర వివరాల ఆధారంగా ఇప్పటికే ఆ విధంగా ఇళ్లు పొందినవారి దరఖాస్తులను తొలగించనున్నారు.అయితే గతంలో ఇల్లు పొందినా, ఆ తర్వాత వారి పిల్లల పెళ్లిళ్లు కావటంతో మరో ఇంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఆ దరఖాస్తు అర్హమై నదే అవుతుంది. దీంతో దరఖాస్తుల్లోని వివరాల పరిశీలనే కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీ లించాల్సి ఉంటుంది. దీనిపై పెద్దయెత్తున కసరత్తు అవసరం కాగా.. లబ్ధిదారుల ఎంపికలో తుది ఆమోదముద్ర జిల్లా ఇన్చార్జి మంత్రే వేయను న్నారు.అంటే ఎమ్మెల్యేలు సిఫారసు చేసే వాటికే ఆమోదముద్ర పడే అవకాశం ఉంటుంది. ఏయే ఊళ్లను ఎంపిక చేయాలి, ఆ ఊళ్లలో ఎవరికి ఇళ్లు మంజూరు చేయాలి అన్న దానిపై ఎమ్మెల్యేల నిర్ణయానికే ప్రాధాన్యం దక్కనుంది. దీంతో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకే వీరు పరిమితం అయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పాత దరఖాస్తులు అలంకారప్రాయమే!ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవ టం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో చాలా అంశాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి మరీ జాబితాలు రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు అలంకారప్రాయంగానే మిగిలిపోయే పరిస్థితి ఉండనుంది. -
వచ్చేవి గృహలక్ష్మి ఇళ్లా! లేక.. ఇందిరమ్మ ఇళ్లా!
దురాజ్‌పల్లి (సూర్యాపేట): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుదారుల్లో సందిగ్ధ్దత నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు ఆమోదిస్తారా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మళ్లీ స్వీకరిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్చి ఉంది. ఒకవేళ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తే గతంలో గృహలక్ష్మి పథకం కింద ఎంపికై ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన చోట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే ఇప్పటి వరకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు వృథాయేనా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూం సక్సెస్ కాకపోవడంతో.. గృహలక్ష్మి పథకానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో అనుకున్న స్థాయిలో ఆ పథకం సక్సెస్ కాలేదు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. నిర్మించిన ఇళ్లు తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సొంతస్థలం ఉన్న వారికి గృహ నిర్మాణం కోసం మూడు విడతల్లో రూ.3లక్షల నగదు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో మొత్తం 58,564 దరఖాస్తులు రాగా క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు. వీటిలో 34,849 మందిని అర్హులుగా తేల్చి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల యూనిట్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోకవర్గాల్లో 12వేల యూనిట్లకు మంజూరు పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. దీంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. మిగతా ఆశావహులు సైతం వారికి అందుతాయని భావించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. తమ హామీల్లో భాగంగా గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అమలు చేయాలని యోచిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించింది. సాయం పెంపుపై అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా.. కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో, విధివిధానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో సుమారు 70 వేలకు పైగా కుటుంబాలు సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు సమాచారం. -
ఉద్యోగాలు ఊడుతాయా?
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మంజూరులో అక్రమాల కేసును తిరగదోడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం ఇప్పుడు హౌసింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. వివిధ కారణాలతో నిలిచిపోయిన కేసులో దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని సీఎం స్పష్టం చేయడంతో ఇళ్ల అక్రమాల రికార్డుల బూజును అధికారులు దులుపుతున్నారు. కేసును తిరగతోడడంతోపాటు బాధ్యులపై చర్యలకు సిఫారసు చేయాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు కసరత్తు కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా కేసులు నమోదవుతాయేమోననే భయం గృహనిర్మాణశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వాస్తవానికి అర్హుల ఇళ్ల జాబితాను ఫైనల్ చేసే బాధ్యత తమదే అయినా ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే చేయాలన్న ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు చేశామని, ఇప్పుడు కేసును తిరగదోడి జైలుకు వెళ్లే పరిస్థితులు కల్పిస్తున్నారని ఇంజనీర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేలపై.. దర్యాప్తులో భాగంగా సీఐడీ పరిశీలించిన 19 నియోజకవర్గాల్లోని 38 గ్రామాల్లో అప్పటి ఎమ్మెల్యేల సిఫారసు మేరకు ఇళ్ల మంజూరు, బిల్లుల జారీ జరిగిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఒకే వ్యక్తికి 2-3 ఇళ్లను సిఫారసు చేయడంలో ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో ఎమ్మెల్యేలపైనా చర్యలకు ప్రభుత్వం అనుమతిస్తే అదే రీతిలో దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ఎమ్మెల్యేలు, కొందరు దళారులను మొదటి జాబితాలో చేర్చి అరెస్టుకు సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే దర్యాప్తు పునఃప్రారంభిస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గతంలో మూసేశారు... : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వాటి బిల్లుల మంజూరులో అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని 2015లో సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో 19 నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు తదితరాలపై సీఐడీ 3 నెలలపాటు వేగంగా దర్యాప్తు చేసింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు అనూహ్యంగా ఆగిపోయింది. 2016లో మళ్లీ కొంత కదలిక వచ్చినా నిందితుల జాబితా, అరెస్టుల వరకు వెళ్లలేదు. ఎందుకంటే ఇళ్ల నిర్మాణం, కేటాయింపుల్లో పూర్తిగా ప్రభుత్వాధికారులు, గతంలోని ప్రజాప్రతినిధులు తదితరుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే విషయాన్ని సీఐడీ ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో ఆ విచారణ కాస్తా ఆగిపోయింది. అక్రమాలపై గతంలో విచారణ జరిపిన సీఐడీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం సింహభాగం అసిస్టెంట్ ఇంజనీర్లే (ఏఈలు) బాధ్యులని తేల్చడం గమనార్హం. -
‘అయ్యో’ వై..!
నిరుపేదలకు సొంతింటి భాగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై) అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంగళం పాడగా.. కొత్తగా అమలు చేయాలని యోచించిన డబుల్ బెడ్రూం కార్యక్రమంపై అయోమయం నెలకొంది. దీంతో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన ఐఏవై నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ క్రమంలో 2014-15 వార్షిక లక్ష్యం ఇప్పటికీ పూర్తికాకపోగా.. 2015-16 సంవత్సరానికి సంబంధించి విడుదలైన నిధుల్లో పైసా కూడా వినియోగంలోకి రాలేదు. * ఇందిరమ్మకు ఐఏవై ఇళ్ల అనుసంధానం * మరుగున పడిన ఇందిరమ్మ ఇళ్ల పథకం * ముందుకు సాగని ‘డబుల్బెడ్రూం’ * బ్యాంకుల్లో మూలుగుతున్న ఐఏవై నిధులు * మరో నెలలో ఖర్చు చేయకుంటే వెనక్కే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)ను గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుసంధానం చేశారు. దీంతో ఈ పథకం కింద వచ్చే నిధులతో పేదలకు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అర్హతను బట్టి విడుదల చేశారు. తాజాగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో పలువురు లబ్ధిదారులు ఎంపికైనప్పటికీ.. వారికి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపింది. కొత్తగా డబుల్బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పిస్తామని సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లతో అనుసంధానమైన ఐఏవై తాజాగా వేరుపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ఐఏవై కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో హౌజింగ్ అధికారులు ఐఏవైను పక్కనబెట్టారు. నెలరోజుల్లో ఖర్చు చేయకుంటే వెనక్కే...! 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఐఏవై కింద జిల్లాకు రూ. 13.10కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 3.97కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.97కోట్లు విడుదల చేసింది. ఇవిగాకుండా రూ.50 లక్షలు జిల్లా యంత్రాంగం వద్ద నిల్వ ఉన్నాయి. మొత్తంగా జిల్లా యంత్రాంగం వద్ద రూ. 8.44కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో నెలరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందుబాటులో నిధులు ఖర్చు చేయాలి. లేదంటే మంజూరైన నిధులన్నీ తిరిగి వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐఏవైపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే అందుబాటులో నిధులన్నీ వృథా కానున్నాయి. 2014-15 వార్షిక సంవత్సరంలో ఐఏవై కింద జిల్లాకు 3,430 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో అర్హులను గుర్తించిన యంత్రాంగం వారికి మంజూరు పత్రాలను ఇచ్చింది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాలు మొదలైనప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 2,603 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 827 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. -
70 వేల ఇందిరమ్మ ఇళ్లు రద్దు?
మోర్తాడ్: గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల ఇళ్లు రద్దు అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను, అంతకు ముందు సంవత్సరాల్లో మంజూరు అయిన ఇళ్లకు సంబంధించి ఎంతో కొంత బిల్లు చేసిన ఇళ్లను మాత్రమే ఆన్లైన్లో ఉంచిన అధికారులు అసలే బిల్లు చేయని ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అయితే, పాత విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త విధానానికి దివంగ త ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించి ఆర్థిక సహాయాన్ని పెంచారు. సకల సదుపాయాలు కల్పిం చే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు బెడ్రూం లు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాతురూం కలిగిన ఇంటిని రూ. మూడు లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తామని ప్రకటించింది. అయితే ఇంతవరకు గృహనిర్మాణ సంస్థ ద్వారా అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన పాలసీని ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందనే నమ్మకంతో ఎంతో మంది ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. బంధు, మిత్రులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి అనేక మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభిం చారు. ఎలాగూ ఇల్లు మంజూరు అయ్యింది కదా అని భావించిన లబ్ధిదారులు బిల్లు వచ్చిన తరువాత అప్పులు తీర్చేయవచ్చని ఆశించి ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు. అయితే రాష్ట్ర విభజనకు ముందుగానే బిల్లుల చెల్లింపునకు వెబ్‌సైట్‌ను క్లోజ్ చేసిన గృహనిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కు అనుమతి ఇవ్వలేదు. వెబ్సైట్ ఆన్‌లో ఉంటేనే ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు చెల్లించే వీలు ఉంది. ఇళ్లు మంజూరు అయినా ఎంతో కొంత బిల్లు చెల్లింపు జరుపకపోవడంతో 70 వేల ఇళ్లు రద్దు కానున్నాయని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పాతవి, కొత్తవి కలుపుకుని 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో 25 వేల ఇళ్లు 50 శాతం నిర్మాణ దశను పూర్తి చేసుకున్నాయి. 30 వేల ఇళ్ల నిర్మాణం మొదలు కావడంతో 10 శాతం బిల్లు చెల్లింపు జరిగింది. 70 వేల ఇళ్లకు అసలే బిల్లు చెల్లింపు జరుగకపోవడంతో అవి రద్దు కానున్నాయి. మంజూరు అయి రద్దు అవుతున్న ఇళ్ల స్థానంలో రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూం గల ఇంటిని మంజూరు చేస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పథకం ప్రకారం తమకు ఇళ్లు మంజూరు అయితే పర్వాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం విషయమై ప్రభుత్వ పాలసీ ఖరారు కాక పోవడంతో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వెబ్సైట్ క్లోజ్ అయ్యింది. వెబ్సైట్ ఆన్‌లో ఉంటే ఏదైనా చెప్పగలం. ఇళ్లు రద్దు విషయం మాకు అధికారికంగా ఇంకా తెలియలేదు. బిల్లులు అసలే చెల్లించకుంటే ఆ ఇళ్లను రద్దు చేస్తారా లేక కొత్త పథకం కింద తీసుకుంటారో ఇంకా స్పష్టత లేదు.