‘అయ్యో’ వై..!
నిరుపేదలకు సొంతింటి భాగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై) అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంగళం పాడగా.. కొత్తగా అమలు చేయాలని యోచించిన డబుల్ బెడ్‌రూం కార్యక్రమంపై అయోమయం నెలకొంది. దీంతో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన ఐఏవై నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ క్రమంలో 2014-15 వార్షిక లక్ష్యం ఇప్పటికీ పూర్తికాకపోగా.. 2015-16 సంవత్సరానికి సంబంధించి విడుదలైన నిధుల్లో పైసా కూడా వినియోగంలోకి రాలేదు.
* ఇందిరమ్మకు ఐఏవై ఇళ్ల అనుసంధానం
* మరుగున పడిన ఇందిరమ్మ ఇళ్ల పథకం
* ముందుకు సాగని ‘డబుల్‌బెడ్‌రూం’
* బ్యాంకుల్లో మూలుగుతున్న ఐఏవై నిధులు
* మరో నెలలో ఖర్చు చేయకుంటే వెనక్కే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)ను గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుసంధానం చేశారు. దీంతో ఈ పథకం కింద వచ్చే నిధులతో పేదలకు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అర్హతను బట్టి విడుదల చేశారు. తాజాగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో పలువురు లబ్ధిదారులు ఎంపికైనప్పటికీ.. వారికి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపింది. కొత్తగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పిస్తామని సర్కారు ప్రకటించింది.
ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లతో అనుసంధానమైన ఐఏవై తాజాగా వేరుపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ఐఏవై కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో హౌజింగ్ అధికారులు ఐఏవైను పక్కనబెట్టారు.
నెలరోజుల్లో ఖర్చు చేయకుంటే వెనక్కే...!
2015-16 ఆర్థిక సంవత్సరంలో ఐఏవై కింద జిల్లాకు రూ. 13.10కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 3.97కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.97కోట్లు విడుదల చేసింది. ఇవిగాకుండా రూ.50 లక్షలు జిల్లా యంత్రాంగం వద్ద నిల్వ ఉన్నాయి. మొత్తంగా జిల్లా యంత్రాంగం వద్ద రూ. 8.44కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో నెలరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందుబాటులో నిధులు ఖర్చు చేయాలి. లేదంటే మంజూరైన నిధులన్నీ తిరిగి వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఐఏవైపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే అందుబాటులో నిధులన్నీ వృథా కానున్నాయి. 2014-15 వార్షిక సంవత్సరంలో ఐఏవై కింద జిల్లాకు 3,430 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో అర్హులను గుర్తించిన యంత్రాంగం వారికి మంజూరు పత్రాలను ఇచ్చింది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాలు మొదలైనప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 2,603 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 827 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.