Indira Awas Yojana
-
లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
-
లక్షన్నర ‘ఇందిరమ్మ’ ఇళ్లు రద్దు!
♦ అనర్హులు లబ్ధిపొందినట్లు తేలడంతో జాబితా నుంచి తొలగింపు ♦ మిగతా 2.10 లక్షల ఇళ్ల బిల్లుల మంజూరుకు ఓకే ♦ అవకతవకల వడపోత తర్వాత స్పష్టత ♦ తొలివిడతలో రూ.197 కోట్ల విడుదలకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకంలో అనర్హులు లబ్ధిపొందినట్లుగా గుర్తించిన లక్షన్నర ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మిగతా 2.10 లక్షల ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అందులో తొలి విడతగా దాదాపు రూ.197 కోట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ 2.10 లక్షల ఇళ్లను పూర్తి చేయాలంటే దాదాపు రూ.1,100 కోట్లు అవసరం. అయితే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద గతంలో కేంద్రం మంజూరు చేసిన రూ.510 కోట్లు గృహ నిర్మాణ శాఖ వద్ద ఉన్నాయి. అవి పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. దాదాపు మూడేళ్లుగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనిపై సీఐడీ విచారణ జరిపించగా.. అక్రమాలు నిజమేనని వెల్లడైంది. దాంతో ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల సంగతి అటకెక్కినట్లేననే భావన వ్యక్తమైంది. అయితే అర్హులైన పేదలు బిల్లులు అందక ఇబ్బంది పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కొన్ని బిల్లులైనా మంజూరు చేయాలని నిర్ణయించి.. 2016లో కొన్ని నిధులు మంజూరు చేసింది. కానీ అది కూడా నిలిచిపోయింది. తాజాగా ఇందిరమ్మ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగనివ్వమని, వారికి మొత్తం బిల్లులు మంజూరు చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బిల్లుల మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణ ఎలా? ‘ఇందిరమ్మ’ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.510 కోట్ల ఐఏవై నిధులు పోను.. రాష్ట్రం మరో రూ.600 కోట్ల మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధుల్లేక హడ్కో నుంచి రుణంగా తీసు కుంటున్నారు.దీంతో ఇందిరమ్మ బిల్లుల చెల్లిం పు ప్రభుత్వానికి భారంగా మారనుంది. ఇప్పుడు సిబ్బంది కరువు? ఇందిరమ్మ బిల్లుల మంజూరులో కొత్త సమస్య వచ్చిపడింది. గతంలో గృహ నిర్మాణశాఖ సిబ్బంది బిల్లులు చెల్లించేవారు. ఇటీవల ఆ విభాగాన్ని ప్రభుత్వం రద్దు చేసి.. సిబ్బందిని ఇతర విభాగాలకు డిప్యుటేషన్‌పై పంపింది. అవినీతి ఆరోపణల మేరకు వంద ల మంది తాత్కాలిక సిబ్బందిని తొలగించిం ది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపునకు సిబ్బంది లేని పరిస్థితి ఎదురైంది. దీంతో పంచాయతీరాజ్ విభాగం నుంచి కొంతమంది సిబ్బందిని రప్పించి వారికి బిల్లుల చెల్లింపుపై తర్ఫీదు ఇస్తున్నారు. వారు ‘ఇందిరమ్మ’ ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి, ఫొటోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బిల్లులను మంజూరు చేస్తారు. సోమవారం నుంచి బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశముంది. -
చేనేత పరిస్థితిపై సర్వే
ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల వివరాలను గ్రామాలవారీగా సేకరించి, చేతిమగ్గాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆదేశించారు. దీనిపై 14 అంశాలతో ప్రొఫార్మా పంపామని, మార్చి 5లోగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేయించనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో 2015–16కు సంబంధించి నియో జకవర్గానికి 1,000 ఇళ్లను మంజూరు చేసినందున వాటికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసి 25 ఫిబ్రవరిలోగా సమర్పించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తామన్నారు. గృహ నిర్మాణ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. బీడీ కార్మికుల వివరాలు పంపాలి బీడీ కార్మికులకు గతంలో కేంద్రం ద్వారా మంజూ రు చేసిన వివరాలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 25లోగా సమర్పించాలని సీఎస్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న గొర్రెల యూనిట్లకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివరాలు, డిమాండ్ సర్వే ఈ నెల 27 లోగా సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. సాదా బైనామాల రెగ్యులరైజేషన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి లబ్ధిదారులకు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. పరిహారం చెల్లింపులో పెండింగ్ వద్దు అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చూడడంతోపాటు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మిషన్ భగీరథ ట్రంక్ వర్క్స్‌తోపాటు ఇంట్రా విలేజ్ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామా ల్లో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. -
‘అయ్యో’ వై..!
నిరుపేదలకు సొంతింటి భాగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో తలపెట్టిన ఇందిరా ఆవాస్ యోజన(ఐఏవై) అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మంగళం పాడగా.. కొత్తగా అమలు చేయాలని యోచించిన డబుల్ బెడ్రూం కార్యక్రమంపై అయోమయం నెలకొంది. దీంతో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమమైన ఐఏవై నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. ఈ క్రమంలో 2014-15 వార్షిక లక్ష్యం ఇప్పటికీ పూర్తికాకపోగా.. 2015-16 సంవత్సరానికి సంబంధించి విడుదలైన నిధుల్లో పైసా కూడా వినియోగంలోకి రాలేదు. * ఇందిరమ్మకు ఐఏవై ఇళ్ల అనుసంధానం * మరుగున పడిన ఇందిరమ్మ ఇళ్ల పథకం * ముందుకు సాగని ‘డబుల్బెడ్రూం’ * బ్యాంకుల్లో మూలుగుతున్న ఐఏవై నిధులు * మరో నెలలో ఖర్చు చేయకుంటే వెనక్కే.. సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)ను గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనుసంధానం చేశారు. దీంతో ఈ పథకం కింద వచ్చే నిధులతో పేదలకు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అర్హతను బట్టి విడుదల చేశారు. తాజాగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. కొత్తగా అధికారం చేపట్టిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో పలువురు లబ్ధిదారులు ఎంపికైనప్పటికీ.. వారికి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపింది. కొత్తగా డబుల్బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారికి అవకాశం కల్పిస్తామని సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లతో అనుసంధానమైన ఐఏవై తాజాగా వేరుపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన ఐఏవై కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో హౌజింగ్ అధికారులు ఐఏవైను పక్కనబెట్టారు. నెలరోజుల్లో ఖర్చు చేయకుంటే వెనక్కే...! 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఐఏవై కింద జిల్లాకు రూ. 13.10కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 3.97కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 3.97కోట్లు విడుదల చేసింది. ఇవిగాకుండా రూ.50 లక్షలు జిల్లా యంత్రాంగం వద్ద నిల్వ ఉన్నాయి. మొత్తంగా జిల్లా యంత్రాంగం వద్ద రూ. 8.44కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరో నెలరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందుబాటులో నిధులు ఖర్చు చేయాలి. లేదంటే మంజూరైన నిధులన్నీ తిరిగి వెనక్కు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఐఏవైపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకుంటే అందుబాటులో నిధులన్నీ వృథా కానున్నాయి. 2014-15 వార్షిక సంవత్సరంలో ఐఏవై కింద జిల్లాకు 3,430 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో అర్హులను గుర్తించిన యంత్రాంగం వారికి మంజూరు పత్రాలను ఇచ్చింది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాలు మొదలైనప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 2,603 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 827 ఇళ్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. -
ఐఏవై కింద రాష్ట్రానికి 60 వేల ఇళ్లు
కేంద్రం ఔదార్యంతో తెలంగాణకు లబ్ధి కొత్తగా ఒక్క ఇల్లు నిర్మించకుండానే ఖాతాలోకి రూ.374 కోట్లు ఇందిరమ్మ ఇళ్లనే ఆ ఖాతాలో చూపబోతున్న అధికారులు హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించిన తరుణంలో కేంద్రప్రభుత్వ ఔదార్యం కారణంగా రాష్ట్రఖాతాలోకి రూ.374 కోట్లు చేరనున్నాయి. అదనంగా 60 వేల ఇళ్లను ఇందిర ఆవాస్ యోజన (ఐఏవై) కింద మంజూరు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని కేంద్రం ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో అయితే అదనంగా ఒక్క ఇంటిని కూడా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఈ సొమ్మును పొందేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగున్నర లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాలుగు నెలలుగా వాటికి నయాపైసా విడుదల కాలేదు. దీంతో పనులు పడకేశాయి. బిల్లుల బకాయిలు రూ.450 కోట్లకు చేరుకున్నాయి. బిల్లుల కోసం లబ్ధిదారులు తిరుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. అది తేలితేగాని డబ్బు విడుదల చేయవద్దన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో కేంద్రం అదనంగా 60 వేల ఇళ్లను ఐఏవై కింద మంజూరు చేస్తానని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు వాటిని తీసుకోనందున కోటా మిగిలిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం 60 వేల ఐఏవై ఇళ్లు మంజూరు కాగా, తొలి విడత బడ్జెట్ కింద రూ.187 కోట్లను కొద్దిరోజుల క్రితమే విడుదల చేసింది. మలి దఫాగా మరో రూ.187 కోట్లు రానున్నాయి. ఇంకా అదనపు ఇళ్ల కోసం మరో రూ.374 కోట్లు ఇవ్వబోతోంది. దీంతో, ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లనే ఐఏవై కింద మార్చి ఆ మొత్తాన్ని పొందేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అంటే వివిధ దశల్లో ఉన్న నాలుగున్నర లక్షల ఇళ్లలోంచే వీటిని చూపుతారన్నమాట. ఆమేరకు కేంద్రానికి లెక్కలు కూడా సమర్పిస్తారు. దీంతో కేంద్రం రికార్డుల్లో ఐఏవై ఇళ్ల నిర్మాణం జరిగినట్టు నమోదవుతుంది. -
‘పేదింటి’ని ఆదుకున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పేదల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం దయచూపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేం ద్రం మంజూరు చేసిన ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) ఇళ్లకు సంబంధించి తాజాగా రూ.187 కోట్లను మంజూరు చేసింది. దీనికి రాష్ట్రప్రభుత్వం తన వంతువాటాగా రూ.58 కోట్లను కలిపి రూ.245 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిధులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు కొంచెం ఊతమిచ్చినట్టయింది. బిల్లులు చెల్లించాలంటూ గత కొన్ని నెలలుగా పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవటంతో తీవ్ర ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోవటం, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడంతో తెలంగాణలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలు రూ.450 కోట్లకు చేరుకున్నాయి. ఈ డబ్బులు చెల్లిస్తేగాని పేదలు ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు కొనసాగించలేని దుస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ దర్యాప్తు కొనసాగుతోంది. అది తేలితేగాని బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవటంతో అధికారులు చేతులెత్తేశారు. కనీసం బిల్లులు ఎప్పుడొస్తాయో కూడా లబ్ధిదారులకు చెప్పలేని పరిస్థితి నెలకొనటంతో చాలాచోట్ల వారు కార్యాలయాల్లో ఉండటానికే జంకుతున్నారు. ఈ దశలో కేంద్రం ఇందిరా ఆవాస్ యోజన నిధులు విడుదల చేయటంతో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. అయితే ఇవి కూడా అందరికీ సరిపోయే పరిస్థితి లేకపోవటంతో ఎవరు ముందు బిల్లులు పెడితే వారికే డబ్బులు అందనున్నాయి. 50 శాతం నిధులు అందజేత... కేంద్రం తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో 65 వేల ఐఏవై ఇళ్లను మంజూరు చేసింది. వాటికి సంబంధించి కేంద్రం తన వాటాగా రూ.374 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు సగం నిధులు కేటాయించింది. అధికారులు ప్రత్యేకంగా ఐఏవై ఇళ్లనంటూ నిర్మించటం లేదు. లబ్ధిదారులు కట్టుకున్న వాటిని ఐఏవై ఇళ్లుగా పరిగణిస్తూ కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పిస్తున్నారు. ఇప్పుడు అందజేసిన నిధులకు సంబంధించి నవంబర్‌లో యూసీ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా ఆ నిధులు ఖర్చు చేసి యూసీ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ యూసీ అందితేగాని మలివిడత నిధులు విడుదల కావు.