సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పేదల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం దయచూపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేం ద్రం మంజూరు చేసిన ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) ఇళ్లకు సంబంధించి తాజాగా రూ.187 కోట్లను మంజూరు చేసింది. దీనికి రాష్ట్రప్రభుత్వం తన వంతువాటాగా రూ.58 కోట్లను కలిపి రూ.245 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో నిధులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు కొంచెం ఊతమిచ్చినట్టయింది. బిల్లులు చెల్లించాలంటూ గత కొన్ని నెలలుగా పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవటంతో తీవ్ర ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోవటం, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడంతో తెలంగాణలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలు రూ.450 కోట్లకు చేరుకున్నాయి.
ఈ డబ్బులు చెల్లిస్తేగాని పేదలు ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు కొనసాగించలేని దుస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ దర్యాప్తు కొనసాగుతోంది. అది తేలితేగాని బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవటంతో అధికారులు చేతులెత్తేశారు. కనీసం బిల్లులు ఎప్పుడొస్తాయో కూడా లబ్ధిదారులకు చెప్పలేని పరిస్థితి నెలకొనటంతో చాలాచోట్ల వారు కార్యాలయాల్లో ఉండటానికే జంకుతున్నారు. ఈ దశలో కేంద్రం ఇందిరా ఆవాస్ యోజన నిధులు విడుదల చేయటంతో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. అయితే ఇవి కూడా అందరికీ సరిపోయే పరిస్థితి లేకపోవటంతో ఎవరు ముందు బిల్లులు పెడితే వారికే డబ్బులు అందనున్నాయి.
50 శాతం నిధులు అందజేత...
కేంద్రం తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో 65 వేల ఐఏవై ఇళ్లను మంజూరు చేసింది. వాటికి సంబంధించి కేంద్రం తన వాటాగా రూ.374 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు సగం నిధులు కేటాయించింది. అధికారులు ప్రత్యేకంగా ఐఏవై ఇళ్లనంటూ నిర్మించటం లేదు. లబ్ధిదారులు కట్టుకున్న వాటిని ఐఏవై ఇళ్లుగా పరిగణిస్తూ కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పిస్తున్నారు. ఇప్పుడు అందజేసిన నిధులకు సంబంధించి నవంబర్‌లో యూసీ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా ఆ నిధులు ఖర్చు చేసి యూసీ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ యూసీ అందితేగాని మలివిడత నిధులు విడుదల కావు.
‘పేదింటి’ని ఆదుకున్న కేంద్రం
Published Sun, Oct 19 2014 2:21 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement