poor homes
-
దర్జాగా కబ్జా
♦ కార్పొరేషన్లో రూ.15 కోట్ల విలువైన స్థలం కబ్జాకు రంగం సిద్ధం ♦ అన్న క్యాంటీన్ పేరుతో అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమైన టీడీపీ నేత ♦ స్థలం అప్పగింతకు సిద్ధమైన నగరపాలక సంస్థ అధికారులు ♦ అధికార పార్టీ నేతలకే భవనం కూల్చివేత కాంట్రాక్టు ♦ కూల్చివేత పనుల్లోనూ నిబంధనలకు పాతర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలున్నా... ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి పేదలను రోడ్డుకీడ్చి మరీ నాడు నగర పాలక సంస్థ అధికారులు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నేడు మాత్రం కోట్లాది రూపాయల విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి, స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒంగోలు నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ సమీపంలో రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా కొట్టేసేందుకు స్థానిక టీడీపీ ముఖ్యనేత ఒత్తిడి తేగా ఆ స్థలం అప్పగింతకు మున్సిపల్ అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు బండ్లమిట్ట ప్రాంతంలో ఇటీవల వందలాది పేదల ఇళ్లు కూల్చివేసి ఆ స్థలంతో పాటు ఊరచెరువును అధికార పార్టీ నేతలకు ఆదాయవనరుగా మార్చేందుకు సిద్ధమైన ఒంగోలు మున్సిపల్ అధికారులు తాజాగా నగరం నడిబొడ్డున అద్దంకి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రూ.15 కోట్ల విలువ చేసే కార్పొరేషన్ స్థలాన్ని అధికార పార్టీ ముఖ్యనేత అనుచరులకు అప్పగించేందుకు సర్వం సిద్ధం చేశారు. 100 గదులకు పైగా ఉన్న ఈ స్థలాన్ని కొట్టేసేందుకు పచ్చ నేత మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాజు తలుచుకుంటే కొదువేముందన్న సామెతగా మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లు విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఆ స్థలంలో ఉన్న పురాతన భవనాన్ని కూల్చివేశారు. ఆ కాంట్రాక్టును సైతం అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతకు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థలంలోని శిథిలాలను సైతం కార్పొరేషన్ అధికారులే తొలగించి స్థలాన్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. నగరం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం కావడంతో దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార పార్టీ నేత అధికారులకు సైతం ముడుపులు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. అన్న క్యాంటీన్ పేరుతో ఈ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు అధికార పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగడం గమనార్హం. తన ముగ్గురు అనుచరులను ముందు పెట్టి ముఖ్యనేత కథ నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు నేతల మధ్య పోటీ.. ఆ స్థలంపై అధికార పార్టీల్లోనే పోటీ నెలకొంది. నగరానికి చెందిన ముగ్గురు స్థలం నాకంటే నాకంటూ ముఖ్యనేతపై ఒత్తిడి తేస్తున్నట్లు సమాచారం. ముగ్గురు ముఖ్యనేత సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఒకరు మాజీ కౌన్సిలర్ కాగా, మరొకరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వ్యక్తి, మరొకరు నగర శాసనసభ్యుడికి ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. పైకి అన్న క్యాంటీన్ అని చెబుతున్నా... స్థలాన్ని అప్పనంగా కొట్టేసి కాంప్లెక్స్‌ను నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య పోటీ నేపథ్యంలో తానే ఆ స్థలాన్ని కొట్టేసేందుకు ముఖ్యనేత సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు పాతర.. నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సాక్షాత్తు మున్సిపల్ అధికారులే సిద్ధమవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి చెందిన భవనాన్ని కూలగొట్టే సమయంలోనే భవిష్యత్తులో ఆ స్థలాన్ని ఏం చేయాలన్న దానికి అధికారులు ఒక నిర్ణయానికి రావాలి. దీనిపై ప్రతిపాదనలు పంపాలి. కాంప్లెక్స్ నిర్మించదలచుకుంటే దానికి సంబంధించిన డిజైన్లు రూపొందించాలి. నిధులు మంజూరు ఉత్తర్వులు తీసుకోవాలి. ఒక వేళ భవనాన్ని కూల్చాలన్నా అందుకు అనుమతులు తీసుకోవాలి. కానీ అద్దంకి బస్టాండ్‌లోని మున్సిపాలిటీ భవనాన్ని కూల్చే విషయంలో అధికారులు ఈ నిబంధనలేమి పాటించలేదు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పెద్ద జేసీబీ, ఇటాచీ లాంటి మిషన్లు తెచ్చి పేదల ఇళ్లు, దుకాణాలను కూల్చివేసే మున్సిపల్ అధికారులు అద్దంకి బస్టాండ్‌లోని భవనం కూల్చివేత పనులను మాత్రం పచ్చ నేతకు అప్పగించడం గమనార్హం. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు చేతులు మారినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆ స్థలాన్ని సైతం సదరు నేతకే అప్పగించేందుకు లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థలాన్ని అన్న క్యాంటీన్‌కు అధికార పార్టీ నేతలు కావాలని కోరిన మాట నిజమేనని మున్సిపల్ కమిషనర్ ‘సాక్షి’తో చెప్పారు. తొలుత క్యాంటీన్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మించాలన్న విషయంపై చర్చించినట్లు చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే విషయంలో పై నిబంధనలు అమలు చేయాల్సి ఉన్నా... అలాంటివేమి అమలు చేసిన దాఖలాల్లేవు. మొత్తంగా స్థలాన్ని అప్పగించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
పేదల బతుకులపై పిడుగు
♦ బండ్లమిట్టలో మరో విధ్వంసం ♦ పేదల ఇళ్లు కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు ♦ రోడ్డున పడిన 30 కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే నివాసం ♦ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం ♦ శనివారం సాయంత్రం ఉన్నపళంగా ఇళ్లు కూల్చివేత ♦ అధికార పార్టీ మద్దతుదారుల నివాసాల జోలికి వెళ్లని వైనం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పచ్చ పార్టీ నేతలు బరితెగించారు. ఒంగోలు కార్పొరేషన్ అధికారులను అడ్డుపెట్టి పేదల ఇళ్లను కూలగొడుతూ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి ఆర్థిక లబ్ధే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. మంగళవారం నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ముస్లిం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టి కార్పొరేషన్ అధికారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఊరచెరువులో బోటింగ్ ఏర్పాటు చేసుకొని తద్వారా ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే బండ్లమిట్టలో ఇళ్లు, దుకాణాల కూల్చివేతకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధ్వంసం మరువక ముందే శనివారం మరోమారు బండ్లమిట్ట ఉత్తరప్రాంతంలోని 30కిపైగా పేదల ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూలగొట్టారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధికారులు పోలీస్ బందోబస్తుల మధ్య జేసీబీని తీసుకెళ్లి ఇళ్లను ధ్వంసం చేశారు. బాధితులు లబోదిబోమంటూ అడ్డుపడ్డా అధికారులు ఖాతరు చేయలేదు. కేసులు పెట్టి స్టేషన్లో పెడతామంటూ వారిని బెదిరించారు. ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చి రోడ్డున పడవేస్తారా... అంటూ నెత్తీనోరు బాదుకున్నా.. అధికారులు కనికరించలేదు. 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. గూడు కోల్పోయి కట్టుబట్టలతో బయటపడిన వారి ఆవేదన వర్ణనాతీతం. వారి మొర ఆలకించే వారు కరువయ్యారు. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన 30కిపైగా కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారుు. ప్లాస్టిక్, చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని అమ్మి పొట్టపోసుకుంటున్నారు. కొందరు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కూలి డబ్బులను పోగేసుకొని ఊరచెరువుకు ఉత్తర ప్రాంతంలో చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకున్నారు. ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు జేసీబీ తెచ్చి ఇళ్లు కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలైన తమకు ఎక్కడో చోట ప్రత్యామ్నాయం చూపించి ఉంటే వెళ్లిపోయేవారమని, అలా చేయకుండా దౌర్జన్యంగా ఇళ్లు కూల్చడం ఏమిటని వారు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఓట్లు వేయించుకొని ఇప్పుడు అందరినీ రోడ్డుపాలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు పెద్దలు, అధికార పార్టీ నేతల స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొని వారి జోలికి వెళ్లడం లేదని బాధితులు ఆరోపించారు. కూలగొట్టిన ఇళ్ల సమీపంలోనే అధికార పార్టీకి చెందిన వారి రేకుల షెడ్లను మాత్రం కూలగొట్టకపోవడాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తాము ఇళ్లను కూల్చివేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. -
రోడ్డున పడ్డ బతుకులు
► అక్రమణలపేరుతో పేదల ఇళ్లు నేలమట్టం ► అధికారులపై బాధితుల మండిపాటు చిత్తూరు(రూరల్)ః నగరంలోని గంగినేరు చెరువు ఆక్రమణకు గురైందంటూ బుధవారం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. బాధితులు అధికారుల కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పట్టించుకోలేదు. చావనైన చస్తామని మా ఇళ్లను కూల్చడానికి మేం అంగీకరించమని జేసీబీలను అడ్డుకున్నా, అధికారుల్లో కాస్త కనికరం కూడా కనబడలేదు. స్థలాన్ని ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని గుండెలు బాదుకున్నా, అధికారులు వినలేదు. గంగినేరు చెరువు ఆనుకోని 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ స్థలం ఆక్రమణకు గురైందని బుధవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ నివాసాలు చూపకుండానే ఇళ్లను కూల్చడంపై బాధితులు విరుచుకుపడ్డారు. 60 ఏళ్లుగా ఇక్కడ కాపురముంటున్నామని, ఉన్నట్టుండి ఇళ్లను తొలగిస్తే ఎక్కడి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు ఎక్కడ తలదాచుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని అధికారులను బతిమిలాడిన కనికరించలేదని వారు మండిపడ్డారు. ఈ సంఘటనపై చిత్తూరు ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని, ఓట్లు దండుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ ఇప్పుడ లేదని ఆయనపై మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైతే మాజీ ఎమ్మెల్యే సీ.కే బాబు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇలా చేశారని బాధితులు ఆరోపించారు. ఇళ్లను తొలగించడంపై అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. -
పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లను వందగజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో పేదల నివాసాలను గరిష్టంగా వందగజాల వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలు నివాసం కోసం వేసుకున్న గుడిసెలు, ఇళ్లకే ఇది వర్తిస్తుంది. ఆక్రమించుకున్న స్థలాలకు క్రమబద్ధీకరణ జీవో వర్తించదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం జారీ చేసిన జీవో 296లో స్పష్టం చేశారు. జీవోలోని ముఖ్యాంశాలు, విధి విధానాలిలా ఉన్నాయి. ⇒ గతేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఉన్న ఆక్రమిత ఇళ్లకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ⇒ అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత నివాసాల క్రమబద్ధీకరణ అని ఈ పథకాన్ని పిలుస్తారు. అమలు ఈ నెల 15 నుంచి ఆరంభమవుతుంది. ‘మీసేవ’ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ⇒ క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 15 నుంచి 120 రోజుల్లోగా ‘మీసేవ’ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపుతారు. సబ్ కలెక్టరు/ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన డివిజనల్ స్థాయి రెగ్యులరైజేషన్ కమిటీ (డీఎల్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆయా మున్సిపాలిటీల పట్టణ ప్రణాళిక అధికారి సభ్యునిగానూ, తహశీల్దారు సభ్య కన్వీనరుగాను ఉంటారు. తహశీల్దారు ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హమైనదో కాదో నిర్ధారించడం కోసం డీఎల్ఆర్సీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తహశీల్దార్లకు జిల్లా కలెక్టరు/రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నిర్దిష్ట ప్రొఫార్మా, చెక్‌లిస్టు పంపుతారు. మహిళల పేరిటే పట్టాలు ⇒ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రూపొందిస్తారు. కుటుంబంలో మహిళలు లేని పక్షంలో కుటుంబ పెద్ద అయిన పురుషుని పేరుతో తయారు చేస్తారు. ⇒ అందిన ప్రతి దరఖాస్తును 90 రోజుల్లోగా పరిష్కరించాలి.హాడీఎల్పీసీ నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో దరఖాస్తుదారు 90 రోజుల్లోగా జేసీ-1కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాలకు వర్తించదు... ⇒ అభ్యంతరంలేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. ⇒ మాస్టర్‌ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లోని దరఖాస్తులను, అనుమతించిన లేఅవుట్లలోని ఖాళీ స్థలాలనూ పరిశీలించరు. నీటివనరులు, శ్మశాన వాటికలు, నీటిపారుదల, తాగునీటి ట్యాంకులు ప్రాంతాల్లోని ఆక్రమణదారుల దరఖాస్తులను అనుమతించరు. ప్రజావసరాలకు పనికొచ్చే స్థలాలు, అతి విలువైన స్థలాలనూ ఈ జీవో నుంచి మినహాయిస్తారు. ⇒ పట్టా పొందిన రెండేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి పూర్తి వారసత్వ హక్కులు లభిస్తాయి. -
వర్సిటీ స్థలంలో వద్దు:వైఎస్సార్సీపీ
హైదరాబాద్: విశ్వవిద్యాలయం స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనను విరమించుకోవాలని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే విద్యార్థులతో కలసి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టితో సీఎం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అందుకోసం యూనివర్సిటీ స్థలాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే పలు యూనివర్సిటీల స్థలాలను పలు సంస్థలకు అప్పగించారని, మిగిలిన భూములను కోల్పోతే విశ్వవిద్యాలయాల విస్తరణ కష్టమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పేదింటి’ని ఆదుకున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పేదల ఇళ్లపై కేంద్ర ప్రభుత్వం దయచూపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేం ద్రం మంజూరు చేసిన ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) ఇళ్లకు సంబంధించి తాజాగా రూ.187 కోట్లను మంజూరు చేసింది. దీనికి రాష్ట్రప్రభుత్వం తన వంతువాటాగా రూ.58 కోట్లను కలిపి రూ.245 కోట్లను విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిధులు లేక ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు కొంచెం ఊతమిచ్చినట్టయింది. బిల్లులు చెల్లించాలంటూ గత కొన్ని నెలలుగా పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవటంతో తీవ్ర ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోవటం, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడంతో తెలంగాణలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలు రూ.450 కోట్లకు చేరుకున్నాయి. ఈ డబ్బులు చెల్లిస్తేగాని పేదలు ఇళ్ల నిర్మాణాన్ని ముందుకు కొనసాగించలేని దుస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ దర్యాప్తు కొనసాగుతోంది. అది తేలితేగాని బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవటంతో అధికారులు చేతులెత్తేశారు. కనీసం బిల్లులు ఎప్పుడొస్తాయో కూడా లబ్ధిదారులకు చెప్పలేని పరిస్థితి నెలకొనటంతో చాలాచోట్ల వారు కార్యాలయాల్లో ఉండటానికే జంకుతున్నారు. ఈ దశలో కేంద్రం ఇందిరా ఆవాస్ యోజన నిధులు విడుదల చేయటంతో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. అయితే ఇవి కూడా అందరికీ సరిపోయే పరిస్థితి లేకపోవటంతో ఎవరు ముందు బిల్లులు పెడితే వారికే డబ్బులు అందనున్నాయి. 50 శాతం నిధులు అందజేత... కేంద్రం తెలంగాణకు ఈ ఆర్థిక సంవత్సరంలో 65 వేల ఐఏవై ఇళ్లను మంజూరు చేసింది. వాటికి సంబంధించి కేంద్రం తన వాటాగా రూ.374 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు సగం నిధులు కేటాయించింది. అధికారులు ప్రత్యేకంగా ఐఏవై ఇళ్లనంటూ నిర్మించటం లేదు. లబ్ధిదారులు కట్టుకున్న వాటిని ఐఏవై ఇళ్లుగా పరిగణిస్తూ కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పిస్తున్నారు. ఇప్పుడు అందజేసిన నిధులకు సంబంధించి నవంబర్‌లో యూసీ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా ఆ నిధులు ఖర్చు చేసి యూసీ పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ యూసీ అందితేగాని మలివిడత నిధులు విడుదల కావు.