రోడ్డున పడ్డ బతుకులు
► అక్రమణలపేరుతో పేదల ఇళ్లు నేలమట్టం
► అధికారులపై బాధితుల మండిపాటు
చిత్తూరు(రూరల్)ః నగరంలోని గంగినేరు చెరువు ఆక్రమణకు గురైందంటూ బుధవారం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. బాధితులు అధికారుల కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పట్టించుకోలేదు. చావనైన చస్తామని మా ఇళ్లను కూల్చడానికి మేం అంగీకరించమని జేసీబీలను అడ్డుకున్నా, అధికారుల్లో కాస్త కనికరం కూడా కనబడలేదు. స్థలాన్ని ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని గుండెలు బాదుకున్నా, అధికారులు వినలేదు. గంగినేరు చెరువు ఆనుకోని 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ స్థలం ఆక్రమణకు గురైందని బుధవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ నివాసాలు చూపకుండానే ఇళ్లను కూల్చడంపై బాధితులు విరుచుకుపడ్డారు.
60 ఏళ్లుగా ఇక్కడ కాపురముంటున్నామని, ఉన్నట్టుండి ఇళ్లను తొలగిస్తే ఎక్కడి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు ఎక్కడ తలదాచుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని అధికారులను బతిమిలాడిన కనికరించలేదని వారు మండిపడ్డారు. ఈ సంఘటనపై చిత్తూరు ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని, ఓట్లు దండుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ ఇప్పుడ లేదని ఆయనపై మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైతే మాజీ ఎమ్మెల్యే సీ.కే బాబు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇలా చేశారని బాధితులు ఆరోపించారు. ఇళ్లను తొలగించడంపై అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.