Occupation of Pond
-
కొల్లేరు ప్రక్షాళనకు రెడీ
ఏలూరు రూరల్ : టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి కొల్లేరు మరోసారి విముక్తి కానుంది. కొద్దిరోజుల్లో అటవీశాఖ అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టబోతున్నారు. ఇందుకోసం అభయారణ్యంలో 8,800 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ చెరువులు గుర్తించారు. ఉన్నతధికారులు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇన్చార్జి డీఎఫ్ఓ అనంత్శంకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ చెరువులను గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేల అనుచరుల పేదల పేరుతో అభయారణ్యంలో పెద్ద ఎత్తున అక్రమ చెరువులు తవ్వారు. చేపలు, రొయ్యల సాగు చేసే బినామీలకు లీజుకు కట్టబెట్టారు. ఐదేళ్లలో కోట్ల రూపాయలు దండుకున్నారు. అడ్డుచెప్పిన అటవీశాఖ అధికారులను దూషించారు. ప్రశ్నించిన అటవీశాఖ అధికారులను బదిలీ చేశారు. యథేచ్ఛగా సాగిన అక్రమాలతో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలంతా తమ అక్రమ సంపాదనకు గండి పడుతుందని భయపడుతున్నారు. 10 గ్రామాల పరిధిలో భారీగా అక్రమ చెరువులు కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఏలూరు, పెదపాడు, నిడమర్రు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని సుమారు 10 గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు వెలసినట్టు అ«టవీశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 4,403 ఎకరాలు అభయారణ్యంలో తవ్వగా మరో 4,396 ఎకరాల చెరువులు జిరాయితీ భూముల్లో తవ్వినట్టు అధికారులు గుర్తించారు. ఆక్రమణల ఇలా.. మొండికోడు డ్రెయిన్ పరిసరాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా పెద్ద ఎత్తున చెరువులు తవ్వారు. ఈ చెరువులను మాజీ సర్పంచ్లతో పాటు గ్రామ టీడీపీ నాయకులు వంతులు వేసుకుని చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు మండలం కలకుర్రు గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వకాలు జరిగాయి. కొట్టేసిన వందలాది ఎకరాలు చేపల చెరువులు నేడు మళ్లీ పూర్వస్థితికి చేరుకున్నారు. కాంటూరు దిగువన కొల్లేరులో వెలసిన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఒక్క సెంటు రెవెన్యూ భూమి లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ చెరువులు వెలిశాయి. జాలిపూడి, మాదవాపురం రెవెన్యూ ప్రాంతాల మధ్య గతంలో కొట్టేసిన 200 ఎకరాలల్లో సొసైటీ చెరువును టీడీపీ నాయకులు తవ్వారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రాంతానికి పొక్లెయిన్లు, బుల్డోజర్లు తరలించేందుకు ఇప్పటికే రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. గండ్లను పూడ్చేసి సాగు శ్రీపర్రు ఊరు వెనుక అభయారణ్యంలో గతంలో అధికారులు కొట్టేసిన చెరువుల గండ్లను కొందరు వ్యక్తులు పూడ్చేశారు. వందల ఎకరాల విస్త్రీర్ణంలో ఉన్న ఈ చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే చేపలు, రొయ్యలను టీడీపీ అనుయాయులు ఎగుమతి చేస్తున్నారు. జైపురం శివారున అభయారణ్య పరిధిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పాత చెరువులకు గట్లు వేసి సాగు చేస్తున్నారు. ప్రత్తికోళ్లలంక, పెదయాగనమిల్లి, కోమటిలంక, కలకుర్రు, పైడిచింతపాడు తదితర గ్రామాల సమీపంలో సైతం కొల్లేరులో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువులు వెలిశాయి. ఈ చెరువులకు వేలం పాట నిర్వహించి టీడీపీ నాయకులు ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 8 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. కొల్లేరు పరిధిలో అక్రమ చెరువులపై నివేదికను తయారు చేశాం. వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు గుర్తించాం. గత మూడేళ్ల నుంచి వీటిలో చేపలు, రొయ్య ల సాగు జరుగుతోంది. సుమారు 8,000 వేలకు పైగా జిరాయితీ, అభయారణ్యంలో చెరువులు తవ్వినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – బి.రమణప్రసాద్, ఏలూరు రేంజర్ -
కాదేదీ కబ్జాకు అనర్హం..!
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : కబ్జాకు కాదేదీ అనర్హం అంటూ గట్టు, పుట్ట, శ్మశానం, ఆఖరికి చెరువులు కూడా కబ్జా చేస్తూ ఆక్రమణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. వీటిలో అధికంగా పక్కపక్కనే సాగు చేస్తున్న రైతులు ఉండగా, కొన్ని చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. కొందరు కబ్జా చేసి ఇతరులకు సాగుకు అందించి తమ సత్తా చాటుకుంటున్నారు. చెరువుల్లో 50 శాతం పైగా కబ్జా జరిగినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు తహసీల్దార్లు ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా కబ్జాలు ఆగడం లేదు. ముందుగా రైతులతో కబ్జా చేస్తుండడంతో ఈ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కూడా కొంత మేర ఆక్రమణలకు కారణం అవుతుండగా, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు మారిపోతుండడంతో వారికి అవగాహన లేకపోవడం, వీఆర్వోలు సరిగ్గా పట్టించుకోకపోవడం, గ్రామస్తులతో వివాదాలు లేదా గ్రామాల్లో వివాదాలతో తమకు ఎందుకు వివాదం అన్న ధోరణిలో వెళ్తుండడం కొంతమేర కబ్జాలకు కారణం అవుతున్నాయి. కబ్జా బారిన పడిన చెరువుల వివరాలు.. బొబ్బిలి మండలంలో చింతాడలో పుట్టోడి చెరు వు, నారప్పచెరువు, పిరిడిలో పోలవానిచెరువు, అలజంగిలో సీతారామ సాగరం, దాలెందర చెరువు, మెట్టవలసలో మల్లమ్మచెరువు, కృష్ణాపురంలో రంగం చెరువు, ఎర్రచెరువు, గొర్లెసీతారాంపురంలో రాయుడిచెరువు, కోమటపల్లిలో నారయ్యచెరువు ఇలా ప్రతీ గ్రామంలో చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇలా అన్ని మండలాల్లోని గ్రామాల్లో పలు చెరువులు ఆక్రమణ బారిన పడ్డాయి. గతంలో రైతులు పంటలు వేసుకునేందుకు ఆక్రమించుకోగా ఇప్పుడు నాయకులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. కబ్జాకోరల్లో చెరువులు.. ఇదివరలో రైతులు పంటలకోసం కక్కుర్తి పడి చెరువు గర్భాలు ఆక్రమించుకునే వారు. ఇప్పుడు అలా కాకుండా దళారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తున్నారు. చెరువులు, పంట కాలువలు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కబ్జాలపై చర్యలు చేపట్టాలి. – బొమ్మి అప్పలనాయుడు, రైతు, పెంట రైతులు ఇబ్బంది పడుతున్నారు.. చెరువులు కబ్జా చేస్తుండడంతో రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. చెరువులను కబ్జాచేసి వీఆర్వోల సహాయంతో రికార్డులు తారుమారు చేస్తున్నారు. సీతయ్యపేటలో ఓ వీఆర్వో బినామీగా చెరువు కబ్జా చేశాడు. సుప్రీం కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదు. అక్రమణదారులపై చర్యలు చేపట్టాలి. – వేమిరెడ్డి లక్ష్మణ్ నాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బొబ్బిలి. నోటీసులు ఇస్తున్నాం.. అనేక చెరువులు కబ్జాలో ఉ న్నట్లు తెలు స్తోంది. మా వీఆర్వోలు స మాచారం తెలి పిన వెంటనే నోటీసులు ఇస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా నోటీసులు ఇస్తున్నాం. చర్యలు చేపడుతున్నాం. అనేకమంది ఆక్రమణ దారులకు గతంలో తహసీల్దార్లు నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుం టున్నాం. – ఏ.సింహాచలం, తహసీల్దార్, బొబ్బిలి. నియోజకవర్గంలో చెరువుల విస్తీర్ణం, కబ్జా వివరాలు.. మండలం చెరువుల సంఖ్య సాగువిస్తీర్ణం కబ్జా(సుమారుగా) బొబ్బిలి 356 1,550 ఎకరాలు 50ఎకరాలు తెర్లాం 460 1,000ఎకరాలు 30ఎకరాలు బాడంగి 320 935ఎకరాలు 10ఎకరాలు రామభద్రపురం 266 870ఎకరాలు 12ఎకరాలు -
ఆక్రమణలపై ఆగ్రహం!
సాక్షి, బలిజిపేట (విజయనగరం): మండంలోని పెద్దింపేటలో కబ్జాకు గురైన సంతచెరువులో ఆక్రమణలను గ్రామస్తులు మంగళవారం తొలగించారు. గ్రామంలో కొందరు బడాబాబులు చేస్తున్న దురాక్రమణల వల్ల చెరువు గర్భాలు తగ్గుతున్నాయని, ఆయకట్టుదారులకు సాగునీరు అందడం లేదని, చెరువుల్లో చేపలు పెంచుకునేవారికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని భావించి ఆక్రమణలను తొలగించారు. పెత్తనందారులు చేస్తున్న ఆక్రమణలకు అంతూపొంతూ లేకుండా పోతోందని బాధితులు టి సూర్యనారాయణ, మజ్జిరావు, సాంబయ్య, ఎస్ అప్పలస్వామి, సత్యం, బి పోలీసు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్.69లో ఉన్న సంతచెరువు గర్భం 11.66 ఎకరాలు, ఆయకట్టు సుమారు 400 ఎకరాల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఈ చెరువు దిగువన పెద్దింపేట, పోలినాయుడువలస, గౌరీపురం గ్రామాలకు చెందిన రైతుల ఆయకట్టు భూమి ఉందన్నారు. అటువంటి చెరువు గర్భంలో సుమారు 8ఎకరాల వరకు దురాక్రమణలు జరిగాయని తెలిపారు. చెరువు గర్భంలో ఉండే గట్టును జేసీబీతో తొలగించి దురాక్రమణ చేయడం దారుణమని తెలిపారు. సంతచెరువు, పద్మనాభం చెరువు, పనసోడు చెరువులను మూడు సంవత్సరాలకు చేపలు పెంచుకునేందుకు లక్ష రూపాయలకు పాడుకున్నామని అటువంటి చెరువును దురాక్రమణ చేస్తున్నారని తెలిపారు. మూడు చెరువుల్లో చేపలు పెంచుకుంటూ 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. చెరువు కొమ్మును తొలగించి ఆక్రమణదారుల పంటపొలాలకు నీరు మళ్లించేందుకు కాలువలు ఏర్పాటు చేసుకున్నారని బాధితులు తెలిపారు. అధికారులు ఇటీవల నీటివనరులపై సర్వే నిర్వహించారు. కానీ ఎన్ని చెరువులు ఆక్రమణలో ఉన్నాయి, వాటివల్ల ఎంతమేర ఆయకట్టు భూమికి నష్టం వాటిల్లుతుందో పర్యవేక్షించలేదని బాధితులు ఆరోపించారు. మండలంలో 24 పంచాయతీల్లో 428 ఇరిగేటెడ్ చెరువులు ఉన్నట్లు సర్వేలో తేలింది. పరిశీలించి తగు చర్యలు తీసకుంటాం ఆక్రమణలో ఉండే చెరువులను పరిశీలిస్తాం. ఈ చెరువు ఇప్పటికే కబ్జా అయిందని గుర్తించాం. గట్టు కూడా వేయడం జరిగింది. ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి పరిశీలిస్తాం. ఆక్రమణలు రుజువైతే చర్యలు తీసుకుంటాం. –రాణి అమ్మాజీ, తహసీల్దార్, బలిజిపేట -
రోడ్డున పడ్డ బతుకులు
► అక్రమణలపేరుతో పేదల ఇళ్లు నేలమట్టం ► అధికారులపై బాధితుల మండిపాటు చిత్తూరు(రూరల్)ః నగరంలోని గంగినేరు చెరువు ఆక్రమణకు గురైందంటూ బుధవారం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. బాధితులు అధికారుల కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పట్టించుకోలేదు. చావనైన చస్తామని మా ఇళ్లను కూల్చడానికి మేం అంగీకరించమని జేసీబీలను అడ్డుకున్నా, అధికారుల్లో కాస్త కనికరం కూడా కనబడలేదు. స్థలాన్ని ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని గుండెలు బాదుకున్నా, అధికారులు వినలేదు. గంగినేరు చెరువు ఆనుకోని 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ స్థలం ఆక్రమణకు గురైందని బుధవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ నివాసాలు చూపకుండానే ఇళ్లను కూల్చడంపై బాధితులు విరుచుకుపడ్డారు. 60 ఏళ్లుగా ఇక్కడ కాపురముంటున్నామని, ఉన్నట్టుండి ఇళ్లను తొలగిస్తే ఎక్కడి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు ఎక్కడ తలదాచుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని అధికారులను బతిమిలాడిన కనికరించలేదని వారు మండిపడ్డారు. ఈ సంఘటనపై చిత్తూరు ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని, ఓట్లు దండుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ ఇప్పుడ లేదని ఆయనపై మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైతే మాజీ ఎమ్మెల్యే సీ.కే బాబు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇలా చేశారని బాధితులు ఆరోపించారు. ఇళ్లను తొలగించడంపై అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.