
వర్సిటీ స్థలంలో వద్దు:వైఎస్సార్‌సీపీ
హైదరాబాద్: విశ్వవిద్యాలయం స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలన్న ఆలోచనను విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే విద్యార్థులతో కలసి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దృష్టితో సీఎం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు.
పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అందుకోసం యూనివర్సిటీ స్థలాలు తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికే పలు యూనివర్సిటీల స్థలాలను పలు సంస్థలకు అప్పగించారని, మిగిలిన భూములను కోల్పోతే విశ్వవిద్యాలయాల విస్తరణ కష్టమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.