♦ బండ్లమిట్టలో మరో విధ్వంసం
♦ పేదల ఇళ్లు కూల్చేసిన కార్పొరేషన్ అధికారులు
♦ రోడ్డున పడిన 30 కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే నివాసం
♦ చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం
♦ శనివారం సాయంత్రం ఉన్నపళంగా ఇళ్లు కూల్చివేత
♦ అధికార పార్టీ మద్దతుదారుల నివాసాల జోలికి వెళ్లని వైనం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పచ్చ పార్టీ నేతలు బరితెగించారు. ఒంగోలు కార్పొరేషన్ అధికారులను అడ్డుపెట్టి పేదల ఇళ్లను కూలగొడుతూ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి ఆర్థిక లబ్ధే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. మంగళవారం నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ముస్లిం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టి కార్పొరేషన్ అధికారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఊరచెరువులో బోటింగ్ ఏర్పాటు చేసుకొని తద్వారా ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇందులో భాగంగానే బండ్లమిట్టలో ఇళ్లు, దుకాణాల కూల్చివేతకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధ్వంసం మరువక ముందే శనివారం మరోమారు బండ్లమిట్ట ఉత్తరప్రాంతంలోని 30కిపైగా పేదల ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూలగొట్టారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అధికారులు పోలీస్ బందోబస్తుల మధ్య జేసీబీని తీసుకెళ్లి ఇళ్లను ధ్వంసం చేశారు. బాధితులు లబోదిబోమంటూ అడ్డుపడ్డా అధికారులు ఖాతరు చేయలేదు. కేసులు పెట్టి స్టేషన్‌లో పెడతామంటూ వారిని బెదిరించారు.
ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చి రోడ్డున పడవేస్తారా... అంటూ నెత్తీనోరు బాదుకున్నా.. అధికారులు కనికరించలేదు. 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. గూడు కోల్పోయి కట్టుబట్టలతో బయటపడిన వారి ఆవేదన వర్ణనాతీతం. వారి మొర ఆలకించే వారు కరువయ్యారు. ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు.
బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన 30కిపైగా కుటుంబాలు 40 ఏళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారుు. ప్లాస్టిక్, చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని అమ్మి పొట్టపోసుకుంటున్నారు. కొందరు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కూలి డబ్బులను పోగేసుకొని ఊరచెరువుకు ఉత్తర ప్రాంతంలో చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకున్నారు. ఒక్కసారిగా కార్పొరేషన్ అధికారులు జేసీబీ తెచ్చి ఇళ్లు కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుపేదలైన తమకు ఎక్కడో చోట ప్రత్యామ్నాయం చూపించి ఉంటే వెళ్లిపోయేవారమని, అలా చేయకుండా దౌర్జన్యంగా ఇళ్లు కూల్చడం ఏమిటని వారు కన్నీళ్లపర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఓట్లు వేయించుకొని ఇప్పుడు అందరినీ రోడ్డుపాలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు పెద్దలు, అధికార పార్టీ నేతల స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొని వారి జోలికి వెళ్లడం లేదని బాధితులు ఆరోపించారు. కూలగొట్టిన ఇళ్ల సమీపంలోనే అధికార పార్టీకి చెందిన వారి రేకుల షెడ్లను మాత్రం కూలగొట్టకపోవడాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తాము ఇళ్లను కూల్చివేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు.